rathod bapurao
-
బీజేపీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్
ఢిల్లీ: బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు బీజేపీ గూటికి చేరారు. రాథోడ్ బాపురావ్‌తో పాటు మునుగోడు నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నేత చెల్లమల కృష్ణారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు సుభాష్ రెడ్డి, ఇతర నాయకులు బీజేపీలో చేరారు. బీజేపీలో చేరిన సందర్బంగా ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావ్ మాట్లాడుతూ.. ఉద్యోగాన్ని వదిలి తెలంగాణ ఉద్యమంలో చేరానని చెప్పారు. రాష్ట్ర సాధనకోసం తనవంతు ప్రయత్నం చేశానన్నారు. బోథ్ సిట్టింగ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావును కాదని నేరడిగొండ జెడ్పీటీసీ అనిల్ జాదవ్‌కు సీఎం కేసీఆర్ పార్టీ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. దీంతో అసంతృప్తికి గురైన బాపురావు.. బీజేపీ నుంచి బరిలో దిగనున్నారు. రెండుసార్లు గెలిచిన తనను ప్రజల్లో ఆదరాభిమానాలున్నప్పటికీ కొందరు కక్షగట్టి మూడోసారి ఎమ్మెల్యే టికెట్ రాకుండా చేశారని బాపురావ్ తెలిపారు. దీనిపై మాట్లాడాలని కలిసేందుకు ప్రయత్నిస్తే ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ముగ్గురు గిరిజన ఎమ్మెల్యేలకు కూడా టికెట్లు ఇవ్వకుండా అడ్డుకున్నారని చెప్పారు. అనంతరం ఎల్లారెడ్డికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత సుభాష్ రెడ్డి, చెల్లమల కృష్ణారెడ్డితోపాటు కాంగ్రెస్ నేతలు సురిగి నర్సింహా, బిట్టు సత్యనారాయణ పార్టీలో చేరారు. వీరందరినీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇదీ చదవండి: గద్వాల నుంచి పోటీకి డీకే అరుణ దూరం.. కారణమిదే..? -
ప్లాట్ల విక్రయంలో.. బోథ్ ఎమ్మెల్యేపై చీటింగ్ కేసు!
సాక్షి, ఆదిలాబాద్: బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావుపై చీటింగ్ కేసు నమోదైంది. బీఆర్ఎస్కు గుడ్‌బై చెప్పి కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమవుతున్న తరుణంలో ఈ కేసు నమోదు కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు హైదరాబాద్‌లో మంగళవారం కలిసిన సంగతి తెలిసిందే. ఈ విషయం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉండగా.. ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు ఆదిలాబాద్ పట్టణానికి చెందిన ఆదిత్య ఖండేష్కర్‌కు మావల మండలంలోని బట్టిసావర్గాం శివారులో 2012లో రెండు ప్లాట్లను విక్రయించారు. ఆ తర్వాత 2019లో ఇవేప్లాట్లను సంతోష్ అనే మరో వ్యక్తికి రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు. దీంతో బాధితుడు కోర్టును ఆశ్రయించాడు. కోర్టు ఆదేశాల మేరకు ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావుపై 409, 420 సెక్షన్ల కింద చీటింగ్ కేసు నమోదు చేసినట్లు టూటౌన్ సీఐ అశోక్ తెలిపారు. ఎమ్మెల్యేతో పాటు ఆయన వ్యాపార భాగస్వామి సుదర్శన్‌పై కూడా కేసు నమోదైనట్లుగా పేర్కొన్నారు. విచారణ జరుపుతున్నట్లుగా సీఐ వివరించారు. -
బీఆర్ఎస్కు షాక్.. రాజీనామాకు సిద్ధమైన ఎమ్మెల్యే!
సాక్షి, ఆదిలాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. పలు పార్టీల్లో సీనియర్ నేతలు కూడా ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. పరిస్థితి బట్టి అధికార పార్టీ సహా ప్రతిపక్ష పార్టీల్లోకి జంప్ అవుతున్నారు. తాజాగా మరో కీలక నేత బీఆర్ఎస్ను వీడుతున్నట్టు వెల్లడించారు. ఆయన హస్తం గూటిలో చేరుతున్నట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. టికెట్ ఇవ్వకపోవడంపై గుస్సా.. వివరాల ప్రకారం.. బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు బీఆర్ఎస్ పార్టీని వీడాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. ఈ క్రమంలో పార్టీ నేతలతో బాపూరావు సమాలోచనలు, చర్చలు జరిపారు. తాను ఎమ్మెల్యేగా తప్పు చేయలేదని, పార్టీకి నష్టం చేయలేదని ఆయన అన్నారు. కొంతమంది చెప్పుడు మాటలు విని తనకు టికెట్ ఇవ్వలేదని ఆరోపించారు. మరో నాలుగు రోజుల్లో పూర్తి వివరాలు వెల్లడిస్తానని చెప్పుకొచ్చారు. ఈ సందర్బంగా తాను ఏ పార్టీలో చేరుతున్న విషయం మాత్రం చెప్పలేదు. అయితే, బాపూరావు కాంగ్రెస్‌లో చేరబోతున్నట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కేటీఆర్ నో అపాంట్మెంట్.. మరోవైపు.. మూడు రోజుల క్రితం మంత్రి కేటీఆర్ అపాయింట్మెంట్ కావాలని కోరారు రాథోడ్ బాపురావు. దీనికి కేటీఆర్ స్పందించకపోవడంతో.. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. ఇక, బోథ్ నుంచి అనిల్ జాదవ్‌కు టికెట్ కేటాయించారు సీఎం కేసీఆర్. దీంతో రాథోడ్ బాపురావు అసంతృప్తితో ఉన్నారు. పార్టీ మారాలంటూ ఆయన మద్దతుదారులు ఒత్తిడి తేవడంతోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. కాగా, మొదట పార్టీని వీడే అంశంపై రాథోడ్ బాపురావు విముఖత వ్యక్తం చేశారు. తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇదిలా ఉండగా.. అధికార బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ వచ్చే ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులు జాబితాను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పలువురు సిట్టింగ్‌లకు టికెట్ లభించకపోవడంతో వారు పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇతర పార్టీలవైపు చూస్తున్నారు. ఇప్పటికే కొంత మంది బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్, బీజేపీలో చేరిపోయారు. ఇది కూడా చదవండి: కేసీఆర్ సర్కార్‌కు షాక్.. గవర్నర్ తమిళిసై సంచలన నిర్ణయం -
బోథ్ (ST) రాజకీయ చరిత్ర..!
బోథ్ నియోజకవర్గం బోథ్ గిరిజన రిజర్వుడు నియోజకవర్గంలో టిఆర్ఎస్ అభ్యర్ధి రాదోడ్ బాపూరావు రెండోసారి గెలుపొందారు. ఆయన తన సమీప కాంగ్రెస్ ఐ ప్రత్యర్ది సోయం బాపూరావుపై 6639 ఓట్ల ఆదిక్యతతో గెలుపొందారు. కాగా స్వతంత్ర అభ్యర్ధి అనిల్ జాదవ్ 27368 ఓట్లు తెచ్చుకుని మూడో స్తానంలో ఉన్నారు. సోయం బాపూరావు 2009లో టిఆర్ఎస్ తరపున గెలిచి, ఈ ఎన్నికలో కాంగ్రెస్ ఐ పక్షాన పోటీచేసి ఓడిపోయారు. కాగా అనిల్ జాదవ్ కిందటిసారి కాంగ్రెస్ ఐ పక్షాన పోటీచేసి, టిక్కెట్ రాకపోవడంతో 2018లో ఇండిపెండెంట్‌గా నిలబడ్డారు. రాదోడ్ బాపూరావుకు 60967 ఓట్లు రాగా, సోయం బాపూరావుకు 54328 ఓట్లు లభించాయి. బాపూరావు ఆ తర్వాత 2019లో బిజెపిలో చేరి లోక్ సభకు ఎన్నికవడం విశేషం. బోథ్ నుంచి 2014లో టిఆర్ఎస్ అభ్యర్దిగా పోటీచేసిన రాదోడ్ బాపూరావు శాసనసభకు ఎన్నికయ్యారు. ఈయనకు 26993 ఓట్ల ఆదిక్యత లబించింది. కాంగ్రెస్ అభ్యర్ధి జాదవ్ అనిల్ కుమార్ 35877 ఓట్లతో రెండో స్థానంలో ఉండగా, టిడిపి అభ్యర్ధిగా పోటీచేసిన మాజీ ఎమ్మెల్యే సోయం బాపూరావుకు 35218 ఓట్లు వచ్చాయి. ఇక్కడ 2009లో టిడిపి పక్షాన గెలిచిన ఎమ్మెల్యే గొడం నగేష్ 2014లో టిడిపికి గుడ్ బై చెప్పి టిఆర్ఎస్లో చేరి ఆదిలాబాద్ నుంచి ఎమ్.పిగా పోటీచేసి ఘన విజయం సాధించారు. కానీ 2019లో లోక్‌సభ ఎన్నికలలో ఓటమి చెందారు. బోథ్ నియోజకవర్గంలో నగేష్ మూడుసార్లు టిడిపి పక్షాన గెలుపొందారు. ఈయన తండ్రి గొడం రామారావు కూడా రెండుసార్లు గెలిచారు. రామారావు గతంలో ఎన్.టి.ఆర్ క్యాబినెట్లో పనిచేస్తే నగేష్ 1999 ఎన్నికలకు ముందు చంద్రబాబు క్యాబినెట్లో ఉన్నారు. ఇలా తండ్రి, కొడుకులు ఇద్దరు మంత్రుల్కెన ఘనత పొందారు. బోథ్ కు 1962 నుంచి ఇప్పటి వరకు 13సార్లు ఎన్నికలు జరిగితే ఐదుసార్లు కాంగ్రెస్, కాంగ్రెస్‌ఐలు, ఐదుసార్లు తెలుగుదేశం, మూడుసార్లు టిఆర్ఎస్ గెలుపొందాయి. 2004లో గెలిచిన టిఆర్ఎస్ అభ్యర్ధి ఎస్.బాపూరావు ఆ తరువాత కాలంలో అసమ్మతి ఎమ్మెల్యేగా మారారు. టిఆర్ఎస్కు భిన్నంగా ఈయన శాసనమండలి ఎన్నికలలో కాసాని జ్ఞానేశ్వర్‌కు మద్దతు ఇచ్చిన కారణంగా ఫిరాయింపుల చట్టం కింద అనర్హుడై పదవిని కోల్పోయారు. శాసనసభ చరిత్రలో తొలిసారిగా అనర్హుల్కెన తొమ్మిది మందిలో ఈయన ఒకరు. 2014 ఎన్నికలో టిడిపిలో చేరి ఓడిపోయారు. ఆ తర్వాత కాంగ్రెస్ ఐ, తదుపరి బిజెపిలోకి ఆయన మారి 2019లో లోక్‌సభకు ఎన్నికయ్యారు. బోథ్ నియోజకవర్గం జనరల్‌గా ఉన్నప్పుడు ప్రముఖ సోషలిస్టు నేత సి. మాధవరెడ్డి 1962లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈయన 1952లో సోషలిస్టుగా ఆదిలాబాద్ నుంచి లోక్‌సభకు ఎన్నికైతే, 1984లో టిడిపి పక్షాన మరోసారి లోక్‌సభకు ఎన్నికై, ప్రధాన ప్రతిపక్షనేతగా పనిచేయడం విశేషం. బోథ్ ఎస్టిలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
బోథ్ ఎమ్మెల్యేకి తప్పిన పెను ప్రమాదం.. ఆవు అడ్డం రావడంతో
సాక్షి, అదిలాబాద్: తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ నేతలు వరుస ప్రమాదాలకు గురవుతున్నాయి. ఇటీవల ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కారు ప్రమాదానికి గురి కాగా.. తాజాగా బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావుకు పెను ప్రమాదం తప్పింది. శనివారం ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. వివరాల ప్రకారం.. హైదారాబాద్ నుండి ఆదిలాబాద్ వస్తుండగా నిర్మల్ బైపాస్ సమీపంలో కొరటికల్ కార్నర్ వద్ద అకస్మాత్తుగా ఆవు అడ్డం వచ్చింది. దీంతో ఆవును తప్పించబోయి ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో కారు మొత్తం నుజ్జు నుజ్జు కాగా.. ఎమ్మెల్యే చేతివేలికి గాయమై తీవ్ర రక్తస్రావం అయ్యింది. వెంటనే మరో వాహనంలో ఆయనను బోథ్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఎమ్మెల్యే బాపురావు ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. చదవండి: ఎంపీ, ఎమ్మెల్యే సీట్ల పంచాయితీ.. నిధుల వాడకం వ్యాఖ్యలు మరింత మైనస్? బీజేపీ శ్రేణుల్లో ఆందోళన! -
వివాదంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే.. పంచాయితీ సెక్రటరీకి బెదిరింపులు
సాక్షి, ఆదిలాబాద్: జిల్లాలోని బోథ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివాదంలో చిక్కుకున్నారు. ఓ విషయంలో ఇచ్చోడ మండలం నవ్గామ్ పంచాయితీ సెక్రటరీకి ఫోన్ చేసి ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు హెచ్చరించారు. పంచాయితీ సెక్రటరీ సురేష్‌కు ఫోన్ చేసి భార్యా, పిల్లలను బతికించుకుంటావా లేదా చెప్పాలంటూ బెదిరింపులకు గురిచేశారు. ఉద్యోగం పోతే తెలుస్తుందని, మంచి మాటతో చెప్తున్నా.. పద్దతి మార్చుకోవాలని భయపెట్టారు. ఎక్కువ మాట్లాడుతున్నావని, సర్పంచ్‌లతో కలిసి తప్పులు చేస్తున్నావని సెక్రటరినీ భయబ్రాంతులకు గురిచేశారు. అయితే తన తప్పేంటో చెప్పాలని ఎమ్మెల్యేను సెక్రటరీ ప్రాదేయపడ్డారు. తప్పుంటే రాజీనామా చేస్తానని తెలిపారు. అయినా సెక్రటరీ మాటలు పట్టించుకోని ఎమ్మెల్యే.. పద్దతి మారకుంటే శిక్ష తప్పదని హెచ్చరించారు. కాగా ఇప్పటికే బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై ఓ మహిళా తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. తమను నమ్మించి మోసం చేశారంటూ అరిజిన్ పాల సంస్థ భాగస్వామి శేజల్ ఆరోపించారు. తమ డబ్బులు తీసుకొని, తిరిగి తమ మీదనే కేసులు బనాయించి రిమాండ్‌కు పంపించాడని వాపోయారు. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యతో తనకు ప్రాణహాని ఉందని ఇటీవల ఆత్మహత్యాయత్నం కూడా చేశారు. శేజల్‌ను పరామర్శించిన మాజీ మంత్రి గడ్డం వినోద్ బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య బాధితురాలు శేజల్‌ను మాజీ మంత్రి గడ్డం వినోద్ పరామర్శించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్ పెద్దలు మాణిక్యం థాక్రేను కలిసేందుకు ఢిల్లీకి వచ్చాను. మానవత్వంతో శేజల్‌ను పరామర్శించాను. బెల్లంపల్లిలో ఇంత పెద్ద దుర్ఘటన జరగడం బాధాకరం. నేషనల్ ఉమెన్స్ కమిషన్ కు ఆమె ఇచ్చిన ఫిర్యాదును అధికారులు పట్టించుకోవడం లేదు, FIR కూడా చెయ్యడం లేదు. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై చర్యలు తీసుకోవాలి. తెలంగాణ ప్రభుత్వం ఇకనైనా ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పైన వస్తున్న ఆరోపణలపై విచారణ జరపాలి. అమ్మాయి దగ్గర డబ్బులు తీసుకొని ప్రభుత్వ భూమి ఇచ్చారు. 30 లక్షలు తీసుకొని ఒక ఏడాది గడిచిపోయింది న్యాయం కావాలని శేజల్‌కు కాంగ్రెస్ పార్టీ తరఫున మేము మద్దతు ఇస్తున్నాం. చదవండి: తెలంగాణకు అమిత్ షా, జేపీ నడ్డా.. ఎప్పుడంటే! -
బోథ్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారికి ఎమ్మెల్యే బెదిరింపులు
-
ఆ నియోజకవర్గంలో ‘గులాబీ’ల మధ్య యుద్ధం!
ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గంలో గులాబీల మధ్య యుద్ధం మొదలైంది. సిటింగ్ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ మధ్య వార్ తీవ్రమయింది. మాజీ ఎంపీ నగేష్ ఎమ్మెల్యే మీద యుద్ధం ప్రకటించారు. దీనికి ఎమ్మెల్యే వర్గం కూడా సై అంటోంది. రెండు వర్గాలు సమరశంఖం పూర్తించి ఆధిపత్యపోరుకు తెర తీసాయి. సంక్షేమంపై దళారి డేగలు ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీల నియోజకవర్గం బోథ్‌లో అధికార టిఆర్ఎస్ పార్టీలో అంతర్యుద్ధం తారస్థాయికి చేరింది. ఎమ్మెల్యే రాథోడ్ బాపురావుపై మాజీ ఎంపి నగేష్ తిరుగుబాటు జెండా ఎగురేశారు. కొద్ది రోజుల క్రితం నగేష్ జన్మదిన వేడుకలు బోథ్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు పై నగేష్ తీవ్ర విమర్శలు చేశారు. నియోజకవర్గంలో రాష్ట్ర సర్కారు పథకాలు లభించాలంటే దళారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఉందని నగేష్ వ్యాఖ్యానించారు. సంక్షేమ పథకాల విషయంలో దళారులే రాజ్యమేలుతున్నారని.. ఇప్పటికే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కళ్యాణలక్ష్మి పథకంలో అవినీతి జరిగిందన్నారు. బోగస్ పేర్లతో ప్రభుత్వ సొమ్మును లూటీ చేశారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు మాజీ ఎంపీ నగేష్. రియల్ ఎస్టేట్ పాలిటిక్స్ తన ఇరవై ఎనిమిది సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎప్పుడూ వ్యాపారాలు చేయలేదని.. తనతో ఉన్న నాయకులు కూడా వ్యాపారాలు చేయలేదన్నారు. ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని ఎద్దేవా చేస్తూ ఈ వ్యాఖ్యలు చెయడం సంచలనం కలిగించింది. బోథ్ నియోజకవర్గానికి రాష్ట్రస్థాయిలో గుర్తింపు తెచ్చానని నగేష్ చెప్పారు. ఇప్పుడు బోథ్ ప్రతిష్ట మసక బారుతుందని అందోళన వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికలలో బోథ్ లో టిఅర్ఎస్ జెండా ఎగురవేయడమే తనలక్ష్యమంటూ..తానే ఎమ్మెల్యే అభ్యర్థినని కార్యకర్తలకు సంకేతాలు ఇచ్చారు నగేష్. ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరు? మాజీ ఎంపి నగేష్ చేసిన వ్యాఖ్యలు బోథ్‌లో తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు ఎన్నికల ప్రచారంలో ఉండటంతో ఆయన వర్గీయులంతా ఇచ్చోడలో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నగేష్ తీరుపై అగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాబలం ఉన్న రాథోడ్‌కే కేసీఆర్ మళ్ళీ అవకాశం ఇస్తారని, ఆయన తప్పకుండా విజయం సాధిస్తారని ప్రకటించారు. కొందరు కావాలనే రాథోడ్‌కు టిక్కెట్ రాదని.. ఒకవేళ వచ్చినా తాము పనిచేయంటూ ప్రకటించడంపై అగ్రహం వ్యక్తం చేశారు. రాథోడ్ బాపురావు పై అనవసరమైన వ్యాఖ్యలు చేస్తే తగిన బుద్ది చెబుతామని హెచ్చరికలు జారీచేశారు. మొత్తం మీద అధికార పార్టీలోని ఇద్దరు ముఖ్య నేతల మధ్య పోరు కారణంగా బోథ్ నియోజకవర్గం రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. -
Teachers' Day: ఉపాధ్యాయ వృత్తి నుంచి చట్టసభల్లోకి..
సాక్షి, ఆదిలాబాద్: వారంతా ఒకప్పటి గురువులు.. తరగతి గదిలో విద్యార్థులకు పాఠాలు బోధించి వారి ఉన్నతికి తోడ్పడ్డారు. ఏళ్లుగా ఉపాధ్యాయ వృత్తిలో రాణించి, ఎంతో మందిని ప్రయోజకులుగా తీర్చిదిద్దారు. సమాజ మార్గనిర్దేశకులుగా సేవలందించి విద్యార్థుల అభ్యన్నతికి పాటుపడ్డారు. ప్రజాసేవ చేయాలని రాజకీయాల్లోకి ప్రవేశించారు. ప్రజల ఆదరణను చూరగొని తరగతి నుంచి చట్టసభల్లోకి అడుగుపెట్టారు. ఉపాధ్యాయుడిగా విద్యార్థుల ఉన్నతికి ఏ విధంగా పాటుపడ్డారో ప్రజాప్రతినిధులుగానూ తమను గెలిపించిన ప్రజలకు అండగా నిలుస్తూ వారి మన్ననలు పొందుతున్నారు. ఉపాధ్యాయులుగా నాటి జ్ఞాపకాలు మరువలేనివని చెబుతున్న పూర్వపు గురువులపై ‘టీచర్స్‌డే’ సందర్భంగా ప్రత్యేక కథనం. ఉద్యోగాన్ని వదిలి ఎమ్మెల్యే, ఎంపీగా.. ఆదిలాబాద్ ఎంపీగా ఉన్న సోయం బాపూరావు సైతం ఉపాధ్యా య వృత్తి నుంచే రాజకీయాల్లోకి అడుగుపె ట్టారు. 1987లో బోథ్ మండలం మహద్గాంవ్లో తొలిసారి ఐ టీడీఏ ఉపాధ్యాయుడిగా నియామకమయ్యారు. అదే మండలం రాజుపల్లి, బజార్హత్నూర్ మండలం కొత్తగూడెం, ఆసిఫాబాద్ మండలం రాయిగూడ, ఆసిఫాబాద్ ఆశ్రమ పాఠశాల, ఉట్నూర్ స్పోర్ట్స్ స్కూల్లో 1994 వరకు విద్యార్థులకు పాఠాలు నేర్పారు. రాజకీయాలపై ఆసక్తితో 2004లో టీఆర్ఎస్లో చేరిన ఆయన ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2014, 2018లో పోటీచేసి పరాజయం పాలై తిరిగి బీజేపీలో చేరి 2019లో ఎంపీగా గెలుపొందారు. ఉపాధ్యాయుడిగా పనిచేసిన నాటి జ్ఞాపకాలు మరిచిపోలేనివని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ఉపాధ్యాయ వృత్తి ఎంతో గౌరవప్రదమైనదని దాన్ని బాధ్యతగా నిర్వహిస్తూ విద్యార్థుల ఉన్నతికి పాటుపడాలని పిలుపునిచ్చారు. ఉద్యోగాన్ని వదిలి ప్రజాసేవలో.. ఆసిఫాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆత్రం సక్కు 1993లో ఐటీడీఏ ఉపాధ్యాయుడిగా తిర్యాణి మండలం గొపెరాలో నియామకమయ్యారు. ఆరేళ్లపాటు అక్కడే పనిచేసిన ఆయన 1999లో నార్నూర్ మండలం చింతగూడ ఆశ్రమ పాఠశాలకు బదిలీ అయ్యారు. అక్కడ మూడేళ్లపాటు విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పిన ఆయన 2004లో తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2009లో తొలిసారి కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లోనూ అదె పార్టీ నుంచి పోటీచేసి పరాజయం పాలయ్యారు. తిరిగి 2018లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఉపాధ్యాయుడి నుంచి ప్రజాప్రతినిధిగా ఎన్నికై తన ప్రస్తానం కొనసాగిస్తున్నారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా .. బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు సుదీర్ఘకాలం పాటు ఉపాధ్యాయుడిగా సేవలందించారు. 1986లో ఆదిలాబాద్ మండలం చింతగూడలో స్పెషల్ టీచర్‌గా నియామకమయ్యారు. 1987లో పదోన్నతి పొంది ముత్యన్పేట పాఠశాలకు బదిలీపై వెళ్లారు. ఆదిలాబాద్‌లోని కోలాం ఆశ్రమ పాఠశాలలో నాలుగేళ్లపాటు పనిచేశారు. 1993లో గ్రేడ్–1 హింది పండిట్‌గా పదోన్నతి పొంది తలమడుగు మండలం ఝరి ఆశ్రమ పాఠశాలకు వెళ్లారు. అక్కడ ఏడేళ్లపాటు పనిచేసిన ఆయన ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దారు. 2000 సంవత్సరంలో తాంసి మండలం అందర్బంద్కు బదిలీ అయ్యారు. అక్కడ మూడేళ్లపాటు పనిచేసి, ఆదిలాబాద్ మండలం మామిడిగూడ బాలికల ఆశ్రమ పాఠశాలకు బదిలీ అయ్యారు. 2009 వరకు అక్కడే సేవలందించారు. ప్రత్యేక తెలంగాణ రాష్టాన్ని కాంక్షిస్తూ 2009లో తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. కేసీఆర్ పిలుపుతో టీఆర్ఎస్లో చేరిన ఆయన 2014, 2018లో వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. గురువులు బావి తరాలకు ఆదర్శమని, బాధ్యతగా పనిచేస్తూ విద్యార్థుల ఉన్నతికి తోడ్పడాలని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ప్రైవేట్ టీచర్ నుంచి ఎమ్మెల్యేగా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు విద్యారంగంతో ఎంతో అనుబంధం ఉంది. ఈయన రాజకీయాల్లోకి రాక ముందు 1992నుంచి 1994 వరకు శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని సరస్వతి శిశు మందిర్‌లో ఉపాధ్యాయుడిగా సేవలందించారు. విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన చదువునందించి మంచి ఉపాధ్యాయుడిగా గుర్తింపు పొందిన ఆయన రాజకీయాల్లోనూ అదే స్ఫూర్తిని కొనసాగిస్తున్నారు. 1996లో నెన్నెల మండల జెడ్పీటీసీగా, 2001లో ఎంపీపీగా పనిచేశారు. 2009, 2018లో టీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రజా ప్రతినిధి అయినప్పటికీ విద్యారంగపై ఆయనకున్న మక్కువను చాటుతూనే ఉంటారు. పాఠశాలలను సందర్శించిన సమయంలో విద్యార్థులతో ముచ్చటిస్తూ వారి ప్రతిభాపాఠవాలను తెలుసుకుంటారు. ప్రశ్నలు సంధించి సమాధానాలు రాబడుతూ వారితో మమేకమవుతారు. ఉపాధ్యాయ వృత్తి ఎంతో గౌరవప్రదమైనదని, బాధ్యతగా నిర్వహించాలని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఉపాధ్యాయుడి నుంచి క్యాబినెట్ మంత్రిగా గోడం నగేశ్ 1986లో ఎస్జీబీటీగా బజార్హత్నూర్ మండలం విఠల్గూడ ఆశ్రమ పాఠశాలలో నియామకమయ్యారు. బోథ్ మండలం పార్డి–బి యూపీఎస్ హెచ్‌ఎంగాను సేవలందించారు. 1989లో స్కూల్ అసిస్టెంట్‌గా పదోన్నతి పొంది బజార్హత్నూర్ మండలం జాతర్ల ఉన్నత పాఠశాలలో నియామకమయ్యారు. 1993లో ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. టీడీపీలో చేరిన ఆయన 1994 ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1999లో మరోసారి ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్ర గిరిజన సంక్షేమ, వికలాంగుల సంక్షేమశాఖ మంత్రిగా పనిచేశారు. 2009లోనూ అదే పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో టీఆర్ఎస్ నుంచి ఎంపీగా పోటీచేసి గెలుపొంది పార్లమెంట్‌లోనూ అడుగుపెట్టారు. ఉపాధ్యాయుడిగా విద్యార్థులకు పాఠాలు బోధించిన ఆయన జిల్లా రాజకీయాల్లోనూ తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. -
బోథ్ ఎమ్మెల్యే తిట్లపురాణం
సాక్షి, ఆదిలాబాద్: తన కారు వెళ్లే దారిలోనే ట్రాక్టర్ అడ్డుపెడుతారా? అంటూ బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు మావల మండలం బట్టిసావర్గాం గ్రామ పంచాయతీ కారోబార్‌పై తిట్ల పురాణం అందుకున్నారు. శనివారం ఆదిలాబాద్ నుంచి పొన్నారి శివారులోని తన వ్యవసాయ క్షేత్రానికి కారులో ఎమ్మెల్యే బయలుదేరారు. కాగా బట్టిసావర్గాం గ్రామంలో డీజిల్ అయిపోయిందని రోడ్డుపైనే పంచాయతీ ట్రాక్టర్‌ను నిలిపివేశారు. దీంతో తన కారుకే అడ్డుగా ట్రాక్టర్‌ను నిలుపుతారా..? అంటూ గ్రామ కారోబార్‌పై మండిపడ్డారు. ట్రాక్టర్ నిలపడానికి తనకు ఎలాంటి సంబంధం లేదని కారోబార్ సమాధానం ఇచ్చినా శాంతించని ఎమ్మెల్యే ఉద్యోగంలో ఎలా కొనసాగుతావో, ఆదిలాబాద్‌కు ఎలా వస్తోవో చూస్తానని కారోబార్‌ను హెచ్చరించారు. బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు చేసిన వ్యాఖ్యల వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. -
ఆదిలాబాద్ టీఆర్ఎస్లో వార్!
సాక్షి, ఆదిలాబాద్: అధికార పార్టీలో వార్ నడుస్తోంది. ఎమ్మెల్యేలు, ముఖ్యనేతల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. గత కొద్ది రోజులుగా జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే, ముఖ్యనేతల మధ్య వైరం నడుస్తుండగా..తాజాగా ఎమ్మెల్యేల మధ్య కూడా సఖ్యత కొరవడింది. ఈ తాజా రాజకీయ పరిణామాలు ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఎక్కడి వారు అక్కడే.. జిల్లా రాజకీయాల్లో అధికార పార్టీ పరంగా ఇటీవల జరిగిన సంఘటనలు పార్టీలో రాజకీయ విభేదాలను ప్రస్పుటం చేస్తున్నాయి. సాధారణంగా మంత్రులు జిల్లాలో పర్యటించినప్పుడు ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఇటీవల మంత్రి ఐకేరెడ్డి ఆదిలాబాద్ పట్టణంలోని దుర్గానగర్‌లో అటవీశాఖకు సంబంధించి ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు రాగా, బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు దాంట్లో పాల్గొనలేదు. రెండు రోజుల క్రితం బోథ్ మండలం ధనోరలో డబుల్ బెడ్రూమ్ ప్రారంభోత్సవంలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పాల్గొనగా ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న ఆ కార్యక్రమానికి గైర్హాజరయ్యారు. ఇటు ఆదిలాబాద్, అటు బోథ్ నియోజకవర్గాల్లో ఏ కార్యక్రమం జరిగినా ముఖ్యనేతలు హాజరైతే ఇరువురు ఎమ్మెల్యేలు పాల్గొనేవారు. అయితే తాజాగా ఎమ్మెల్యే రాథోడ్ బాపురావుకు ఎమ్మెల్యే జోగు రామన్నతో పొసగక పోవడంతోనే ఈ పరిస్థితి నెలకొందన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. కాగా ఈ ఇరువురు మధ్య విభేదాలు శాసనసభ ఎన్నికల సమయం నుంచే అంతర్లీనంగా ఉన్నప్పటికీ తాజాగా అవి బహిర్గతం అవుతున్నాయన్న చర్చ సాగుతోంది. ఆ ఎన్నికలకు ముందు అప్పుడు ఎంపీగా ఉన్న గోడం నగేశ్‌తో ఎమ్మెల్యే జోగు రామన్న సఖ్యతగా ఉంటున్నారనే అభిప్రాయంతో రాథోడ్ బాపురావు వర్గీయులు విభేదించారు. ఆ తర్వాత ఎన్నికల్లో బోథ్ నియోజకవర్గం నుంచి తిరిగి అసెంబ్లీ పోటీ చేసి విజయం సాధించిన రాథోడ్ బాపురావు విభేదాలను పక్కన బెట్టి ఎమ్మెల్యే జోగు రామన్నతో కలిసి సాగుతున్నట్లు కనిపించినప్పటికీ తాజాగా ఆ పరిస్థితులు మారిపోయాయి. టీఆర్ఎస్ సర్కార్ రెండోసారి కొలువుదీరిన తర్వాత జోగు రామన్నకు తిరిగి మంత్రి పదవి దక్కకపోవడం.. ఈ విషయంలో బోథ్ ఎమ్మెల్యేతో సఖ్యతగా ఉండే నాయకులు కొంతమంది రామన్నకు వ్యతిరేకంగా అనేక చోట్ల ప్రస్తావించడంతోనే ఈ పరిస్థితి ఎదురైనట్లు తెలుస్తోంది. తాను రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందడం మరోపక్క అధికార కాలం మరో నాలుగేళ్లు ఉండడంతో బాపురావు కూడా ఇదివరకు రామన్నతో వ్యవహరించిన తీరుకు భిన్నంగా పోతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ మధ్యకాలంలో మంత్రివర్గ విస్తరణ తర్వాత రామన్న అజ్ఞాతంలోకి వెళ్లి తిరిగి వచ్చిన తర్వాత పలువురు ముఖ్యనాయకులు ఆయనను కలిసి పరామర్శించినప్పటికీ బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు ఆయనను పరామర్శించలేదనే అపవాదు ఉంది. విభేదాల కారణంగానే ఈ పరిస్థితి ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్య నేతలతోనూ.. రాథోడ్ బాపురావుకు టీఆర్ఎస్ జిల్లా ముఖ్యనేతలతోనూ సత్సంబంధాలు లేవు. పార్టీలో ఈ విషయంలో సామాన్య కార్యకర్తకు కూడా అవగతం ఉంది. ప్రధానంగా మాజీ ఎంపీ గోడం నగేశ్‌తో విభేదాలు ఉన్నాయి. ప్రధానంగా శాసనసభ ఎన్నికలకు ముందు నగేశ్ బోథ్ అసెంబ్లీ నుంచి పోటీ చేయడం ఖాయమనే సంకేతాలను ఆయన అనుచరులు బాహాటంగానే పేర్కొనడం అప్పట్లో జరిగింది. అయితే ఎన్నికల్లో తిరిగి బాపురావు టికెట్ దక్కించుకొని గెలుపొందడం ద్వారా తన ప్రభావం చాటారు. అప్పట్లో బోథ్ నియోజకవర్గంలో నగేశ్ కేడర్‌గా ఉన్నవారిని ఆయన కొంతదూరం పెట్టారు. అంతకు ముందు బోథ్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్సీ రాములునాయక్ వర్గం కూడా ఉండేది. ఆయన పార్టీ మారిన తర్వాత ఆ కేడర్‌కు సరైన ప్రాధాన్యత ఎమ్మెల్యే వర్గీయులు ఇవ్వలేదన్న ప్రచారం లేకపోలేదు. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలోనూ కొంత వర్గ రాజకీయాలకు దారితీశాయి. రాష్ట్ర డెయిరీ డెవలప్మెంట్ చైర్మన్ లోక భూమారెడ్డితోనూ బాపురావుకు విభేదాలు ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో తలమడుగు జెడ్పీటీసీ స్థానం నుంచి లోక భూమారెడ్డి తన అల్లుడికి టికెట్ కోసం ప్రయత్నం చేశారు. అయితే ఎమ్మెల్యే ఆయనకు సహకరించకపోవడం ఈ విభేదాలకు కారణమైంది. అంతకుముందు నుంచే ఈ ఇరువురి మధ్య విభేదాలు ఉండగా, ఆ సంఘటనతో మరింత ముదిరాయి. ఇప్పటికీ ఈ ఇరువురి నేతల మధ్య ఎడమొహం.. పెడమొహం అన్న తీరుగానే రాజకీయం ఉందన్న చర్చ సాగుతోంది. జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్‌తో ఎమ్మెల్యే రాథోడ్ బాపురావుతో సఖ్యతగా ఉండగా, నార్నూర్ జెడ్పీటీసీగా గెలిచి జెడ్పీ చైర్మన్‌గా ఎన్నికైన రాథోడ్ జనార్దన్ ఆ తర్వాత కొంత ఖానాపూర్ నియోజకవర్గంలోని ఉట్నూర్‌పై దృష్టి సారించడంతో ఆ ఎమ్మెల్యే రేఖానాయక్ ఇటు జెడ్పీ చైర్మన్‌పై, అటు ఆయనకు సపోర్ట్‌గా ఉన్న బోథ్ ఎమ్మెల్యేపై కొంత గుర్రుగా ఉన్నారన్న ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో బోథ్ ఎమ్మెల్యే వర్సెస్ జిల్లా ముఖ్యనేతలు అన్న చందంగా ప్రస్తుతం అధికార పార్టీలో రాజకీయ వ్యవహారాలు సాగుతున్నాయి. జెడ్పీచైర్మన్ రాథోడ్ జనార్దన్ ఇటు బాపురావుతో, అటు రామన్నతో సఖ్యతగా ఉంటూ వస్తున్నారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న, మాజీ ఎంపీ నగేశ్, డెయిరీ డెవలప్మెంట్ చైర్మన్ లోక భూమారెడ్డి ప్రస్తుతం ఒక వర్గంగా ఉండగా, రాథోడ్ బాపురావు మరో వర్గంగా ఒంటరిగా నిలవడం గమనార్హం. -
రసవత్తరంగా రెండో దశ!
నేటి శుక్రవారం జరగనున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ రెండో విడత ఎన్నికలు పలువురు అధికార పార్టీ ముఖ్య నాయకులకు కీలకం కానున్నాయి. ఎందుకంటే, ఈ ఎన్నికలు జరగనున్న మండలాలతో ఆయా నాయకులకు ప్రత్యేక సంబంధం ఉండటమే కారణం. కాబట్టి ఆ మండలాల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీలను గెలిపించుకోవడం ఇప్పుడు సదరు నేతలకు సవాలుగా మారింది. బోథ్నియోజకవర్గంలో ఈ ఎన్నికల బాధ్యతలను ఎమ్మెల్యేలకు అప్పగించినప్పటికీ ఆయా మండలాల్లో ఇతర నేతలు కూడా బాగానే పలుకుబడి కలిగి ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆ నియోజకవర్గంలో ‘నాయకులు పలుకుబడి’ గెలుపోటములపై ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు! గుడిహత్నూర్, తలమడుగు, బోథ్, నేరడిగొండ, బజార్హత్నూర్ మండలాల్లో నేడు పోలింగ్ జరగనుంది. గత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించి అటు జెడ్పీటీసీ స్థానాలు గెలవడంతోపాటు ఇటు ఎంపీపీ స్థానాలను టీఆర్ఎస్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే! దీంతో ఇప్పుడు ఐదు మండలాల్లో జరగనున్న రెండో విడత ఎన్నికల్లో గెలవడం అధికార పార్టీ నాయకులకు ప్రతిష్టాత్మకంగా మారిందని చెప్పొచ్చు. సాక్షి, ఆదిలాబాద్: రాథోడ్ బాపూరావు, ఎమ్మెల్యే..బోథ్ నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో ఈ ఎన్నికలు జరుగుతుండడంతో ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావుకు ఈ ఎన్నికలు కీలకం కానున్నాయి. ఇప్పటికే ఈ నియోజకవర్గంలోని తాంసి, భీంపూ ర్ మండలాల్లో మొదటి విడత ఎన్నికలు పూర్తయ్యాయి. రెండో విడతలో మిగిలిన మండలాల్లో జరుగుతుండటంతో గెలుపును ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ప్రధానంగా అసెంబ్లీ ఎన్నికల్లో తాను గెలుపొందినప్పటికీ ఆశించిన స్థాయిలో మెజార్టీ రాకపోవడంతో ప్రాదేశిక ఎన్నికల్లో గెలుపొందడం ద్వారా ఆ లెక్కను సమం చేయాలని ఆయన భావిస్తున్నారు. నేరడిగొండ, గుడిహత్నూర్, బజార్హత్నూర్ మండలాల్లో ఆయన ప్రచారం కూడా చేపట్టలేదు. నేరడిగొండలో అనిల్ జాదవ్ బరిలో ఉండటంతో ఆ మండలం విషయంలో ఆయన జోక్యం చేసుకోలేదని తెలుస్తోంది. బజార్హత్నూర్ మండలంలో ఎంపీ నగేష్ అనుచరులు పోటీ చేస్తుండటంతో ఆ మండలంలోనూ బాపూరావు కలుగజేసుకోలేదు. గుడిహత్నూర్‌లో ఎమ్మెల్యే అనుచరుడు పోటీ చేస్తున్నప్పటికీ ఆయన అక్కడ కూడా ప్రచారం చేయకపోవడం విస్మయం కలిగించే అంశమే! ఏదేమైనా ప్రాదేశిక ఎన్నికల ఫలితాలు ఎమ్మెల్యే బాపూరావుకు సవాలుగా మారనున్నాయనేది సుస్పష్టం! గోడం నగేష్, ఎంపీ ఎంపీ గోడం నగేష్ సొంత మండలం బజార్హత్నూర్. ఇక్కడ ఆయన అనుచరులు పోటీ చేస్తుండటంతో ఈ మండలంలో వారి గెలుపు కీలకం కానుంది. లోక్‌సభ ఎన్నికల బరిలో నిలిచిన నగేష్‌కు అప్పుడు ప్రచారం విషయంలో బోథ్ నియోజకవర్గం ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావుతో పొసగలేదనే ప్రచారముంది. బజార్హత్నూర్లో ప్రధానంగా ప్రత్యర్థి పార్టీలు కాంగ్రెస్, బీజేపీ నుంచి గట్టి సవాల్ ఎదురుకావడంతో ఇక్కడ గెలుపు సవాలుగా మారనుంది. బీజేపీ నుంచి ఏకంగా 14 మంది అభ్యర్థులు టికెట్ కోసం పోటీపడటం ఈ మండల ప్రాధాన్యతను చెప్పకనే చెప్పింది. చివరికి పార్టీ బీ–ఫాం ఒకరికి ఇచ్చినప్పటికీ ఆ అభ్యర్థి విజయం కోసం ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి సోయం బాపూరావు విస్తృతంగా పర్యటించడంతో ఇక్కడ గోడం వర్సెస్ సోయం అన్న చందంగా పోటీ నెలకొంది. లోక భూమారెడ్డి, డెయిరీ చైర్మన్ ప్రాదేశిక ఎన్నికల్లో తలమడుగు మండలంలో తన సమీప బంధువుకు జెడ్పీటీసీ టికెట్ ఇప్పించాలని రాష్ట్ర డెయిరీ డెవలప్మెంట్ చైర్మన్ లోక భూమారెడ్డి ప్రయత్నాలు చేశారు. అయితే ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు తన అనుచరుడికి కట్టబెట్టడంతో ఇద్దరి మధ్య విభేదాలు పొడచూపాయనే గుసగుసలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో నిలిచిన జెడ్పీటీసీ అభ్యర్థిని ఎలాగైనా ఓడించాలనే ప్రయత్నం చేస్తున్న లోక భూమారెడ్డికి ఈ మండలంలో ఎన్నికలు కీలకం కానున్నాయి. అయితే ప్రచారంలో ఎమ్మెల్యేతో ఉన్న విభేదాలు బాహాటంగానే ప్రస్పుటమయ్యాయి. చివరి రోజు బుధవారం ప్రచారంలో ఎంపీ నగేష్, ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్నతో కలిసి ఆయన తలమడుగు మండలంలో ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచార విషయం గురించి ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావుకు కనీసం సమాచారం కూడా అందించలేదనే చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో ఈ మండలంలో ఎమ్మెల్యే అనుచరుడే బరిలో ఉన్నప్పటికీ గెలుపోటముల ప్రభావం కొంత లోక భూమారెడ్డిపై కూడా ఉండనుంది. డీసీసీబీ అధ్యక్షుడు ముడుపు దామోదర్‌రెడ్డి తలమడుగు మండలానికి చెందినవారే. దీంతో అక్కడి ఎన్నికల్లో ఆయనపై కూడా గెలుపు బాధ్యత నెలకొంది. అనిల్ జాదవ్, జెడ్పీటీసీ అభ్యర్థి బోథ్ నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో ఎన్నికలు ఈరోజు జరగనుండగా, అందులో మూడు స్థానాలు జనరల్ కాగా, బోథ్ జనరల్(మహిళ) రిజర్వ్ అయింది. ఇక నేరడిగొండ ఒక్కటే ఎస్టీ(జనరల్) రిజర్వ్ ఉంది. ఇక్కడి నుంచి అధికార పార్టీ తరపున బరిలో దిగిన అనిల్ జాదవ్ జెడ్పీ చైర్మన్ అభ్యర్థి అంటూ ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ మండలంలో ఆయన గెలుపు కీలకం కానుంది. ఇదిలా ఉంటే టీఆర్ఎస్ నుంచి ఈ మండలంలో ప్రచారం కూడా ఆయన ఒక్కడే నిర్వహించడం గమనార్హం! లోక్‌సభ ఎన్నికల సమయంలో టీఆర్ఎస్లో చేరిన అనిల్ జాదవ్ అధినాయకుల అండతోనే జెడ్పీ చైర్మన్ పదవిపై భరోసాతోనే జెడ్పీటీసీ బరిలో దిగారనే ప్రచారమూ జరుగుతోంది. జిల్లాలోని ఇతర మండలాల అధికార పార్టీ జెడ్పీటీసీ అభ్యర్థులతో ఆయన ఇప్పుడే టచ్‌లో ఉండటం కూడా ప్రాధాన్యతను సంతరించుకుంది. -
నాలుగేళ్ల పాలనలో అన్నిరంగాల్లో అభివృద్ధి
ఇచ్చోడ: నాలుగేళ్ల టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో మండలాలు అన్నిరంగాల్లో అభివృద్ధి చెందాయని ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు అన్నారు. శనివారం ఇచ్చోడ మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. గ్రామాల్లో రోడ్లు, మురికికాల్వల నిర్మాణాలు, పాఠశాల భవనాలు, పంచాయతీ భవనాలు పూర్తిస్థాయిలో నిర్మాణాలు జరిగాయని ఆయన తెలిపారు. టీఆర్ఎస్ హయాంలో అనేకగ్రామాలకు విద్యుత్ సరఫరా అందించనున్నట్లు ఆయన తెలిపారు. ఇచ్చోడ మండలంలో కోకస్‌మాన్నూర్, ధర్మంపురి, నేరడిగొండ జి, సల్యాద, గుండాల గ్రామాలకు బీటీ రోడ్లు నిర్మాణం అయినట్లు ఆయన తెలిపారు. మండలంలో నర్సపూ ర్లో విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మించి సిరిచెల్మ, తలమద్రి, మాల్యల్, గెర్జం ఫీడర్ల కింద నలభై గ్రామాల కు విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు ఆయన తెలిపా రు. రైతుబం«ధు పథకం ద్వారా భూమి ఉన్న ప్రతీ రైతుకు ఎకరానికి రూ.4 వేలు అందించిన ఘనత కూడా టీఆర్ఎస్ ప్రభుత్వనిదేనని తెలిపారు. నర్సపూర్, ఇచ్చోడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వెళ్లాడానికి సీసీరోడ్లు నిర్మిస్తామని తెలిపారు. ఇచ్చోడ మండలకేంద్రంలో శ్మాశాన వాటికి వద్ద కల్వర్టు నిర్మాణానికి కృషి చేస్తానని తెలిపారు. బీసీ హాస్టల్లో తాగు నీటికి బోరుకు నిధులు మంజూ రు చేస్తామని తెలిపారు. ఎల్లమగూడ, కేశవపట్నం గ్రామాల్లో నిర్మిస్తున్న డబుల్బెడ్రూం ఇళ్ల నిర్మా ణాలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. అంగన్వాడీల ద్వారా పిల్లలకు అందిస్తు న్న పౌష్టికాహారాన్ని పకడ్బందీగా అమలు చేయా లని ఐసీడీఎస్ సూపర్వైజర్లకు ఆదేశించారు. వర్షా కాలంలో వైద్యసిబ్బంది అప్రమత్తంగా ఉండాలని వైద్యసిబ్బందిని ఆదేశించారు. ఎంపీపీ అమీనాబీ, ఇన్చార్జీ ఎంపీడీవో లింగయ్య, ఇచ్చోడ, సిరికొండ తహసీల్దార్లు మహేంద్రనాథ్, మోతీరాం, ఎంపీటీసీలు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. -
నామినేషన్ల జోరు
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : లోక్‌సభ, శాసనసభ స్థానాలకు అన్ని పార్టీల్లో అభ్యర్థులు ఖరారవుతుండటంతో నామినేషన్ల పర్వం ఊపందుకుంది. మూడో రోజైన శుక్రవారం తొమ్మిది నియోజకవర్గాలకు 17 నామినేషన్లు దాఖలు కా గా, నిర్మల్ నియోజకవర్గానికి నామినేషన్లు రాలేదు. సిర్పూర్ నియోజకవర్గానికి టీడీపీ నుంచి రావి శ్రీనివాస్‌రావు, టీఆర్ఎస్ నుంచి కావేటి సమ్మయ్య, చెన్నూర్‌కు టీడీపీ నుంచి దుర్గం నరేష్, బెల్లంపల్లికి టీడీపీ నుంచి పాటి సుభద్ర, మంచిర్యాలకు కాంగ్రెస్ నుంచి గడ్డం అరవింద రెడ్డి, టీడీపీ నుంచి కొండేటి సత్యనారాయణ, టీడీపీ నుంచి మురళీధర్, ఆసిఫాబాద్ స్థానానికి టీఆర్ఎస్ నుంచి కోవ లక్ష్మి, ఖానాపూర్‌కు కాంగ్రెస్ పార్టీ నుంచి అజ్మీర హరినాయక్, స్వతంత్ర అభ్యర్థిగా జాదవ్ బొజ్జ నాయక్ నామినేషన్ దాఖలు చేశారు. అదే స్థానానికి టీఆర్ఎస్ నుంచి అజ్మీర రేఖాశ్యాంనాయక్ రెండు సెట్లు నామినేషన్ వేశారు. ఆదిలాబాద్‌కు టీఆర్ఎస్ నుంచి జోగు రామన్న, బీజేపీ నుంచి పాయ ల శంకర్ నామినేషన్ వేశారు. బోథ్‌కు టీఆర్ఎస్ నుంచి రాథోడ్ బాపురావు వేశారు. ముథోల్‌కు కాంగ్రెస్ నుంచి విఠల్‌రెడ్డి నామినేషన్ వేయగా, ఈయనే స్వతంత్ర అభ్యర్థిగా మరో నామినేషన్ దాఖలు చేశా రు. సిర్పూర్ నియోజకవర్గానికి 2, చెన్నూర్‌కు 1, బెల్లంపల్లికి 1, మంచిర్యాలకు 3, ఆసిఫాబాద్‌కు 1, ఖానాపూర్‌కు 4, ఆదిలాబాద్‌కు 2, బోథ్‌కు 1, ముథోల్‌కు 2 చొప్పున నామినేషన్లు వచ్చాయి.