మహిళా ఉద్యమ కెరటం మల్లాది సుబ్బమ్మ | Subbamma minute wave women's movement | Sakshi
Sakshi News home page

మహిళా ఉద్యమ కెరటం మల్లాది సుబ్బమ్మ

Published Fri, May 16 2014 12:38 AM | Last Updated on Sat, Sep 2 2017 7:23 AM

మహిళా ఉద్యమ కెరటం మల్లాది సుబ్బమ్మ

మహిళా ఉద్యమ కెరటం మల్లాది సుబ్బమ్మ

జ్ఞాపకం
 
సాక్షి, సిటీబ్యూరో : ‘శక్తి  చాలడం లేదు కానీ, ఏ మాత్రం ఓపిక ఉన్నా సరే ఉద్యమాల్లో  పాల్గొనాలని ఉంది’ జీవితాన్నే ఒక సమరశీల పోరాటంగా మలుచుకున్న మల్లాది సుబ్బమ్మ మాటలివి. ఇటీవల ‘సాక్షి’తో తన అనుభవాలను పంచుకున్నారామె. గురువారం కన్నుమూసిన ఆమె జ్ఞాపకాలను ఆమె మాటల్లోనే... మననం చేసుకునే ప్రయత్నమిది.
 
రహస్యంగా పెళ్లి...

గుంటూరు జిల్లా రేపల్లె తాలూక పోతార్లంక మా సొంత ఊరు. నాన్న కొండూరు సత్యనారాయణ. అమ్మ అన్నపూర్ణమ్మ. నాన్న బాపట్లలో ప్లీడర్. లాయర్ మల్లాది వెంకట రామ్మూర్తితో నా 11వ ఏట  రహస్యంగా వివాహం జరిపించారు. నాకు పుట్టినిల్లు, మెట్టినిల్లు బాపట్లే. ఆరు క్లాసులతో అటకెక్కిన నా చదువు పిల్లలయ్యాక తిరిగి మొదలైంది. 36వ ఏట  నా కూతురు విజయలక్ష్మి ఎస్సెస్సెల్సీ రాస్తుంటే నేను మెట్రిక్యులేషన్ రాశాను.

ఆ తర్వాత పీయూసీ, బీఏ చదివాను. అప్పటి వరకు సాధారణ గృహిణిగానే ఉన్న నన్ను హైదరాబాద్‌లోని పంజగుట్ట కేంద్రంగా నడుస్తోన్న కుటుంబ నియంత్రణ కార్యక్రమాలు ప్రభావితం చేశాయి. ఈ కేంద్రం నుంచే ఫ్యామిలీ ప్లానింగ్‌లో డిప్లొమా పూర్తి చేశాను. ఏడాది తర్వాత బాపట్లకు వెళ్లి కుటుంబ నియంత్రణ ఉద్యమాన్ని నడిపాను.

ఊరూరు తిరిగి ప్రచారం చేశాను. గృహిణిగా ఉన్న నేను చదువుకొని, ఉద్యమాల్లో పాల్గొనేందుకు అడుగడుగునా నా భర్త ప్రోత్సాహం, సహకారం, అండదండలు లభించాయి. 1972లో వచ్చిన ప్రత్యేక ఆంధ్ర ఉద్యమంలో సైతం పాల్గొని 8 సార్లు అరెస్టయ్యాను. జైలుకు వెళ్లాను. ప్రజాస్వామ్యం  కోసం లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ చేపట్టిన ఉద్యమం మమ్మల్ని బాగా ప్రభావితం చేసింది. ఎమర్జెన్సీ కాలంలో  ప్రభుత్వం రామ్మూర్తిగారిని అరెస్టు చేసి జైల్లో పెట్టింది. ఆ తర్వాత విజయవాడ నుంచి హైదరాబాద్ మెహిదీపట్నంకు మకాం మార్చాం.  
 
కూరగాయల ఉద్యమం...


హైదరాబాద్ కేంద్రంగా కూరగాయల ఉద్యమం చేపట్టాం. ఆ పోరాటం ప్రతి ఇంటినీ కదిలించింది. ఆ రోజుల్లో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో కూరగాయల కొరత తీవ్రంగా ఉండేది. ఇక్కడి పంటను గల్ఫ్ దేశాలకు ఎగుమతి చేసేవాళ్లు. నేను మరి కొంతమంది మహిళలం కలిసి చేపట్టిన కూరగాయల  పోరాటానికి అనూహ్యమైన స్పందన లభించింది. చివరకు ప్రభుత్వం దిగి రాక తప్పలేదు. మహిళలకు సంబంధించి ఏ కార్యక్రమం జరిగినా నేను పాల్గొన్నాను. భార్యాభర్తల తగాదాలు, కాపురాలు నిలబెట్టడాలు, అవసరమైన చోట విడాకులు ఇప్పించడం మొదలుకొని వందలాది కుల, మతాంతర వివాహాల వరకు మా ఇల్లు ప్రధాన కేంద్రంగానే ఉండింది.

1992లో వచ్చిన సంపూర్ణ మద్య నిషేధ ఉద్యమం గురించి అందరికీ తెలిసిందే. దూబగుంటలో మొదలైన ఆ పోరాటం రాష్ట్రవ్యాప్తంగా ఉధృతంగా సాగింది. ప్రతి  ఆందోళనలో నేను పాల్గొన్నాను. వావిలాల గోపాల కృష్ణయ్య, నేను, సంద్యావందనం, లక్ష్మీదేవి  వంటి  అనేక మంది కలిసి ఉద్యమాన్ని నడిపించాం. ఆ రోజుల్లో ఈ  పోరాటం దేశవ్యాప్తంగానే కాకుండా  విదేశాల్లో  కూడా  చర్చనీయాంశమైంది.
 
ఆమె వారసత్వాన్ని ముందుకు తీసుకుపోయేవాళ్లు కావాలి ...

అమ్మ చాలా పోరాటం చేశారు. 80కి పైగా గ్రంథాలు రాశారు. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలపైనా పోరాడారు. ఇప్పుడు ఆమె పోరాట వారసత్వాన్ని ముందుకు తీసుకుపోయేవాళ్లు కావాలి. కొంత కాలంగా మహిళా ఉద్యమాల్లో విస్తృతి కనిపించడం లేదు. దశాబ్దాలుగా ఆ కొద్ది మందే మహిళా పోరాటాల్లో  కనిపిస్తున్నారు.
 -  మల్లాది కామేశ్వర్‌రావు (సుబ్బమ్మ పెద్ద కొడుకు)
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement