డీసీసీ కార్యాలయంలో ధ్వంసమైన కుర్చీలు
మహబూబ్‌నగర్: జిల్లాకేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం ఉద్రిక్తత నెలకొంది. దేవరకద్ర నియోజకవర్గ కార్యకర్తలు హంగామా చేశారు. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ప్రదీప్‌గౌడ్ విలేకరుల సమావేశం ముగించుకొని బయటకు వస్తున్న తరుణంలో ఒక్కసారిగా దేవరకద్రకు చెందిన నాయకులు, కార్యకర్తలు కుర్చీలు పగులగొట్టడంతోపాటు ఫ్లెక్సీలను చించివేశారు.
దీంతో కార్యాలయంలో కొద్దిసేపు గందరగోళం నెలకొంది. ప్రదీప్‌గౌడ్ తదితరులు వారిస్తున్నప్పటికీ కార్యకర్తలు వినకుండా ఎక్కడికక్కడ కుర్చీలను పగులగొట్టారు. దీంతో స్థానిక నాయకులు, దేవరకద్ర నియోజకవర్గ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో అందరినీ కార్యాలయం నుంచి బయటకు పంపించేశారు. అయితే ఈ సంఘటన గురించి తెలుసుకొని అక్కడికి చేరుకున్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఎస్.వినోద్‌కుమార్ దేవరకద్ర నియోజకవర్గ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
కార్యాలయంలో కుర్చీలను పగులగొట్టి రచ్చ చేయడం సరికాదని, దీనిపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. అలాగే ఈ సంఘటనపై స్థానిక నాయకులు టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. అంతకుముందు దేవరకద్ర నాయకులు, కార్యకర్తలు కార్యాలయం పార్టీ ఎదుట కొద్దిసేపు ఆందోళన చేపట్టారు. దేవరకద్ర నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి, రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
స్వతంత్రంగా పోటీ చేస్తా..
కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్న నిజమైన కార్యకర్తలకు టికెట్ల కేటాయింపులో అన్యాయం చేయడం తగదని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ప్రదీప్‌కుమార్‌గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాకేంద్రంలోని కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీలు బీసీలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కావాలని అంటుంటే దానికి భిన్నంగా పీసీసీ జాబితా ఉందన్నారు.
రెండు జాబితాల్లో బలహీనవర్గాలకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని, ప్రతి పార్లమెంట్‌లో రెండు బీసీలకు ఇస్తామన్న రేవంత్‌రెడ్డి మాటలు ఏమయ్యాయని ప్రశ్నించారు. బీసీల పరిస్థితి కాంగ్రెస్‌లో దయనీయంగా మారిందని, తమ గోడు పట్టించుకునే నాథుడే లేరని ఆరోపించారు. 3 నుంచి నామినేషన్లు ప్రారంభమవుతుందని, ఆలోగా దేవరకద్ర కాంగ్రెస్ అభ్యర్థిని మార్చే నిర్ణయాన్ని అధిష్టానం తీసుకుపోతే నియోజకవర్గ నాయకులు, కార్యకర్తల అభీష్టం మేరకు స్వతంత్రంగా పోటీ చేస్తానని తేల్చిచెప్పారు.
అయితే డీసీసీ కార్యాలయంలో జరిగిన సంఘటన దురదృష్టకరమన్నారు. కొంతమంది కార్యకర్తలు క్షణికావేశంలో ఇలాంటి చర్యలకు దిగారని, దీనిని పూర్తిగా ఖండిస్తున్నానని పేర్కొన్నారు. సమావేశంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి సంజీవ్ ముదిరాజ్, జిల్లా ఓబీసీసెల్ అధ్యక్షుడు బాల్‌చందర్‌గౌడ్, నాయకులు వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment