డాక్టర్ బీసీ రాయ్
వైద్యునిగా, విద్యావేత్తగా, స్వాతంత్య్ర సమరయోధునిగా, వితరణ శీలిగా, ఆధునిక పశ్చిమ బెంగాల్ రూపకర్తగా విశేష సేవలు అందించిన బహుముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్ బీసీ రాయ్. ఆయన పుట్టిన రోజూ, మరణించిన రోజూ ఒక్కటే (జూలై 1) కావడం విశేషం. ఈరోజును భారత ప్రభుత్వం ‘నేషనల్ డాక్టర్స్ డే’గా ప్రకటించి గౌరవించింది.
డాక్టర్ బీసీ రాయ్‌గా సుపరిచితులైన డాక్టర్ బిధాన్ చంద్రరాయ్ 1882లో అఘోర్ కామినీ దేవి, ప్రకాష్ చంద్రరాయ్ దంపతులకు, బిహార్ రాష్ట్రంలో జన్మించారు. వైద్య విద్య నిమిత్తం 1901లో కలకత్తా మెడికల్ కాలేజీలో చేరి వైద్య విద్యను అభ్యసిస్తూనే స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్నారు.
1909లో లండన్ వెళ్ళి ఉన్నత విద్య అభ్యసించి వచ్చి కలకత్తా మెడికల్ కాలేజీలో అధ్యాపకునిగా చేరారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ), మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ)ల ఏర్పాటులో కీలకపాత్ర పోషించారు.
స్వాతంత్య్రానంతరం కాంగ్రెస్ పార్టీ రాయ్‌కి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి పదవి చేపట్టమని కోరింది. మొదట తిరస్కరించినా... 1948 జనవరి 23న రాయ్ ఆ బాధ్యతలు స్వీకరించారు. తన 80వ ఏట 1962 జులై 1వ తేదీ వరకు అంటే తుదిశ్వాస విడిచేవరకు 14 ఏళ్లపాటు అద్భుతపాలన అందించారు. అంతేకాక ముఖ్యమంత్రిగా ఎంత బిజీగా వున్నా, ప్రతిరోజూ క్రమం తప్పకుండా రోగులను చూడడం మాత్రం మానుకోలేదు. భారత ప్రభుత్వం డాక్టర్ బీసీ రాయ్ అత్యున్నత సేవలను గుర్తించి, 1961లో దేశ అత్యున్నత పురస్కారం ‘భారత రత్న’తో గౌరవించింది.
– డాక్టర్ టి. సేవకుమార్, గుంటూరు
(జూలై 1న జాతీయ వైద్యుల దినోత్సవం)
Comments
Please login to add a commentAdd a comment