indian freedom fighters
-
Ram Prasad Bismil, Ashfaqulla Khan: అమర మిత్రులు!
దేశ స్వాతంత్య్రం కోసం అనేక మంది యువ కిశోరాలు తమ ప్రాణాలను పణంగా పెట్టి పోరాడారు. వారిలో రాంప్రసాద్ బిస్మిల్, అష్ఫాఖుల్లా ఖాన్ ముఖ్యులు. వయసుకు మించిన పరిణతితో దేశం కోసం ఉరితాడును ముద్దాడి నూరేళ్ల ఖ్యాతిని ఆర్జించారు. బిస్మిల్ 1897 జూన్ 11వ తేదీన, అష్ఫాఖ్ 1900 అక్టోబర్ 22న ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్పూర్లో జన్మించారు. రాంప్రసాద్ బిస్మిల్, అష్ఫాఖ్ల కుటుంబ నేపథ్యాలు ఉత్తర దక్షిణ ధ్రువాల్లాంటివి. బిస్మిల్ సనాతన హిందువు, ఆర్యసమాజ సభ్యుడు. అష్ఫాఖ్ సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన ముస్లిం. భిన్న సామాజిక జీవన నేపథ్యాల నుండి వచ్చినా వీరు గొప్ప స్నేహితులయ్యారు. బిస్మిల్ మొదట్లో అష్ఫాఖ్‌ను ఒక పట్టాన నమ్మలేదు, కాని అచంచలమైన అష్ఫాఖ్ దేశ భక్తికి, అంకిత భావానికి బిస్మిల్ చలించి పోయాడు. ఇద్దరూ యుక్త వయసులోనే పదునైన కవిత్వం రాశారు. సామ్రాజ్యవాద భావ జాలాన్ని తుత్తునియలు చేశారు. మాతృదేశ స్వాతంత్య్ర ఉద్యమ అవసరాల కోసం ప్రభుత్వ ధనాన్ని కొల్లగొట్టాలని నిర్ణయించారు. అందులో భాగంగా 1925 ఆగస్టు 9వ తేదీన అష్ఫాఖుల్లా ఖాన్, రాం ప్రసాద్ బిస్మిల్, చంద్ర శేఖర్ ఆజాద్ లాంటి మరికొందరు విప్లవకారులు కలిసి ‘కకోరీ’ గ్రామం వద్ద ప్రభుత్వ ఖజానాతో పోతున్న రైలును దోపిడీ చేశారు. పట్టుమని పదిమంది కూడా లేని యువకులు ఏకంగా బ్రిటిష్ ఖజానాకే గురి పెట్టి, రైలునే దోచేయడం ఆంగ్లాధికారులకు తల తీసేసినంత పనైతే, ఉద్యమకారులకు కొత్త ఉత్సాహాన్ని అందించి నట్లయింది. సెప్టెంబర్ 26న రాంప్రసాద్ బిస్మిల్‌ను అరెస్టుచేశారు. అష్ఫాఖ్ తప్పించుకున్నాడు. కొన్నాళ్ళ పాటు బనారస్‌లో అజ్ఞాత జీవితం గడిపి ఢిల్లీ చేరుకున్నాడు. ఢిల్లీలో మిత్రుడు చేసిన నమ్మక ద్రోహంతో పోలీసులకు పట్టుబడ్డాడు. చివరికి 1927 డిసెంబర్ 19వ తేదీన అష్ఫాఖ్, రాంప్రసాద్ బిస్మిల్లను ఉరితీయాలని తీర్పు వెలువడింది. ప్రాణత్యాగానికి ఏనాడో సిద్ధపడ్డ ఈ ఇద్దరు ప్రాణ మిత్రులు మాతృదేశ విముక్తి కోసం ఉరి కంబాన్ని ఎక్కబోతున్నందుకు గర్వపడుతున్నామని ప్రకటించారు. ఇద్దరినీ వేర్వేరు జైళ్ళలో ఒకేరోజు ఉరి తీశారు. భూప్రపంచం ఉన్నంత వరకు దేశం పట్ల బాధ్యతను గుర్తుచేస్తూ అష్ఫాఖ్, బిస్మిల్ల త్యాగం, స్నేహం సజీవంగా ఉంటాయి. హిందూ – ముస్లిం ఐక్యతను చాటుతూ... మతోన్మాదులకు సవాల్ విసురుతూనే ఉంటుంది! (క్లిక్ చేయండి: వారధి కట్టాల్సిన సమయమిది!) – ఎం.డి. ఉస్మాన్ ఖాన్ (డిసెంబర్ 19 రాంప్రసాద్ బిస్మిల్, అష్ఫాఖుల్లా ఖాన్‌లను ఉరితీసిన రోజు) -
Bhimbor Deori: భీంబర్ డియోరీ.. ఎవరో తెలుసా?
భారత స్వాతంత్య్ర అమృతోత్సవాల సంరంభంలో ఉన్న మనం ఈశాన్య భారత్‌కు చెందిన భీంబర్ డియోరీని గుర్తుచేసుకోవాలి. ఈయన అసోంను తూర్పు పాకిస్తాన్లో విలీనం చేసే ప్రయత్నాలను విఫలం చేసిన జన నాయకుడు. అలాగే స్వదేశీ వర్గాలను ఉద్ధరించడంలో, అసోం ప్రయోజనాలను పరిరక్షించడంలోనూ కీలక పాత్ర పోషించారు. ఆయన కృషి ఫలితంగా అసోం విధాన సభలో గిరిజనుల కొరకు 5 స్థానాలు రిజర్వు చేయబడ్డాయి. స్వాతంత్య్రేచ్ఛ ఆయన రక్తంలోనే ఉంది. ప్రత్యేక మాతృభూమి కోసం 1945 మార్చి 21– 23 మధ్య ‘ఖాసీ దర్బార్ హాల్ తీర్మానాలు’ చేశారు. ఈ తీర్మానాలతో వివిధ గిరిజన తెగలకు చెందిన స్థానిక నాయకులు తమ స్వతంత్ర మాతృభూమిని పునరుద్ధరించాలని నిర్ణయించుకున్నారు. ఆయన 1903 మే 16న అసోంలోని శివసాగర్ జిల్లాలోని వనిదిహింగ్ గ్రామంలో గోదారం డియోరీ, బజోతి డియోరీ దంపతులకు జన్మించారు. సాధారణ గిరిజన యువకుడైన భీంబర్ అసోం సివిల్ పరీక్షలో ప్రథమ స్థానం సంపాదించారు. కానీ ఈయన గిరిజనుడైనందున బ్రిటిష్ ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వడానికి నిరాకరించింది. పట్టుదలతో ఆయన డిబ్రుగర్లో న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. 1933లో ‘అసోం బ్యాక్వర్డ్ ప్లెయిన్స్ ట్రైబల్ లీగ్’ని స్థాపించి దాని వ్యవస్థాపక జనరల్ సెక్రటరీగా పని చేశారు. 1941 జూన్ 18న వివిధ విద్యా సంస్థలకు చెందిన వసతి గృహాలలో చదువుకుంటున్న గిరిజన విద్యార్థులను జనరల్ డైనింగ్ హాల్లోకి అనుమతించమని పోరాడారు. 1946 జూలై 8న అసోం ప్రభుత్వంలో అటవీ, కార్మిక శాఖ మంత్రిగా నియమితులైనారు. అసోం ప్రజల హృదయాల్లో భీంబర్ డియోరీ ఆదివాసీల నాయకుడిగానేగాక, ఆదర్శ జననేతగా నిలిచి 1947 నవంబర్ 30న తనువు చాలించారు. – గుమ్మడి లక్ష్మీ నారాయణ ఆదివాసీ రచయితల వేదిక వ్యవస్థాపక కార్యదర్శి (నవంబర్ 30న భీంబర్ డియోరీ 75వ వర్ధంతి) -
జైహింద్ స్పెషల్: మీ డబ్బొద్దు.. మీరు కావాలి
‘‘మీరు ప్రాక్టీస్ మానేసి కాంగ్రెస్‌లో చేరాలి’’.. గాంధీజీ అభ్యర్ధన! ‘‘నా సంపాదన యావత్తూ కాంగ్రెస్ ప్రచారం కోసం పూర్తిగా ఇచ్చేస్తాను.. నన్ను వదిలిపెట్టండి’’ .. చిత్తరంజన్‌దాస్ వేడికోలు..! సహాయ నిరాకరణోద్యమాన్ని ప్రారంభించిన గాంధీజీ కలకత్తా వెళ్లినపుడు అక్కడి ప్రముఖ న్యాయవాది అయిన చిత్తరంజన్‌దాస్ ఇంట్లో బస చేశారు. కాంగ్రెస్‌లో చేరమంటూ ప్రతిరోజూ గాంధీజీ అడగటం, వదిలేయమంటూ దాస్ ప్రాధేయపడటం జరుగుతుండేది. న్యాయవాది అయిన చిత్తరంజన్ దాస్ సంపాదన నెలకు రూ.50 వేలుండేది. ఆరోజుల్లో థూమ్రాన్ కేసు జరుగు తోంది. అంటే మొదటి ప్రపంచ యుద్ధానికి సంబంధించిన కాంట్రాక్టు తగాదాల వ్యవహారం. చదవండి: విక్టోరియా స్మారక చిహ్నం పై డ్రోన్ల కలకలం... తమ తరపును వాదించటానికి ప్రభుత్వం చిత్తరంజన్‌దాస్‌ను రూ.3 లక్షల ఫీజు చెల్లించే ఒప్పందంతో న్యాయవాదిగా నియమించుకుంది. ‘‘ఈ ఫీజు మొత్తాన్ని కాంగ్రెస్‌కు సమర్పించు కుంటాను.. నన్ను వదిలిపెట్టారంటే కాంగ్రెస్‌కు ఎంతో లాభం కలుగుతుంది..’’ అని చిత్తరంజన్ దాస్ ఎన్నో విధాలా గాంధీజీకి నచ్చజెప్పచూశాడు. గాంధీజీ మాత్రం ఒక్కటే చెప్పారు. ‘‘ మీ ధనంతో నాకు నిమిత్తం లేదు.. నాకు కావలసింది మీరు..’’ అని స్పష్టంగా చెప్పారు. ఆ మాటల్లో ఏ సమ్మోహనశక్తి ఉందో గానీ దాస్ మాత్రం ఎదురుమాట లేకుండా లొంగిపోయారు. చిత్తరంజన్‌దాస్ మహామేధావి. ఆలీపూర్ బాంబు కేసుతో ఆయన ప్రజ్ఞావిశేషాలు దేశమంతటా తెలిశాయి. జాతీయోద్యమంతో సహా వంగ దేశంలో ఆ రోజుల్లో తలెత్తిన ప్రతి విప్లవోద్యమానికి దాస్ ధన సహాయం తప్పనిసరి. ఎప్పుడో తన తండ్రి బాకీలు చేసి దివాలా తీస్తే, తనకు సంబంధం లేకున్నా, బాకీదారులను పిలిచి దమ్మిడీతో సహా లెక్కగట్టి చెల్లించిన దొడ్డమనిషిగా గుర్తింపు ఉంది. నెలకోసారి బీదాబిక్కీకి పిండివంటలతో అన్నదానం చేయటం ఆయనకు ఆలవాటు. కలకత్తా పట్టణంలో ఆయన ధనసాయం పొందని బీద విద్యార్థి అంటూ లేరు. ప్రతి విప్లవోద్యమం వెనుక ఆయన దాతృత్వం ఉందని ప్రభుత్వానికి స్పష్టంగా తెలిసినా, ఆయనపై చర్యకు సర్కారు గడగడ వణికేది. గాంధీజీకి ఈ విషయాలు తెలుసు కనుకనే కాంగ్రెస్ ఉద్యమానికి దాస్ ధనం కంటే దాస్ ఒక్కడే ఎక్కువ ఉపయోగపడతాడని గ్రహించి ఆయన్నే కోరుకున్నారు. పట్టుబట్టి స్వాతంత్య్ర ఉద్యమంలో భాగస్వామిని చేశారు. (పిల్లుట్ల హనుమంతరావు ఆత్మకథ నుంచి) సేకరణః బి.ఎల్.నారాయణ, సాక్షి, తెనాలి -
జైహింద్ స్పెషల్: వలస పాలన సీమ గర్జన
1857లో జరిగిన ప్రథమ స్వాతంత్య్ర పోరాటంతో ఈస్టిండియా కంపెనీ పాలన పోయి భారతదేశం నేరుగా బ్రిటీషు రాణి ఏలుబడిలోకి వచ్చింది. తర్వాత 28 సంవత్సరాలకు బ్రిటీషు పాలనను విభేదించే ఉద్దేశ్యంతో భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పడింది. 1885 డిసెంబరు 28న అప్పటి బొంబాయిలో జరిగిన తొలి సమావేశంలో దేశవ్యాప్తంగా ప్రాతినిధ్యం వహిస్తూ 72 మంది సభ్యులు పాల్గొన్నారు. అలా పాల్గొన్న వారిలో అనంతపురం జిల్లా నుంచి పట్టు కేశవ పిళ్లై ఒకరు. 1860 అక్టోబరు 8న జన్మించిన కేశవ పిళ్లై గుత్తి మునిసిపాలిటి సభ్యుడుగా ఎంపికయి, తర్వాత మద్రాసు లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉపాధ్యక్షుడు కూడా అయ్యారు.ఆయన తన 22 సంవత్సరాల వయసు నుంచి ‘ది హిందూ’ పత్రికకు గుత్తి నుంచి విలేఖరిగా పనిచేసి గుత్తి కేశవ పిళ్లై పేరుగాంచారు. జపాన్‌కు బళ్లారి విద్యార్థి 1891లో నాగపూర్ లో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాల్లో అధ్యక్షులుగా ఎన్నికయిన తిరుపతికి చెందిన పనబాకం ఆనందాచార్యులు 1906 కలకత్తా సమావేశంలో స్వదేశీ తీర్మానం ప్రవేశపెట్టారు. మదనపల్లె వాస్తవ్యులు ఆదిశేషాచలం నాయుడు పూనాలో గోపాల కృష్ణ గోఖలే ప్రారంభించిన సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ సభ్యులయ్యారు. వీరే 1907లో సూరత్ లో జరిగిన కాంగ్రెస్ సమావేశాల్లో ఆహ్వానితులుగా పాల్గొన్నారు. స్వదేశీ ఉద్యమం, వందేమాతరం ఉద్యమం ఉద్ధృతంగా జరిగినపుడు విదేశీ వస్త్రాలు బహిష్కరిస్తూ ఎన్నో సభలు రాయలసీమ ప్రాంతంలో జరిగాయి. నిజానికి అప్పట్లో రాయలసీమ అనే పేరు లేదు. స్థానిక ఉత్పత్తులను విక్రయించే ప్రత్యేకమైన అంగళ్లు జమ్మలమడుగులో మొదలయ్యాయి. దేశవాళీ మగ్గాలు మెరుగుపడటానికి జపాన్ తోడ్పాటు తీసుకోవడానికి ప్రయత్నాలు జరిగాయి. గాజు, గడియారాల తయారీ గురించి నేర్చుకోవడానికి బళ్లారి చెందిన విద్యార్థి శ్యాంజీ రావును జపాన్ పంపారు. దీనికి చాలామంది వ్యక్తులతోపాటు మద్రాసు నేషనల్ ఫండ్ అండ్ ఇండస్టియ్రల్ అసోసియేషన్ కూడా ఎంతో ఆర్థిక సాయం చేసింది. డయ్యర్‌కు గాడిచర్ల ‘బులెట్’ బిపిన్ చంద్రపాల్ రాజమండ్రి వచ్చినప్పుడు, ఆయన ప్రసంగాన్ని గాడిచర్ల హరిసర్వోత్తమరావు తెలుగులోకి అనువదించారు. వీరే రాజమండ్రి ట్రైనింగ్ కళాశాలలో స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్నారనే కారణం మీద బహిష్కరణకు గురైన తొలి విద్యార్థి అయ్యారు. స్వదేశీ ఉద్యమ లక్ష్యాల వ్యాప్తి కోసం తాలూకా స్థాయిలో అసోసియేషన్లు కర్నూలు, ప్రొద్దుటూరు, కడప, వాయల్పాడు, మదనపల్లె వంటి చోట్ల ఏర్పడి వార్తా పత్రికలు చదువుకునే వీలుకల్పించాయి. అనిబిసెంట్ తను మద్రాసులో ప్రారంభించిన దివ్యజ్ఞాన సమాజం ద్వారా 1916లో హోమ్ రూల్ ఉద్యమాన్ని లేవనెత్తారు. ఇందులో ఎంతో క్రియాశీలకంగా వ్యవహరించిన గాడిచర్ల 1919 ఏప్రిల్ 13న జలియన్ వాలాబాగ్ లో జనరల్ డయ్యర్ నిర్వహించిన అమానుష ఘాతుకాన్ని ఖండిస్తూ తన వారపత్రిక ‘ది నేషనలిస్టు’లో ‘ది కల్ట్ ది బుల్లెట్’ అనే గొప్ప వ్యాసం రాశారు. ముల్తాన్ జైలుకు శేషయ్య చెట్టి దండి సత్యాగ్రహం సమయంలో ఢిల్లీలో వైస్రాయ్ నివాసం ముందు సత్యాగ్రహం చేసిన కర్నూలు వ్యక్తి శేషయ్య చెట్టిని అరెస్టు చేసి (ఇప్పటి పాకిస్తాన్లో ఉన్న) ముల్తాన్ జైలుకు పంపారు. అదే కాలంలో ఉప్పునీటి బావుల దగ్గర ప్రభుత్వ ఉత్తర్వులు ధిక్కరిస్తూ రాయలసీమ ప్రాంతంలో నిరసన ప్రయత్నాలు జరిగాయి. అనంతపురం జిల్లాలో చౌడు భూముల్లో ఉప్పు తయారు చేసి, ఆ ఉప్పును వేలం వేసేవారు. పాకాల, తిరుపతి వంటి చోట్ల ఉప్పు తయారుచేయడానికి శిక్షణా తరగతులు నిర్వహించారు. 1930లో గుజరాత్ లోని దర్శన్ డిపో మీద దాడి చేసిన వారిలో అనంతపురం జిల్లా వాసి అయిన వాలంటీర్ కూడా ఉన్నారు. గాంధీజీ అనంతపురం జిల్లా పర్యటనకు అప్పటి జిల్లా కలెక్టర్ గెల్లిట్టి సతీసమేతంగా సరిహద్దు దాకా వెళ్లి ఆహ్వానించడమే కాక లాంఛనంగా ఒక రూపాయి విరాళం ఇవ్వడం చాలా పెద్ద విశేషం! ఇలాంటి ఎన్నో సంగతులు కె. మద్దయ్య రచించిన ‘ఫ్రీడమ్ మూవ్ మెంట్ ఇన్ రాయలసీమ’ పుస్తకంలో కనబడతాయి. పికెట్లు, టికెట్లెస్ ట్రావెళ్లు 1938లో మదనపల్లిలో జరిగిన ‘రాజకీయ ఆర్థిక పాఠశాల’.. సామ్రాజ్యవాదానికి, పెట్టుబడికి వ్యతిరేకంగా సామ్యవాదపు ఆలోచనలు విస్తరించడానికి దోహదపడింది. ఇలాంటి పాఠశాలల్ని కర్నూలు ప్రాంతంలో కాల్వబుగ్గ, ఇంకా అనంతపురం జిల్లాలో హిందూపురం వద్ద కూడా నిర్వహించారు. 1942 క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో లాయర్లు, విద్యార్థులు పికెటింగ్ భారీ ఎత్తున చేశారు. టికెట్లెస్ ట్రావెల్.. రైళ్లలో ఆ కాలంలోనే మొదలైంది. నగరి ఆర్డినెన్స్ కేసు, అనంతపురం ఆర్ట్స్ కళాశాల కెమిస్ట్రీ ల్యాబ్ తగులబట్టడం, గగన్ మహల్ ధ్వంసం వంటి సంఘటనలు కూడా జరిగాయి. అలాగే గాంధీ – జిన్నాల మధ్య చర్యలు విజయవంతం కావాలని మదనపల్లెలో రంజాన్ 27వ రోజున మసీదులలో ప్రార్థనలు జరిగాయి. ఇలా భారత స్వాతంత్య్ర పోరాటంలో రాయలసీమ ప్రాంతపు వ్యక్తులు, సంస్థలు పోరాడి వేకువ చుక్కలుగా స్ఫూర్తినిచ్చారు, చైతన్యం నింపారు! – డా. నాగసూరి వేణుగోపాల్ ఆకాశవాణి పూర్వ సంచాలకులు -
జైహింద్ స్పెషల్: నడిచింది ముళ్ల దారి.. ఎంచుకుంది ఏరికోరి!
యంగ్ ఇండియన్ కపుల్. అమెరికా వెళ్లిపోవాలని అనుకున్నారు. ఇంతలో ఫ్రీడమ్ ఫైట్. ‘నేనిక్కడే ఉంటాను’ అంది భార్య. ‘నేనెళ్తున్నా మరి..’ అన్నాడు భర్త. ఆమె ఒంటరి పోరాటం మొదలైంది. ఆ పోరాటం తనకోసం కాదు. తన మాతృభూమి కోసం. స్వాతంత్య్రోద్యమానికి తనూ ఒక ఆయుధం అయింది. ఆమె.. గులాబ్ కౌర్. ఆమె నడిచింది ముళ్ల దారి ఎంచుకుంది ఏరికోరి! భారత స్వాతంత్య్ర చరిత్ర అంటే కేవలం గొప్ప నాయకుల విశేషాలే కాదు! ‘నేను సైతం’ అంటూ సామాన్యులనేకులు స్వేచ్ఛ కోసం పోరాడారు. కులాలు, మతాలు, జాతుల భేదాల్లేకుండా అనేకమంది వీరోచిత పోరాటం చేయడం వల్లనే నేటి భారతం స్వేచ్ఛా వాయువులు పీలుస్తోంది. అలాంటి ప్రచ్ఛన్న వీరులలో ఒకరు బీబీ గులాబ్ కౌర్. స్వాతంత్య్రోద్యమంలో పురుషులకు తీసిపోకుండా పోరాడిన ప్రసిద్ధ మహిళా యోధుల గురించి అందరికీ తెలుసు, కానీ సాయుధ పోరాటంలో మాత్రం చాలా కొద్దిమంది స్త్రీలు పురుషులతో సమానంగా పాలుపంచుకున్నారు. ఆ వీరరత్నాల్లో గులాబ్ ముందంజలో ఉంటారు. దేశ స్వాతంత్య్రం కోసం వ్యక్తిగత జీవితాన్ని సైతం త్యాగం చేసిన ఆమె చరిత్ర ఆదర్శప్రాయం. గులాబ్ కౌర్ 1890లో పంజాబ్‌లోని బక్షివాలా గ్రామంలో జన్మించారు. చాలా చిన్నవయసులోనే ఆమెకు మాన్ సింగ్‌తో వివాహమైంది. వివాహానంతరం అమెరికా వెళ్లి స్థిరపడాలని ఆ దంపతులు కలలు కన్నారు. కానీ పరిస్థితులు అనుకూలించకపోవడంతో ముందు వీరు ఫిలిప్పీన్స్‌లోని మనీలా నగరానికి పయనమయ్యారు. జర్నలిస్టులా నటిస్తూ..! మనీలాలో జీవిస్తున్న కాలంలో గులాబ్ పలుమార్లు గదర్ పార్టీ సమావేశాలకు హాజరయ్యారు. బ్రిటీష్ పాలన నుంచి భారత్‌కు విముక్తిని సాధించడం కోసం పంజాబీ సిక్కులు ఈ సంస్థను నెలకొల్పారు. అప్పట్లో మనీలాలో గదర్ పార్టీ తరఫున బాబా హఫీజ్ అబ్దుల్లా, బాబా బంతా సింగ్, బాబా హర్నామ్ సింగ్ నాయకులుగా వ్యవహరించేవారు. గులాబ్ కౌర్‌పై వీరి ప్రభావం ఎంతో ఉంది. 1913–14లో ఈ పార్టీ భారతీయుల విముక్తి కోసం విదేశాల్లో గదర్ మూవ్‌మెంట్‌ను ఆరంభించింది. అమెరికా, కెనడా, ఫిలిప్పీ¯Œ ్స, హాంకాంగ్, సింగపూర్ తదితర దేశాల్లో పలువురు భారతీయులు నివసించేవారు. వీరిలో స్వాతంత్య్ర కాంక్షను రగిల్చేందుకు గదర్ మూవ్మెంట్ ప్రయత్నించింది. గదర్ పార్టీ తరఫున గులాబ్ కౌర్ కూడా పలు కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. మనీలాలో సంచరించేందుకు ఆమె జర్నలిస్టులా నటించారు. చేతిలో ప్రెస్ పాస్ తో జర్నలిస్ట్ గా నటిస్తూ, ఆమె గదర్ పార్టీ సభ్యులకు ఆయుధాలు పంపిణీ చేసేవారు. స్వాతంత్య్రోద్యమ సాహిత్యాన్ని పంపిణీ చేయడం, ఓడల్లో భారతీయ ప్రయాణీకులకు స్ఫూర్తిదాయక ప్రసంగాలు చేయడంతో పాటు గదర్ పార్టీలో చేరమని గులాబ్ కౌర్ ఎంతోమందిని ప్రోత్సహించారు. జైలు నుంచీ పోరాటం..! స్వాతంత్య్ర పోరాటాన్ని స్వదేశంలో కొనసాగించే ఉద్దేశంతో గులాబ్‌తోపాటు 50మంది వరకు పార్టీ సభ్యులు ఎస్ఎస్ కొరియా బాచ్ నౌకలో ఇండియాకు బయలుదేరారు. భారత్ వచ్చాక హోషియార్పూర్, జలంధర్, కపుర్తలా తదితర జిల్లాల గ్రామాల్లో ఆమె విస్తృతంగా పర్యటించారు. చాలామందిని సాయుధ పోరాటం దిశగా నడిపించారు. గులాబ్ ప్రయత్నాలు గమనించిన బ్రిటీష్ ప్రభుత్వం ఆమెను లాహోర్ షాహి కిలాలో అరెస్టు చేసింది. అయితే ఈ అరెస్టులకు భయపడని గులాబ్ జైలు నుంచి తన కార్యక్రమాలను కొనసాగించారు. ఈ నేపథ్యంలో అమెరికా కలను కూడా ఆమె వదులుకున్నారు. గులాబ్‌ను వదిలి మా¯Œ సింగ్ ఒక్కరే అమెరికా పయనమయ్యారు. అయినా బాధపడని ఆమె స్వతంత్ర పోరాటం కొనసాగించారు. కానీ జైల్లో బ్రిటీషర్ల హింస కారణంగా ఆమె ఆరోగ్యం దెబ్బతిని చివరకు తన యాభై ఏళ్ల వయసులో 1941లో కన్నుమూశారు. – దుర్గరాజు శాయి ప్రమోద్ -
మహోజ్వల భారతి: కృష్ణారావు.. కృష్ణాపత్రిక.. కృష్ణాజిల్లా
కృష్ణారావు గారు రాతలో విశ్వరూపం చూపేవారు. మాటలో మాత్రం విదూషకుడి విన్యాసాలు చూపేవారు. కానీ ఆ హాస్యం వెనుక చెప్పలేనంత విషాదం ఉంది. కృష్ణారావుగారు పుట్టిన కొన్ని రోజులకే తల్లి చనిపోయారు. అందుకే అడపా దడపా తాను మాతృ హంతకుడినని అనుకుంటూ దీర్ఘ విచారంలో మునిగిపోయేవారు. ఆరో ఏట తండ్రి ఈ లోకాన్ని వీడారు. పినతండ్రి ఇంట పెరిగారాయన. పుట్టింది దివిసీమ ప్రాంతంలోని ముట్నూరు. కృష్ణారావు గారిపై బ్రహ్మసమాజం ప్రభావం ఉండేది. మచిలీపట్నంలో చదువుకునేటప్పుడు రఘుపతి వెంకటరత్నం నాయుడు ఆయనకు గురువుగా ఉండేవారు. కృష్ణారావు గారికి ఇద్దరు కూతుళ్లు. ఒక కొడుకు. వారిలో ఒక కూతురు, ఒక్కగానొక్క కొడుకు, అల్లుడు కూడా ఆయన కళ్ల ముందే తనువు చాలించారు. చదవండి: స్వతంత్ర భారతి... భారత్–పాక్ యుద్ధం అయినా ఆయన స్వాతంత్యోద్య్రమానికి, పత్రికా రచనకు దూరం కాలేదు. చిత్రం, ఆ హాస్య ధోరణి కూడా తుదికంటా వెన్నంటే ఉంది. కృష్ణారావుగారి చివరి దశలో ఆస్పత్రిలో ఉన్నారు. ఆయన ఆస్పత్రిలో చేరిన వెంటనే భార్య వచ్చారు. అంత్యకాలాన్ని ఆయన ఎంతో మామూలు విషయంగా తీసుకున్నారు. పాపం, ఆ ఇల్లాలు దుఃఖం ఆపుకోలేక గొల్లుమన్నారు. కృష్ణాపత్రిక స్వాతంత్య్ర ఉద్యమకాలంలో, వలస పాలన తెచ్చిన చీకటియుగంలో ఒక కంచు కాగడా అయింది. కానీ చాలామంది భావిస్తున్నట్టు కృష్ణాపత్రిక కృష్ణారావు గారి పేరు మీద నెలకొల్పినది కాదు. అది ఆవిర్భవించే నాటికి కృష్ణారావు గారు ఆ పత్రికలో లేరు. ఇంకా చెప్పాలంటే కృష్ణానది పేరు మీద ఆ పత్రిక ఆవిర్భవించిందని చెప్పాలి. పత్రిక నెలకొల్పే సమయంలో ఉంటే తాను ‘కృష్ణవేణి’ అని నామకరణం చేయించి ఉండేవాడినని కృష్ణారావు అనేవారట. భారతదేశం పునరుజ్జీవనోద్యమం వైపు అడుగులు వేయడం నేరుస్తున్న సమయంలో, స్వాతంత్యోద్య్రమం రూపు కడుతున్న తరుణంలో 20వ శతాబ్దానికి కాస్త ముందు, అంటే 1892లో మచిలీపట్నంలో కృష్ణా జిల్లా సంఘం ఏర్పడింది. అయితే అది ఇప్పటి కృష్ణా జిల్లా కాదు. మొత్తం గుంటూరు ప్రాంతం కూడా కలసి ఉండేది. ఈ మొత్తం ప్రాంతం అభివృద్ధికీ, రాజకీయ చైతన్యానికీ పాటు పడడమే ఆ సంస్థ ఉద్దేశం. ఇందులో సభ్యులు కొండా వెంకటప్పయ్య తదితరులకు వచ్చిన ఆలోచనే కృష్ణాపత్రిక స్థాపన. వెంకటప్పయ్యగారు న్యాయవాది. మరొక న్యాయవాదీ, కవీ దాసు నారాయణరావుతో కలసి ఇలాంటి నిర్ణయానికి వచ్చారాయన. ఈ ప్రాంతంలో ఒక్క తెలుగు పత్రిక కూడా లేకపోవడం వారిని ఇలాంటి చరిత్రాత్మక నిర్ణయం తీసుకునేటట్టు చేసింది. పైగా రాజకీయ చైతన్యం రేకెత్తించే ధ్యేయంతో పత్రికలు ప్రారంభమవుతున్న కాలం కూడా అదే. వెంకటప్పయ్య, దాసు నారాయణరావు మొత్తానికి అనేక ఇక్కట్ల మధ్య కృష్ణాపత్రికను పక్షపత్రికగా ఫిబ్రవరి 1, 1902న ఆరంభించారు (తరువాత వారపత్రిక అయింది). అంతలోనే దాసు హఠాన్మరణం పాలయ్యారు. ఈ పత్రిక ఆనాడే తీవ్రవాద లక్షణాలు కలిగిన పత్రికగా ముద్ర పడిందని వెంకటప్పయ్య తన జీవిత చరిత్రలో రాసుకున్నారు. ఒక ఏడాది తరువాత కృష్ణారావు గారు సహాయ సంపాదకులుగా చేరారు. (ముట్నూరి కృష్ణారావునేడు వర్ధంతి) – డా. గోపరాజు -
అబ్బురం కన్నెగంటి సమరం
‘కన్నెగంటి హనుమంతు వెన్నులోని బాకూ వెన్నుతట్టి నడవమంది కడ విజయం వరకూ’ అల్లూరి సీతారామరాజు చిత్రంలోని ప్రారంభ గీతంలోని ఓ చరణం ఇది. ఎంతో మంది విప్లవకారులను స్వాతంత్య్రోద్య మంలో వెన్నుతట్టి నడిపిన స్ఫూర్తి కన్నెగంటి హనుమంతు. శరీరంలోకి 24 గుండ్లు దూసుకెళ్లిన తరువాత కూడా సుమారు రెండు గంటలపాటు మాతృమూర్తి దాస్య శృంఖలాలను తెంచ డానికి బ్రిటిష్ సైన్యంతో పోరాడిన ధీరుడు కన్నెగంటి హను మంతు. సుమారు ఓ దశాబ్దంన్నర క్రితం పుల్లరి (పన్ను) చెల్లింపు నకు వ్యతిరేకించే నేపథ్యంలో వచ్చిన స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తి ప్రదాయక చిత్రం ‘లగాన్’కు భారతీయులు హృదయాల్ని అర్పిం చారు. అదంతా వారి నరనరాల్లో జీర్ణించుకుపోయిన దేశభక్తి మరో సారి వెల్లువలా పెల్లుబికిన వైనం. అలాంటి స్ఫూర్తికి ప్రతీకగా నిలి చిన ఓ తెలుగు వాడు కన్నెగంటి హనుమంతు. పుల్లరి చెల్లింపును ధిక్కరిస్తూ బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం నడిపిన నాయకుడు. కన్నెగంటి హనుమంతుకి జన్మనిచ్చింది మించాలపాడు అనే ఓ కుగ్రామం. గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలోని దుర్గికి సమీపంలోని కోలెకుట్ట శివారు ప్రాంతమే మించాలపాడు. అది 1920వ సంవత్సరం ప్రాంతం. దేశమంతా గాంధీగారి పిలుపుతో సహాయ నిరాకరణోద్యమంలో చురుగ్గా పాల్గొంటోంది. 1921లో విజయవాడలో జరిగిన కాంగ్రెస్ సమావేశంలోని నాయకుల పిలు పునందుకొని ఆంధ్రదేశం కూడా సహాయ నిరాకరణోద్యమంలోకి దూకింది. సహాయ నిరాకరణోద్యమంలో పన్నుల నిరాకరణ ఓ భాగం. గుంటూరు జిల్లాలో ఉన్నవ లక్ష్మీనారాయణగారు దీనికి నాయకులు. పల్నాడు ప్రాంతంలోని మాచర్ల, వెల్దుర్తి, జట్టిపాలెం, రెంటచింతల వంటి ప్రాంతాల్లో ప్రజాజీవనం ఆ ప్రాంతపు అడవులతో ముడిపడి ఉంది. 1921 సంవత్సరం ప్రాంతంలో పల్నాడులో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయి. పరాయి పాలనలో సామాన్య ప్రజలకు కూడు, గుడ్డ వంటి కనీసావసరాల మాట దేవుడెరుగు కనీసం పశువులకు గ్రాసం, గ్రామ జీవి తంలో భాగమైన కట్టెలు కొట్టుకోవడం, ఆకూ అలమూ పోగుచేసుకోవడం వంటి వాటికి సైతం బ్రిటిష్ ప్రభుత్వం ప్రజలపై ఆంక్షలు విధించింది. అడవిలో పశువుల్ని మేపుకోవడానికీ, కట్టెలు కొట్టుకోవడానికీ ప్రజలు బ్రిటిష్ ప్రభుత్వానికి పుల్లరి చెల్లించాలనే నిబంధన విధిం చింది. దరిమిలా ప్రభుత్వాధికారులు మేతకు వచ్చిన పశువుల్ని బందెలదొడ్డికి తోలడం, ప్రజలు వాటిని విడిపించు కోవడానికి నానా అవస్థలూ పడటం పరిపాటి అయింది. ఈ క్రమంలో ప్రజలను సంఘటిత పరచి ప్రభుత్వంపై పోరాటం చేయడానికి నాయకత్వం వహించాడు కన్నెగంటి. ప్రభుత్వానికి ప్రజలు పుల్లరి చెల్లించరాదనే ఉద్యమాన్ని లేవదీశాడు. ప్రజలు పుల్లరి కట్టడం మానేశారు. పెపైచ్చు ప్రజలు కన్నెగంటి నాయకత్వంలో అటవీ అధికారులను, రెవెన్యూ అధికారులనూ సాంఘిక బహిష్కారానికి గురిచేశారు. దీన్ని అణచివేయడానికి బ్రిటిష్ ప్రభుత్వం కుట్ర పన్నింది. అది 1922వ సంవత్సరం, ఫిబ్రవరి 22వ తారీఖు ఆదివారం. అమావాస్య మిట్ట మధ్యాహ్నం పన్నెండు గంటలు. భారత స్వాతంత్య్రోద్యమ చరిత్రలో ఓ దుర్దినం. మరో బ్రిటిష్ దౌష్ట్యం రూపుదిద్దుకోబోతున్న వేళ. గుంటూరు జిల్లా కలెక్టర్ వార్నరు పల్నాడు గ్రామం చేరుకున్నాడు. దుర్గి సబ్ ఇన్స్పెక్టర్ రాఘవయ్య నాయుడిని పిలిచాడు. అతనికి తోడు మరికొంత మంది సైన్యాన్ని ఇచ్చాడు. పుల్లరి కట్టని మించాలపాడు గ్రామస్తుల పశువులను నిర్బంధించవలసిందిగా ఆదేశించాడు. అంతే.. బ్రిటిష్ సైన్యం మించాలపాడు గ్రామంపై విరుచుకు పడింది. పశువుల్ని నిర్బంధించడం మొదలు పెట్టింది. కన్నెగంటి నాయకత్వంలో గ్రామస్తులంతా తిరగబడ్డారు. సుమారు రెండు నుంచి మూడు వందల మంది గ్రామీణ స్త్రీలు, పురుషులు ఈ తిరుగుబాటులో పాల్గొన్నారు. బ్రిటిష్ సైన్యం ప్రజలపై దమనకాండ జరిపింది. ఈ పోరాటంలో తుది వరకూ పోరాడిన కన్నెగంటి పోలీసుల తూటాలకు నేలకొరిగాడు. ఈ యోధుడితో పాటు మరో ఇద్దరు పోలీసులు ఆ దమనకాండలో ప్రాణాలు పోగొట్టుకున్నారు. పల్నాటి పుల్లరి సత్యాగ్రహంలో వీరమరణం పొందిన కన్నెగంటి త్యాగాన్ని జాతీయ కాంగ్రెస్ సంఘం గుర్తించింది. బ్రిటిష్ అధికారుల పట్ల పల్నాటి ప్రజలు అనుసరించిన సాంఘిక బహిష్కరణ విధానం తక్కిన దేశానికంతటికీ దారిచూపింది. హనుమంతు త్యాగనిరతిని శ్లాఘిస్తూ మించాలపాడు గ్రామ ప్రజలు అతని సమాధిపై ఏర్పాటు చేసిన శిలాశాసనం నేటికీ ఆ వీరుని పోరాట స్ఫూర్తికి మౌన సాక్షిగా నిలుస్తుంది. (నేడు కన్నెగంటి హనుమంతు 92వ వర్ధంతి సందర్భంగా...) డా॥అడబాల అప్పారావు కేంద్రీయ విశ్వవిద్యాలయం, హైదరాబాద్. మొబైల్:9494868936