డాక్టర్ కోట్నిస్
భారత – చైనా దేశాల మధ్య స్నేహానికి స్ఫూర్తి డాక్టర్ ద్వారాకానాథ్ శాంతారాం కోట్నిస్. ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న ఈ కాలంలో ఆయన జీవితం నుండి స్ఫూర్తిని పొందాల్సిన అవసరం ఉంది. డాక్టర్ కోట్నిస్ 1910 అక్టోబరు 10న మహారాష్ట్రలోని షోలాపూర్‌లో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. భారతదేశంలో స్వాతంత్య్ర పోరాటం ఉధృతం అవుతుండగా, జపాన్ ఫాసిస్టుల దురాక్రమణకు చైనా గురైనకాలం అది. ఈ సమయంలో చైనాకు చెందిన జనరల్ ఛూటే తమ సైనికులకు వైద్యసహాయం అందించటానికి డాక్టర్లను పంపమని జవహర్‌లాల్ నెహ్రూను కోరారు. ఆ మేరకు 1938లో చైనాకు పంపబడిన 5 మంది డాక్టర్ల బృందంలో 27 ఏళ్ల డాక్టర్ కోట్నిస్ ఒకరు.
డాక్టర్ కోట్నిస్, ఆయన బృందం గాయపడిన చైనా సైనికులకు రోజుకు 800 మందికి వైద్యసహాయం అందించేవారు. బృందంలోని డాక్టర్లు తిరిగి ఇండియాకు వచ్చినా కోట్నిస్ అక్కడే ఉండి పోయారు. 1941లో చైనాలోని నార్మన్ బెతూన్ అంతర్జాతీయ శాంతి హాస్పిటల్‌కు ఆయన డైరెక్టర్‌గా నియమితులయ్యారు. 1941 డిసెంబరులో ఆయన అక్కడే యుద్ధ రంగంలో పనిచేస్తున్న ఒక చైనా నర్సును వివాహ మాడారు. వారికి కల్గిన కుమారునికి ‘ఇన్ హువా’ అని పేరు పెట్టారు. ఇన్ అంటే ఇండియా, హువా అంటే చైనా అని అర్థం. 1942లో ఆయన చైనా కమ్యూనిస్టు పార్టీ సభ్యత్వం కూడా తీసుకున్నారు. అవిశ్రాంతంగా పనిచేసిన కోట్నిస్‌కు అక్కడి అతిశీతల వాతావరణం వల్ల ఆరోగ్యం దెబ్బతింది. అందుకే తన కుమారుడు జన్మించిన కొద్ది నెలలకే 1942 డిసెంబరు 9న మూర్ఛవ్యాధితో మరణించారు. అప్పటికి ఆయన వయస్సు 32 సంవత్సరాలు మాత్రమే.
ఆయన చనిపోయినపుడు ‘‘చైనా సైన్యం ఒక ఆపన్నహస్తాన్ని పోగొట్టుకుంది. చైనాదేశం ఒక స్నేహితుణ్ణి కోల్పోయింది. డాక్టర్ కోట్నిస్ అంతర్జాతీయ స్ఫూర్తిని మనం ఎల్లప్పుడూ మన మనస్సులలో పదిలపరచుకోవాలి’’ అని చైనా విప్లవ నాయకుడు కామ్రేడ్ మావో యువ డాక్టరుకు ఘనంగా నివాళులర్పించారు. చైనా కోట్నిస్ స్మృతికి గుర్తుగా చైనాలోని కొన్ని నగరాలలో వైద్యశాలలు, విగ్రహాలు, స్థూపాలు నిర్మించింది. చైనా నాయకులు ఇండియా పర్యటనకువచ్చినప్పుడల్లా డాక్టర్ కోట్నిస్ కుటుంబసభ్యులను తప్పనిసరిగా కలవటం ఒక ఆనవాయితీ.
ప్రస్తుతం ఇరుదేశాల మధ్యగల సరిహద్దు తగాదాను సామరస్యంగాను, ఇచ్చిపుచ్చుకునే ధోరణితోను పరిష్కరించుకోవాలి. భారత, చైనా దేశాల మైత్రికి సంకేతంగానూ, అంతర్జాతీయ సౌభ్రాతృత్వానికి ప్రతీకగానూ నిలిచిన డాక్టర్ కోట్నిస్ ఉద్వేగభరిత జీవితం నుండి స్ఫూర్తిని పొంది భారత, చైనా మైత్రీ ఉద్యమాన్ని నిర్మించటం నేటి తక్షణ కర్తవ్యం. (క్లిక్ చేయండి: తెలుగు నేలపై చైతన్య యాత్ర)
– సి. భాస్కర్, యూసీసీఆర్‌ఐ (ఎమ్‌ఎల్)
(డాక్టర్ కోట్నిస్ 80వ వర్ధంతి సందర్భంగా)
Comments
Please login to add a commentAdd a comment