
సక్సెస్‌ఫుల్ ఫెయిల్యూర్
బీటెక్ అయిపోయిన కుర్రాడు ముందుగా ఆలోచించేది కెరీర్ గురించి.
బీటెక్ అయిపోయిన కుర్రాడు ముందుగా ఆలోచించేది కెరీర్ గురించి. ఫ్రెషర్‌గా ప్లేస్‌మెంట్ కొడితే ఏ ప్రెషర్ ఉండదని భావిస్తాడు. కానీ అనిరుధ్ మాత్రం కాస్త డిఫరెంట్. నలుగురు వెళ్లే దారిలో వెళ్తే లైఫ్‌లో కిక్కేముందని ఫిక్సయ్యాడు. అందుకే కలం పట్టాడు.. కవిగా మారాడు. తన జీవితంలో ఎదురుకాని ఓ కథాంశాన్ని ఎంచుకుని ఎందరి జీవితాలకో స్ఫూర్తినందించే నవల రాశాడు.
తలపండిన మేధావులు ట్రై చేసే లవ్ ఫెయిల్యూర్ టాపిక్ మీద కథ అల్లాడు.. కథనం సాగించి ’ఇన్ పెయిన్‘ నవలగా తీర్చిదిద్దాడు. అంతేకాదు నావెల్ ప్రచురణకు పబ్లిషర్స్ దొరక లేదని తన సాహిత్యాన్ని అటకెక్కించలేదు. తానే పబ్లిషర్‌గా మారాడు. తన నవలను అచ్చేయడమే కాదు యంగ్ ఆథర్స్ రచనలనూ ప్రచురిస్తానని ఆఫర్ ఇస్తున్న అనిరుధ్‌ను ’సిటీప్లస్‘ పలకరించింది.
నా బీటెక్ పూర్తయి మూడు నెలలవుతోంది. చిన్నప్పటి నుంచే చిన్న చిన్న కథలు రాసేవాణ్ని. జీవితంలో ఏదైనా సాధించాలనుకునేవాణ్ని. ఆ ఆలోచనలే నన్ను రచయితను చేశాయి. నవల రాయాలనుకున్నప్పుడు ఏ సబ్జెక్ట్ ఎంచుకోవాలని ప్రత్యేకంగా ఏమీ అనుకోలేదు. ఈ రోజుల్లో లవ్ ఫెయిల్యూర్స్ పెద్ద సమస్యగా మారిపోతున్నాయి. ప్రేమ విఫలమైతే అమ్మాయిని చంపడం.. తాను చావడం.. ఇదే పరిష్కారం అని ఆలోచిస్తున్నారు.
మా ఫ్రెండ్స్‌తో డిస్కషన్స్‌లో కూడా ఈ టాపికే వచ్చేది. కానీ ప్రేమకి ముందు తర్వాత కూడా జీవితం ఉంటుంది. దాని గురించి ఆలోచించాలనేదే ఈ నవల ఉద్దేశం. ప్రేమిస్తే ఎలా ఉండొచ్చో నా జనరేషన్ వాళ్లకు చెప్పే ప్రయత్నం చేశాను. ఓ వ్యక్తి ప్రేమించిన తర్వాత, ప్రేమలో ఓడిపోయిన తర్వాత ఎలాంటి పరిస్థితులకు లోనయ్యాడనేది ‘ఇన్ పెయిన్‘ కథాంశం.
యూనివర్సల్ యాక్సెప్ట్..
మొదట తెలుగులోనే రాయాలనుకున్నాను. నా ఫ్రెండ్ శేషు.. ’లవ్ యూనివర్సల్ సబ్జెక్ట్.. ఈ బుక్ కూడా గ్లోబల్ రీచ్ కావాలంటే ఇంగ్లిష్‌లో రాయటం మంచిది‘ అని సలహా ఇచ్చాడు. ఇంగ్లిష్‌లో నాకంత లిటరేచర్ స్కిల్స్ లేకపోయినా.. నేను అనుకున్నది రీడర్‌కు అర్థమయ్యేలా చెప్పగలనన్న నమ్మకంతో ఇంగ్లిష్‌లో రాయడానికి సాహసించాను.
ఒక్క ఏడాదిలో నావెల్ పూర్తి చేశాను. శేషు, మరో స్నేహితుడు శరత్ చాలా ప్రోత్సహించారు. బుక్ పూర్తయ్యాక ఎడిటింగ్ బాధ్యతలు శరత్ చూసుకున్నాడు. శని, ఆదివారాల్లో వచ్చి ఎడిట్ చేసేవాడు. ‘ఏదో రాస్తావ్ అనుకున్నాం.. ఇంత మెచ్యూర్డ్‌గా రాస్తావనుకోలేదు‘ అన్న వాళ్ల మాటలు ఎప్పుడూ మరచిపోలేను.
ఊహల ఊయలలో..
దీన్ని చదివిన వాళ్లు ఇది నీ కథేనా అని అడుగుతున్నారు. నేను రాసింది కేవలం కథే. లవ్ ఫెయిల్యూర్ ఎలా ఉంటుందో ఊహించుకుని రాశాను. ఆ ఫీలింగ్‌ను అనుభవించాలని ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఒక గదిలో ఒంటరిగా ఉన్నాను. ఒక అమ్మాయిని ప్రేమిస్తే, ఆ ప్రేమ బ్రేకప్ అయితే ఎలా ఉంటుందో ఊహించుకుని ఆ ఫీలింగ్స్ పేపర్ మీద పెట్టేవాణ్ని. ఒక చాప్టర్ పూర్తయ్యాక అంతకుముందు చాప్టర్ చప్పగా అనిపించింది. మళ్లీ మార్పులు చేర్పులు చేసేవాణ్ని. ఇలా ఎన్నో స్వీయ తర్జనభర్జనల తర్వాత దీనికి ఓ రూపం వచ్చింది.
యువకలాల కోసం..
నావెల్ పూర్తయిన తర్వాత పబ్లిషర్ కోసం ముంబై, బెంగళూరు ఇలా చాలా సిటీలు తిరిగాం. కానీ ఎవరూ పబ్లిష్ చేయలేదు. చాలా మంది యంగ్ రైటర్స్ రచనలు పబ్లిష్ కాకుండా ఉండిపోతున్నాయి. అందుకే నా ఫ్రెండ్స్ శేషు, శరత్, సైఫుద్దీన్‌తో కలసి విప్రెన్సా అని పబ్లిషింగ్ హౌస్ ప్రారంభించాం. యువ రచయితలను ప్రోత్సహించడమే ఈ పబ్లిషింగ్ హౌస్ లక్ష్యం.