ప్రశాంత కిశోర్‌కు పదవీ గండం
బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌కు సలహాదారుగా ఉన్న ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత కిశోర్ పదవికి గండం పొంచి ఉంది. ఆయనకు కేబినెట్ ర్యాంకు ఇవ్వడాన్ని సవాలు చేస్తూ ఓ వ్యక్తి సుప్రీంకోర్టును ఆశ్రయించడమే ఇందుకు కారణం. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జేడీ(యూ), ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీల కూటమి ఘన విజయం సాధించింది. ఈ విజయం వెనుక ప్రశాంత కిషోర్ వ్యూహాలు చాలావరకు పనిచేశాయి. దాంతో మళ్లీ అధికారంలోకి వచ్చిన నితీష్ కుమార్.. ప్రశాంత కిషోర్‌ను తన సలహాదారుడిగా నియమించుకుని, ఆయనకు కేబినెట్ ర్యాంకు ఇచ్చారు. ఎన్నికల సలహాదారుగా ఉన్నందుకు ఫీజు ఇవ్వడంతో పాటు దీన్ని అదనపు బహుమతిగా కట్టబెట్టారు.
ఇలా ఒక ప్రైవేటు వ్యక్తికి కేబినెట్ ర్యాంకు ఎలా ఇస్తారంటూ ఇంతకుముందు బిహార్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సుశీల్ మోదీ కూడా ప్రశ్నించారు. బిహార్ వికాస్ మిషన్ (బీవీఎం) బాధ్యతలను ప్రశాంత కిషోర్‌కు అప్పగించారు. అయితే, కేబినెట్ ర్యాంకు ఉన్న కిషోర్.. ఏనాడూ కేబినెట్ సమావేశాలకు మాత్రం హాజరు కాలేదు. నిబంధనల ప్రకారం, మంత్రిమండలి సమావేశాలలో పాల్గొనని మంత్రులపై చర్య తీసుకోవాలి. అంతేకాదు.. బిహార్ వికాస్ మండలి సమావేశాలకు కూడా ఇంతవరకు ఒక్కసారి కూడా ఆయన హాజరు కాలేదు, తన కార్యాలయానికి కూడా ఇంతవరకు వెళ్లలేదు. వీటన్నింటినీ ప్రస్తావిస్తూ.. అసలు ఈ వ్యక్తికి కేబినెట్ ర్యాంకు ఎలా ఇస్తారని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంటే ఆయన పదవి ప్రమాదంలో పడుతుందని అంటున్నారు.