
సాక్షి, హైదరాబాద్: బీజేపీ సీనియర్ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై ఉమ్మడి హైకోర్టు స్పందించింది. ఈ వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరిస్తూ, క్యాబినెట్ ర్యాంకులు ఇవ్వడంపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సాధారణ పరిపాలనశాఖ ముఖ్య కార్యదర్శి, యువజన సర్వీసులశాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించింది. వీరితో పాటు కేబినెట్ హోదా పొందిన బాలకిషన్, ఎ.కె.గోయల్, ఎ.రామలక్ష్మణ్, బి.వి.పాపారావు, కె.వి.రమణాచారి, జి.ఆర్.రెడ్డి, పేర్వారం రాములు, కె.ఎం.సహానీ, డాక్టర్ వేణుగోపాలాచారి, రామచంద్రుడు, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, పిడమర్తి రవి, అల్లం నారాయణ తదితరులకు నోటీసులు జారీ చేసింది.
ఇదే వ్యవహారంపై రేవంత్‌రెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యంతో ఈ వ్యాజ్యాన్ని జత చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలిలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. పలువురు ప్రభుత్వ సలహాదారులు, ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధులు, పలు కార్పొరేషన్ల చైర్మన్లకు కేబినెట్ హోదా కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన పలు జీవోలను సవాలు చేస్తూ ఇంద్రసేనారెడ్డి పిల్ వేసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment