Ram Prasad Bismil, Ashfaqulla Khan: అమర మిత్రులు! | Indian Freedom Fighters Ram Prasad Bismil, Ashfaqulla Khan | Sakshi
Sakshi News home page

Ram Prasad Bismil, Ashfaqulla Khan: అమర మిత్రులు!

Published Mon, Dec 19 2022 1:53 PM | Last Updated on Mon, Dec 19 2022 1:53 PM

Indian Freedom Fighters Ram Prasad Bismil, Ashfaqulla Khan - Sakshi

దేశ స్వాతంత్య్రం కోసం అనేక మంది యువ కిశోరాలు తమ ప్రాణాలను పణంగా పెట్టి పోరాడారు. వారిలో రాంప్రసాద్‌ బిస్మిల్, అష్ఫాఖుల్లా ఖాన్‌ ముఖ్యులు. వయసుకు మించిన పరిణతితో దేశం కోసం ఉరితాడును ముద్దాడి నూరేళ్ల ఖ్యాతిని ఆర్జించారు. బిస్మిల్‌ 1897 జూన్‌ 11వ తేదీన, అష్ఫాఖ్‌ 1900 అక్టోబర్‌ 22న ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌లో జన్మించారు. రాంప్రసాద్‌ బిస్మిల్, అష్ఫాఖ్‌ల కుటుంబ నేపథ్యాలు ఉత్తర దక్షిణ ధ్రువాల్లాంటివి. బిస్మిల్‌ సనాతన హిందువు, ఆర్యసమాజ సభ్యుడు. అష్ఫాఖ్‌ సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన ముస్లిం. భిన్న సామాజిక జీవన నేపథ్యాల నుండి వచ్చినా వీరు గొప్ప స్నేహితులయ్యారు. బిస్మిల్‌ మొదట్లో అష్ఫాఖ్‌ను ఒక పట్టాన నమ్మలేదు, కాని అచంచలమైన అష్ఫాఖ్‌ దేశ భక్తికి, అంకిత భావానికి బిస్మిల్‌ చలించి పోయాడు. ఇద్దరూ యుక్త వయసులోనే పదునైన కవిత్వం రాశారు. సామ్రాజ్యవాద భావ జాలాన్ని తుత్తునియలు చేశారు.

మాతృదేశ స్వాతంత్య్ర ఉద్యమ అవసరాల కోసం ప్రభుత్వ ధనాన్ని కొల్లగొట్టాలని నిర్ణయించారు. అందులో భాగంగా 1925 ఆగస్టు 9వ తేదీన అష్ఫాఖుల్లా ఖాన్, రాం ప్రసాద్‌ బిస్మిల్‌, చంద్ర శేఖర్‌ ఆజాద్‌ లాంటి మరికొందరు విప్లవకారులు కలిసి ‘కకోరీ’ గ్రామం వద్ద ప్రభుత్వ ఖజానాతో పోతున్న రైలును దోపిడీ చేశారు. పట్టుమని పదిమంది కూడా లేని యువకులు ఏకంగా బ్రిటిష్‌ ఖజానాకే గురి పెట్టి, రైలునే దోచేయడం ఆంగ్లాధికారులకు తల తీసేసినంత పనైతే, ఉద్యమకారులకు కొత్త ఉత్సాహాన్ని అందించి నట్లయింది. 

సెప్టెంబర్‌ 26న రాంప్రసాద్‌ బిస్మిల్‌ను అరెస్టుచేశారు. అష్ఫాఖ్‌ తప్పించుకున్నాడు. కొన్నాళ్ళ పాటు బనారస్‌లో అజ్ఞాత జీవితం గడిపి ఢిల్లీ చేరుకున్నాడు. ఢిల్లీలో మిత్రుడు చేసిన నమ్మక ద్రోహంతో పోలీసులకు పట్టుబడ్డాడు. చివరికి 1927 డిసెంబర్‌ 19వ తేదీన అష్ఫాఖ్, రాంప్రసాద్‌ బిస్మిల్‌లను ఉరితీయాలని తీర్పు వెలువడింది. ప్రాణత్యాగానికి ఏనాడో సిద్ధపడ్డ ఈ ఇద్దరు ప్రాణ మిత్రులు మాతృదేశ విముక్తి కోసం ఉరి కంబాన్ని ఎక్కబోతున్నందుకు గర్వపడుతున్నామని ప్రకటించారు. 

ఇద్దరినీ వేర్వేరు జైళ్ళలో ఒకేరోజు ఉరి తీశారు. భూప్రపంచం ఉన్నంత వరకు దేశం పట్ల బాధ్యతను గుర్తుచేస్తూ అష్ఫాఖ్, బిస్మిల్‌ల త్యాగం, స్నేహం సజీవంగా ఉంటాయి. హిందూ – ముస్లిం ఐక్యతను చాటుతూ... మతోన్మాదులకు సవాల్‌ విసురుతూనే ఉంటుంది! (క్లిక్ చేయండి: వారధి కట్టాల్సిన సమయమిది!)

– ఎం.డి. ఉస్మాన్‌ ఖాన్‌ 
(డిసెంబర్‌ 19 రాంప్రసాద్‌ బిస్మిల్, అష్ఫాఖుల్లా ఖాన్‌లను ఉరితీసిన రోజు)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement