సాక్షి, ఆదిలాబాద్: అధికార పార్టీలో వార్ నడుస్తోంది. ఎమ్మెల్యేలు, ముఖ్యనేతల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. గత కొద్ది రోజులుగా జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే, ముఖ్యనేతల మధ్య వైరం నడుస్తుండగా..తాజాగా ఎమ్మెల్యేల మధ్య కూడా సఖ్యత కొరవడింది. ఈ తాజా రాజకీయ పరిణామాలు ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
ఎక్కడి వారు అక్కడే..
జిల్లా రాజకీయాల్లో అధికార పార్టీ పరంగా ఇటీవల జరిగిన సంఘటనలు పార్టీలో రాజకీయ విభేదాలను ప్రస్పుటం చేస్తున్నాయి. సాధారణంగా మంత్రులు జిల్లాలో పర్యటించినప్పుడు ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఇటీవల మంత్రి ఐకేరెడ్డి ఆదిలాబాద్ పట్టణంలోని దుర్గానగర్‌లో అటవీశాఖకు సంబంధించి ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు రాగా, బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు దాంట్లో పాల్గొనలేదు. రెండు రోజుల క్రితం బోథ్ మండలం ధనోరలో డబుల్ బెడ్‌రూమ్ ప్రారంభోత్సవంలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పాల్గొనగా ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న ఆ కార్యక్రమానికి గైర్హాజరయ్యారు.
ఇటు ఆదిలాబాద్, అటు బోథ్ నియోజకవర్గాల్లో ఏ కార్యక్రమం జరిగినా ముఖ్యనేతలు హాజరైతే ఇరువురు ఎమ్మెల్యేలు పాల్గొనేవారు. అయితే తాజాగా ఎమ్మెల్యే రాథోడ్ బాపురావుకు ఎమ్మెల్యే జోగు రామన్నతో పొసగక పోవడంతోనే ఈ పరిస్థితి నెలకొందన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. కాగా ఈ ఇరువురు మధ్య విభేదాలు శాసనసభ ఎన్నికల సమయం నుంచే అంతర్లీనంగా ఉన్నప్పటికీ తాజాగా అవి బహిర్గతం అవుతున్నాయన్న చర్చ సాగుతోంది. ఆ ఎన్నికలకు ముందు అప్పుడు ఎంపీగా ఉన్న గోడం నగేశ్‌తో ఎమ్మెల్యే జోగు రామన్న సఖ్యతగా ఉంటున్నారనే అభిప్రాయంతో రాథోడ్ బాపురావు వర్గీయులు విభేదించారు.
ఆ తర్వాత ఎన్నికల్లో బోథ్ నియోజకవర్గం నుంచి తిరిగి అసెంబ్లీ పోటీ చేసి విజయం సాధించిన రాథోడ్ బాపురావు విభేదాలను పక్కన బెట్టి ఎమ్మెల్యే జోగు రామన్నతో కలిసి సాగుతున్నట్లు కనిపించినప్పటికీ తాజాగా ఆ పరిస్థితులు మారిపోయాయి. టీఆర్‌ఎస్ సర్కార్ రెండోసారి కొలువుదీరిన తర్వాత జోగు రామన్నకు తిరిగి మంత్రి పదవి దక్కకపోవడం.. ఈ విషయంలో బోథ్ ఎమ్మెల్యేతో సఖ్యతగా ఉండే నాయకులు కొంతమంది రామన్నకు వ్యతిరేకంగా అనేక చోట్ల ప్రస్తావించడంతోనే ఈ పరిస్థితి ఎదురైనట్లు తెలుస్తోంది. తాను రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందడం మరోపక్క అధికార కాలం మరో నాలుగేళ్లు ఉండడంతో బాపురావు కూడా ఇదివరకు రామన్నతో వ్యవహరించిన తీరుకు భిన్నంగా పోతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.
ఈ మధ్యకాలంలో మంత్రివర్గ విస్తరణ తర్వాత రామన్న అజ్ఞాతంలోకి వెళ్లి తిరిగి వచ్చిన తర్వాత పలువురు ముఖ్యనాయకులు ఆయనను కలిసి పరామర్శించినప్పటికీ బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు ఆయనను పరామర్శించలేదనే అపవాదు ఉంది. విభేదాల కారణంగానే ఈ పరిస్థితి ఉన్నట్లు తెలుస్తోంది.
ముఖ్య నేతలతోనూ..
రాథోడ్ బాపురావుకు టీఆర్‌ఎస్ జిల్లా ముఖ్యనేతలతోనూ సత్సంబంధాలు లేవు. పార్టీలో ఈ విషయంలో సామాన్య కార్యకర్తకు కూడా అవగతం ఉంది. ప్రధానంగా మాజీ ఎంపీ గోడం నగేశ్‌తో విభేదాలు ఉన్నాయి. ప్రధానంగా శాసనసభ ఎన్నికలకు ముందు నగేశ్ బోథ్ అసెంబ్లీ నుంచి పోటీ చేయడం ఖాయమనే సంకేతాలను ఆయన అనుచరులు బాహాటంగానే పేర్కొనడం అప్పట్లో జరిగింది. అయితే ఎన్నికల్లో తిరిగి బాపురావు టికెట్ దక్కించుకొని గెలుపొందడం ద్వారా తన ప్రభావం చాటారు. అప్పట్లో బోథ్ నియోజకవర్గంలో నగేశ్ కేడర్‌గా ఉన్నవారిని ఆయన కొంతదూరం పెట్టారు. అంతకు ముందు బోథ్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్సీ రాములునాయక్ వర్గం కూడా ఉండేది.
ఆయన పార్టీ మారిన తర్వాత ఆ కేడర్‌కు సరైన ప్రాధాన్యత ఎమ్మెల్యే వర్గీయులు ఇవ్వలేదన్న ప్రచారం లేకపోలేదు. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలోనూ కొంత వర్గ రాజకీయాలకు దారితీశాయి. రాష్ట్ర డెయిరీ డెవలప్‌మెంట్ చైర్మన్ లోక భూమారెడ్డితోనూ బాపురావుకు విభేదాలు ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో తలమడుగు జెడ్పీటీసీ స్థానం నుంచి లోక భూమారెడ్డి తన అల్లుడికి టికెట్ కోసం ప్రయత్నం చేశారు. అయితే ఎమ్మెల్యే ఆయనకు సహకరించకపోవడం ఈ విభేదాలకు కారణమైంది. అంతకుముందు నుంచే ఈ ఇరువురి మధ్య విభేదాలు ఉండగా, ఆ సంఘటనతో మరింత ముదిరాయి. ఇప్పటికీ ఈ ఇరువురి నేతల మధ్య ఎడమొహం.. పెడమొహం అన్న తీరుగానే రాజకీయం ఉందన్న చర్చ సాగుతోంది.
జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్‌తో ఎమ్మెల్యే రాథోడ్ బాపురావుతో సఖ్యతగా ఉండగా, నార్నూర్ జెడ్పీటీసీగా గెలిచి జెడ్పీ చైర్మన్‌గా ఎన్నికైన రాథోడ్ జనార్దన్ ఆ తర్వాత కొంత ఖానాపూర్ నియోజకవర్గంలోని ఉట్నూర్‌పై దృష్టి సారించడంతో ఆ ఎమ్మెల్యే రేఖానాయక్ ఇటు జెడ్పీ చైర్మన్‌పై, అటు ఆయనకు సపోర్ట్‌గా ఉన్న బోథ్ ఎమ్మెల్యేపై కొంత గుర్రుగా ఉన్నారన్న ప్రచారం సాగుతోంది.
ఈ నేపథ్యంలో బోథ్ ఎమ్మెల్యే వర్సెస్ జిల్లా ముఖ్యనేతలు అన్న చందంగా ప్రస్తుతం అధికార పార్టీలో రాజకీయ వ్యవహారాలు సాగుతున్నాయి. జెడ్పీచైర్మన్ రాథోడ్ జనార్దన్ ఇటు బాపురావుతో, అటు రామన్నతో సఖ్యతగా ఉంటూ వస్తున్నారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న, మాజీ ఎంపీ నగేశ్, డెయిరీ డెవలప్‌మెంట్ చైర్మన్ లోక భూమారెడ్డి ప్రస్తుతం ఒక వర్గంగా ఉండగా, రాథోడ్ బాపురావు మరో వర్గంగా ఒంటరిగా నిలవడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment