తెలంగాణలో ఎన్నికలు తరుముకొస్తున్నాయి. టీ.కాంగ్రెస్ యాక్టివ్ మోడ్‌లోకి వచ్చిందా? రాలేదా? పార్టీల మధ్య జంపింగ్‌లు భారీగా జరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరి టీ.కాంగ్రెస్ చేరికల కమిటీ ఉన్నట్లా? లేనట్లా? చేరికల కమిటీ ఛైర్మన్ జానారెడ్డి ఏం చేస్తున్నారు? కాంగ్రెస్‌లోకి రావాలనుకుంటున్నవారితో చర్చిస్తున్నారా? కొత్తవారిని పట్టించుకోవడం మానేశారా?
ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో పార్టీల మధ్య కుండమార్పిళ్ళు సహజమే. ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి కప్పగెంతులు భారీగానే జరుగుతుంటాయి. అందుకే ప్రతి పార్టీలోనూ చేరికల కమిటీలు ఏర్పాటు చేసుకుంటారు. ఈ బాధ్యతను పార్టీలో ఒక సీనియర్‌కు అప్పగిస్తారు. అలాగే తెలంగాణ కాంగ్రెస్‌లో కూడా సీనియర్ నేత జానారెడ్డి ఆధ్వర్యంలో చేరికల కమిటీని ఏర్పాటు చేశారు.
ఎవరైనా కాంగ్రెస్‌లో చేరాలంటే ఈ కమిటీయే తుది నిర్ణయం తీసుకుంటుంది. పార్టీలో చేరదామనుకుంటున్నవారితో చర్చించి ఫైనల్ చేస్తుంది. ఇటువంటి కీలకమైన కమిటీకి ఛైర్మన్‌గా ఉన్న జానారెడ్డి ఇంతవరకు సమావేశమే ఏర్పాటు చేయలేదు. కమిటీ ఏర్పాటయ్యాక కొత్తవారు ఎవరూ కాంగ్రెస్‌లో చేరింది లేదు. ఎవరితోనూ కమిటీ చర్చించిందీ లేదు.
పెద్దలు జానారెడ్డి చేరికల కమిటీ ఉనికినే ప్రశ్నార్థకం చేయడంతో..అసలు ఈ కమిటీ ఉందా లేదా అని గాంధీభవన్‌లో చర్చించుకుంటున్నారు. కాంగ్రెస్‌లోకి వద్దామని ఎవరైనా అనుకుంటే పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డితోనో.. లేక సీఎల్‌పీ నేత భట్టి విక్రమార్కతోనో చర్చిస్తున్నారు గాని.. జానారెడ్డిని ఎవరూ పట్టించుకోవడంలేదు. మరోవైపు చేరికల కమిటీకి పీసీసీ నేతలే విలువ ఇవ్వడంలేదనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి.
అసలు చేరికల కమిటీ ఏర్పాటైనప్పటి నుంచి ఇతర పార్టీ నేతలను ఆకర్షించడంలో ఫెయిలయ్యిందనే విమర్శలు వస్తున్నాయి. ఇతర పార్టీలలో అసంతృప్తిగా ఉన్న నేతలతో చర్చించి కాంగ్రెస్‌లోకి తీసుకురావడం చేరికల కమిటీ పని. కానీ జానారెడ్డి ఇప్పటి వరకు అలాంటి ఆలోచనే చేయలేదనే అభిప్రాయాలు కాంగ్రెస్‌లోనే వ్యక్తమవుతున్నాయి. ఓ వైపు బీజేపీ చేరికల కమిటీ ఇటు కాంగ్రెస్ అటు బీఆర్ఎస్ అసంతృప్త నేతలతో సంప్రదింపులు జరుపుతూ పార్టీలోకి నేతలను ఆహ్వానిస్తుంటే.. టీ కాంగ్రెస్ చేరికల కమిటీ మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నదనే అసహనం పార్టీ నేతల్లో కనిపిస్తోంది.
చదవండి: పోటీకి వెనకడుగు.. ప్లాన్ ఇదేనా?.. టీ కాంగ్రెస్‌లో ఏం జరుగుతోంది?
బీఆర్ఎస్‌నుంచి సస్పెండైన సీనియర్ నేతలు జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు కొద్దిరోజులుగా చౌరస్తాలో నిలబడి ఏ పార్టీలో చేరాలనేదానిపై తర్జనభర్జన పడుతున్నారు. ఇలాంటి సమయంలో వారితో సంప్రదింపులు జరపాల్సిన చేరికల కమిటీ తనకేమీ పట్టనట్లు వ్యవహరిస్తోంది. పార్టీలో చేరాలనుకునే వారు కావాలంటే తమ దగ్గరకే వస్తారు..తాము ఇంకొకరి దగ్గరికి వెళ్ళేది ఏంటనే ధోరణిలో టీ కాంగ్రెస్ చేరికల కమిటీ వ్యవహరిస్తోంది. గాంధీభవన్ నేతల తీరుతో పార్టీలో చేరాలనుకునే వారు కూడా కాంగ్రెస్ పట్ల విముఖత చూపుతున్నారు. గతంలో ఈటల రాజేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకున్న సమయంలో కూడా చేరికల కమిటీ సకాలంలో రియాక్ట్ కాకపోవడం వల్లే ఈటల బీజేపీలోకి వెళ్ళారనే విమర్శ ఉంది.
చదవండి: ఎమ్మెల్యేగా సీతక్క కొడుకు పోటీ ఇక్కడి నుంచేనా..?
వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటికైనా చేరికల కమిటీ యాక్టీవ్ గా పనిచేయాలని సూచిస్తున్నారు. పార్టీలో సీనియర్ నేత అయిన జానారెడ్డి చేరికల కమిటీని యాక్టివ్ చేయాలని కోరుతున్నారు. ఇతర పార్టీలలో అసంతృప్తిగా ఉన్న నేతలతో వారి ఇళ్లకు వెళ్లి సంప్రదింపులు జరపాలని.. లేదంటే పార్టీలో చేరేందుకు ఎవరూ ముందుకు రారని పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment