ఢిల్లీ: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు బీజేపీ గూటికి చేరారు. రాథోడ్ బాపురావ్‌తో పాటు మునుగోడు నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నేత చెల్లమల కృష్ణారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు సుభాష్ రెడ్డి, ఇతర నాయకులు బీజేపీలో చేరారు.
బీజేపీలో చేరిన సందర్బంగా ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావ్ మాట్లాడుతూ.. ఉద్యోగాన్ని వదిలి తెలంగాణ ఉద్యమంలో చేరానని చెప్పారు. రాష్ట్ర సాధనకోసం తనవంతు ప్రయత్నం చేశానన్నారు. బోథ్ సిట్టింగ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావును కాదని నేరడిగొండ జెడ్పీటీసీ అనిల్ జాదవ్‌కు సీఎం కేసీఆర్ పార్టీ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. దీంతో అసంతృప్తికి గురైన బాపురావు.. బీజేపీ నుంచి బరిలో దిగనున్నారు.
రెండుసార్లు గెలిచిన తనను ప్రజల్లో ఆదరాభిమానాలున్నప్పటికీ కొందరు కక్షగట్టి మూడోసారి ఎమ్మెల్యే టికెట్ రాకుండా చేశారని బాపురావ్ తెలిపారు. దీనిపై మాట్లాడాలని కలిసేందుకు ప్రయత్నిస్తే ముఖ్యమంత్రి అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ముగ్గురు గిరిజన ఎమ్మెల్యేలకు కూడా టికెట్లు ఇవ్వకుండా అడ్డుకున్నారని చెప్పారు.
అనంతరం ఎల్లారెడ్డికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత సుభాష్ రెడ్డి, చెల్లమల కృష్ణారెడ్డితోపాటు కాంగ్రెస్ నేతలు సురిగి నర్సింహా, బిట్టు సత్యనారాయణ పార్టీలో చేరారు. వీరందరినీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఇదీ చదవండి: గద్వాల నుంచి పోటీకి డీకే అరుణ దూరం.. కారణమిదే..?
Comments
Please login to add a commentAdd a comment