Gadicherla Harisarvottama Rao, Pattu Kesava Pillai, Panabakam Anandacharyalu Life History In Telugu - Sakshi
Sakshi News home page

జైహింద్‌ స్పెషల్‌: వలస పాలన సీమ గర్జన

Published Tue, Jul 12 2022 1:57 PM | Last Updated on Tue, Jul 12 2022 3:39 PM

Indian Freedom Fight Pattu Kesava Pillai Panabakam Anandacharyalu Gadicharla Harisarvottama Rao - Sakshi

భారతదేశ చిట్టచివరి వైశ్రాయ్‌ లార్డ్‌ మౌంట్‌బాటెన్, ఆయన సతీమణి లేడీ ఎడ్వీనా ఢిల్లీలోని వైస్‌రీగల్‌ భవనానికి అధికార వాహనంపై వెళుతున్నప్పటి చిత్రం (1947 మార్చి 22); ఫొటో : ఎ.పి.

1857లో జరిగిన ప్రథమ స్వాతంత్య్ర పోరాటంతో ఈస్టిండియా కంపెనీ పాలన పోయి భారతదేశం నేరుగా బ్రిటీషు రాణి ఏలుబడిలోకి వచ్చింది. తర్వాత 28 సంవత్సరాలకు బ్రిటీషు పాలనను విభేదించే ఉద్దేశ్యంతో భారత జాతీయ కాంగ్రెస్‌ ఏర్పడింది. 1885 డిసెంబరు 28న అప్పటి బొంబాయిలో జరిగిన తొలి సమావేశంలో దేశవ్యాప్తంగా ప్రాతినిధ్యం వహిస్తూ 72 మంది సభ్యులు పాల్గొన్నారు. అలా పాల్గొన్న వారిలో అనంతపురం జిల్లా నుంచి పట్టు కేశవ పిళ్లై ఒకరు. 1860 అక్టోబరు 8న జన్మించిన కేశవ పిళ్లై గుత్తి మునిసిపాలిటి సభ్యుడుగా ఎంపికయి, తర్వాత మద్రాసు లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌ ఉపాధ్యక్షుడు కూడా అయ్యారు.ఆయన తన 22 సంవత్సరాల వయసు నుంచి ‘ది హిందూ’ పత్రికకు గుత్తి నుంచి విలేఖరిగా పనిచేసి గుత్తి కేశవ పిళ్లై పేరుగాంచారు. 

జపాన్‌కు బళ్లారి విద్యార్థి
1891లో నాగపూర్‌ లో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్‌ సమావేశాల్లో అధ్యక్షులుగా ఎన్నికయిన తిరుపతికి చెందిన పనబాకం ఆనందాచార్యులు 1906 కలకత్తా సమావేశంలో స్వదేశీ తీర్మానం ప్రవేశపెట్టారు. మదనపల్లె వాస్తవ్యులు ఆదిశేషాచలం నాయుడు పూనాలో గోపాల కృష్ణ గోఖలే ప్రారంభించిన సర్వెంట్స్‌ ఆఫ్‌ ఇండియా సొసైటీ సభ్యులయ్యారు. వీరే 1907లో సూరత్‌ లో జరిగిన కాంగ్రెస్‌ సమావేశాల్లో ఆహ్వానితులుగా పాల్గొన్నారు. స్వదేశీ ఉద్యమం, వందేమాతరం ఉద్యమం ఉద్ధృతంగా జరిగినపుడు విదేశీ వస్త్రాలు బహిష్కరిస్తూ ఎన్నో సభలు రాయలసీమ ప్రాంతంలో జరిగాయి. నిజానికి అప్పట్లో రాయలసీమ అనే పేరు లేదు.  స్థానిక ఉత్పత్తులను విక్రయించే ప్రత్యేకమైన అంగళ్లు జమ్మలమడుగులో మొదలయ్యాయి. దేశవాళీ మగ్గాలు మెరుగుపడటానికి జపాన్‌ తోడ్పాటు తీసుకోవడానికి ప్రయత్నాలు జరిగాయి. గాజు, గడియారాల తయారీ గురించి నేర్చుకోవడానికి బళ్లారి చెందిన విద్యార్థి శ్యాంజీ రావును జపాన్‌ పంపారు. దీనికి చాలామంది వ్యక్తులతోపాటు మద్రాసు నేషనల్‌ ఫండ్‌ అండ్‌ ఇండస్టియ్రల్‌ అసోసియేషన్‌ కూడా ఎంతో ఆర్థిక సాయం చేసింది. 

డయ్యర్‌కు గాడిచర్ల ‘బులెట్‌’
బిపిన్‌ చంద్రపాల్‌ రాజమండ్రి వచ్చినప్పుడు, ఆయన ప్రసంగాన్ని గాడిచర్ల హరిసర్వోత్తమరావు తెలుగులోకి అనువదించారు. వీరే రాజమండ్రి ట్రైనింగ్‌ కళాశాలలో స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్నారనే కారణం మీద బహిష్కరణకు గురైన తొలి విద్యార్థి అయ్యారు. స్వదేశీ ఉద్యమ లక్ష్యాల వ్యాప్తి కోసం తాలూకా స్థాయిలో అసోసియేషన్లు కర్నూలు, ప్రొద్దుటూరు, కడప, వాయల్పాడు, మదనపల్లె వంటి చోట్ల ఏర్పడి వార్తా పత్రికలు చదువుకునే వీలుకల్పించాయి. అనిబిసెంట్‌ తను మద్రాసులో ప్రారంభించిన దివ్యజ్ఞాన సమాజం ద్వారా 1916లో హోమ్‌ రూల్‌ ఉద్యమాన్ని లేవనెత్తారు. ఇందులో ఎంతో క్రియాశీలకంగా వ్యవహరించిన గాడిచర్ల 1919 ఏప్రిల్‌ 13న జలియన్‌ వాలాబాగ్‌ లో జనరల్‌ డయ్యర్‌ నిర్వహించిన అమానుష ఘాతుకాన్ని ఖండిస్తూ తన వారపత్రిక ‘ది నేషనలిస్టు’లో ‘ది కల్ట్‌ ది బుల్లెట్‌’ అనే గొప్ప వ్యాసం రాశారు. 

ముల్తాన్‌ జైలుకు శేషయ్య చెట్టి
దండి సత్యాగ్రహం సమయంలో ఢిల్లీలో వైస్రాయ్‌ నివాసం ముందు సత్యాగ్రహం చేసిన కర్నూలు వ్యక్తి శేషయ్య చెట్టిని అరెస్టు చేసి (ఇప్పటి పాకిస్తాన్‌లో ఉన్న) ముల్తాన్‌ జైలుకు పంపారు. అదే కాలంలో ఉప్పునీటి బావుల దగ్గర ప్రభుత్వ ఉత్తర్వులు ధిక్కరిస్తూ రాయలసీమ ప్రాంతంలో నిరసన ప్రయత్నాలు జరిగాయి. అనంతపురం జిల్లాలో చౌడు భూముల్లో ఉప్పు తయారు చేసి, ఆ ఉప్పును వేలం వేసేవారు. పాకాల, తిరుపతి వంటి చోట్ల ఉప్పు తయారుచేయడానికి శిక్షణా తరగతులు నిర్వహించారు. 1930లో గుజరాత్‌ లోని దర్శన్‌ డిపో మీద దాడి చేసిన వారిలో అనంతపురం జిల్లా వాసి అయిన వాలంటీర్‌ కూడా ఉన్నారు. గాంధీజీ అనంతపురం జిల్లా పర్యటనకు అప్పటి జిల్లా కలెక్టర్‌ గెల్లిట్టి సతీసమేతంగా సరిహద్దు దాకా వెళ్లి ఆహ్వానించడమే కాక లాంఛనంగా ఒక రూపాయి విరాళం ఇవ్వడం చాలా పెద్ద విశేషం! ఇలాంటి ఎన్నో సంగతులు కె. మద్దయ్య రచించిన ‘ఫ్రీడమ్‌ మూవ్‌ మెంట్‌ ఇన్‌ రాయలసీమ’ పుస్తకంలో కనబడతాయి. 

పికెట్లు, టికెట్లెస్‌ ట్రావెళ్లు 1938లో మదనపల్లిలో జరిగిన ‘రాజకీయ ఆర్థిక పాఠశాల’.. సామ్రాజ్యవాదానికి, పెట్టుబడికి వ్యతిరేకంగా సామ్యవాదపు ఆలోచనలు విస్తరించడానికి దోహదపడింది. ఇలాంటి పాఠశాలల్ని కర్నూలు ప్రాంతంలో కాల్వబుగ్గ, ఇంకా అనంతపురం జిల్లాలో హిందూపురం వద్ద కూడా నిర్వహించారు. 1942 క్విట్‌ ఇండియా ఉద్యమ సమయంలో లాయర్లు,  విద్యార్థులు పికెటింగ్‌ భారీ ఎత్తున చేశారు. టికెట్లెస్‌ ట్రావెల్‌.. రైళ్లలో ఆ కాలంలోనే మొదలైంది. నగరి ఆర్డినెన్స్‌ కేసు, అనంతపురం ఆర్ట్స్‌ కళాశాల కెమిస్ట్రీ ల్యాబ్‌ తగులబట్టడం, గగన్‌ మహల్‌ ధ్వంసం వంటి సంఘటనలు కూడా జరిగాయి. అలాగే గాంధీ – జిన్నాల మధ్య చర్యలు విజయవంతం కావాలని మదనపల్లెలో రంజాన్‌ 27వ రోజున మసీదులలో ప్రార్థనలు జరిగాయి. ఇలా భారత స్వాతంత్య్ర పోరాటంలో రాయలసీమ ప్రాంతపు వ్యక్తులు, సంస్థలు పోరాడి వేకువ చుక్కలుగా స్ఫూర్తినిచ్చారు, చైతన్యం నింపారు!

 – డా. నాగసూరి వేణుగోపాల్‌
 ఆకాశవాణి పూర్వ సంచాలకులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement