malladi subbamma
-
మల్లాది సుబ్బమ్మ కన్నుమూత
మహిళల హక్కుల కోసం పోరాటం సంపూర్ణ మద్యపాన నిషేధ ఉద్యమంలో కీలక పాత్ర సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మహిళా ఉద్యమం పెద్ద దిక్కును కోల్పోయింది. మహిళాహక్కుల ఉద్యమకారిణి, ప్రముఖ రచయిత్రి మల్లాది సుబ్బమ్మ(90) గురువారం మధ్యాహ్నం కన్నుమూశారు. ఉదయం అస్వస్థతకు గురైన ఆమెను సోమాజి గూడలోని వివేకానంద ఆసుపత్రికి తరలించగా.. అక్కడే చికిత్స పొందుతూ తుది శ్వాసవదిలారు. ఆమె భర్త మల్లాది వెంకట రామ్మూర్తి చాన్నాళ్ల క్రితమే చనిపోయారు. హేతువాది అయిన సుబ్బమ్మకు అంత్యక్రియలు నిర్వహించడం లేదు. ఆమె మృతదేహాన్ని ఉస్మానియా మెడికల్ కాలేజీకి అందజేయనున్నారు. నేత్రదానం కూడా చేశారు. ఆమెకు నలుగురు సంతానం. ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె. వారిలో ఇద్దరు కుమారు లు ఇప్పటికే మృతి చెందారు. భౌతిక కాయాన్ని శుక్రవారం ఉదయం సోమాజిగూడలోని ఆమె స్వగృహానికి తరలించి, ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు ప్రజల సందర్శనార్థం ఉంచుతామని, అనంతరం ఉస్మానియా వైద్యకళాశాలకు తరలిస్తామని ఆమె కుమారుడు కేఆర్మల్లాది తెలిపారు. మల్లాది సుబ్బమ్మ 1924 అగస్టు 2న గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా పాతర్లంకలో జన్మించారు. బాపట్లకు చెందిన మల్లాది వెంకట రామమ్మూర్తిని వివాహం చేసుకున్నారు. మహిళల హక్కుల కోసం, వారి సంక్షేమం కోసం మల్లాది సుబ్బమ్మ అవిశ్రాం తంగా కృషి చేశారు. సంపూర్ణ మద్యపాన నిషేధ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. ఉద్యమకారులకు పెద్దదిక్కుగా ఉండేవారు. ప్రఖ్యాతి గాంచిన ‘పాతివ్రత్యం నుంచి ఫెమినిజం దాకా’ అనే పుస్తకం సహా 88 రచనలు చేశారు. 1993లో మహిళా ఉద్యమం అనే పుస్తకానికి ఎన్టీరామారావు చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. 2003లో ఆత్మగౌరవ పురస్కారాన్ని అందుకున్నారు. ఆత్మకు శాంతి చేకూరాలి: వైఎస్ జగన్ ప్రముఖ సంఘ సేవకురాలు, స్త్రీవాద రచయిత్రి మల్లాది సుబ్బమ్మ మృతి పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. మహిళల అభ్యున్నతి కోసం మల్లాది సుబ్బమ్మ అహర్నిశలు శ్రమించారని, సారా వ్యతిరేక మహోద్యమంలో ముందుండి పోరాడారని ఆయన గుర్తుచేశారు. నమ్మిన సిద్ధాంతాల కోసం, ఆదర్శాల కోసం జీవితాంతం మొక్కవోని దీక్షతో కృషి చేశారని జగన్మోహన్ రెడ్డి కొనియాడారు. మల్లాది సుబ్బమ్మ కుటుంబసభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. త్యాగశీలి సుబ్బమ్మ: పీయూసీఎల్ ప్రముఖ హేతువాది, మహిళా అభ్యుదయ సంస్థ వ్యవస్థాపకురాలు మల్లాది సుబ్బమ్మ మృతికి పౌరహక్కుల సంస్థ పీయూసీఎల్ రాష్ట్రశాఖ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేసింది. మహిళల హక్కుల కోసం నిరంతరం శ్రమించిన వారిలో సుబ్బమ్మ ఒకరని పీయూసీఎల్ రాష్ట్ర నాయకుడు మల్లెల శేషగిరిరావు తెలిపారు. బాల్యవివాహాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేశారని, స్త్రీ విద్యావ్యాప్తికి కృషి చేశారన్నారు. ఆస్తిపాస్తులన్నింటినీ వివిధ మహిళా శిశు సంక్షేమ సంఘాలకు విరాళంగా ఇచ్చిన త్యాగశీలి అని కొనియాడారు. తీరని లోటు.. ప్రముఖ రచయిత్రి మల్లాది సుబ్బమ్మ మృతి సాహిత్యలోకానికి తీరనిలోటని సాంస్కృతిక శాఖ సంచాలకులు ఆర్. కవితాప్రసాద్ తెలిపారు. మహిళా అభ్యుదయంపై ఆమె అనేక రచనలు చేశారన్నారు. హేతువాదం, కాంతికిరణాలు, చీకటి వెలుగులు నవలలు రాసి ఆమె ఎంతోమందిని మేల్కొలిపారని తెలిపారు. మల్లాది సుబ్బమ్మ మరణం పట్ల పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉప కులపతి ఆచార్య ఎల్లూరి శివారెడ్డి సంతాపాన్ని ప్రకటించారు. యావజ్జీవితాన్ని మహిళాభ్యుదయం కోసం వెచ్చించిన ఆదర్శజీవి ఆమె అని పేర్కొన్నారు. మల్లాది సుబ్బమ్మ మరణం మహిళల పోరాటాలకు తీరని లోటు అని జనచైతన్య వేదిక రాష్ర్ట అధ్యకుడు వి. లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. పురావస్తుశాఖ రాష్ట్ర మాజీ డెరైక్టర్ ఆచార్య చెన్నారెడ్డి సహా పలువురు ఆమె మృతికి సంతాపం ప్రకటించారు. -
మహిళా ఉద్యమ కెరటం మల్లాది సుబ్బమ్మ
జ్ఞాపకం సాక్షి, సిటీబ్యూరో : ‘శక్తి చాలడం లేదు కానీ, ఏ మాత్రం ఓపిక ఉన్నా సరే ఉద్యమాల్లో పాల్గొనాలని ఉంది’ జీవితాన్నే ఒక సమరశీల పోరాటంగా మలుచుకున్న మల్లాది సుబ్బమ్మ మాటలివి. ఇటీవల ‘సాక్షి’తో తన అనుభవాలను పంచుకున్నారామె. గురువారం కన్నుమూసిన ఆమె జ్ఞాపకాలను ఆమె మాటల్లోనే... మననం చేసుకునే ప్రయత్నమిది. రహస్యంగా పెళ్లి... గుంటూరు జిల్లా రేపల్లె తాలూక పోతార్లంక మా సొంత ఊరు. నాన్న కొండూరు సత్యనారాయణ. అమ్మ అన్నపూర్ణమ్మ. నాన్న బాపట్లలో ప్లీడర్. లాయర్ మల్లాది వెంకట రామ్మూర్తితో నా 11వ ఏట రహస్యంగా వివాహం జరిపించారు. నాకు పుట్టినిల్లు, మెట్టినిల్లు బాపట్లే. ఆరు క్లాసులతో అటకెక్కిన నా చదువు పిల్లలయ్యాక తిరిగి మొదలైంది. 36వ ఏట నా కూతురు విజయలక్ష్మి ఎస్సెస్సెల్సీ రాస్తుంటే నేను మెట్రిక్యులేషన్ రాశాను. ఆ తర్వాత పీయూసీ, బీఏ చదివాను. అప్పటి వరకు సాధారణ గృహిణిగానే ఉన్న నన్ను హైదరాబాద్‌లోని పంజగుట్ట కేంద్రంగా నడుస్తోన్న కుటుంబ నియంత్రణ కార్యక్రమాలు ప్రభావితం చేశాయి. ఈ కేంద్రం నుంచే ఫ్యామిలీ ప్లానింగ్‌లో డిప్లొమా పూర్తి చేశాను. ఏడాది తర్వాత బాపట్లకు వెళ్లి కుటుంబ నియంత్రణ ఉద్యమాన్ని నడిపాను. ఊరూరు తిరిగి ప్రచారం చేశాను. గృహిణిగా ఉన్న నేను చదువుకొని, ఉద్యమాల్లో పాల్గొనేందుకు అడుగడుగునా నా భర్త ప్రోత్సాహం, సహకారం, అండదండలు లభించాయి. 1972లో వచ్చిన ప్రత్యేక ఆంధ్ర ఉద్యమంలో సైతం పాల్గొని 8 సార్లు అరెస్టయ్యాను. జైలుకు వెళ్లాను. ప్రజాస్వామ్యం కోసం లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ చేపట్టిన ఉద్యమం మమ్మల్ని బాగా ప్రభావితం చేసింది. ఎమర్జెన్సీ కాలంలో ప్రభుత్వం రామ్మూర్తిగారిని అరెస్టు చేసి జైల్లో పెట్టింది. ఆ తర్వాత విజయవాడ నుంచి హైదరాబాద్ మెహిదీపట్నంకు మకాం మార్చాం. కూరగాయల ఉద్యమం... హైదరాబాద్ కేంద్రంగా కూరగాయల ఉద్యమం చేపట్టాం. ఆ పోరాటం ప్రతి ఇంటినీ కదిలించింది. ఆ రోజుల్లో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో కూరగాయల కొరత తీవ్రంగా ఉండేది. ఇక్కడి పంటను గల్ఫ్ దేశాలకు ఎగుమతి చేసేవాళ్లు. నేను మరి కొంతమంది మహిళలం కలిసి చేపట్టిన కూరగాయల పోరాటానికి అనూహ్యమైన స్పందన లభించింది. చివరకు ప్రభుత్వం దిగి రాక తప్పలేదు. మహిళలకు సంబంధించి ఏ కార్యక్రమం జరిగినా నేను పాల్గొన్నాను. భార్యాభర్తల తగాదాలు, కాపురాలు నిలబెట్టడాలు, అవసరమైన చోట విడాకులు ఇప్పించడం మొదలుకొని వందలాది కుల, మతాంతర వివాహాల వరకు మా ఇల్లు ప్రధాన కేంద్రంగానే ఉండింది. 1992లో వచ్చిన సంపూర్ణ మద్య నిషేధ ఉద్యమం గురించి అందరికీ తెలిసిందే. దూబగుంటలో మొదలైన ఆ పోరాటం రాష్ట్రవ్యాప్తంగా ఉధృతంగా సాగింది. ప్రతి ఆందోళనలో నేను పాల్గొన్నాను. వావిలాల గోపాల కృష్ణయ్య, నేను, సంద్యావందనం, లక్ష్మీదేవి వంటి అనేక మంది కలిసి ఉద్యమాన్ని నడిపించాం. ఆ రోజుల్లో ఈ పోరాటం దేశవ్యాప్తంగానే కాకుండా విదేశాల్లో కూడా చర్చనీయాంశమైంది. ఆమె వారసత్వాన్ని ముందుకు తీసుకుపోయేవాళ్లు కావాలి ... అమ్మ చాలా పోరాటం చేశారు. 80కి పైగా గ్రంథాలు రాశారు. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలపైనా పోరాడారు. ఇప్పుడు ఆమె పోరాట వారసత్వాన్ని ముందుకు తీసుకుపోయేవాళ్లు కావాలి. కొంత కాలంగా మహిళా ఉద్యమాల్లో విస్తృతి కనిపించడం లేదు. దశాబ్దాలుగా ఆ కొద్ది మందే మహిళా పోరాటాల్లో కనిపిస్తున్నారు. - మల్లాది కామేశ్వర్రావు (సుబ్బమ్మ పెద్ద కొడుకు) -
రచయిత్రి మల్లాది సుబ్బమ్మ కన్నుమూత
-
ప్రముఖ రచయిత్రి మల్లాది సుబ్బమ్మ కన్నుమూత
హైదరాబాద్: ప్రముఖ రచయిత్రి మల్లాది సుబ్బమ్మ(90) కన్నుమూశారు. మహిళాభ్యుదయంపై ఆమె అనేక రచనలు చేశారు. హేతువాదం, కాంతికిరణాలు, చీకటి వెలుగులు నవలలు రాశారు. 12 సంస్థలు స్థాపించి మహిళాభ్యుదయం కోసం ఆమె కృషి చేశారు. కుల నిర్మూలన, ఛాందస వ్యతిరేక పోరాటం, మూఢవిశ్వాస నిర్మూలన, స్త్రీ జనోద్ధరణ, కుటుంబ నియంత్రణ, స్త్రీ విద్య కోసం పాటు పడ్డారు. మల్లాది సుబ్బమ్మ 1924 ఆగస్టు 2న గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా పోతార్లంకలో జన్మించారు. బాపట్లకు చెందిన ఎం.వి.రామమూర్తిని ఆమె వివాహం చేసుకున్నారు. అత్తమామలు వ్యతిరేకించినప్పటికీ భర్త సహకారంతో పెళ్లైన తర్వాత ఉన్నత విద్యను అభ్యసించారు. 60పైగా రచనలు చేశారు. మల్లాది సుబ్బమ్మ మరణం పట్ల కవులు, రచయితలు సంతాపం ప్రకటించారు. మల్లాది సుబ్బమ్మ మరణం తీరని లోటని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ సంతాపం వ్యక్తం చేశారు.