
సామరస్య నగరం
జ్ఞాపకం
నిఖిలేశ్వర్ - ప్రముఖ కవి
ఎక్కడైనా నగరాల విస్తరణ, పురోగమనం అక్కడి అసంఖ్యాక శ్రామికులు చెల్లించే జీవన మూల్యాల ఫలితమే! నగరాలే మానవ నాగరికతా వికాసాన్ని కాలగమనంలో ఆయా దశల్లో ప్రతిఫలించాయి. కొన్ని కాలగర్భంలో కలసిపోతే మరికొన్ని కాలానికి సాక్షిగా నిలిచాయి. అలాంటి నగరమే హైదరాబాద్.. అదే ఒకనాటి భాగ్యనగరం! అంటారు నిఖిలేశ్వర్. కవిగా, ఉపాధ్యాయుడిగా, వ్యక్తిగా నాలుగు వందల ఏళ్లు పైబడిన ఈ మహానగరంతో ఆయన అనుబంధం ఏడు దశాబ్దాలు. ఈనాటికీ కొత్తగా ఉన్న ఆ జ్ఞాపకాలు ఆయన మాటల్లోనే.
..:: హనుమా
నా బాల్యం, యవ్వనం, జీవితం.. అంతా ఇక్కడే. 425 ఏళ్ల చరిత్ర గల ఈ మహానగరానిది దక్కన్ సాంస్కృతిక స్వభావం. మత సామరస్యం, బహుభాషా జీవితాల సహజీవనం ఇక్కడి ప్రత్యేకత. ప్రస్తుతం మెట్రోపాలిటన్ నగరంగా విస్తరిస్తున్నందున సిటీలైఫ్ ఒక కమోడిటీగా మారిపోయే పరిస్థితి కనిపిస్తోంది. మెట్రో రైలు కూతతో జీవితం వేగవంతమై.. మనమంతా ఈ నగరంలోనే పరాయీకరణ చెందే ప్రమాదమూ ఉంది. చుట్టు పక్కల విస్తరిస్తున్న హైటెక్ సిటీతో ఇప్పటికే ‘న్యూ అమెరికన్’ సంస్కృతిలోకి జారిపోయింది. అయితే వలస వచ్చే వారందరికీ ఆశ్రయమివ్వడం ఈ సిటీ ప్రత్యేకత.
ఎన్నో పాత్రలు...
సిటీకి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న వీరవల్లి గ్రామంలో పుట్టినా... బాల్యం నుంచి నా జీవితం ఇక్కడే గడిచింది. అబిడ్స్‌లో మా ‘దిగంబర కవులు’ తొలి కవితా సంపుటి ఓ రిక్షావాలా చేత ఆవిష్కరింపజేశాం. కేశవ్ స్మారక విద్యాలయంలో ఇంగ్లిష్ ఉపాధ్యాయుడిగా 30 ఏళ్లు పనిచేశా. విద్యార్థులతో మమేకమయ్యే అవకాశం దక్కింది. హిందీ, తెలుగు బోధన భాషగా ఉంటేనేం..! మరాఠీ, కన్నడ, ఉర్దూ, హిందీ భాషలు కూడా ఉండేవి. ఇది నగరంలో పరిమళించే మిశ్రమ సంస్కృతికి చక్కని నిదర్శనం.
కార్మిక, కర్షక నగరం
నా బాల్యం బాకారం, దాయరా, ముషీరాబాద్ బస్తీల్లో సాగింది. పక్కనే ఆజామాబాద్ పారిశ్రామిక ప్రాంతం. ఇక్కడెక్కువ వజీర్ సుల్తాన్ ఫ్యాక్టరీ (వీఎస్‌టీ), గోల్కొండ సిగరెట్ ఫ్యాక్టరీ, డీబీఆర్ బట్టల మిల్లు, ఆల్విన్ ఫ్యాక్టరీ కార్మికుల కుటుంబాలుండేవి. అంతటా సామరస్యం వెల్లివిరిసేది.
పోలీస్ ఫైరింగ్...
1948లో ‘ఇండియన్ యూనియన్ సైన్యాలు’ హైదరాబాద్‌లోకి ప్రవేశించాయి. సుల్తాన్‌బజార్ రోడ్లపై ఆ సైన్యాన్ని ఆహ్వానించిన వాళ్లలో నేనూ ఉన్నాను. అప్పుడు నా వయసు పదేళ్లు. సైనిక చర్యతో నిజాం ఫ్యూడల్ ప్రభుత్వానికి నూకలు చెల్లాయి. ముల్కీ సమస్యపై హైదరాబాద్‌లో 1954-55లోనే ఉద్యమం చెలరేగింది. నాన్ ముల్కీ గో బ్యాక్ అంటూ విద్యార్థులమంతా అఫ్జల్‌గంజ్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగాం. అది తీవ్రరూపం దాల్చడంతో పోలీసులు మొదట లాఠీచార్జి.. తర్వాత ఫైరింగ్ మొదలుపెట్టారు. తప్పించుకోవడానికి నేను నయాపూల్ వంతెన మీదుగా పరిగెత్తిన ఘటన నేటికీ కళ్ల ముందు కదలాడుతూనే ఉంది.
అభ్యుదయ యువక సంఘం
1956 ప్రాంతం.. ముషీరాబాద్ జమిస్తాన్‌పూర్ హైస్కూల్‌లో చదివా. అప్పుడక్కడ అంతా ఖాళీ ప్రదేశం. ముషీరాబాద్‌లో ఆనాడు ఉన్న గౌరీశంకర్ గ్రంథాలయం మాకు సాహితీ సౌరభాలను పరిచయం చేసింది. స్థానిక కాంగ్రెస్ నాయకుడైన వెంకటరామయ్య జోషి పంతులు దీన్ని నిర్వహించేవారు. అక్కడ 1959-60లో ‘అభ్యుదయ యువక సంఘం’ స్థాపించి.. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాం. మాడపాటి హనుమంతరావు, పుట్టపర్తి శ్రీనివాసాచార్య (పురాతత్వ శాస్త్రవేత్త), దాశరథి కృష్ణమాచార్యులు, వట్టికోట ఆళ్వార్‌స్వామి, వెంకటావధాని, కాళేశ్వరరావు, కాళోజీ వంటి మహనీయులతో సాహిత్య, సాంస్కృతిక ప్రసంగాలు ఏర్పాటు చేశాం.
విరిసిన విరసం
1960-65 మధ్య మేమంతా బూర్గుల రంగనాథ్ (బూర్గుల రామకృష్ణారావు కుమారుడు) ఇంట్లో, కుందుర్తి ఆంజనేయులు ‘ఫ్రీవర్స్ ఫ్రంట్’ సాహిత్య గోష్ఠుల్లో మా రచనలు చదివేవాళ్లం. నేను, మిత్రులు జ్వాలాముఖి, నగ్నముని, చెరబండరాజు, భైరవయ్య, మహాస్వప్న.. ఈ ఆరుగురం ‘దిగంబర కవులు’ మూడు సంపుటాలు రాశాం. మేమంతా కలసి లెనిన్ శతజయంతి సభల్లో పాల్గొన్నాం. అక్కడే ‘విరసం’ అంకురార్పణ జరిగింది. నేను, జ్వాలాముఖి, నగ్నముని, చెరబండరాజు విరసం వ్యవస్థాపక సభ్యులం.
హోటళ్లలో చర్చాగోష్టులు
అబిడ్స్‌లోని ఓరియంటల్, కింగ్స్ సర్కిల్ హోటళ్లలో తెలుగు, హిందీ, ఉర్దూ రచయితల భేటీలు జరుగుతుండేవి. మగ్దూం మొహియొద్దీన్, టంగుటూరి అంజయ్య, జి.వెంకటస్వామి వంటి కార్మిక నాయకులు కూడా ఈ హోటల్‌లో సమావేశమయ్యేవారు. సుల్తాన్‌బజార్‌లోని ‘దిల్షాద్ రాయల్ టాకీస్’, అబిడ్స్ ‘జమృద్ మహల్’లో హిందీ సినిమాలు, సికింద్రాబాద్ ‘ప్లాజా, టివోలీ, డ్రీమ్ ల్యాండ్’ థియేటర్లలో ఇంగ్లిష్ సినిమాలు చూసేవాళ్లం.
రాజద్రోహం కేసు...
ప్రభుత్వానికి వ్యతిరేకంగా రచనలు చేసినందుకు 1971లో నాతోపాటు జ్వాలాముఖి, చరబండరాజులను రాజద్రోహ నేరం కింద అరెస్ట్ చేసి సికింద్రాబాద్ జైల్లో పెట్టారు. ఈ నిర్బంధాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేశాం. ‘కలాలకు సంకెళ్లు ఉండరాదు. భావప్రకటనా స్వేచ్ఛ రాజ్యాంగపరమైన హక్కు’ అంటూ హైకోర్టు చారిత్రక తీర్పునిచ్చింది. ఆ తీర్పుతో మేం విడుదలయ్యాం.
మహానగరాన్ని నిర్మించిన నిర్మిస్తున్న మనుష్యుల మమతలు తినేసిన ఉప్పు (కల్తీ) గాలి అంతశ్చైతన్యాన్ని అంతం చేసి నవ్వుతున్న నగరం పెరుగుతూంది... నిశ్చయంగా విస్తరిస్తూంది. వాయుగుండంలో సమస్యలు వీచివీచి మహానగరపు వీధుల్లో సుళ్లుసుళ్లుగా దివారాత్రుల శ్రమకి- సౌఖ్యానికి ఘర్షణ దరిద్రానికి- ధనానికి అంతులేని సంఘర్షణ ‘కెలిడోస్కోప్’లోని చిత్రవిచిత్ర రంగులవలే జీవితాల విభిన్న చిత్రాల నూతన సృష్టికి జరుగుతున్న సంచలనం. (నిఖిలేశ్వర్ ‘నాలుగు శతాబ్దాల సాక్షిగా నా మహానగరం’లోని కవిత)