అబ్బురం కన్నెగంటి సమరం | History on Kanneganti Hanumanthu | Sakshi
Sakshi News home page

అబ్బురం కన్నెగంటి సమరం

Published Sun, Feb 22 2015 12:29 AM | Last Updated on Sat, Sep 2 2017 9:41 PM

అబ్బురం కన్నెగంటి సమరం

అబ్బురం కన్నెగంటి సమరం

 ‘కన్నెగంటి హనుమంతు వెన్నులోని బాకూ
 వెన్నుతట్టి నడవమంది కడ విజయం వరకూ’
 అల్లూరి సీతారామరాజు చిత్రంలోని ప్రారంభ గీతంలోని ఓ చరణం ఇది. ఎంతో మంది విప్లవకారులను స్వాతంత్య్రోద్య మంలో వెన్నుతట్టి నడిపిన స్ఫూర్తి కన్నెగంటి హనుమంతు. శరీరంలోకి 24 గుండ్లు దూసుకెళ్లిన తరువాత కూడా సుమారు రెండు గంటలపాటు మాతృమూర్తి దాస్య శృంఖలాలను తెంచ డానికి బ్రిటిష్ సైన్యంతో పోరాడిన ధీరుడు కన్నెగంటి హను మంతు. సుమారు ఓ దశాబ్దంన్నర క్రితం పుల్లరి (పన్ను) చెల్లింపు నకు వ్యతిరేకించే నేపథ్యంలో వచ్చిన స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తి ప్రదాయక చిత్రం ‘లగాన్’కు భారతీయులు హృదయాల్ని అర్పిం చారు. అదంతా వారి నరనరాల్లో జీర్ణించుకుపోయిన దేశభక్తి మరో సారి వెల్లువలా పెల్లుబికిన వైనం. అలాంటి స్ఫూర్తికి ప్రతీకగా నిలి చిన ఓ తెలుగు వాడు కన్నెగంటి హనుమంతు. పుల్లరి చెల్లింపును ధిక్కరిస్తూ బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం నడిపిన నాయకుడు.
 
 కన్నెగంటి హనుమంతుకి జన్మనిచ్చింది మించాలపాడు అనే ఓ కుగ్రామం. గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలోని దుర్గికి సమీపంలోని కోలెకుట్ట శివారు ప్రాంతమే మించాలపాడు. అది 1920వ సంవత్సరం ప్రాంతం. దేశమంతా గాంధీగారి పిలుపుతో సహాయ నిరాకరణోద్యమంలో చురుగ్గా పాల్గొంటోంది. 1921లో విజయవాడలో జరిగిన కాంగ్రెస్ సమావేశంలోని నాయకుల పిలు పునందుకొని ఆంధ్రదేశం కూడా సహాయ నిరాకరణోద్యమంలోకి దూకింది. సహాయ నిరాకరణోద్యమంలో పన్నుల నిరాకరణ ఓ భాగం. గుంటూరు జిల్లాలో ఉన్నవ లక్ష్మీనారాయణగారు దీనికి నాయకులు.
 
 పల్నాడు ప్రాంతంలోని మాచర్ల, వెల్దుర్తి, జట్టిపాలెం, రెంటచింతల వంటి ప్రాంతాల్లో ప్రజాజీవనం ఆ ప్రాంతపు అడవులతో ముడిపడి ఉంది. 1921 సంవత్సరం ప్రాంతంలో పల్నాడులో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయి. పరాయి పాలనలో సామాన్య ప్రజలకు కూడు, గుడ్డ వంటి కనీసావసరాల మాట దేవుడెరుగు కనీసం పశువులకు గ్రాసం, గ్రామ జీవి తంలో భాగమైన కట్టెలు కొట్టుకోవడం, ఆకూ అలమూ పోగుచేసుకోవడం వంటి వాటికి సైతం బ్రిటిష్ ప్రభుత్వం ప్రజలపై ఆంక్షలు విధించింది.
 
 అడవిలో పశువుల్ని మేపుకోవడానికీ, కట్టెలు కొట్టుకోవడానికీ ప్రజలు బ్రిటిష్ ప్రభుత్వానికి పుల్లరి చెల్లించాలనే నిబంధన విధిం చింది. దరిమిలా ప్రభుత్వాధికారులు మేతకు వచ్చిన పశువుల్ని బందెలదొడ్డికి తోలడం, ప్రజలు వాటిని విడిపించు కోవడానికి నానా అవస్థలూ పడటం పరిపాటి అయింది. ఈ క్రమంలో ప్రజలను సంఘటిత పరచి ప్రభుత్వంపై పోరాటం చేయడానికి నాయకత్వం వహించాడు కన్నెగంటి. ప్రభుత్వానికి ప్రజలు పుల్లరి చెల్లించరాదనే ఉద్యమాన్ని లేవదీశాడు.
 
 ప్రజలు పుల్లరి కట్టడం మానేశారు. పెపైచ్చు ప్రజలు కన్నెగంటి నాయకత్వంలో అటవీ అధికారులను, రెవెన్యూ అధికారులనూ సాంఘిక బహిష్కారానికి గురిచేశారు. దీన్ని అణచివేయడానికి బ్రిటిష్ ప్రభుత్వం కుట్ర పన్నింది.
 
 అది 1922వ సంవత్సరం, ఫిబ్రవరి 22వ తారీఖు ఆదివారం. అమావాస్య మిట్ట మధ్యాహ్నం పన్నెండు గంటలు. భారత స్వాతంత్య్రోద్యమ చరిత్రలో ఓ దుర్దినం. మరో బ్రిటిష్ దౌష్ట్యం రూపుదిద్దుకోబోతున్న వేళ. గుంటూరు జిల్లా కలెక్టర్ వార్నరు పల్నాడు గ్రామం చేరుకున్నాడు. దుర్గి సబ్ ఇన్‌స్పెక్టర్ రాఘవయ్య నాయుడిని పిలిచాడు. అతనికి తోడు మరికొంత మంది సైన్యాన్ని ఇచ్చాడు. పుల్లరి కట్టని మించాలపాడు గ్రామస్తుల పశువులను నిర్బంధించవలసిందిగా ఆదేశించాడు. అంతే.. బ్రిటిష్ సైన్యం మించాలపాడు గ్రామంపై విరుచుకు పడింది. పశువుల్ని నిర్బంధించడం మొదలు పెట్టింది. కన్నెగంటి నాయకత్వంలో గ్రామస్తులంతా తిరగబడ్డారు. సుమారు రెండు నుంచి మూడు వందల మంది గ్రామీణ స్త్రీలు, పురుషులు ఈ తిరుగుబాటులో పాల్గొన్నారు. బ్రిటిష్ సైన్యం ప్రజలపై దమనకాండ జరిపింది. ఈ పోరాటంలో తుది వరకూ పోరాడిన కన్నెగంటి పోలీసుల తూటాలకు నేలకొరిగాడు. ఈ యోధుడితో పాటు మరో ఇద్దరు పోలీసులు ఆ దమనకాండలో ప్రాణాలు పోగొట్టుకున్నారు.
 
 పల్నాటి పుల్లరి సత్యాగ్రహంలో వీరమరణం పొందిన కన్నెగంటి త్యాగాన్ని జాతీయ కాంగ్రెస్ సంఘం గుర్తించింది. బ్రిటిష్ అధికారుల పట్ల పల్నాటి ప్రజలు అనుసరించిన సాంఘిక బహిష్కరణ విధానం తక్కిన దేశానికంతటికీ దారిచూపింది. హనుమంతు త్యాగనిరతిని శ్లాఘిస్తూ మించాలపాడు గ్రామ ప్రజలు అతని సమాధిపై ఏర్పాటు చేసిన శిలాశాసనం నేటికీ ఆ వీరుని పోరాట స్ఫూర్తికి మౌన సాక్షిగా నిలుస్తుంది.
 (నేడు కన్నెగంటి హనుమంతు 92వ వర్ధంతి సందర్భంగా...)
 డా॥అడబాల అప్పారావు
 కేంద్రీయ విశ్వవిద్యాలయం, హైదరాబాద్. మొబైల్:9494868936

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement