నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో అన్ని పార్టీల్లో గ్రూపు రాజకీయాలు నడుస్తున్నాయి. ఏ పార్టీ నుంచి ఎవరికి సీటు ఇచ్చినా ఆపార్టీల్లోని ఇంకోవర్గం వ్యతిరేకంగా పనిచేసే పరిస్ధితి నెలకొంది. అధిష్టానాలు కూడా గ్రూపు రాజకీయాలను చక్కదిద్దటంలో విఫలమవుతున్నాయి. దీంతో ఆ సెగ్మెంట్లో ఎవరికివారు యమునా తీరే అనే రీతిలో వ్యవహారం నడుస్తోంది.
నేతల మధ్య వార్.. పార్టీ వీడిన జూపల్లి
కొల్లాపూర్ నుంచి జూపల్లి కృష్ణారావు 5 సార్లు గెలిచి అటు కాంగ్రెస్, ఇటు టీఆర్ఎస్‌లో మంత్రిగా పనిచేశారు. 2018 ఎన్నికల్లో జూపల్లి కాంగ్రెస్ అభ్యర్ది హర్షవర్దన్‌రెడ్డి చేతిలో ఓటమి చెందారు. తర్వాత రాజకీయ పరిణామాలతో హర్షవర్దన్ రెడ్డి కాంగ్రెస్‌కు బై చెప్పి టీఆర్ఎస్‌లో చేరారు. ఇక అప్పటి నుంచి ఇద్దరి మధ్య వార్ నడుస్తూనే ఉంది. పార్టీలో హర్షవర్దన్‌రెడ్డి బలపడటం... రోజురోజుకు జూపల్లికి ప్రాధాన్యత తగ్గటం మొదలయ్యింది. దీంతో తన ఉనికిని చాటుకునేందుకు స్దానిక సంస్ధల ఎన్నికల్లో జూపల్లి తన అనుచరులను ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ బరిలో దింపి సత్తా చాటారు. ఇద్దరి మధ్య వివాదం రోజురోజుకు పెరిగింది తప్పా ఎక్కడ సమసిపోలేదు. అధిష్టానం కూడా ఇద్దరిని సమన్వయం చేసేందుకు పెద్దగా దృష్టి కూడా పెట్టలేదు.
పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి పార్టీపై ఘాటైన విమర్శలు చేయటంతో జూపల్లిని బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. దీంతో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు నిర్ణయించుకుని ఢిల్లీలో బుధవారం మల్లిఖార్జున ఖర్గే సమక్షంలో పార్టీలో చేరారు. దీంతో ఎమ్మెల్యే హర్షవర్దన్‌రెడ్డి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు లైను క్లియర్ అయ్యింది. హర్షవర్ధన్‌రెడ్డి మాత్రం తాను నియోజకవర్గ అభివృద్దే ధ్యేయంగా పనిచేస్తున్నానని చెబుతున్నారు. ఎన్నో ఏళ్లుగా ఉన్న సోమశిల-సిద్దేశ్వరం వంతెన, రెవెన్యూ డివిజన్ సాధించానని దీంతో ఈ ప్రాంత ప్రజల చిరకాల కోరిన నెరవేరటంతో పాటు ఈప్రాంతం అభివృద్ది చెందేందుకు దోహదపడుతుందని అంటున్నారు. అయితే జీఓ 98 ప్రకారం శ్రీశైలం ముంపు నిర్వాసితులకు ఉద్యోగాలు ఇప్పిస్తానన్న హామీ నెరవేర్చటంలో ఎమ్మెల్యే వైఫల్యం చెందాడనే ఆరోపణలు ఉన్నాయి.
ఎమ్మెల్యేపై ఆ వర్గాల అసంతృప్తి
నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఒక్క డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం జరగకపోవటం, మాదాసి కురువలను ఎస్సీలుగా, వాల్మీకిబోయలను ఎస్టీలుగా గుర్తించేందుకు కృషి చేస్తానంటూ ఇచ్చిన హమీలు నెరవేరకపోవటంతో ఆయా వర్గాలు ఎమ్మెల్యేపై అసంతృప్తిగా ఉన్నారు. ఎమ్మెల్యే అనుచరులు తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇసుక అక్రమ రవాణాలో ఎమ్మెల్యే అనుచరులు ఉన్నారనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. అనుచరులకే ప్రభుత్వ పథకాలు అందిస్తున్నారనే ఆరోణలు చేస్తున్నారు. ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత ఎమ్మెల్యేకు మైనస్‌గా మారనుంది. ఇప్పటికే డబ్బులు తీసుకుని కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్‌లోకి మారాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేకు ఫాంహౌజ్ ఎపిసోడ్ సంకటంగా మారింది.
కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన తర్వాత ఎమ్మెల్యే హర్షవర్దన్‌రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరటంతో గతంలో కొల్లాపూర్‌లో మూడు సార్లు టీడీపీ నుంచి పోటీ చేసిన, సీఆర్ జగదీశ్వర్‌రావు కాంగ్రెస్‌లో చేరారు. ఆయన ఈ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ విభాగంలో పనిచేసిన రంగినేని అభిలాష్‌రావు కూడా కాంగ్రెస్‌లో చేరాఉ. ఈయన కూడ సీటు ఆశిస్తున్నారు. వీరిద్దరి మధ్య కూడ అంతర్గత విభేదాలు ఉన్నాయి. పార్టీ కార్యక్రమాలను వీరిద్దరు వేరువేరుగా నిర్వహించిన సందర్భాలు ఉన్నాయి.
సొంతగూటికి జూపల్లి.. మొదలైన వర్గపోరు
ఇంతలోనే జూపల్లి సొంతగూడికి చేరటంతో వచ్చే ఎన్నికల్లో ఆపార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్ది ఎంపిక పార్టీకి తలనొప్పిగా మారింది. అయితే సీటు గ్యారెంటీతోనే మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు పార్టీలో చేరినట్టు తెలుస్తోంది. జూపల్లి పార్టీలోకి రావటాన్ని స్వాగతిస్తున్నట్టు చెబుతున్న జగదీశ్వర్‌రావు మాత్రం సీటు తనకే కేటాయించాలని కోరుతున్నారు. దీంతో అప్పుడే వర్గపోరు మొదలైనట్టు కనిపిస్తోంది. ఎలాగైనా తాను ఈసారి బరిలో ఉండాలనుకుంటున్న జగదీశ్వర్‌రావుకు సీటు రాకుంటే ఇండిపెండెంటుగానైనా పోటీ చేయాలని ఆలోచిస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్ సీటు విషయంలో గందరగోళం రేగితే బీఆర్ఎస్‌కు మేలు జరిగే అవకాశం ఉంది.
బీజేపీ నుంచి పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎల్లెని సుధాకర్‌రావు నియోజకవర్గ ఇంచార్జీగా కొనసాగుతున్నారు. ఆయన గత ఎన్నికల్లో పార్టీ తరపున పోటీ చేసి ఓటమి చెందారు. కేంద్రప్రభుత్వం కృష్ణానదిపై సోమశిల-సిద్దేశ్వరం బ్రిడ్జి మంజూరు చేసిందని తాను దీనికోసం ప్రయత్నించానని గతంలో హర్షవర్దన్‌రెడ్డి జూపల్లిలకు అవకాశం ఇచ్చారు. ఈసారి తనకు అవకాశం ఇస్తే నియోజకవర్గాన్ని అభివృద్ది పథంలో నడిపిస్తానని అంటున్నారు. ఆయన నియోజవర్గంలో పాదయాత్ర నిర్వహించి పార్టీ క్యాడర్లో జోష్ నింపారు. అయితే నియోజకవర్గంలో బీజేపీకి పెద్దగా క్యాడర్ లేకపోవటం పెద్ద మైనస్‌గా ఉంది. అయితే సుధాకర్‌రావు మాత్రం పార్టీ కార్యక్రమాలు విధిగా నిర్వహిస్తూ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతున్నారు.
నియోజకవర్గంలో భౌగోళిక పరిస్థితులు
కొల్లాపూర్ సంస్ధానాల పాలన సాగిన ప్రాంతం,ఇక్కడ బీసీలు అధికంగా ఉన్న నియోజకవర్గం.మామిడి తోటలకు ప్రసిద్ది చెందిన ప్రాంతం.ఇక్కడి నుంచి మామిడిపడ్లను అంతర్జాతీయంగా వివిధ దేశాలకు ఎగుమతి చేస్తారు. కాగితం పరిశ్రమలు నెలకొల్పేందుకు వీలుగా నల్లమలలో పుష్కలంగా వెదురు లభ్యమవుతుంది.
నదులు: కృష్ణానది,దీని ఆదారంగా భగీరధ నీటిని పాలమూరు,రంగారెడ్డి జిల్లాలకు సరఫరా అవుతుంది
అడవులు: నల్లమల అటవీ ప్రాంతం విస్తరించి ఉంది.ఈ నియోజవర్గంలోని చిన్నంబావి,వీపనగండ్ల,పాన్గల్లు మండలాలు వనపర్తి జిల్లా పరిధిలో ఉన్నాయి.మిగిలినవి నాగర్కర్నూల్ జిల్లాలో ఉన్నాయి.
ఆలయాలు: ఈ నియోజవర్గంలో ప్రసిద్దిన అనేక ఆలయాలు ఉన్నాయి సింగోటం శ్రీలక్ష్మి నర్సింహ స్వామి ఆలయం ,కొల్లాపూర్ మాదవస్వామి ఆలయం ,జెటప్రోలు. వేణుగోపాలస్వామి ఆలయాలు,సోమశిలలో సోమేశ్వరాలయం,ద్వాదశలింగల ధామంగా పసిద్ది చెందింది.
పర్యాటకం: సోమశిల కృష్ణానది, కే ఎల్ ఐ ప్రాజెక్ట్.పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సైతం ఇక్కడి నుంచే నీటిని తరలిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment