కేసీఆర్ ఫామ్ హౌస్ సీఎం కాదు.. ఫామింగ్ సీఎం: హరీష్ రావు | Miniter Harish Rao Press Meet | Sakshi
Sakshi News home page

కేసీఆర్ ఫామ్ హౌస్ సీఎం కాదు.. ఫామింగ్ సీఎం: హరీష్ రావు

Published Sun, Nov 26 2023 8:02 PM | Last Updated on Sun, Nov 26 2023 9:07 PM

Miniter Harish Rao Press Meet - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సీఎం కేసీఆర్ దృష్టి అంతా రైతుల మీద ఉంటుందని మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. కేసీఆర్ ఫామ్ హౌస్ సీఎం కాదు.. ఒక ఫామింగ్ సీఎం అని కొనియాడారు. రాష్ట్రంలో 24 గంటల కరెంట్, రైతుబంధుతో కేసీఆర్ వ్యవసాయం పండగ చేశారని పేర్కొన్నారు. కేసీఆర్ ఒక రైతు బిడ్డని గుర్తు చేశారు. ఇన్నాళ్లు నీళ్ళు లేక, పెట్టుబడి లేక రైతులు ఇబ్బందులు పడ్డారు. మళ్ళీ కాంగ్రెస్ చేతిలో పడితే రాష్ట్రం ఏమవుతుంది అనేదే భయమని అన్నారు. రిస్క్ తీసుకోవద్దు.. కారుకు ఓటేసి బీఆర్‌ఎస్‌ను గెలిపించాలని ప్రజలను కోరారు. 

ప్రశ్న: బీఆర్‌ఎస్ కాకుండా వేరే పార్టీ వస్తే పరిస్తితి ఏంటి?

హరీష్ రావు: పేదలకు బీజేపీ, కాంగ్రెస్‌లు చేసిందేమీ లేదు. అయిదు గ్యారంటీలతో కర్ణాటకలో కాంగ్రెస్ జనాన్ని మోసం చేసింది. రాహుల్, ప్రియాంక తమది గ్యారంటీ అన్నారు. ఆరు నెలలు అవుతున్నా ఎన్నికల హామీలు అమలు చేయటం లేదు. ఏడాదికి 2లక్షల ఉద్యోగాలు అన్నారు. ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు. ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు. నిన్న నిరుద్యోగుల వద్దకు వెళ్లి రాహుల్ గాంధీ డ్రామాలు చేస్తున్నారు. కర్ణాటకలో 5 గ్యారెంటీలు ఏమో గానీ ఉన్న గ్యారంటీలు పోయాయి. నిరుద్యోగ భృతి కూడా ఇవ్వటం లేదు. 80 శాతం ఫీజుల్లో కోత పెట్టారు. అన్నింట్లో కోత పెట్టింది కర్ణాటక ప్రభుత్వం. రేవంత్ రెడ్డి 3 గంటల కరెంట్, కర్ణాటక డిప్యూటీ సీఎం 5 నుంచి 7 గంటల కరెంట్ చాలు అంటున్నారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే 3 గంటల కరెంట్, 5 గంటల కరెంట్ ఒప్పుకున్నట్టే. ప్రజలు ఆలోచించాలి. రైతు బంధు కాంగ్రెస్ పార్టీ రూ.15 వేలు ఇస్తామని చెప్తోంది. కానీ మేము రూ.16 వేలు ఇస్తామని చెప్తున్నాం. గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కరెంట్ కష్టాలు ఉండే. మనం రిస్క్ తీసుకోవద్దు. 

ప్రశ్న: కర్ణాటక హామీల ప్రకటనలు ఇస్తోంది ఇక్కడ?

హరీష్ రావు: కర్ణాటక ఇచ్చే యాడ్ అంత అబద్దం. యువశక్తి అని యాడ్ ఇచ్చారు. అక్కడ ఉద్యోగాలు ఇచ్చారా? బస్సులు కూడా లేకుండా చేశారు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇక్కడ కర్ణాటక యాడ్ ఇవ్వటం ఎందుకు?


ప్రశ్న: బీఆర్‌ఎస్ పరిపాలనలో పాజిటివ్‌తో వెళ్లాల్సిన బీఆర్‌ఎస్ భయపడుతుంది కాంగ్రెస్ కు అనే వాదన వస్తోంది?

హరీష్ రావు: మాకు భయం అనేదే లేదు. ఆ ప్రశ్న ఉత్పన్నం కాదు. మేము 12 సార్లు రైతు బంధు ఇచ్చాం. కాంగ్రెస్‌లో అధికారంలోకి వస్తే 12 ముఖ్యమంత్రులు ఖాయం.

ప్రశ్న: ఇతర రాష్ట్రాల్లో ఎక్కడ కూడా సీఎంలను మార్చలేదు ఇక్కడ ఎందుకు మారుస్తాం అంటున్నారు?

హరీష్ రావు: తెలంగాణ రాకముందు ఇక్కడ సీఎంలను మార్చలేదా మనం చూడలేదా? కర్ణాటక మోడల్ అంటే ఏంటి? కరెంట్ ఇవ్వక పోవడమా?  రైతు బంధు ఇచ్చాము, కరెంట్ ఇచ్చాము.కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇవన్నీ రద్దు అవుతాయి.

ప్రశ్న: కాంగ్రెస్ గాలి వీస్తుంది అనే వార్తలు వస్తున్నాయి? ఏమంటారు?

హరీష్ రావు: మేము నిర్వహించిన మహబూబాబాద్, నర్సం పేట, పాలకుర్తి, భువనగిరిలో ఎక్కడ చూసినా ఇసుక వేస్తే రాలనంత జనం వస్తున్నారు. కానీ రాహుల్ సభకు, ప్రియాంక సభకు జనం లేక వెలవెలభోతున్నాయి. ఖాళీ కుర్చీలకు ఉపన్యాసం ఇస్తున్నారు. జనం ముమ్మాటికీ మా వైపే ఉన్నారు. ఇంటింటికి మంచి నీరు, 24 గంటల కరెంట్, సాగు నీరు అందిచాం. 
 

ప్రశ్న: 24 గంటల కరెంట్, మిషన్ భగీరథతో ఇంటింటికి నీళ్ళు ఇవ్వలేదు? వెళ్లి చూద్దామా? అని ప్రతిపక్షాలు అంటున్నాయి

మంత్రి హరీష్‌: 'ఇవన్నీ రాకపోతే టీవీ లోనో, పేపర్ లోనో రావాలి కదా. కరెంట్, నీళ్ళు ఇస్తే కారుకు ఓటెయ్యండి. రాని వాళ్ళు కాంగ్రెస్‌కు ఓటెయ్యండి. రిస్క్ వద్దు అనేది మా అభిప్రాయం. సాఫీగా తెలంగాణ పాలన సాగుతోంది. సంక్షేమ రంగంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉంది. అనేక రంగాల్లో మార్గదర్శకంగా తెలంగాణను దేశంలో.నంబర్ 1 స్థానంలో ఉంచాం. హర్ గర్ జల్ అని కేంద్రం మిషన్ భగీరథను కాపీ కొట్టింది. కేసీఆర్‌కు వాగు వంక, చెట్టు పుట్ట అన్ని తెలుసు. ప్రతిపక్ష నాయకులకు ఏది తెలియదు. కొన్ని పథకాలు తప్ప వేరే కనపడటం లేదు. చేసింది, చూసిందే గమనించాలి అంటున్నాం. అందుకే ఇవ్వన్నీ గమనించి ఓటేయాలి.' అని మంత్రి హరీష్ రావు చెప్పారు.


ప్రశ్న: స్కూళ్ళు మూత పడుతున్నాయి?

మంత్రి హరీష్‌: 'ఒక్క విద్యార్థి కూడా లేని చోట మూత పడ్డాయి అంతే' అని హరీష్ రావు సమాధామిచ్చారు. 

ప్రశ్న: ధరణి విషయంలో విమర్శలు ఎందుకు? ధరణి ప్లాప్ అంటోంది కాంగ్రెస్?

మంత్రి హరీష్‌:  'మా బలం ఏందో ప్రతిపక్షాలకు తెలుసు. మా బలం  మీద విమర్శ చేస్తేనే దుష్ప్రచారం చేస్తేనే జనం నమ్ముతారు అని వారి ఆలోచన' అని హరీష్ రావు అన్నారు. 

ప్రశ్న: తెలంగాణలో జనరేటర్లు, ఇన్వర్టర్లు లేవు.. ధరణితో భూములు లాక్కుంటున్నారు అంటున్నారు?

మంత్రి హరీష్‌: 'ప్రజల్లో అపనమ్మకం సృష్టించి జనాన్ని ఇబ్బందులు పెట్టాలని కాంగ్రెస్ చూస్తోంది. 60 యేళ్లు పాలించిన కాంగ్రెస్ ఏనాడైనా రైతు గురించి ఆలోచించిందా. మా అధికారం అంత ప్రజలకు ఇచ్చాము.'అని హరీష్ రావు సమాధానమిచ్చారు. 

ప్రశ్న: కుటుంబ పాలన చేస్తున్నారని విమర్శ?

మంత్రి హరీష్‌: 'ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వీరంతా ఎవరు? మేము ప్రజా క్షేత్రం నుంచి వచ్చిన వాళ్ళం. కుటుంబ పార్టీ ఎలా అవుతుంది. సంక్షేమ రంగంలో అద్భుతాలు చేశాం. ప్రతిపక్షాలు చెప్పడానికి ఏం లేక, పదే పదే సొల్లు చెప్తోంది. దళిత బంధు ఓట్ల కోసం కాదు, దళితులను ఆర్థికంగా ఎదగాలని తీసుకొచ్చాం' అని హరీష్ రావు చెప్పారు. 


ప్రశ్న: దళిత బంధు, డబుల్ బెడ్ రూం ఇల్లు బీఆర్‌ఎస్‌కు గుది బండలా మారుతుందా?

మంత్రి హరీష్‌:  'దశల వారీగా ఈ పథకం అందరికీ అందిస్తాం. దళితులు ఆర్థికంగా ఆదుకోవటానికి ఇది తీసుకొచ్చాం. రైతు అందుబాటులో ఉన్న సమయంలో కరెంట్ తో నీళ్ళు పారించటానికి 24 గంటల కరెంట్ ఇస్తున్నాం. 24 గంటల కరెంట్ మధ్యలో అంతరాయం వస్తుంటేనే మళ్ళీ ఫోన్లు వస్తున్నాయి. ఇది చాలాదా అందరికీ నాణ్యమైన కరెంట్ ఇస్తున్నాం.' అని మంత్రి హరీష్ రావు చెప్పారు. 

ప్రశ్న: కాళేశ్వరం లక్ష కోట్లు అవీనీతి అంటున్నారు?

మంత్రి హరీష్‌: 'ప్రాజెక్ట్ మొత్తం రూ.80 వేల కోట్లు అయ్యింది. లక్ష కోట్ల అవినీతి ఎలా అవుతుంది. ఆ ప్రాజెక్టుతో వ్యవసాయం సస్యశ్యామలం అయ్యింది.' అని హరీష్ రావు చెప్పారు. 

ప్రశ్న: డిజైన్ లో లోపాలు ఉన్నాయా? ఎందుకు కుంగిపోయింది.?

మంత్రి హరీష్‌:  'ఇంత పెద్ద ప్రాజెక్టులో చిన్న పిల్లర్ కుంగింది. ఇది ఎల్ అండ్ టీ టేకప్ చేసిన ప్రొజేక్ట్. ప్రజలపై భారం పడకుండా మళ్ళీ మరమత్తులు చేస్తామని చెప్పారు. ఓట్ల కోసం ఇంత రాజకీయం అవసరమా. ప్రాజెక్టు కూలితే కేంద్రం ఊరుకుంటుందా?' అని హరీష్ రావు చెప్పారు. 

ప్రశ్న: భారీ వర్షాలు పడితే హైదరాబాద్‌ పరిస్తితి దారుణంగా ఉంది?

మంత్రి హరీష్‌: 'హైదరాబాద్ విషయంలో కేటీఆర్ బాగా కష్టపడుతున్నారు.' అని హరీష్ రావు చెప్పారు. 

ప్రశ్న: ఓయూ వెళ్ళడానికి బీఆర్‌ఎస్ నేతలు భయపడుతున్నారా?

మంత్రి హరీష్‌: 'ఓయూ వెళ్ళడానికి భయపడేది మేము కాదు. రేవంత్ రెడ్డి భయపడుతున్నారు. విద్యార్థులను బీర్లు, బిర్యానీ ఇస్తే ఏమైనా చేస్తారు అని అన్నాడు. వచ్చే ప్రభుత్వంలో ఉద్యోగ కాలెండర్ ప్రకటిస్తాం. అత్యుత్తమ పారిశ్రామిక విధానం ద్వారా ప్రవేట్ ఉద్యోగాలు వచ్చాయి. మొత్తం ఉద్యోగాల్లో 3 శాతం మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలు ఉంటాయి. పేపర్ లీకేజీలు ఇతర రాష్ట్రాల్లో జరగటం లేదా? మేము దాన్ని ముందు పెట్టడం లేదు. కొన్ని లోపాలు జరిగాయి. మేమే దాన్ని గుర్తించాం. అత్యంత పారదర్శకంగా ఉద్యోగాలు భర్తీ చేస్తాం' అని హరీష్ రావు చెప్పారు. 

ప్రశ్న: బీజేపీకి ఓటేస్తే బీఆర్‌ఎస్ కు ఓటేసినట్టే. కాంగ్రెస్‌కు వేస్తే బీఆర్‌ఎస్‌కు వేసినట్టే అనే ఆరోపణ వస్తోంది?

మంత్రి హరీష్‌:  'మేము ఎవరికీ బీ టీమ్ కాదు. వీళ్లు వాళ్ల మీద.. వాళ్ళు వీళ్ళ మీద చెప్పుకుంటూ మా మీద ఆరోపణ చేస్తున్నారు' అని హరీష్ రావు చెప్పారు. 

ప్రశ్న: కొంత వ్యతిరేకత ఉందని సర్వే లు చెప్తున్నాయి?

మంత్రి హరీష్‌:  'అవన్నీ ఫేక్ సర్వేలు, పెద్ద పేరున్న ఛానళ్ళు చేస్తే ఓకే, పేపర్‌ల మీద సర్వే లు చేస్తే ఎలా?' అని హరీష్ రావు చెప్పారు. 

ప్రశ్న: మైనoపల్లి విమర్శలు ఎలా చూస్తారు?

మంత్రి హరీష్‌:  'ఆయన మాట్లాడిన భాష ఆయన స్థాయికి నిదర్శనం. ఆయన విజ్ఞతకే వదిలేస్తాం. ప్రజలే తగిన బుద్ధి చెప్తారు. అలాంటి వారి గురించి మాట్లాడి నా స్థాయి తగ్గించుకోను.' అని హరీష్ రావు చెప్పారు. 


ప్రశ్న: కొంత మంది ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉంది.కానీ అయిన వారికే టికెట్ల ఇచ్చారు అని వాదనపై మీ స్పందన?
మంత్రి హరీష్‌: 'వ్యతిరేకత కాదు పాజిటివ్ కూడా ఉండొచ్చు కదా. సంక్షేమ పథకాల లబ్ధి ఎమ్మెల్యేల ద్వారానే వెళ్తుంది కదా. 80 సీట్లతో మేమే అధికారంలోకి వస్తాం. రేవంత్ రెడ్డి హెడ్ లైన్స్ కోసం సెన్సేషన్ కోసమో ఆయన ఆ భాషతో మాట్లాడుతున్నారు. మేము బాధ్యతాయుతంగా ఉండేవాళ్ళం. మేము పాలన సక్రమంగా అందించాలని అనుకునే వాళ్ళం. ప్రధాని ఎన్నో చెప్తాడు. నిజంగా కేటీఆర్ ను సీఎం చేయాలంటే మా ఎమ్మెల్యేలు కావాలి కానీ, ఎంపీలు ప్రధాని సపోర్ట్ ఎందుకు? మోడీ కేసీఆర్‌ను ఎన్ని సార్లు మెచ్చుకున్నారు. 

ప్రశ్న: కేటీఆర్ ను సీఎం చేయాలనడంపై హరీష్ రావు అభిప్రాయం ఏంటి?

మంత్రి హరీష్‌: 'మా పార్టీ ఏది అనుకుంటే అది చేస్తుంది. మాకు కేసీఆరే సీఎం కావాలని అనుకుంటున్నాం. మా ఎమ్మెల్యేలకు తీరిక ఉండదు. అన్ని పనులు సక్రమంగా సాగుతున్నాయి' అని హరీష్ రావు చెప్పారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement