తల్లిదండ్రులు, చెల్లెలు పూజితతో వెంకటసాయి హర్షవర్ధన్‌రెడ్డి
బుచ్చిరెడ్డిపాళెం: బుచ్చిరెడ్డిపాళెం బెజవాడ గోపాల్‌రెడ్డినగర్లోని బృందావనం అపార్ట్‌మెంట్‌లో నివాసముంటున్న ఒంటేరు శ్రీహరిరెడ్డి కుటుంబం 20 ఏళ్ల క్రితం చేజర్ల మండలం మడపల్లి నుంచి వలస వచ్చి స్థిరపడింది. శ్రీహరిరెడ్డి–శ్రీదేవి దంపతులకు ఇద్దరు పిల్లలు. కుమారుడు వెంకటసాయి హర్షవర్ధన్‌రెడ్డి, కుమార్తె పూజిత. శ్రీహరిరెడ్డి వ్యవసాయం చేసి కుటుంబాన్ని పోషిస్తున్నాడు. హర్షవర్ధన్‌రెడ్డి, పూజితకు చిన్నతనం నుంచి చదువుపై ఆసక్తి ఎక్కువ. దీంతో ఎలాగైనా పిల్లలను బాగా చదివించాలన్న కోరిక శ్రీహరిరెడ్డికి ఉండేది. భార్య శ్రీదేవి 2016లో బ్లడ్ కేన్సర్‌తో మరణించింది. దీంతో పిల్లలు, కుటుంబం కోసం శ్రీహరిరెడ్డి దామరమడుగుకు చెందిన లక్ష్మీగీతను రెండో వివాహం చేసుకున్నారు. లక్ష్మీగీత ఇద్దరు పిల్లలను తన కన్న బిడ్డల్లా చూసుకుంటుంది.
ప్రాథమిక స్థాయి నుంచే పోటీ పరీక్షల్లో విజేత
హర్షవర్ధన్‌రెడ్డి ఒకటో తరగతి నుంచి ఏడో తరగతి వరకు స్థానిక కేరళ ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో చదివాడు. ఎనిమిదో తరగతి రత్నం ఉన్నత పాఠశాలలో చదివాడు. ఆ సమయాల్లో మ్యా«థ్స్ అండ్ సైన్స్ ప్రతిభా పరీక్షల్లో రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో సత్తా చాటాడు. కబడ్డీలో గోల్డ్‌మెడల్ సాధించాడు. తొమ్మిదో తరగతి నుంచి విజయవాడ శ్రీచైతన గో«శాల బ్రాంచ్‌లో చేరాడు. పదో తరగతిలో 9.8 జీపీఏ పాయింట్లు సాధించాడు. ఇంటర్లో 980 మార్కుల సాధించాడు. అయితే టెన్త్, ఇంటర్‌ను హర్షవర్ధన్‌ను లక్ష్యంగా పెట్టుకోలేదు. తన ఏకైక లక్ష్యం వైద్య విద్య నభ్యసించడం. అందుకు ఎంసెట్, నీట్, ఎయిమ్స్‌లను లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఎలాగైనా వాటిలో సత్తా చాటాలనే తన లక్ష్యం ముందు దేనినీ లెక్కచేయలేదు.
తల్లి వ్యాధిని దాచారు
కుమారుడి లక్ష్యానికి తన తల్లి అనారోగ్యం ఆటంకం కాకూడదని తండ్రి శ్రీహరిరెడ్డి అనుకున్నారు. 2016 మే 3న తల్లి శ్రీదేవికి బ్లడ్ కేన్సర్ సోకిందని శ్రీహరిరెడ్డి తెలిపారు. నెల్లూరు, చెన్నై, హైదరాబాద్‌ల్లో చూపించినా ఫలితం లేకుండా పోయింది. చివరకు ఆగస్టులో వైద్యులు ఇంటికి తీసుకెళ్లమని చెప్పారు. ఆ సమయంలో హర్షవర్ధన్‌రెడ్డికి తల్లి వ్యాధి చెప్పారు. తన కళ్ల ముందే కేన్సర్‌తో తల్లి మృతి చెందడం హర్షవర్ధన్‌ను మరింత బాధకు గురి చేసింది. దీంతో ఎలాగైనా కేన్సర్ వైద్య నిపుణుడు కావాలని సంకల్పించుకున్నాడు.
ఎంసెట్, నీట్‌లో సత్తా చాటాడు
ఇంటర్లో 980 మార్కులు సాధించిన హర్షవర్ధన్ ఏ నాడు ఆనందపడలేదు. తన లక్ష్యం వైద్య విద్య అనే మాటతో ముందుకు సాగాడు. ఎంసెట్ అగ్రికల్చర్ విభాగంలో 10వ ర్యాంక్ సాధించాడు. మెడిసిన్‌కు అర్హత అయిన నీట్‌లో 675 మార్కులతో జాతీయ స్థాయిలో 14వ ర్యాంకు సాధించి సత్తా చాటాడు.
ఎయిమ్స్‌లో విద్యే ఎయిమ్
ఎయిమ్స్ విద్యనభ్యసించాలన్న ఎయిమ్ (లక్ష్యం) కోసం హర్షవర్ధన్ తపన పడ్డాడు. అందుకే గత నెల 26వ తేదీన ఎయిమ్స్ పరీక్షను రాశాడు. అందులో ర్యాంక్ సాధిస్తానని చెబుతున్నాడు. అక్కడే పీజీ వరకు చదవాలని అనుకుంటున్నానని తెలిపాడు. తాజాగా ఈ నెల 3వ తేదీన జిప్‌మర్ పరీక్షను కూడా రాశానని చెబుతున్నాడు. ఎంబీబీఎస్ తర్వాత కేన్సర్ స్పెషలైజేషన్ చేసి నిపుణుడిగా రాణించాలన్నదే లక్ష్యమని చెబుతున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment