Kollapur Assembly Constituency
-
కాంగ్రెస్ హత్యారాజకీయాలకు భయపడేది లేదు: హరీష్ రావు ఫైర్
సాక్షి, హైదరాబాద్: ప్రజాస్వామ్యంలో హత్యారాజకీయాలకు తావులేదు. ప్రశ్నించే గొంతుకలను బెదిరింపులతో కాంగ్రెస్ ప్రభుత్వం భయపెట్టలేదంటూ మాజీ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ బెదిరింపులకు భయపడేది లేదు. బీఆర్ఎస్ కార్యకర్తలకు పార్టీ అన్ని వేళలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.కాగా, కొల్లాపూర్‌లో బీఆర్ఎస్ నేత శ్రీధర్ రెడ్డిని కొందరు వ్యక్తులు దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీధర్ రెడ్డి హత్యపై హరీష్ రావు స్పందించారు. ఈ క్రమంలో ట్విట్టర్ వేదికగా హరీష్ రావు..‘కొల్లాపూర్ నియోజకవర్గం చిన్నంబావి మండలం లక్ష్మిపల్లిలో బీఆర్ఎస్ మండల నాయకులు శ్రీధర్ రెడ్డి దారుణ హత్యకు గురికావడం దారుణం. కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. కొల్లాపూర్ నియోజకవర్గం చిన్నంబావి మండలం లక్ష్మిపల్లిలో బి.ఆర్.ఎస్ మండల నాయకులు శ్రీధర్ రెడ్డి గారు దారుణ హత్యకు గురికావడం దారుణం. కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 5నెలల్లో ఒక్క కొల్లాపూర్ నియోజకవర్గంలోనే ఇద్దరు బి.ఆర్.ఎస్ నాయకులు హత్యకు గురికావడం,… https://t.co/zyNPsWtIvr— Harish Rao Thanneeru (@BRSHarish) May 23, 2024 కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఐదు నెలల్లో ఒక్క వనపర్తి జిల్లాలోనే ఇద్దరు బీఆర్ఎస్ నాయకులు హత్యకు గురికావడం, పలుచోట్ల నేతలు, కార్యకర్తలపై దాడులు జరగటం దురదృష్టకరం. ప్రజాస్వామ్యంలో హత్యారాజకీయాలకు తావులేదు. ప్రశ్నించే గొంతుకలను బెదిరింపులతో కాంగ్రెస్ ప్రభుత్వం భయపెట్టలేదు. బీఆర్ఎస్ కార్యకర్తలు మనోధైర్యాన్ని కోల్పోవద్దు. పార్టీ అన్ని వేళలా అండగా ఉంటుంది. రాజకీయ ప్రేరేపిత హత్యపై తక్షణమే విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాం’ అంటూ కామెంట్స్ చేశారు. -
బీఆర్ఎస్ నేత దారుణ హత్య
సాక్షి, కొల్లాపూర్: తెలంగాణలో ఎన్నికల వేళ దారుణ ఘటన చోటుచేసుకుంది. బీఆర్ఎస్ నేత శ్రీధర్ రెడ్డిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. ఈ ఘటన రాజకీయంగా సంచలనంగా మారింది.వివరాల ప్రకారం.. కొల్లాపూర్ నియోజకవర్గంలోని చిన్నంబావి మండలం లక్ష్మీ పల్లిలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన ప్రధాన నేత శ్రీధర్ రెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. కాగా, శ్రీధర్ రెడ్డి బుధవారం రాత్రి నిద్రిస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆయనపై దాడి హత్య చేశారు. ఇక, శ్రీధర్ రెడ్డి కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి ప్రధాన అనుచరుడిగా పోలీసులు గుర్తించారు.ఈ హత్య కేసు ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. ఇక, శ్రీధర్ రెడ్డి హత్య స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. హత్య చేసిన వారిని వెంటనే పట్టుకోవాలని బీఆర్ఎస్ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. -
కొల్లాపూర్‌లో ఉద్రిక్తత.. పోలీస్ స్టేషన్ వద్ద నిరసనలు
సాక్షి, నాగర్‌కర్నూలు: కొల్లాపూర్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జూపల్లి కృష్ణారావు తన అనుచరులు, కాంగ్రెస్ కార్యకర్తలతో వచ్చి కొల్లాపూర్ పోలీసు స్టేషన్ వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలో స్టేషన్ ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. దీంతో, ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. గురువారం రాత్రి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఓ కారులో అక్రమంగా మద్యం తరలిస్తుండగా కాంగ్రెస్ కార్యకర్తలు పట్టుకొని పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే, సమాచారం ఇచ్చిన వారిని కొల్లాపూర్ ఎస్సై అతి దారుణంగా కొట్టారని వారు ఆరోపించారు. కొల్లాపూర్ మాజీ జెడ్పీటీసీ హనుమంతు నాయక్, ముక్కిడి గుండం మాజీ సర్పంచ్ లోకేష్ యాదన్‌ను ఎస్సై అతి దారుణంగా కొట్టారని జూపల్లి ఆరోపించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి డైరెక్షన్లోనే పోలీసులు పనిచేస్తున్నారని జూపల్లి మండిపడ్డారు. పోలీసులు అధికార బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా పనిచేస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులపై దౌర్జన్యాలకు పాల్పడుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని సీరియస్ అయ్యారు. తెలంగాణలో రాక్షస పాలన సాగుతోందన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు బూటు కాళ్లతో తన్నారని బెల్టులతో కొట్టారని జూపల్లి ఆవేదన వ్యక్తం చేశారు. దీని కోసమేనా తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నది అంటూ ప్రశ్నించారు. -
తెలంగాణ ఎన్నికల బరిలో బర్రెలక్క.. నామినేషన్ దాఖలు
నాగర్‌కర్నూల్: రెండేళ్ల కిందట సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయిన బర్రెలక్క గుర్తుందా?. డిగ్రీ చదివి తాను బర్రెలు కాసుకుంటున్నానని వీడియో ద్వారా తెగ వైరల్ అయ్యిందామె. ఆ వీడియోలోని బర్రెలక్క అలియాస్ శిరీష మళ్లీ వార్తల్లోకి ఎక్కింది. ‘‘హాయ్ ఫ్రెండ్స్.. నేను మీ బర్రెలక్కను డిగ్రీ చేసాను. ఫ్రెండ్స్ ఉద్యోగ నోటిఫికేషన్ లేక మా అమ్మను అడగి బర్రెలు కొన్నాను ఫ్రెండ్స్. ఎన్ని డిగ్రీలు చేసిన సర్టిఫికేట్లు వస్తున్నాయి తప్ప ఉద్యోగాలు వస్తలేవు ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ అంటూ సోషల్ మీడియాలో ఒకప్పుడు ఊపు ఊపిన వీడియో అది. ఆమె ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని శిరీష నిర్ణయించుకుంది. ఈ మేరకు కొల్లాపూర్(నాగర్ కర్నూల్) నియోజకవర్గం నుంచి నామినేషన్ వేసింది కూడా. నిరుద్యోగుల తరపున పోరాడటం కోసమే తాను పోటీ చేస్తున్నానని ఈ సందర్భంగా శిరీష ప్రకటించుకుంది. ప్రజలకు ఇవ్వడానికి తన దగ్గర డబ్బు లేదని ప్రచారం చేయడానికి అంత సమయం లేదని అందరిని కలవకపోవచ్చు అందుకే ఈ వీడియో ఫ్రెండ్స్ అంటూ సోషల్ మీడియాలో వదిలింది. ప్రస్తుతం ఆ వీడియో కాస్త వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by Barrelakka Siri (@princes_siri_barrelakka) View this post on Instagram A post shared by Barrelakka Siri (@princes_siri_barrelakka) View this post on Instagram A post shared by Telugu Scribe (@telugu_scribe) -
కొల్లాపూర్‌లో ఎవరికి వారే యమునా తీరే!
నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో అన్ని పార్టీల్లో గ్రూపు రాజకీయాలు నడుస్తున్నాయి. ఏ పార్టీ నుంచి ఎవరికి సీటు ఇచ్చినా ఆపార్టీల్లోని ఇంకోవర్గం వ్యతిరేకంగా పనిచేసే పరిస్ధితి నెలకొంది. అధిష్టానాలు కూడా గ్రూపు రాజకీయాలను చక్కదిద్దటంలో విఫలమవుతున్నాయి. దీంతో ఆ సెగ్మెంట్లో ఎవరికివారు యమునా తీరే అనే రీతిలో వ్యవహారం నడుస్తోంది. నేతల మధ్య వార్.. పార్టీ వీడిన జూపల్లి కొల్లాపూర్ నుంచి జూపల్లి కృష్ణారావు 5 సార్లు గెలిచి అటు కాంగ్రెస్, ఇటు టీఆర్ఎస్లో మంత్రిగా పనిచేశారు. 2018 ఎన్నికల్లో జూపల్లి కాంగ్రెస్ అభ్యర్ది హర్షవర్దన్‌రెడ్డి చేతిలో ఓటమి చెందారు. తర్వాత రాజకీయ పరిణామాలతో హర్షవర్దన్ రెడ్డి కాంగ్రెస్‌కు బై చెప్పి టీఆర్ఎస్లో చేరారు. ఇక అప్పటి నుంచి ఇద్దరి మధ్య వార్ నడుస్తూనే ఉంది. పార్టీలో హర్షవర్దన్‌రెడ్డి బలపడటం... రోజురోజుకు జూపల్లికి ప్రాధాన్యత తగ్గటం మొదలయ్యింది. దీంతో తన ఉనికిని చాటుకునేందుకు స్దానిక సంస్ధల ఎన్నికల్లో జూపల్లి తన అనుచరులను ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ బరిలో దింపి సత్తా చాటారు. ఇద్దరి మధ్య వివాదం రోజురోజుకు పెరిగింది తప్పా ఎక్కడ సమసిపోలేదు. అధిష్టానం కూడా ఇద్దరిని సమన్వయం చేసేందుకు పెద్దగా దృష్టి కూడా పెట్టలేదు. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి పార్టీపై ఘాటైన విమర్శలు చేయటంతో జూపల్లిని బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. దీంతో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు నిర్ణయించుకుని ఢిల్లీలో బుధవారం మల్లిఖార్జున ఖర్గే సమక్షంలో పార్టీలో చేరారు. దీంతో ఎమ్మెల్యే హర్షవర్దన్‌రెడ్డి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు లైను క్లియర్ అయ్యింది. హర్షవర్ధన్‌రెడ్డి మాత్రం తాను నియోజకవర్గ అభివృద్దే ధ్యేయంగా పనిచేస్తున్నానని చెబుతున్నారు. ఎన్నో ఏళ్లుగా ఉన్న సోమశిల-సిద్దేశ్వరం వంతెన, రెవెన్యూ డివిజన్ సాధించానని దీంతో ఈ ప్రాంత ప్రజల చిరకాల కోరిన నెరవేరటంతో పాటు ఈప్రాంతం అభివృద్ది చెందేందుకు దోహదపడుతుందని అంటున్నారు. అయితే జీఓ 98 ప్రకారం శ్రీశైలం ముంపు నిర్వాసితులకు ఉద్యోగాలు ఇప్పిస్తానన్న హామీ నెరవేర్చటంలో ఎమ్మెల్యే వైఫల్యం చెందాడనే ఆరోపణలు ఉన్నాయి. ఎమ్మెల్యేపై ఆ వర్గాల అసంతృప్తి నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఒక్క డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం జరగకపోవటం, మాదాసి కురువలను ఎస్సీలుగా, వాల్మీకిబోయలను ఎస్టీలుగా గుర్తించేందుకు కృషి చేస్తానంటూ ఇచ్చిన హమీలు నెరవేరకపోవటంతో ఆయా వర్గాలు ఎమ్మెల్యేపై అసంతృప్తిగా ఉన్నారు. ఎమ్మెల్యే అనుచరులు తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇసుక అక్రమ రవాణాలో ఎమ్మెల్యే అనుచరులు ఉన్నారనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. అనుచరులకే ప్రభుత్వ పథకాలు అందిస్తున్నారనే ఆరోణలు చేస్తున్నారు. ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత ఎమ్మెల్యేకు మైనస్‌గా మారనుంది. ఇప్పటికే డబ్బులు తీసుకుని కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్లోకి మారాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేకు ఫాంహౌజ్ ఎపిసోడ్ సంకటంగా మారింది. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన తర్వాత ఎమ్మెల్యే హర్షవర్దన్‌రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరటంతో గతంలో కొల్లాపూర్‌లో మూడు సార్లు టీడీపీ నుంచి పోటీ చేసిన, సీఆర్ జగదీశ్వర్‌రావు కాంగ్రెస్‌లో చేరారు. ఆయన ఈ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ విభాగంలో పనిచేసిన రంగినేని అభిలాష్‌రావు కూడా కాంగ్రెస్‌లో చేరాఉ. ఈయన కూడ సీటు ఆశిస్తున్నారు. వీరిద్దరి మధ్య కూడ అంతర్గత విభేదాలు ఉన్నాయి. పార్టీ కార్యక్రమాలను వీరిద్దరు వేరువేరుగా నిర్వహించిన సందర్భాలు ఉన్నాయి. సొంతగూటికి జూపల్లి.. మొదలైన వర్గపోరు ఇంతలోనే జూపల్లి సొంతగూడికి చేరటంతో వచ్చే ఎన్నికల్లో ఆపార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్ది ఎంపిక పార్టీకి తలనొప్పిగా మారింది. అయితే సీటు గ్యారెంటీతోనే మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు పార్టీలో చేరినట్టు తెలుస్తోంది. జూపల్లి పార్టీలోకి రావటాన్ని స్వాగతిస్తున్నట్టు చెబుతున్న జగదీశ్వర్‌రావు మాత్రం సీటు తనకే కేటాయించాలని కోరుతున్నారు. దీంతో అప్పుడే వర్గపోరు మొదలైనట్టు కనిపిస్తోంది. ఎలాగైనా తాను ఈసారి బరిలో ఉండాలనుకుంటున్న జగదీశ్వర్‌రావుకు సీటు రాకుంటే ఇండిపెండెంటుగానైనా పోటీ చేయాలని ఆలోచిస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్ సీటు విషయంలో గందరగోళం రేగితే బీఆర్ఎస్కు మేలు జరిగే అవకాశం ఉంది. బీజేపీ నుంచి పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎల్లెని సుధాకర్‌రావు నియోజకవర్గ ఇంచార్జీగా కొనసాగుతున్నారు. ఆయన గత ఎన్నికల్లో పార్టీ తరపున పోటీ చేసి ఓటమి చెందారు. కేంద్రప్రభుత్వం కృష్ణానదిపై సోమశిల-సిద్దేశ్వరం బ్రిడ్జి మంజూరు చేసిందని తాను దీనికోసం ప్రయత్నించానని గతంలో హర్షవర్దన్‌రెడ్డి జూపల్లిలకు అవకాశం ఇచ్చారు. ఈసారి తనకు అవకాశం ఇస్తే నియోజకవర్గాన్ని అభివృద్ది పథంలో నడిపిస్తానని అంటున్నారు. ఆయన నియోజవర్గంలో పాదయాత్ర నిర్వహించి పార్టీ క్యాడర్లో జోష్ నింపారు. అయితే నియోజకవర్గంలో బీజేపీకి పెద్దగా క్యాడర్ లేకపోవటం పెద్ద మైనస్‌గా ఉంది. అయితే సుధాకర్‌రావు మాత్రం పార్టీ కార్యక్రమాలు విధిగా నిర్వహిస్తూ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతున్నారు. నియోజకవర్గంలో భౌగోళిక పరిస్థితులు కొల్లాపూర్ సంస్ధానాల పాలన సాగిన ప్రాంతం,ఇక్కడ బీసీలు అధికంగా ఉన్న నియోజకవర్గం.మామిడి తోటలకు ప్రసిద్ది చెందిన ప్రాంతం.ఇక్కడి నుంచి మామిడిపడ్లను అంతర్జాతీయంగా వివిధ దేశాలకు ఎగుమతి చేస్తారు. కాగితం పరిశ్రమలు నెలకొల్పేందుకు వీలుగా నల్లమలలో పుష్కలంగా వెదురు లభ్యమవుతుంది. నదులు: కృష్ణానది,దీని ఆదారంగా భగీరధ నీటిని పాలమూరు,రంగారెడ్డి జిల్లాలకు సరఫరా అవుతుంది అడవులు: నల్లమల అటవీ ప్రాంతం విస్తరించి ఉంది.ఈ నియోజవర్గంలోని చిన్నంబావి,వీపనగండ్ల,పాన్గల్లు మండలాలు వనపర్తి జిల్లా పరిధిలో ఉన్నాయి.మిగిలినవి నాగర్‌కర్నూల్ జిల్లాలో ఉన్నాయి. ఆలయాలు: ఈ నియోజవర్గంలో ప్రసిద్దిన అనేక ఆలయాలు ఉన్నాయి సింగోటం శ్రీలక్ష్మి నర్సింహ స్వామి ఆలయం ,కొల్లాపూర్ మాదవస్వామి ఆలయం ,జెటప్రోలు. వేణుగోపాలస్వామి ఆలయాలు,సోమశిలలో సోమేశ్వరాలయం,ద్వాదశలింగల ధామంగా పసిద్ది చెందింది. పర్యాటకం: సోమశిల కృష్ణానది, కే ఎల్ ఐ ప్రాజెక్ట్.పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సైతం ఇక్కడి నుంచే నీటిని తరలిస్తారు. -
కొల్లాపూర్ నియోజకవర్గంనికి తదుపరి పాలకుడు ఎవరు..?
కొల్లాపూర్ నియోజకవర్గం తెలంగాణ అంతటా 2018 ఎన్నికలలో టిఆర్ఎస్ ప్రభంజనం వీచినా కొల్లాపూర్ నియోజకవర్గంలో టిఆర్ఎస్ నేత, అప్పటి వరకు మంత్రిగా ఉన్న జూపల్లి కృష్ణారావు ఓడిపోయారు. ఇక్కడ కాంగ్రెస్ ఐ పక్షాన పోటీచేసిన బీరం హర్షవర్దన్‌రెడ్డి 12543 ఓట్ల మెజార్టీతో గెలిచారు. తదుపరి హర్షవర్దన్ రెడ్డి టిఆర్ఎస్లో చేరిపోవడం విశేషం. కృష్ణారావు వరసగా ఐదుసార్లు గెలిచి 2018లో ఓటమి చెందారు. హర్షవర్దన్‌రెడ్డికి 80611 ఓట్లు రాగా, కృష్ణారావుకు 68068 ఓట్లు దక్కాయి. ఇక్కడ బిజెపి పక్షాన పోటీచేసిన ఇ.సుదాకరరావుకు పదమూడువేలకుపైగా ఓట్లు వచ్చాయి. హర్షవర్దన్ రెడ్డి సామాజికపరంగా రెడ్డి వర్గానికి చెందినవారు. కొల్లాపూర్నియోజకవర్గంలో 2014లో జూపల్లి కృష్ణారావు టిఆర్ఎస్ తరపున ఐదోసారి విజయం సాధించి ముఖ్యమంత్రి కెసిఆర్ క్యాబినెట్లో మంత్రి అయ్యారు. అంతకుముందు వై.ఎస్.రాజశేఖరరెడ్డి, రోశయ్య, కిరణ్ క్యాబినెట్లలో మంత్రిగా పనిచేసిన జూపల్లి తెలంగాణ అంశంపైన, కాంగ్రెస్ ఐలో వచ్చిన విబేధాల కారణంగా తన మంత్రి పదవికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి టిఆర్ఎస్లో చేరారు. ఆ తర్వాత ఉప ఎన్నికలోను, తిరిగి 2014 సాధారణ ఎన్నికలోను ఘన విజయం సాధించారు. కృష్ణారావు 1999లో కాంగ్రెస్ ఐ పక్షాన, 2004లో కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్ధిగా ఇండిపెండెంటుగా గెలిచిన ఈయన తిరిగి 2009లో కాంగ్రెస్ ఐ అభ్యర్ధిగా గెలిచారు.తదుపరి రెండుసార్లు టిఆర్ఎస్ అభ్యర్ధిగా గెలిచారు. కాని 2018లో ఓటమిపాలయ్యారు. కొల్లాపూర్ నుంచి కాంగ్రెస్, కాంగ్రెస్ ఐ కలిసి తొమ్మిది సార్లు, టిడిపి ఒక్కసారి, టిఆర్ఎస్ రెండుసార్లు పిడిఎఫ్ ఒకసారి, ఇండిపెండెంట్లు మూడుసార్లు గెలిచారు. 1978 నుంచి కొత్త వెంకటేశ్వరరావు మూడుసార్లు గెలిస్తే, 1989లో ఈయన సోదరుడు కొత్త రామచంద్రరావు గెలుపొందారు. 1994లో వెంకటేశ్వరరావు ఇండిపెండెంటుగా పోటీచేసి ఓడిపోయారు. 1962లో కాంగ్రెస్ అభ్యర్ధిగా గెలిచిన కె. రంగదాసు, 1972లో ఇండిపెండెంటుగా నెగ్గారు. 1985, 89లలో సిపిఐ నాయకుడు సురవరం సుధాకరరెడ్డి ఇక్కడ పోటీచేసి ఓడిపోయారు. ఆ తర్వాత ఆయన నల్గొండ నుంచి రెండుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. కొల్లాపూర్‌లో మూడుసార్లు రెడ్డి నేతలు, పన్నెండు సార్లు వెలమ నేతలు, ఒకసారి బ్రాహ్మణ నేత విజయం సాధించారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే..