జైహింద్‌ స్పెషల్‌: మీ డబ్బొద్దు.. మీరు కావాలి | Azadi Ka Amrit Mahotsav: Indian Freedom Fighter Chittaranjan Dass | Sakshi
Sakshi News home page

జైహింద్‌ స్పెషల్‌: మీ డబ్బొద్దు.. మీరు కావాలి

Published Sat, Aug 13 2022 12:18 PM | Last Updated on Sat, Aug 13 2022 12:18 PM

Azadi Ka Amrit Mahotsav: Indian Freedom Fighter Chittaranjan Dass - Sakshi

డార్జిలింగ్‌లోని కక్‌ఝోరా సమీపంలో హిల్‌ కార్డ్‌ రోడ్‌పై గాంధీజీ, అనిబిసెంట్‌ తదితరులతో చిత్తరంజన్‌దాస్‌ (గాంధీజీ వెనుక చేతిలో వాకింగ్‌ స్టిక్‌తో)

‘‘మీరు ప్రాక్టీస్‌ మానేసి కాంగ్రెస్‌లో చేరాలి’’.. గాంధీజీ అభ్యర్ధన! ‘‘నా సంపాదన యావత్తూ కాంగ్రెస్‌ ప్రచారం కోసం పూర్తిగా ఇచ్చేస్తాను.. నన్ను వదిలిపెట్టండి’’ .. చిత్తరంజన్‌దాస్‌ వేడికోలు..! సహాయ నిరాకరణోద్యమాన్ని ప్రారంభించిన గాంధీజీ కలకత్తా వెళ్లినపుడు అక్కడి ప్రముఖ న్యాయవాది అయిన చిత్తరంజన్‌దాస్‌ ఇంట్లో బస చేశారు. కాంగ్రెస్‌లో చేరమంటూ ప్రతిరోజూ గాంధీజీ అడగటం, వదిలేయమంటూ దాస్‌ ప్రాధేయపడటం జరుగుతుండేది. న్యాయవాది అయిన చిత్తరంజన్‌ దాస్‌ సంపాదన నెలకు రూ.50 వేలుండేది. ఆరోజుల్లో థూమ్రాన్‌ కేసు జరుగు తోంది. అంటే మొదటి ప్రపంచ యుద్ధానికి సంబంధించిన కాంట్రాక్టు తగాదాల వ్యవహారం.
చదవండి: విక్టోరియా స్మారక చిహ్నం పై డ్రోన్‌ల కలకలం...

తమ తరపును వాదించటానికి ప్రభుత్వం చిత్తరంజన్‌దాస్‌ను రూ.3 లక్షల ఫీజు చెల్లించే ఒప్పందంతో న్యాయవాదిగా నియమించుకుంది. ‘‘ఈ ఫీజు మొత్తాన్ని కాంగ్రెస్‌కు సమర్పించు కుంటాను.. నన్ను వదిలిపెట్టారంటే కాంగ్రెస్‌కు ఎంతో లాభం కలుగుతుంది..’’ అని చిత్తరంజన్‌ దాస్‌ ఎన్నో విధాలా గాంధీజీకి నచ్చజెప్పచూశాడు. గాంధీజీ మాత్రం ఒక్కటే చెప్పారు. ‘‘ మీ ధనంతో నాకు నిమిత్తం లేదు.. నాకు కావలసింది మీరు..’’  అని స్పష్టంగా చెప్పారు. ఆ మాటల్లో ఏ సమ్మోహనశక్తి ఉందో గానీ దాస్‌ మాత్రం ఎదురుమాట లేకుండా లొంగిపోయారు.

చిత్తరంజన్‌దాస్‌ మహామేధావి. ఆలీపూర్‌ బాంబు కేసుతో ఆయన ప్రజ్ఞావిశేషాలు దేశమంతటా తెలిశాయి. జాతీయోద్యమంతో సహా వంగ దేశంలో ఆ రోజుల్లో తలెత్తిన ప్రతి విప్లవోద్యమానికి దాస్‌ ధన సహాయం తప్పనిసరి. ఎప్పుడో తన తండ్రి బాకీలు చేసి దివాలా తీస్తే, తనకు సంబంధం లేకున్నా, బాకీదారులను పిలిచి దమ్మిడీతో సహా లెక్కగట్టి చెల్లించిన దొడ్డమనిషిగా గుర్తింపు ఉంది. నెలకోసారి బీదాబిక్కీకి పిండివంటలతో అన్నదానం చేయటం ఆయనకు ఆలవాటు.

కలకత్తా పట్టణంలో ఆయన ధనసాయం పొందని బీద విద్యార్థి అంటూ లేరు. ప్రతి విప్లవోద్యమం వెనుక ఆయన దాతృత్వం ఉందని ప్రభుత్వానికి స్పష్టంగా తెలిసినా, ఆయనపై చర్యకు సర్కారు గడగడ వణికేది. గాంధీజీకి ఈ విషయాలు తెలుసు కనుకనే కాంగ్రెస్‌ ఉద్యమానికి దాస్‌ ధనం కంటే దాస్‌ ఒక్కడే ఎక్కువ ఉపయోగపడతాడని గ్రహించి ఆయన్నే కోరుకున్నారు. పట్టుబట్టి స్వాతంత్య్ర ఉద్యమంలో భాగస్వామిని చేశారు.
(పిల్లుట్ల హనుమంతరావు ఆత్మకథ నుంచి)
సేకరణః బి.ఎల్‌.నారాయణ, సాక్షి, తెనాలి 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement