కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి
ప్రభుత్వ విధానాలపై పోరాడతాం
నేరడిగొండ : 2019లో రాష్ర్టంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి జోస్యం చెప్పారు. గురువారం లింగట్ల గ్రామంలో పీఏసీఎస్ చైర్మన్ సాబ్లే నానక్‌సింగ్ ఇంటి గృహ ప్రవేశ మహోత్సవానికి ముఖ్యఅతిథిగా ఆయన హాజరయ్యారు. ఈ సంద ర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. ఒకేసారి రుణమాఫీ చేసేందుకు డబ్బులు లేవని సీఎం కేసీఆర్ చెప్తున్నాడని, తను మాత్రం ఎడెకరాల స్థలంలో రూ. 50 కోట్లతో ఇళ్లు కట్టుకుంటున్నాడని విమర్శించారు.
పింఛన్లు ఇవ్వడం గొప్పకాదు, లోటు బడ్జెట్ ఉన్న ఏపీలో కూడా ఇస్తున్నారని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై కాంగ్రెస్ పోరాడుతుందన్నారు. గ్రామస్థాయి నుంచి పార్టీలో బలోపేతం చేస్తామని తెలిపారు. ఆ పార్టీ బోథ్ నియోజకవర్గ ఇన్‌చార్జి అనిల్ జాదవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలో అధికసంఖ్యలో ఇందిరమ్మ ఇళ్లు కట్టించిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌కే దక్కుతుందన్నారు.
పేదలకు డబుల్ బెడ్‌రూం ఇళ్లు ఇస్తామని కేసీఆర్ మభ్యపెడుతున్నాడని ఆరోపించారు. కేసీఆర్ గారడీ మాటాలతో కాలం వెళ్లదీస్తున్నారని దుయ్యబట్టారు. ఈ సమావేశంలో బోథ్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మల్లెపూల సత్యనారాయణ, మండల నాయకులు ఆడే వసంత్, బాబులాల్, రాజశేఖర్‌రెడ్డి, సాబ్లే ప్రతాప్‌సింగ్, ఆదుముల్ల భూషన్, లచ్చన్న, గులాబ్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు.