పదవుల జోష్
సాక్షిప్రతినిధి, నల్లగొండ :జిల్లాను దీర్ఘకాలికంగా సతాయిస్తున్న సమస్యలకు కొదువేం లేదు. ఏడు ద శాబ్దాలుగా పట్టి పీడిస్తున్న ఫ్లోరైడ్ వేలాది మందిని జీవచ్ఛవాలుగా మార్చింది. మునుగోడు నియోజకవర్గం చిక్కిశల్యమైంది. మూడు దశాబ్దాలుగా ఊరిస్తున్న శ్రీశైలం సొరంగం పనులు ఒక అడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కి అన్న విధంగా సాగుతున్నాయి. తుంగుతుర్తి, సూర్యాపేట నియోజకవర్గాల్లో గలగలా పారాల్సిన గోదావరి జలాలు శ్రీరాంసాగర్ ద్వారా సరిగ్గా అందడమే లేదు. నకిరేకల్ నియోజకవర్గాన్ని సస్యశామలం చేయాల్సిన మూసీ ప్రాజెక్టు ముక్కుతూ మూలుగుతోంది. నాగార్జునసాగర్ వరదకాల్వ నత్తకు నడకలు నేర్పుతోంది. దేవరకొండ భూములకు జీవజలం అందించాల్సిన నక్కలగండి అడుగు ముందుకు పడడం లేదు. ఇలా... అత్యధిక నియోజకవర్గాల్లో దీర్ఘకాలికంగా తిష్టవేసిన సమస్యలు ఎన్నో.
సరిగ్గా ఇప్పుడు ఈ నియోజకవర్గాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నేతలకు పదవులు అందివచ్చాయి. వీటి ఆధారంగా వీరు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారా..? జిల్లా అభివృద్ధిలో ఈ పదవుల పాత్ర ఉంటుందా...? అన్న అంశాలపై చర్చ జరుగుతోంది. తుంగతుర్తి నియోజకవర్గానికి చెందిన గుంటకండ్ల జగదీష్‌రెడ్డి సూర్యాపేట ఎమ్మెల్యేగా గెలవడమే కాదు, టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఆయన విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు కూడా చేపట్టారు. అదే మాదిరిగా, నాగార్జునసాగర్ నుంచి రికార్డు విజయాల్ని సొంతం చేసుకున్న కుందూరు జానారెడ్డి సమైక్య రాష్ట్రంలో అత్యధిక కాలం మంత్రిగా పనిచేసిన రికార్డునూ నమోదు చేశారు. ఇప్పుడు ఆయన కాంగ్రెస్ శాసనసభా పక్షనేతగా ఎంపికై మరో కేబినెట్ ర్యాంకు పదవిని పొందారు. ఇక, రెండోసారి దేవరకొండ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన రవ్రీంద్రకుమార్ సీపీఐ శాసనసభా పక్ష నేత పదవిని దక్కించుకున్నారు.
సమైక్య రాష్ట్రంలో శాసనమండలికి డిప్యూటీ చైర్మన్‌గా ఉన్న నేతి విద్యాసాగర్ ఇప్పుడు తెలంగాణ శాసనమండలికి తొలి చైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఇలా, ముఖ్యమైన అధికారిక పదవుల్లో జిల్లా ప్రత్యేకత నిలుపుకొంది. ఎటొచ్చీ ఈ పదవుల ద్వారా ఆయా నాయకులు జిల్లా అభివృద్ధి ఏమేర కృషి చేస్తారు అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. గత ప్రభుత్వాల్లోనూ జిల్లాను ప్రతీసారి ఇద్దరు చొప్పున మంత్రులు ప్రాతినిధ్యం వహించారు. కానీ, అప్పుడు సమైక్య రాష్ట్రంలో ఏదీ సరిగ్గా సాధించలేక పోయామన్న అభిప్రాయం బలంగా ఉంది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో జిల్లా అభివృద్ధికి కొత్త బాటలు ఎలా వేస్తారో చూడాలన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అధికార, విపక్ష పార్టీలన్న తేడా లేకుండా ఈ నేతలు కలిసి పనిచేయాల్సిన అవసరాన్నీ కొందరు ప్రస్తావిస్తున్నారు. జిల్లాకు పదవుల ద్వారా అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే సమస్యల పరిష్కారంతో పాటు, జిల్లాను అభివృద్ధి పథంలోకి తీసుకుపోవచ్చన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.