నాడూ నేడూ పోరాటమే! | Fight Tours asserted nadu! | Sakshi
Sakshi News home page

నాడూ నేడూ పోరాటమే!

Published Mon, Jan 5 2015 12:00 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM

నాడూ నేడూ పోరాటమే! - Sakshi

నాడూ నేడూ పోరాటమే!

  • జ్ఞాపకం
  • కె.బాలకుమార్
  • తెలంగాణ ఉద్యమకారుడు
  • యవ్వనం ఉద్యమంతో రగిలింది. తెలంగాణ సాధనే ధ్యేయంగా కదిలింది. పోలీసులు గ్యాస్ బాంబులు విసురుతున్నా, బుల్లెట్లు వర్షంలా కురుస్తున్నా.. ఉడుకెత్తే రక్తంతో ఎదురొడ్డి నిలిచిన సాహసం.. కె.బాలకుమార్. ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షకు ఊపిరిలూదిన 1969 నాటి ఉద్యమం నుంచి... స్వర్ణకాంతులు అద్దుకున్న నేటి తెలంగాణ వరకు నిలువెత్తు సాక్ష్యమై నగరంతో మమేకమై సాగుతున్న ప్రయాణం. పోరుబాటలో తూటా తాకి కాలు పోయినా.. చిన్న బడ్డీ కొట్టు నడుపుకొంటూ హుందాగా జీవిస్తున్న ఈ అరవై ఆరేళ్ల పోరాట యోధుడి ‘జ్ఞాపకాలు’..
     ..:: హనుమా


    అది 1969 జూన్ 27. సీఎం బ్రహ్మానందరెడ్డి రాజీనామా చేశారు. నగరమంతా బంద్. తెలంగాణ కోసం ఉద్యమం ఉవ్వెత్తున సాగుతోంది. రోడ్లపై వేలాదిమంది ఉద్యమకారులు. వారిని చెదరగొట్టేందుకు పోలీసుల లాఠీచార్జీ.. ఆపై గ్యాస్ బాంబులు. ఆ బాంబులు పట్టి తిరిగి వారిపైకే వేశాం. పోలీసులు ఫైరింగ్ ఓపెన్ చేశారు. బుల్లెట్ల వర్షం.. అంతా చెల్లాచెదురు. నా కాలికీ ఓ తూటా తగిలింది. సమయం సాయంత్రం మూడు గంటలు. పరుగెత్తలేక అక్కడే పడిపోయా. రెండు గంటలపాటు నరకయాతన. ఐదింటప్పుడు పోలీసులే తీసుకెళ్లి గాంధీ ఆసుపత్రిలో పడేశారు. అందులో ప్రాణాలు కోల్పోయిన వారు, నాలా గాయపడిన వారెందరో!.

    ఐదొందలడిగారు...
    ఉద్యమం కోసం మేం ప్రాణాలకు తెగిస్తే..దవాఖానాలో మాత్రం నిర్లజ్జగా లంచం అడిగారు. నాకు చికిత్స చేయడానికి ఐదొందల రూపాయలిమ్మన్నారు. ఇవ్వలేనన్నందుకు.. వదిలేశారు. తరువాత ఇన్‌ఫెక్షన్ సోకి కాలు తీసేయాల్సి వచ్చింది. ఇదిగో ఇలా ఒంటికాలితో బతుకీడుస్తున్నా.

    సికింద్రాబాద్ టు మల్కాజిగిరి
    మాది సికింద్రాబాద్. చదివింది ఐఐటీ. అప్పట్లో సికింద్రాబాద్ గణేష్ కట్‌పీస్ సెంటర్‌లో సేల్స్‌మాన్‌గా చేసేవాడిని. కాలు పోయిన తరువాత ఉద్యోగం పోయింది. ఇంటి ముందే స్కూల్ పిల్లలకు చాక్లెట్లు, బిస్కెట్లు అమ్మేవాడిని. 1981లో సిటీ అమ్మాయితోనే పెళ్లయింది. ముగ్గురు సంతానం. 1983లో మల్కాజిగిరికి మారాం. ఇక్కడ చిన్న బడ్డీ  పెట్టుకున్నాను. నాడు.. నేడు ఇదే జీవనాధారం. 1972లో
     ఖైరతాబాద్ నియోజకవర్గం ఎన్నికలప్పుడు.. ఉద్యమంలో కాలు పోయిందంటూ నన్ను చూపించి ప్రచారం చేసుకున్నారు. అక్కడి నుంచి గెలిచారు గానీ.. ఎవరూ నన్ను  ఆదుకుంది లేదు. నాటి ఉద్యమంలో 350 మంది  మరణించారు. నాకు తెలిసి ప్రస్తుతం గౌతమ్‌నగర్‌లో ఒకరు, ఇక్కడి దయానంద్‌నగర్‌లో ఒకాయన ఆనాటి ఉద్యమంలో బుల్లెట్ గాయాలు తిన్నవారే. వీరిద్దరూ ఇప్పుడు దోభీతో జీవనం సాగిస్తున్నారు.
     
    అంతా పంటపొలాలు
    నేను మల్కాజిగిరికి వచ్చిన ఏడాదికి రామచంద్ర థియేటర్ కట్టారు. ఇది పంటపొలాలున్న ప్రాంతం. 1983లో సఫిల్‌గూడ చెరువుండేది. అందులో అన్నం ఉడికినట్టు నీళ్లు ఊరుతుండేవి. రామకృష్ణాపురం నుంచి నీళ్లు ఇందులోకి వచ్చేవి. ఇప్పుడా చెరువులో అన్నీ ఇళ్లే.
     
    హుస్సేన్‌సాగర్‌లో జలకాలు
    చిన్నప్పుడు ఫ్రెండ్సందరం కలసి తరచూ ట్యాంక్‌బండ్‌కు వెళ్లేవాళ్లం. హుస్సేన్‌సాగర్‌లో జలకాలాడేవాళ్లం. అంత స్వచ్ఛం నీళ్లు. సాగరం ఎంతో విశాలంగా, నిండుగా ఉండేది. నల్లగుట్ట, సింధికాలనీ వెనుక భాగం వరకు నీళ్లు. ఇప్పుడు... చుట్టూ నివాసాలొచ్చి కుంచించుకుపోయింది.
     
    నాడూ బడా సెంటర్లే..
    సికింద్రాబాద్, మొజంజాహీ మార్కెట్, చార్మినార్, సుల్తాన్‌బజార్ వంటివి నాడూ బిజీ సెంటర్లే. ఇక ప్రతి వీధిలో బ్రిటిష్ జమానా నల్లాలు... అందులో 24 గంటలూ మంజీర నీళ్లు. ఇళ్లలో నల్లాలు లేవు. బావులు అక్కడక్కడా కనిపించేవి. ఇప్పుడవన్నీ పోయి ఎక్కడపడితే అక్కడ బోరింగులైపోయాయి. కార్లు, బస్సులు అరుదుగా కనిపించేవి. ఎక్కడికి వెళ్లాలన్నా సైకిళ్లే. డబుల్ డక్కర్ బస్సు ఓ వింత.
     
    వాహ్.. మూసీ
    చాదర్‌ఘాట్‌లో మూసీ నది ప్రవాహం.. ఓహ్ ఎంత సొగసు! ఆ నీళ్లు తాగేవాళ్లం కూడా. చుట్టుపక్కల పొలాలకు ఈ నీటిని వాడేవాళ్లు. ఇప్పుడా ఆహ్లాదం ఏది?. నాడు వాతావరణం కూడా ఎంతో కూల్. ఈ సీజన్‌లో మధ్యాహ్నం కూడా స్వెట్టర్, మఫ్లర్ లేకుండా బయటకెవరూ వచ్చేవారు కాదు. సమయానికి వర్షాలు, చలి, ఎండలు.. ఏ కాలంలో అవి. ఒకటా రెండా.. ఈ మహానగరంతో అరవై ఆరేళ్ల అనుబంధం. ప్రతిదీ ఓ జ్ఞాపకం.
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement