indian freedom struggle
-
జైహింద్ స్పెషల్: వలస పాలన సీమ గర్జన
1857లో జరిగిన ప్రథమ స్వాతంత్య్ర పోరాటంతో ఈస్టిండియా కంపెనీ పాలన పోయి భారతదేశం నేరుగా బ్రిటీషు రాణి ఏలుబడిలోకి వచ్చింది. తర్వాత 28 సంవత్సరాలకు బ్రిటీషు పాలనను విభేదించే ఉద్దేశ్యంతో భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పడింది. 1885 డిసెంబరు 28న అప్పటి బొంబాయిలో జరిగిన తొలి సమావేశంలో దేశవ్యాప్తంగా ప్రాతినిధ్యం వహిస్తూ 72 మంది సభ్యులు పాల్గొన్నారు. అలా పాల్గొన్న వారిలో అనంతపురం జిల్లా నుంచి పట్టు కేశవ పిళ్లై ఒకరు. 1860 అక్టోబరు 8న జన్మించిన కేశవ పిళ్లై గుత్తి మునిసిపాలిటి సభ్యుడుగా ఎంపికయి, తర్వాత మద్రాసు లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉపాధ్యక్షుడు కూడా అయ్యారు.ఆయన తన 22 సంవత్సరాల వయసు నుంచి ‘ది హిందూ’ పత్రికకు గుత్తి నుంచి విలేఖరిగా పనిచేసి గుత్తి కేశవ పిళ్లై పేరుగాంచారు. జపాన్‌కు బళ్లారి విద్యార్థి 1891లో నాగపూర్ లో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాల్లో అధ్యక్షులుగా ఎన్నికయిన తిరుపతికి చెందిన పనబాకం ఆనందాచార్యులు 1906 కలకత్తా సమావేశంలో స్వదేశీ తీర్మానం ప్రవేశపెట్టారు. మదనపల్లె వాస్తవ్యులు ఆదిశేషాచలం నాయుడు పూనాలో గోపాల కృష్ణ గోఖలే ప్రారంభించిన సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ సభ్యులయ్యారు. వీరే 1907లో సూరత్ లో జరిగిన కాంగ్రెస్ సమావేశాల్లో ఆహ్వానితులుగా పాల్గొన్నారు. స్వదేశీ ఉద్యమం, వందేమాతరం ఉద్యమం ఉద్ధృతంగా జరిగినపుడు విదేశీ వస్త్రాలు బహిష్కరిస్తూ ఎన్నో సభలు రాయలసీమ ప్రాంతంలో జరిగాయి. నిజానికి అప్పట్లో రాయలసీమ అనే పేరు లేదు. స్థానిక ఉత్పత్తులను విక్రయించే ప్రత్యేకమైన అంగళ్లు జమ్మలమడుగులో మొదలయ్యాయి. దేశవాళీ మగ్గాలు మెరుగుపడటానికి జపాన్ తోడ్పాటు తీసుకోవడానికి ప్రయత్నాలు జరిగాయి. గాజు, గడియారాల తయారీ గురించి నేర్చుకోవడానికి బళ్లారి చెందిన విద్యార్థి శ్యాంజీ రావును జపాన్ పంపారు. దీనికి చాలామంది వ్యక్తులతోపాటు మద్రాసు నేషనల్ ఫండ్ అండ్ ఇండస్టియ్రల్ అసోసియేషన్ కూడా ఎంతో ఆర్థిక సాయం చేసింది. డయ్యర్‌కు గాడిచర్ల ‘బులెట్’ బిపిన్ చంద్రపాల్ రాజమండ్రి వచ్చినప్పుడు, ఆయన ప్రసంగాన్ని గాడిచర్ల హరిసర్వోత్తమరావు తెలుగులోకి అనువదించారు. వీరే రాజమండ్రి ట్రైనింగ్ కళాశాలలో స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్నారనే కారణం మీద బహిష్కరణకు గురైన తొలి విద్యార్థి అయ్యారు. స్వదేశీ ఉద్యమ లక్ష్యాల వ్యాప్తి కోసం తాలూకా స్థాయిలో అసోసియేషన్లు కర్నూలు, ప్రొద్దుటూరు, కడప, వాయల్పాడు, మదనపల్లె వంటి చోట్ల ఏర్పడి వార్తా పత్రికలు చదువుకునే వీలుకల్పించాయి. అనిబిసెంట్ తను మద్రాసులో ప్రారంభించిన దివ్యజ్ఞాన సమాజం ద్వారా 1916లో హోమ్ రూల్ ఉద్యమాన్ని లేవనెత్తారు. ఇందులో ఎంతో క్రియాశీలకంగా వ్యవహరించిన గాడిచర్ల 1919 ఏప్రిల్ 13న జలియన్ వాలాబాగ్ లో జనరల్ డయ్యర్ నిర్వహించిన అమానుష ఘాతుకాన్ని ఖండిస్తూ తన వారపత్రిక ‘ది నేషనలిస్టు’లో ‘ది కల్ట్ ది బుల్లెట్’ అనే గొప్ప వ్యాసం రాశారు. ముల్తాన్ జైలుకు శేషయ్య చెట్టి దండి సత్యాగ్రహం సమయంలో ఢిల్లీలో వైస్రాయ్ నివాసం ముందు సత్యాగ్రహం చేసిన కర్నూలు వ్యక్తి శేషయ్య చెట్టిని అరెస్టు చేసి (ఇప్పటి పాకిస్తాన్లో ఉన్న) ముల్తాన్ జైలుకు పంపారు. అదే కాలంలో ఉప్పునీటి బావుల దగ్గర ప్రభుత్వ ఉత్తర్వులు ధిక్కరిస్తూ రాయలసీమ ప్రాంతంలో నిరసన ప్రయత్నాలు జరిగాయి. అనంతపురం జిల్లాలో చౌడు భూముల్లో ఉప్పు తయారు చేసి, ఆ ఉప్పును వేలం వేసేవారు. పాకాల, తిరుపతి వంటి చోట్ల ఉప్పు తయారుచేయడానికి శిక్షణా తరగతులు నిర్వహించారు. 1930లో గుజరాత్ లోని దర్శన్ డిపో మీద దాడి చేసిన వారిలో అనంతపురం జిల్లా వాసి అయిన వాలంటీర్ కూడా ఉన్నారు. గాంధీజీ అనంతపురం జిల్లా పర్యటనకు అప్పటి జిల్లా కలెక్టర్ గెల్లిట్టి సతీసమేతంగా సరిహద్దు దాకా వెళ్లి ఆహ్వానించడమే కాక లాంఛనంగా ఒక రూపాయి విరాళం ఇవ్వడం చాలా పెద్ద విశేషం! ఇలాంటి ఎన్నో సంగతులు కె. మద్దయ్య రచించిన ‘ఫ్రీడమ్ మూవ్ మెంట్ ఇన్ రాయలసీమ’ పుస్తకంలో కనబడతాయి. పికెట్లు, టికెట్లెస్ ట్రావెళ్లు 1938లో మదనపల్లిలో జరిగిన ‘రాజకీయ ఆర్థిక పాఠశాల’.. సామ్రాజ్యవాదానికి, పెట్టుబడికి వ్యతిరేకంగా సామ్యవాదపు ఆలోచనలు విస్తరించడానికి దోహదపడింది. ఇలాంటి పాఠశాలల్ని కర్నూలు ప్రాంతంలో కాల్వబుగ్గ, ఇంకా అనంతపురం జిల్లాలో హిందూపురం వద్ద కూడా నిర్వహించారు. 1942 క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో లాయర్లు, విద్యార్థులు పికెటింగ్ భారీ ఎత్తున చేశారు. టికెట్లెస్ ట్రావెల్.. రైళ్లలో ఆ కాలంలోనే మొదలైంది. నగరి ఆర్డినెన్స్ కేసు, అనంతపురం ఆర్ట్స్ కళాశాల కెమిస్ట్రీ ల్యాబ్ తగులబట్టడం, గగన్ మహల్ ధ్వంసం వంటి సంఘటనలు కూడా జరిగాయి. అలాగే గాంధీ – జిన్నాల మధ్య చర్యలు విజయవంతం కావాలని మదనపల్లెలో రంజాన్ 27వ రోజున మసీదులలో ప్రార్థనలు జరిగాయి. ఇలా భారత స్వాతంత్య్ర పోరాటంలో రాయలసీమ ప్రాంతపు వ్యక్తులు, సంస్థలు పోరాడి వేకువ చుక్కలుగా స్ఫూర్తినిచ్చారు, చైతన్యం నింపారు! – డా. నాగసూరి వేణుగోపాల్ ఆకాశవాణి పూర్వ సంచాలకులు -
జైహింద్ స్పెషల్: పెన్నులతో గన్నుల పైకి
1870 ప్రాంతం నుంచి భారత పత్రికా రంగం వేళ్లూనుకోవడం మొదలయింది. పత్రికలు కేవలం రాజకీయ చైతన్యం రేకెత్తించడం వరకే పరిమితం కాలేదు. జాతీయ భావాలు నింపడంతోనే బాధ్యత పూర్తయిందని అనుకోలేదు. తొలి దశలో భారతీయ సమాజంలో ఉన్న వివక్ష, అసమానతలు, దురాచారాల నిర్మూలనకు కూడా కృషి చేశాయి. స్వతంత్ర దేశం దిశగా, స్వయం పాలన ఆశయంగా సాగుతున్న ఉద్యమంలో విద్య, ప్రభుత్వ విధానాలు, ఆర్థిక వ్యవస్థ, కుటీర పరిశ్రమలు, సేద్యం వంటి వ్యవస్థల పునర్ నిర్మాణానికి ఆనాటి పత్రికారంగం బాటలు వేసింది. చదవండి: ఎడిటర్‌కి ఎనిమిదేళ్ల జైలు!.. రెండేళ్లకే పేపర్ మూత!! ప్రభుత్వం మీద ప్రజలను రెచ్చగొట్టే రచనలు ప్రచురిస్తే నేర శిక్షాస్మృతి 124ఏ నిబంధన కింద కఠిన శిక్షలు విధించే అవకాశం ఉన్నా చాలా పత్రికలు అందుకు సిద్ధమై పనిచేశాయి. ఇది చాలదన్నట్టు భారతీయ భాషా పత్రికల చట్టం 1878 ని ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఒక్క సమావేశంతోనే హడావుడిగా తెచ్చింది. దీని ప్రకారం పత్రికను అచ్చువేసే ప్రెస్ ఆస్తులను జప్తు చేయవచ్చు. 1881లో దీనిని రిపన్ రద్దు చేశాడు. పత్రికా రచయితగా ప్రభుత్వ ఆగ్రహానికి గురై భారతదేశంలో తొలిసారి జైలుకు వెళ్లిన ఘనత సురేంద్రనాథ్ బెనర్జీకి (ఐపీఐ అవార్డు 2007, ప్రదానోత్సవంలో ఔట్లుక్ పత్రిక సంపాదకుడు వినోద్ మెహతా ఇచ్చిన ఉపన్యాసం) దక్కుతుంది. బ్రిటిష్వాద పత్రికలు! 1900–1947 వరకు కనిపించే దశ ఒకటి. ఈ దశలోనే అతి జాతీయవాద, మితవాద ధోరణులతో సాగిన ఉద్యమం గురించి వార్తాపత్రికలు విశ్లేషించవలసి వచ్చింది. తీవ్ర జాతీయవాదం రంగం మీదకు వచ్చింది. జాతీయవాద పత్రికారంగానికీ, బ్రిటిష్ ఇండియా ప్రభుత్వానికీ మధ్య యుద్ధం కూడా తీవ్రమైంది. బ్రిటిష్ ఇండియాను సమర్థించే పత్రికలు జాతీయవాద పత్రికలను లక్ష్యంగా చేసుకోవడం మరొక వాస్తవం. పత్రికల పాత్ర మరింత సునిశితమైంది. హిందుస్తాన్ టైమ్స్, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ జాతీయవాదం వైపు మళ్లాయి. భారత్ మిత్ర.. కలకత్తా సమాచార్ 1850–1857 మధ్య హిందీలో చాలా పత్రికలు వచ్చాయి. మొదటి ప్రపంచ యుద్ధకాలంలో ఆ సంఖ్య ఇంకా పెరిగింది. ‘భారత్ మిత్ర’, ‘కలకత్తా సమాచార్’ వంటివి అప్పుడే వెలువడినాయి. 1920లో బెనారస్ నుంచి వెలువడిన ‘ఆజ్’ స్వాతంత్య్రోద్యమంలో ప్రముఖ పాత్ర వహించింది. ఆ సంవత్సరమే బాబూ రాజేంద్రప్రసాద్ పట్నా నుంచి ఆరంభించిన ‘దేశ్’ కాంగ్రెస్ వాణిగా పనిచేసింది. ఉర్దూలో ‘మిలాప్’, ‘ప్రతాప్’, ‘తేజ్’ తమ వంతు పాత్రను నిర్వహించాయి.1923లో కేరళలో ఆరంభమైన ‘మాతృభూమి’ కూడా కాంగ్రెస్ అధికార పత్రిక వంటిదే. అంతకు ముందే ఆరంభమైన కేరళ పత్రిక బ్రిటిష్ పాలన మీద విమర్శలు కురిపించేది. తమిళంలో 1917లో ప్రారంభమైన ‘దేశభక్తన్’ పత్రికకు ఎంతో ప్రత్యేకత ఉంది. స్వరాజ్య సమరంలో సిద్ధాంతవేత్తగా పేర్గాంచిన వీవీఎస్ అయ్యర్ దీని సంపాదకుడు. మైసూరు సంస్థానంలో ‘విశ్వ కర్ణాటక’ పత్రిక 1921 నుంచి జాతీయ భావాల వ్యాప్తి కోసం పనిచేసింది. తిలక్ ప్రభావం ఉన్న కొందరు వ్యక్తులు అక్కడ స్థాపించిన పత్రిక ‘జయ కర్ణాటక’. స్వాతంత్య్రోద్యమంలో ఉన్న నాయకులు, కార్యకర్తలనే కాదు, పత్రికా రచయితలను కూడా బ్రిటిష్ ఇండియా ప్రభుత్వం అంతే ద్వేషంతో చూసింది. కఠిన కారాగార శిక్షలు, అండమాన్ ప్రవాసాలు, మాండలే నిర్బంధాలు, జరిమానాలు, జప్తులు పత్రికా రచయితలకు కూడా తప్పలేదు. బాలగంగాధర తిలక్ భారత స్వాతంత్య్ర సమరంలో, ఆనాటి పత్రికా రంగంలో రెండు దశాబ్దాల పాటు ముఖ్య భూమికను పోషించిన యోధుడు బాలగంగాధర తిలక్. స్వాతంత్య్రం నా జన్మహక్కు అని గొప్ప నినాదం ఇచ్చి, పత్రికలకూ, పోరాటానికీ నడుమ ఉన్న తాత్త్విక బంధం నిరూపించారాయన. ప్రభుత్వ వ్యతిరేకతతో తిలక్‌ను మూడు పర్యాయాలు దేశద్రోహం నేరం కింద ప్రభుత్వం విచారించింది. 1897లో ఆయనకు 18 మాసాల శిక్ష పడింది. ర్యాండ్ అనే బ్రిటిష్ అధికారిని చాపేకర్ సోదరులు చంపడాన్ని తిలక్ సమర్థించారు. ర్యాండ్ అప్పుడు ప్లేగ్ బారిన పడిన వారి పట్ల పరమ కర్కోటకంగా వ్యవహరించాడని పేరు. 1908లో ముజఫర్‌నగర్ దగ్గర మేజిస్ట్రేట్ డగ్లస్ కింగ్స్‌ఫోర్డ్ లక్ష్యంగా వాహనం మీద బెంగాలీ యువకులు ప్రఫుల్ల చాకి, ఖుదీరాం బోస్ బాంబు విసరడాన్ని కూడా తిలక్ సమర్థించారు. అంతేకాదు, భారతీయులకు స్వరాజ్యం ఇవ్వాలని తన పత్రికలో రాశారు. వెంటనే ప్రభుత్వం విచారించి ఆరున్నరేళ్ల కారాగారం విధించి, మాండలే జైలుకు పంపింది. 1916లో మరొకసారి దేశద్రోహం కేసుతో తిలక్‌కు శిక్ష విధించింది. గాంధీజీతో మదన్ మోహన్ మలావియా ప్రసిద్ధ జాతీయవాద పత్రిక ‘హిందూస్థాన్ టైమ్’.. 1924లో ప్రారంభమైన కొన్ని నెలలకే బ్రిటిష్ పాలకుల ఒత్తిళ్లకు మనుగడ సాగించలేని స్థితిలో, మూసివేత తప్ప మరో మార్గం లేదనుకున్నప్పుడు మాలావియానే ముందుకొచ్చి 50 వేల రూపాయల విరాళాలు సేకరించి ఆ పత్రికను నిలబెట్టారు. అయ్యర్ మీద కేసు తన పత్రికలను దేశ వ్యతిరేక కార్యకలాపాలను ప్రోత్సహించేందుకు ఉపయోగిస్తున్నారని ‘ది హిందూ’ వ్యవస్థాపకులు సుబ్రహ్మణ్య అయ్యర్ మీద కేసు పెట్టారు. 1908లో ఆయన కారాగారవాసం అనుభవించారు. అమృత్‌బజార్ పత్రిక వ్యవస్థాపకులు శిశిర్‌కుమార్ ఘోష్, మోతీలాల్ ఘోష్‌లను 1897లో దేశద్రోహం కేసు కింద జైలుకు పంపారు. ఆ ఇద్దరు సోదరులు. బాంబే క్రానికల్ ఎడిటర్ బీజీ హార్నిమన్‌ను కూడా బ్రిటిష్ వ్యతిరేకత కారణంగా నిర్బంధించి, బలవంతంగా ఇంగ్లండ్ పంపారు. – డా. గోపరాజు నారాయణరావు, ఎడిటర్, ‘జాగృతి’ -
అబ్బురం కన్నెగంటి సమరం
‘కన్నెగంటి హనుమంతు వెన్నులోని బాకూ వెన్నుతట్టి నడవమంది కడ విజయం వరకూ’ అల్లూరి సీతారామరాజు చిత్రంలోని ప్రారంభ గీతంలోని ఓ చరణం ఇది. ఎంతో మంది విప్లవకారులను స్వాతంత్య్రోద్య మంలో వెన్నుతట్టి నడిపిన స్ఫూర్తి కన్నెగంటి హనుమంతు. శరీరంలోకి 24 గుండ్లు దూసుకెళ్లిన తరువాత కూడా సుమారు రెండు గంటలపాటు మాతృమూర్తి దాస్య శృంఖలాలను తెంచ డానికి బ్రిటిష్ సైన్యంతో పోరాడిన ధీరుడు కన్నెగంటి హను మంతు. సుమారు ఓ దశాబ్దంన్నర క్రితం పుల్లరి (పన్ను) చెల్లింపు నకు వ్యతిరేకించే నేపథ్యంలో వచ్చిన స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తి ప్రదాయక చిత్రం ‘లగాన్’కు భారతీయులు హృదయాల్ని అర్పిం చారు. అదంతా వారి నరనరాల్లో జీర్ణించుకుపోయిన దేశభక్తి మరో సారి వెల్లువలా పెల్లుబికిన వైనం. అలాంటి స్ఫూర్తికి ప్రతీకగా నిలి చిన ఓ తెలుగు వాడు కన్నెగంటి హనుమంతు. పుల్లరి చెల్లింపును ధిక్కరిస్తూ బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం నడిపిన నాయకుడు. కన్నెగంటి హనుమంతుకి జన్మనిచ్చింది మించాలపాడు అనే ఓ కుగ్రామం. గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలోని దుర్గికి సమీపంలోని కోలెకుట్ట శివారు ప్రాంతమే మించాలపాడు. అది 1920వ సంవత్సరం ప్రాంతం. దేశమంతా గాంధీగారి పిలుపుతో సహాయ నిరాకరణోద్యమంలో చురుగ్గా పాల్గొంటోంది. 1921లో విజయవాడలో జరిగిన కాంగ్రెస్ సమావేశంలోని నాయకుల పిలు పునందుకొని ఆంధ్రదేశం కూడా సహాయ నిరాకరణోద్యమంలోకి దూకింది. సహాయ నిరాకరణోద్యమంలో పన్నుల నిరాకరణ ఓ భాగం. గుంటూరు జిల్లాలో ఉన్నవ లక్ష్మీనారాయణగారు దీనికి నాయకులు. పల్నాడు ప్రాంతంలోని మాచర్ల, వెల్దుర్తి, జట్టిపాలెం, రెంటచింతల వంటి ప్రాంతాల్లో ప్రజాజీవనం ఆ ప్రాంతపు అడవులతో ముడిపడి ఉంది. 1921 సంవత్సరం ప్రాంతంలో పల్నాడులో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయి. పరాయి పాలనలో సామాన్య ప్రజలకు కూడు, గుడ్డ వంటి కనీసావసరాల మాట దేవుడెరుగు కనీసం పశువులకు గ్రాసం, గ్రామ జీవి తంలో భాగమైన కట్టెలు కొట్టుకోవడం, ఆకూ అలమూ పోగుచేసుకోవడం వంటి వాటికి సైతం బ్రిటిష్ ప్రభుత్వం ప్రజలపై ఆంక్షలు విధించింది. అడవిలో పశువుల్ని మేపుకోవడానికీ, కట్టెలు కొట్టుకోవడానికీ ప్రజలు బ్రిటిష్ ప్రభుత్వానికి పుల్లరి చెల్లించాలనే నిబంధన విధిం చింది. దరిమిలా ప్రభుత్వాధికారులు మేతకు వచ్చిన పశువుల్ని బందెలదొడ్డికి తోలడం, ప్రజలు వాటిని విడిపించు కోవడానికి నానా అవస్థలూ పడటం పరిపాటి అయింది. ఈ క్రమంలో ప్రజలను సంఘటిత పరచి ప్రభుత్వంపై పోరాటం చేయడానికి నాయకత్వం వహించాడు కన్నెగంటి. ప్రభుత్వానికి ప్రజలు పుల్లరి చెల్లించరాదనే ఉద్యమాన్ని లేవదీశాడు. ప్రజలు పుల్లరి కట్టడం మానేశారు. పెపైచ్చు ప్రజలు కన్నెగంటి నాయకత్వంలో అటవీ అధికారులను, రెవెన్యూ అధికారులనూ సాంఘిక బహిష్కారానికి గురిచేశారు. దీన్ని అణచివేయడానికి బ్రిటిష్ ప్రభుత్వం కుట్ర పన్నింది. అది 1922వ సంవత్సరం, ఫిబ్రవరి 22వ తారీఖు ఆదివారం. అమావాస్య మిట్ట మధ్యాహ్నం పన్నెండు గంటలు. భారత స్వాతంత్య్రోద్యమ చరిత్రలో ఓ దుర్దినం. మరో బ్రిటిష్ దౌష్ట్యం రూపుదిద్దుకోబోతున్న వేళ. గుంటూరు జిల్లా కలెక్టర్ వార్నరు పల్నాడు గ్రామం చేరుకున్నాడు. దుర్గి సబ్ ఇన్స్పెక్టర్ రాఘవయ్య నాయుడిని పిలిచాడు. అతనికి తోడు మరికొంత మంది సైన్యాన్ని ఇచ్చాడు. పుల్లరి కట్టని మించాలపాడు గ్రామస్తుల పశువులను నిర్బంధించవలసిందిగా ఆదేశించాడు. అంతే.. బ్రిటిష్ సైన్యం మించాలపాడు గ్రామంపై విరుచుకు పడింది. పశువుల్ని నిర్బంధించడం మొదలు పెట్టింది. కన్నెగంటి నాయకత్వంలో గ్రామస్తులంతా తిరగబడ్డారు. సుమారు రెండు నుంచి మూడు వందల మంది గ్రామీణ స్త్రీలు, పురుషులు ఈ తిరుగుబాటులో పాల్గొన్నారు. బ్రిటిష్ సైన్యం ప్రజలపై దమనకాండ జరిపింది. ఈ పోరాటంలో తుది వరకూ పోరాడిన కన్నెగంటి పోలీసుల తూటాలకు నేలకొరిగాడు. ఈ యోధుడితో పాటు మరో ఇద్దరు పోలీసులు ఆ దమనకాండలో ప్రాణాలు పోగొట్టుకున్నారు. పల్నాటి పుల్లరి సత్యాగ్రహంలో వీరమరణం పొందిన కన్నెగంటి త్యాగాన్ని జాతీయ కాంగ్రెస్ సంఘం గుర్తించింది. బ్రిటిష్ అధికారుల పట్ల పల్నాటి ప్రజలు అనుసరించిన సాంఘిక బహిష్కరణ విధానం తక్కిన దేశానికంతటికీ దారిచూపింది. హనుమంతు త్యాగనిరతిని శ్లాఘిస్తూ మించాలపాడు గ్రామ ప్రజలు అతని సమాధిపై ఏర్పాటు చేసిన శిలాశాసనం నేటికీ ఆ వీరుని పోరాట స్ఫూర్తికి మౌన సాక్షిగా నిలుస్తుంది. (నేడు కన్నెగంటి హనుమంతు 92వ వర్ధంతి సందర్భంగా...) డా॥అడబాల అప్పారావు కేంద్రీయ విశ్వవిద్యాలయం, హైదరాబాద్. మొబైల్:9494868936