కొల్లాపూర్ నియోజకవర్గం
తెలంగాణ అంతటా 2018 ఎన్నికలలో టిఆర్‌ఎస్ ప్రభంజనం వీచినా కొల్లాపూర్ నియోజకవర్గంలో టిఆర్‌ఎస్ నేత, అప్పటి వరకు మంత్రిగా ఉన్న జూపల్లి కృష్ణారావు ఓడిపోయారు. ఇక్కడ కాంగ్రెస్ ఐ పక్షాన పోటీచేసిన బీరం హర్షవర్దన్‌రెడ్డి 12543 ఓట్ల మెజార్టీతో గెలిచారు. తదుపరి హర్షవర్దన్ రెడ్డి టిఆర్‌ఎస్‌లో చేరిపోవడం విశేషం. కృష్ణారావు వరసగా ఐదుసార్లు గెలిచి 2018లో ఓటమి చెందారు.
హర్షవర్దన్‌రెడ్డికి 80611 ఓట్లు రాగా, కృష్ణారావుకు 68068 ఓట్లు దక్కాయి. ఇక్కడ బిజెపి పక్షాన పోటీచేసిన ఇ.సుదాకరరావుకు పదమూడువేలకుపైగా ఓట్లు వచ్చాయి. హర్షవర్దన్ రెడ్డి సామాజికపరంగా రెడ్డి వర్గానికి చెందినవారు. కొల్లాపూర్‌నియోజకవర్గంలో 2014లో జూపల్లి కృష్ణారావు టిఆర్‌ఎస్ తరపున ఐదోసారి విజయం సాధించి ముఖ్యమంత్రి కెసిఆర్ క్యాబినెట్‌లో మంత్రి అయ్యారు. అంతకుముందు వై.ఎస్.రాజశేఖరరెడ్డి, రోశయ్య, కిరణ్ క్యాబినెట్‌లలో మంత్రిగా పనిచేసిన జూపల్లి తెలంగాణ అంశంపైన, కాంగ్రెస్ ఐలో వచ్చిన విబేధాల కారణంగా తన మంత్రి పదవికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి టిఆర్‌ఎస్‌లో చేరారు.
ఆ తర్వాత ఉప ఎన్నికలోను, తిరిగి 2014 సాధారణ ఎన్నికలోను ఘన విజయం సాధించారు. కృష్ణారావు 1999లో కాంగ్రెస్ ఐ పక్షాన, 2004లో కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్ధిగా ఇండిపెండెంటుగా గెలిచిన ఈయన తిరిగి 2009లో కాంగ్రెస్ ఐ అభ్యర్ధిగా గెలిచారు.తదుపరి రెండుసార్లు టిఆర్‌ఎస్ అభ్యర్ధిగా గెలిచారు. కాని 2018లో ఓటమిపాలయ్యారు. కొల్లాపూర్ నుంచి కాంగ్రెస్, కాంగ్రెస్ ఐ కలిసి తొమ్మిది సార్లు, టిడిపి ఒక్కసారి, టిఆర్‌ఎస్ రెండుసార్లు పిడిఎఫ్ ఒకసారి, ఇండిపెండెంట్లు మూడుసార్లు గెలిచారు. 1978 నుంచి కొత్త వెంకటేశ్వరరావు మూడుసార్లు గెలిస్తే, 1989లో ఈయన సోదరుడు కొత్త రామచంద్రరావు గెలుపొందారు.
1994లో వెంకటేశ్వరరావు ఇండిపెండెంటుగా పోటీచేసి ఓడిపోయారు. 1962లో కాంగ్రెస్ అభ్యర్ధిగా గెలిచిన కె. రంగదాసు, 1972లో ఇండిపెండెంటుగా నెగ్గారు. 1985, 89లలో సిపిఐ నాయకుడు సురవరం సుధాకరరెడ్డి ఇక్కడ పోటీచేసి ఓడిపోయారు. ఆ తర్వాత ఆయన నల్గొండ నుంచి రెండుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. కొల్లాపూర్‌లో మూడుసార్లు రెడ్డి నేతలు, పన్నెండు సార్లు వెలమ నేతలు, ఒకసారి బ్రాహ్మణ నేత విజయం సాధించారు.
కొల్లాపూర్ నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే..
Comments
Please login to add a commentAdd a comment