HarshavardanReddy
-
ఎమ్మెల్యే హర్షవర్ధన్, ఎమ్మెల్సీ చల్లా వేధిస్తున్నారు! : చంద్రశేఖర్ వేగే
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్ రెడ్డి, ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి తనను వేధిస్తున్నారని, రాజకీయ పలుకుబడితో తనపై తప్పుడు కేసులు పెట్టి భయాందోళనలకు గురి చేస్తున్నారని గోల్డ్‌ఫిష్ అబోడ్ కంపెనీ ఎండీ చంద్రశేఖర్ వేగే అరోపించారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకుండా తమపై పీడీ యాక్ట్ నమోదు చేయిస్తానని బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. తప్పుడు పత్రాలు, ఆరోపణలతో తనపై, తన కంపెనీపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. కోకాపేటలోని స్థలంపై గోల్డ్ ఫిష్ సంస్థకు, ఎమ్మెల్సీ చల్లాకు మధ్య కొన్నేళ్లుగా వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా చల్లా చేసిన ఆరోపణలపై వివరణ ఇస్తూ గురువారం బంజారాహిల్స్‌లోని తాజ్ డెక్కన్‌లో చంద్రశేఖర్ వేగే విలేకరుల సమావేశం నిర్వహించారు. పూర్తి వివరాలు ఆయన మాటల్లోనే... ► కోకాపేటలోని సర్వే నంబరు 85లో 2.30 ఎకరాల స్థలంలో ప్రాజెక్ట్‌ను నిర్మించాలని కంపెనీ భావించింది. ఈ క్రమంలో కంపెనీ డైరెక్టర్ కాటం అశ్వంత్ రెడ్డి ఈ ప్రాజెక్ట్‌కు ప్రధాన పెట్టుబడిదారుడిగా తన సమీప బంధువైన చల్లా వెంకట్రామిరెడ్డి ఆసక్తిగా ఉన్నారని చెప్పడంతో సంస్థ యాజమాన్యం అందుకు అంగీకరించింది. దీంతో కంపెనీ ప్రతినిధి వాసుదేవరెడ్డి, చల్లా వెంకట్రామిరెడ్డితో కలిసి సర్వే నంబరు–85లో ఉన్న 2.30 ఎకరాల వ్యవసాయ భూమిని అగ్రిమెంట్ ఆఫ్ సేల్ హోల్డర్స్‌గా 2013 మార్చిలో ఒప్పందాన్ని కుదుర్చుకున్నాం. ఆ తర్వాత ఈస్థలాన్ని ఎమ్మెల్సీ, ఇతరుల పేర్లపై సేల్‌డీడ్ పూర్తి చేశాం. ► నిబంధనల ప్రకారం 2013 మేలో చల్లా వెంకట్రామిరెడ్డి ఈ స్థలాన్ని అభివృద్ధి చేసేందుకు డెవలప్మెంట్ కమ్ జనరల్ పవరాఫ్ అటార్నీ చేస్తూ కంపెనీతో ఒప్పందం చేసుకున్నారు. ఇందులో 4 బేస్మెంట్లు గ్రౌండ్ 38 అంతస్తులలో హైరైజ్ భవనాన్ని నిర్మించాలని నిర్ణయించాం. ► ఈ మేరకు ప్రొవిజన్ నిర్మాణ అనుమతుల కోసం 2014 జూన్‌లో దరఖాస్తు చేసుకోగా.. డిసెంబర్ 12 నాటికి భూ మార్పిడి, హెచ్ఎండీఏ నుంచి నిర్మాణ అనుమతులతో పాటు ఎయిర్పోర్ట్ అథారిటీ, ఫైర్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, పర్యావరణ అనుమతులన్నీ లభించాయి. అయితే 2014లో రాష్ట్ర విభజనతో హైదరాబాద్‌లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ప్రతికూల పరిస్థితులు సద్దుమణిగే వరకూ కంపెనీ, ఎమ్మెల్సీ ఇరువురూ ప్రాజెక్ట్ నిర్మాణ పనులను నెమ్మదించాలని నిర్ణయించుకున్నాం. అప్పటికే తొలుత పెట్టిన పెట్టుబడులకు అదనంగా రూ.12 కోట్లు ఖర్చు చేశాం. ► హెచ్ఎండీఏ నుంచి తుది అనుమతులు, కంపెనీ బిల్టప్ ఏరియా వాటాలను నిర్ధారించే సప్లిమెంటరీ అగ్రిమెంట్‌పై ఎమ్మెల్సీ సంతకాలు చేయకుండా తాత్సారం చేశారు. దీంతో ప్రాజెక్ట్ నిర్మాణ పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. మరోవైపు కరోనా మహమ్మారితో నెలకొన్న ప్రతికూల పరిస్థితులతో ప్రాజెక్ట్ వ్యవహారం గందరగోళంలో పడిపోయింది. ప్రాథమిక ఒప్పందంలో లేని అంశాలను లేవనెత్తుతూ ప్రాజెక్ట్‌కు అడ్డుపడుతుండటంతో పరిస్థితులను చక్కదిద్దేందుకు కంపెనీ కొత్త ఒప్పందాన్ని ఎమ్మెల్సీ ముందు ఉంచింది. ప్రాజెక్ట్ కొనసాగించడం ఎమ్మెల్సీకి ఇష్టంలేని పక్షంలో వారు పెట్టిన పెట్టుబడికి పది రెట్లు అంటే రూ.40 కోట్లు చెల్లిస్తామని, ఆ తర్వాత ఒప్పందం నుంచి వైదొలిగితే ఆగిపోయిన ప్రాజెక్ట్‌ను కంపెనీ టేకోవర్ చేస్తుందని వివరించాం. ► అయితే ఈ ఒప్పందాన్ని అంగీకరించని ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి తనకున్న రాజకీయ పలుకుబడితో గోల్డ్‌ఫిష్ కంపెనీ యాజమాన్యం, ఉద్యోగులపై కేసులు పెట్టించడం మొదలుపెట్టారు. దీంతో కంపెనీ ఎండీ అయిన నేను 21 రోజుల పాటు జైలులో గడపడమే కాకుండా పలు ప్రభుత్వ అధికారులు, నాయకుల నుంచి ప్రాజెక్ట్ నుంచి వైదొలగాలని తీవ్ర ఒత్తిడి ఎదుర్కోవాల్సి వస్తుంది. నిజాలను ఎదుర్కోలేక చల్లా వెంకట్రామి రెడ్డి తమను మోసగాళ్లుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. వీరి అరాచకాలను చట్టబద్ధంగా ఎదుర్కొంటామని ఆయన పేర్కొన్నారు. -
కొల్లాపూర్ నియోజకవర్గంనికి తదుపరి పాలకుడు ఎవరు..?
కొల్లాపూర్ నియోజకవర్గం తెలంగాణ అంతటా 2018 ఎన్నికలలో టిఆర్ఎస్ ప్రభంజనం వీచినా కొల్లాపూర్ నియోజకవర్గంలో టిఆర్ఎస్ నేత, అప్పటి వరకు మంత్రిగా ఉన్న జూపల్లి కృష్ణారావు ఓడిపోయారు. ఇక్కడ కాంగ్రెస్ ఐ పక్షాన పోటీచేసిన బీరం హర్షవర్దన్‌రెడ్డి 12543 ఓట్ల మెజార్టీతో గెలిచారు. తదుపరి హర్షవర్దన్ రెడ్డి టిఆర్ఎస్లో చేరిపోవడం విశేషం. కృష్ణారావు వరసగా ఐదుసార్లు గెలిచి 2018లో ఓటమి చెందారు. హర్షవర్దన్‌రెడ్డికి 80611 ఓట్లు రాగా, కృష్ణారావుకు 68068 ఓట్లు దక్కాయి. ఇక్కడ బిజెపి పక్షాన పోటీచేసిన ఇ.సుదాకరరావుకు పదమూడువేలకుపైగా ఓట్లు వచ్చాయి. హర్షవర్దన్ రెడ్డి సామాజికపరంగా రెడ్డి వర్గానికి చెందినవారు. కొల్లాపూర్నియోజకవర్గంలో 2014లో జూపల్లి కృష్ణారావు టిఆర్ఎస్ తరపున ఐదోసారి విజయం సాధించి ముఖ్యమంత్రి కెసిఆర్ క్యాబినెట్లో మంత్రి అయ్యారు. అంతకుముందు వై.ఎస్.రాజశేఖరరెడ్డి, రోశయ్య, కిరణ్ క్యాబినెట్లలో మంత్రిగా పనిచేసిన జూపల్లి తెలంగాణ అంశంపైన, కాంగ్రెస్ ఐలో వచ్చిన విబేధాల కారణంగా తన మంత్రి పదవికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి టిఆర్ఎస్లో చేరారు. ఆ తర్వాత ఉప ఎన్నికలోను, తిరిగి 2014 సాధారణ ఎన్నికలోను ఘన విజయం సాధించారు. కృష్ణారావు 1999లో కాంగ్రెస్ ఐ పక్షాన, 2004లో కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్ధిగా ఇండిపెండెంటుగా గెలిచిన ఈయన తిరిగి 2009లో కాంగ్రెస్ ఐ అభ్యర్ధిగా గెలిచారు.తదుపరి రెండుసార్లు టిఆర్ఎస్ అభ్యర్ధిగా గెలిచారు. కాని 2018లో ఓటమిపాలయ్యారు. కొల్లాపూర్ నుంచి కాంగ్రెస్, కాంగ్రెస్ ఐ కలిసి తొమ్మిది సార్లు, టిడిపి ఒక్కసారి, టిఆర్ఎస్ రెండుసార్లు పిడిఎఫ్ ఒకసారి, ఇండిపెండెంట్లు మూడుసార్లు గెలిచారు. 1978 నుంచి కొత్త వెంకటేశ్వరరావు మూడుసార్లు గెలిస్తే, 1989లో ఈయన సోదరుడు కొత్త రామచంద్రరావు గెలుపొందారు. 1994లో వెంకటేశ్వరరావు ఇండిపెండెంటుగా పోటీచేసి ఓడిపోయారు. 1962లో కాంగ్రెస్ అభ్యర్ధిగా గెలిచిన కె. రంగదాసు, 1972లో ఇండిపెండెంటుగా నెగ్గారు. 1985, 89లలో సిపిఐ నాయకుడు సురవరం సుధాకరరెడ్డి ఇక్కడ పోటీచేసి ఓడిపోయారు. ఆ తర్వాత ఆయన నల్గొండ నుంచి రెండుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. కొల్లాపూర్‌లో మూడుసార్లు రెడ్డి నేతలు, పన్నెండు సార్లు వెలమ నేతలు, ఒకసారి బ్రాహ్మణ నేత విజయం సాధించారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
శుభోదయం తాడిపత్రి కార్యక్రమం నిర్వహించిన హర్షవర్దన్ రెడ్డి
-
హర్ష వర్ధనం
బుచ్చిరెడ్డిపాళెం: బుచ్చిరెడ్డిపాళెం బెజవాడ గోపాల్రెడ్డినగర్లోని బృందావనం అపార్ట్మెంట్లో నివాసముంటున్న ఒంటేరు శ్రీహరిరెడ్డి కుటుంబం 20 ఏళ్ల క్రితం చేజర్ల మండలం మడపల్లి నుంచి వలస వచ్చి స్థిరపడింది. శ్రీహరిరెడ్డి–శ్రీదేవి దంపతులకు ఇద్దరు పిల్లలు. కుమారుడు వెంకటసాయి హర్షవర్ధన్‌రెడ్డి, కుమార్తె పూజిత. శ్రీహరిరెడ్డి వ్యవసాయం చేసి కుటుంబాన్ని పోషిస్తున్నాడు. హర్షవర్ధన్‌రెడ్డి, పూజితకు చిన్నతనం నుంచి చదువుపై ఆసక్తి ఎక్కువ. దీంతో ఎలాగైనా పిల్లలను బాగా చదివించాలన్న కోరిక శ్రీహరిరెడ్డికి ఉండేది. భార్య శ్రీదేవి 2016లో బ్లడ్ కేన్సర్‌తో మరణించింది. దీంతో పిల్లలు, కుటుంబం కోసం శ్రీహరిరెడ్డి దామరమడుగుకు చెందిన లక్ష్మీగీతను రెండో వివాహం చేసుకున్నారు. లక్ష్మీగీత ఇద్దరు పిల్లలను తన కన్న బిడ్డల్లా చూసుకుంటుంది. ప్రాథమిక స్థాయి నుంచే పోటీ పరీక్షల్లో విజేత హర్షవర్ధన్‌రెడ్డి ఒకటో తరగతి నుంచి ఏడో తరగతి వరకు స్థానిక కేరళ ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో చదివాడు. ఎనిమిదో తరగతి రత్నం ఉన్నత పాఠశాలలో చదివాడు. ఆ సమయాల్లో మ్యా«థ్స్ అండ్ సైన్స్ ప్రతిభా పరీక్షల్లో రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో సత్తా చాటాడు. కబడ్డీలో గోల్డ్‌మెడల్ సాధించాడు. తొమ్మిదో తరగతి నుంచి విజయవాడ శ్రీచైతన గో«శాల బ్రాంచ్‌లో చేరాడు. పదో తరగతిలో 9.8 జీపీఏ పాయింట్లు సాధించాడు. ఇంటర్లో 980 మార్కుల సాధించాడు. అయితే టెన్త్, ఇంటర్‌ను హర్షవర్ధన్‌ను లక్ష్యంగా పెట్టుకోలేదు. తన ఏకైక లక్ష్యం వైద్య విద్య నభ్యసించడం. అందుకు ఎంసెట్, నీట్, ఎయిమ్స్‌లను లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఎలాగైనా వాటిలో సత్తా చాటాలనే తన లక్ష్యం ముందు దేనినీ లెక్కచేయలేదు. తల్లి వ్యాధిని దాచారు కుమారుడి లక్ష్యానికి తన తల్లి అనారోగ్యం ఆటంకం కాకూడదని తండ్రి శ్రీహరిరెడ్డి అనుకున్నారు. 2016 మే 3న తల్లి శ్రీదేవికి బ్లడ్ కేన్సర్ సోకిందని శ్రీహరిరెడ్డి తెలిపారు. నెల్లూరు, చెన్నై, హైదరాబాద్‌ల్లో చూపించినా ఫలితం లేకుండా పోయింది. చివరకు ఆగస్టులో వైద్యులు ఇంటికి తీసుకెళ్లమని చెప్పారు. ఆ సమయంలో హర్షవర్ధన్‌రెడ్డికి తల్లి వ్యాధి చెప్పారు. తన కళ్ల ముందే కేన్సర్‌తో తల్లి మృతి చెందడం హర్షవర్ధన్‌ను మరింత బాధకు గురి చేసింది. దీంతో ఎలాగైనా కేన్సర్ వైద్య నిపుణుడు కావాలని సంకల్పించుకున్నాడు. ఎంసెట్, నీట్లో సత్తా చాటాడు ఇంటర్లో 980 మార్కులు సాధించిన హర్షవర్ధన్ ఏ నాడు ఆనందపడలేదు. తన లక్ష్యం వైద్య విద్య అనే మాటతో ముందుకు సాగాడు. ఎంసెట్ అగ్రికల్చర్ విభాగంలో 10వ ర్యాంక్ సాధించాడు. మెడిసిన్‌కు అర్హత అయిన నీట్లో 675 మార్కులతో జాతీయ స్థాయిలో 14వ ర్యాంకు సాధించి సత్తా చాటాడు. ఎయిమ్స్‌లో విద్యే ఎయిమ్ ఎయిమ్స్ విద్యనభ్యసించాలన్న ఎయిమ్ (లక్ష్యం) కోసం హర్షవర్ధన్ తపన పడ్డాడు. అందుకే గత నెల 26వ తేదీన ఎయిమ్స్ పరీక్షను రాశాడు. అందులో ర్యాంక్ సాధిస్తానని చెబుతున్నాడు. అక్కడే పీజీ వరకు చదవాలని అనుకుంటున్నానని తెలిపాడు. తాజాగా ఈ నెల 3వ తేదీన జిప్మర్ పరీక్షను కూడా రాశానని చెబుతున్నాడు. ఎంబీబీఎస్ తర్వాత కేన్సర్ స్పెషలైజేషన్ చేసి నిపుణుడిగా రాణించాలన్నదే లక్ష్యమని చెబుతున్నాడు. -
ఉపాధ్యాయులకు 20శాతం హెచ్ఆర్ఏ ఇవ్వాలి
మహబూబ్‌నగర్ విద్యావిభాగం : రాష్ట్రంలో ఏర్పడనున్న కొత్త జిల్లాల్లో పనిచేసే ఉద్యోగ, ఉపాధ్యాయులకు 20శాతం హెచ్ఆర్ఏ ఇవ్వాలని పీఆర్టీయూ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు హర్షవర్ధన్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం హైదరాబాద్‌లో డిప్యూటీ సీఎం మహమూద్‌అలీని కలిసి వినతిపత్రం అందించారు. జెడ్పీ జీపీఎఫ్‌ను రద్దు చేసి జిల్లాల ప్రక్రియ కంటే ముందుగానే ఏజీ జీపీఎఫ్ ఖాతాలను కేటాయించి వాటిలో జెడ్పీ జీపీఎఫ్ డబ్బులు జమ అయ్యేట్లు చూడాలని పేర్కొన్నారు. జిల్లాల విభజన కంటే ముందే ఉపాధ్యాయుల పెండింగ్ రీయింబర్స్మెంట్ చెల్లించాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెన్నయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షుడు యుగంధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.