cabinet rank
-
ప్రెస్ అకాడమీ ఛైర్మన్‌కు కేబినెట్ హోదా
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ ఛైర్మన్‌గా నియమితులైనదేవిరెడ్డి శ్రీనాథ్‌కు ప్రభుత్వం కేబినెట్ హోదా కల్పించింది. సీనియర్ పాత్రికేయుడైన దేవిరెడ్డి శ్రీనాథ్‌ను ప్రెస్ అకాడమీ ఛైర్మన్‌గా నియమిస్తూ ప్రభుత్వం గత ఏడాది నవంబరు 8న ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా ఆయనకు కేబినెట్ హోదా కల్పిస్తూ సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ఆదివారం జీఓ జారీ చేశారు. కాగా.. నవంబర్ 21న ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా దేవిరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. జర్నలిజం వృత్తిలో అపార అనుభవం ఉన్న శ్రీనాథ్ వైఎస్సార్ జిల్లా సింహాద్రిపురం మండలం కొవరంగుట్టపల్లి గ్రామ వాస్తవ్యులు. ఆంధ్రప్రభ ద్వారా 1978లో జర్నలిజం వృత్తిలో చేరిన శ్రీనాధ్ దాదాపు నాలుగు దశాబ్దాల పాటు కొనసాగారు. చదవండి: ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా శ్రీనాథ్ దేవిరెడ్డి కడప జిల్లాలో పనిచేసినప్పుడు రాయలసీమ వెనుకబాటుకు సంబంధించి రాజకీయ, ఆర్థిక, సామాజిక అంశాలపై 'సెవెన్ రోడ్స్ జంక్షన్' పేరుతో ఆయన రాసిన కాలమ్స్ విశేషప్రాచుర్యం పొందాయి. 1990వ దశకంలో ఆయన కొన్నేళ్లపాటు బీబీసీ రేడియోకు పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం(ఏపీయూడబ్ల్యూజే) కడప జిల్లా అధ్యక్షుడిగా దాదాపు 24 సంవత్సరాలు పనిచేశారు. ఆ తర్వాత ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శిగా కూడా పనిచేశారు. శ్రీనాథ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి అత్యంత సన్నిహిత జర్నలిస్టు కూడా. ( దేవిరెడ్డి శ్రీనాథ్‌రెడ్డి బాధ్యతల స్వీకరణ) -
వాసిరెడ్డి పద్మకు క్యాబినెట్ హోదా
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మకు ప్రభుత్వం కేబినెట్ హోదా కల్పించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 8వ తేదీన ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ నియమితులయిన విషయం తెలిసిందే. దీంతో ఈ నెల 26న ఉదయం 10.30 గంటలకి తాడేపల్లిలోని సీఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో ఆమె పదవీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. -
కేబినెట్ ర్యాంకులపై వివరణ ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: బీజేపీ సీనియర్ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై ఉమ్మడి హైకోర్టు స్పందించింది. ఈ వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరిస్తూ, క్యాబినెట్ ర్యాంకులు ఇవ్వడంపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సాధారణ పరిపాలనశాఖ ముఖ్య కార్యదర్శి, యువజన సర్వీసులశాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించింది. వీరితో పాటు కేబినెట్ హోదా పొందిన బాలకిషన్, ఎ.కె.గోయల్, ఎ.రామలక్ష్మణ్, బి.వి.పాపారావు, కె.వి.రమణాచారి, జి.ఆర్.రెడ్డి, పేర్వారం రాములు, కె.ఎం.సహానీ, డాక్టర్ వేణుగోపాలాచారి, రామచంద్రుడు, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, పిడమర్తి రవి, అల్లం నారాయణ తదితరులకు నోటీసులు జారీ చేసింది. ఇదే వ్యవహారంపై రేవంత్‌రెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యంతో ఈ వ్యాజ్యాన్ని జత చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలిలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. పలువురు ప్రభుత్వ సలహాదారులు, ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధులు, పలు కార్పొరేషన్ల చైర్మన్లకు కేబినెట్ హోదా కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన పలు జీవోలను సవాలు చేస్తూ ఇంద్రసేనారెడ్డి పిల్ వేసిన సంగతి తెలిసిందే. -
ప్రశాంత కిశోర్‌కు పదవీ గండం
బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌కు సలహాదారుగా ఉన్న ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత కిశోర్ పదవికి గండం పొంచి ఉంది. ఆయనకు కేబినెట్ ర్యాంకు ఇవ్వడాన్ని సవాలు చేస్తూ ఓ వ్యక్తి సుప్రీంకోర్టును ఆశ్రయించడమే ఇందుకు కారణం. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జేడీ(యూ), ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీల కూటమి ఘన విజయం సాధించింది. ఈ విజయం వెనుక ప్రశాంత కిషోర్ వ్యూహాలు చాలావరకు పనిచేశాయి. దాంతో మళ్లీ అధికారంలోకి వచ్చిన నితీష్ కుమార్.. ప్రశాంత కిషోర్‌ను తన సలహాదారుడిగా నియమించుకుని, ఆయనకు కేబినెట్ ర్యాంకు ఇచ్చారు. ఎన్నికల సలహాదారుగా ఉన్నందుకు ఫీజు ఇవ్వడంతో పాటు దీన్ని అదనపు బహుమతిగా కట్టబెట్టారు. ఇలా ఒక ప్రైవేటు వ్యక్తికి కేబినెట్ ర్యాంకు ఎలా ఇస్తారంటూ ఇంతకుముందు బిహార్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సుశీల్ మోదీ కూడా ప్రశ్నించారు. బిహార్ వికాస్ మిషన్ (బీవీఎం) బాధ్యతలను ప్రశాంత కిషోర్‌కు అప్పగించారు. అయితే, కేబినెట్ ర్యాంకు ఉన్న కిషోర్.. ఏనాడూ కేబినెట్ సమావేశాలకు మాత్రం హాజరు కాలేదు. నిబంధనల ప్రకారం, మంత్రిమండలి సమావేశాలలో పాల్గొనని మంత్రులపై చర్య తీసుకోవాలి. అంతేకాదు.. బిహార్ వికాస్ మండలి సమావేశాలకు కూడా ఇంతవరకు ఒక్కసారి కూడా ఆయన హాజరు కాలేదు, తన కార్యాలయానికి కూడా ఇంతవరకు వెళ్లలేదు. వీటన్నింటినీ ప్రస్తావిస్తూ.. అసలు ఈ వ్యక్తికి కేబినెట్ ర్యాంకు ఎలా ఇస్తారని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంటే ఆయన పదవి ప్రమాదంలో పడుతుందని అంటున్నారు. -
సలహాదారులకు కేబినేట్ హోదాపై విచారణ
హైదరాబాద్: ప్రభుత్వ సలహాదారులకు కేబినెట్ హోదా ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో రేవంత్ రెడ్డి దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వాజ్యం మంగళవారం విచారణకు వచ్చింది. కేబినెట్ హోదాలో నియమించిన వారికి ఎలాంటి అర్హతలు లేవని , దీనివల్ల వేల కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అవుతున్నదని రేవంత్ రెడ్డి తరపు న్యాయవాది ప్రధాన న్యాయమూర్తి ఎదుట వాదనలు వినిపించారు. ఎమ్మెల్యేలు కాదు కాబట్టి వీరి అధికారాలు అర్హతలు తెలపాలంటూ తెలంగాణ అడ్వకేట్ జనరల్‌ను ప్రధాన న్యాయమూర్తి కోరారు. వాదనలను విన్న న్యాయమూర్తి కేసు విచారణను వచ్చేవారానికి వాయిదా వేశారు. -
తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా సహానీ
హైదరాబాద్: ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సహానీని నియమిస్తూ మంగళవారం తెలంగాణ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. అంతే కాకుండా ఆయనకు కేబినెట్ హోదా కల్పిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
పదవుల జోష్
సాక్షిప్రతినిధి, నల్లగొండ :జిల్లాను దీర్ఘకాలికంగా సతాయిస్తున్న సమస్యలకు కొదువేం లేదు. ఏడు ద శాబ్దాలుగా పట్టి పీడిస్తున్న ఫ్లోరైడ్ వేలాది మందిని జీవచ్ఛవాలుగా మార్చింది. మునుగోడు నియోజకవర్గం చిక్కిశల్యమైంది. మూడు దశాబ్దాలుగా ఊరిస్తున్న శ్రీశైలం సొరంగం పనులు ఒక అడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కి అన్న విధంగా సాగుతున్నాయి. తుంగుతుర్తి, సూర్యాపేట నియోజకవర్గాల్లో గలగలా పారాల్సిన గోదావరి జలాలు శ్రీరాంసాగర్ ద్వారా సరిగ్గా అందడమే లేదు. నకిరేకల్ నియోజకవర్గాన్ని సస్యశామలం చేయాల్సిన మూసీ ప్రాజెక్టు ముక్కుతూ మూలుగుతోంది. నాగార్జునసాగర్ వరదకాల్వ నత్తకు నడకలు నేర్పుతోంది. దేవరకొండ భూములకు జీవజలం అందించాల్సిన నక్కలగండి అడుగు ముందుకు పడడం లేదు. ఇలా... అత్యధిక నియోజకవర్గాల్లో దీర్ఘకాలికంగా తిష్టవేసిన సమస్యలు ఎన్నో. సరిగ్గా ఇప్పుడు ఈ నియోజకవర్గాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నేతలకు పదవులు అందివచ్చాయి. వీటి ఆధారంగా వీరు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారా..? జిల్లా అభివృద్ధిలో ఈ పదవుల పాత్ర ఉంటుందా...? అన్న అంశాలపై చర్చ జరుగుతోంది. తుంగతుర్తి నియోజకవర్గానికి చెందిన గుంటకండ్ల జగదీష్‌రెడ్డి సూర్యాపేట ఎమ్మెల్యేగా గెలవడమే కాదు, టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆయన విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు కూడా చేపట్టారు. అదే మాదిరిగా, నాగార్జునసాగర్ నుంచి రికార్డు విజయాల్ని సొంతం చేసుకున్న కుందూరు జానారెడ్డి సమైక్య రాష్ట్రంలో అత్యధిక కాలం మంత్రిగా పనిచేసిన రికార్డునూ నమోదు చేశారు. ఇప్పుడు ఆయన కాంగ్రెస్ శాసనసభా పక్షనేతగా ఎంపికై మరో కేబినెట్ ర్యాంకు పదవిని పొందారు. ఇక, రెండోసారి దేవరకొండ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన రవ్రీంద్రకుమార్ సీపీఐ శాసనసభా పక్ష నేత పదవిని దక్కించుకున్నారు. సమైక్య రాష్ట్రంలో శాసనమండలికి డిప్యూటీ చైర్మన్‌గా ఉన్న నేతి విద్యాసాగర్ ఇప్పుడు తెలంగాణ శాసనమండలికి తొలి చైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఇలా, ముఖ్యమైన అధికారిక పదవుల్లో జిల్లా ప్రత్యేకత నిలుపుకొంది. ఎటొచ్చీ ఈ పదవుల ద్వారా ఆయా నాయకులు జిల్లా అభివృద్ధి ఏమేర కృషి చేస్తారు అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. గత ప్రభుత్వాల్లోనూ జిల్లాను ప్రతీసారి ఇద్దరు చొప్పున మంత్రులు ప్రాతినిధ్యం వహించారు. కానీ, అప్పుడు సమైక్య రాష్ట్రంలో ఏదీ సరిగ్గా సాధించలేక పోయామన్న అభిప్రాయం బలంగా ఉంది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో జిల్లా అభివృద్ధికి కొత్త బాటలు ఎలా వేస్తారో చూడాలన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అధికార, విపక్ష పార్టీలన్న తేడా లేకుండా ఈ నేతలు కలిసి పనిచేయాల్సిన అవసరాన్నీ కొందరు ప్రస్తావిస్తున్నారు. జిల్లాకు పదవుల ద్వారా అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే సమస్యల పరిష్కారంతో పాటు, జిల్లాను అభివృద్ధి పథంలోకి తీసుకుపోవచ్చన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.