మల్లాది సుబ్బమ్మ కన్నుమూత
- మహిళల హక్కుల కోసం పోరాటం
- సంపూర్ణ మద్యపాన నిషేధ ఉద్యమంలో కీలక పాత్ర
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మహిళా ఉద్యమం పెద్ద దిక్కును కోల్పోయింది. మహిళాహక్కుల ఉద్యమకారిణి, ప్రముఖ రచయిత్రి మల్లాది సుబ్బమ్మ(90) గురువారం మధ్యాహ్నం కన్నుమూశారు. ఉదయం అస్వస్థతకు గురైన ఆమెను సోమాజి గూడలోని వివేకానంద ఆసుపత్రికి తరలించగా.. అక్కడే చికిత్స పొందుతూ తుది శ్వాసవదిలారు. ఆమె భర్త మల్లాది వెంకట రామ్మూర్తి చాన్నాళ్ల క్రితమే చనిపోయారు. హేతువాది అయిన సుబ్బమ్మకు అంత్యక్రియలు నిర్వహించడం లేదు.
ఆమె మృతదేహాన్ని ఉస్మానియా మెడికల్ కాలేజీకి అందజేయనున్నారు. నేత్రదానం కూడా చేశారు. ఆమెకు నలుగురు సంతానం. ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె. వారిలో ఇద్దరు కుమారు లు ఇప్పటికే మృతి చెందారు. భౌతిక కాయాన్ని శుక్రవారం ఉదయం సోమాజిగూడలోని ఆమె స్వగృహానికి తరలించి, ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు ప్రజల సందర్శనార్థం ఉంచుతామని, అనంతరం ఉస్మానియా వైద్యకళాశాలకు తరలిస్తామని ఆమె కుమారుడు కేఆర్‌మల్లాది తెలిపారు.
మల్లాది సుబ్బమ్మ 1924 అగస్టు 2న గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా పాతర్లంకలో జన్మించారు. బాపట్లకు చెందిన మల్లాది వెంకట రామమ్మూర్తిని వివాహం చేసుకున్నారు. మహిళల హక్కుల కోసం, వారి సంక్షేమం కోసం మల్లాది సుబ్బమ్మ అవిశ్రాం తంగా కృషి చేశారు. సంపూర్ణ మద్యపాన నిషేధ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. ఉద్యమకారులకు పెద్దదిక్కుగా ఉండేవారు. ప్రఖ్యాతి గాంచిన ‘పాతివ్రత్యం నుంచి ఫెమినిజం దాకా’ అనే పుస్తకం సహా 88 రచనలు చేశారు. 1993లో మహిళా ఉద్యమం అనే పుస్తకానికి ఎన్టీరామారావు చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. 2003లో ఆత్మగౌరవ పురస్కారాన్ని అందుకున్నారు.
ఆత్మకు శాంతి చేకూరాలి: వైఎస్ జగన్
ప్రముఖ సంఘ సేవకురాలు, స్త్రీవాద రచయిత్రి మల్లాది సుబ్బమ్మ మృతి పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. మహిళల అభ్యున్నతి కోసం మల్లాది సుబ్బమ్మ అహర్నిశలు శ్రమించారని, సారా వ్యతిరేక మహోద్యమంలో ముందుండి పోరాడారని ఆయన గుర్తుచేశారు. నమ్మిన సిద్ధాంతాల కోసం, ఆదర్శాల కోసం జీవితాంతం మొక్కవోని దీక్షతో కృషి చేశారని జగన్‌మోహన్ రెడ్డి కొనియాడారు. మల్లాది సుబ్బమ్మ కుటుంబసభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
త్యాగశీలి సుబ్బమ్మ: పీయూసీఎల్
ప్రముఖ హేతువాది, మహిళా అభ్యుదయ సంస్థ వ్యవస్థాపకురాలు మల్లాది సుబ్బమ్మ మృతికి పౌరహక్కుల సంస్థ పీయూసీఎల్ రాష్ట్రశాఖ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేసింది. మహిళల హక్కుల కోసం నిరంతరం శ్రమించిన వారిలో సుబ్బమ్మ ఒకరని పీయూసీఎల్ రాష్ట్ర నాయకుడు మల్లెల శేషగిరిరావు తెలిపారు. బాల్యవివాహాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేశారని, స్త్రీ విద్యావ్యాప్తికి కృషి చేశారన్నారు. ఆస్తిపాస్తులన్నింటినీ వివిధ మహిళా శిశు సంక్షేమ సంఘాలకు విరాళంగా ఇచ్చిన త్యాగశీలి అని కొనియాడారు.
తీరని లోటు..
ప్రముఖ రచయిత్రి మల్లాది సుబ్బమ్మ మృతి సాహిత్యలోకానికి తీరనిలోటని సాంస్కృతిక శాఖ సంచాలకులు ఆర్. కవితాప్రసాద్ తెలిపారు. మహిళా అభ్యుదయంపై ఆమె అనేక రచనలు చేశారన్నారు. హేతువాదం, కాంతికిరణాలు, చీకటి వెలుగులు నవలలు రాసి ఆమె ఎంతోమందిని మేల్కొలిపారని తెలిపారు. మల్లాది సుబ్బమ్మ మరణం పట్ల పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉప కులపతి ఆచార్య ఎల్లూరి శివారెడ్డి సంతాపాన్ని ప్రకటించారు. యావజ్జీవితాన్ని మహిళాభ్యుదయం కోసం వెచ్చించిన ఆదర్శజీవి ఆమె అని పేర్కొన్నారు. మల్లాది సుబ్బమ్మ మరణం మహిళల పోరాటాలకు తీరని లోటు అని జనచైతన్య వేదిక రాష్ర్ట అధ్యకుడు వి. లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. పురావస్తుశాఖ రాష్ట్ర మాజీ డెరైక్టర్ ఆచార్య చెన్నారెడ్డి సహా పలువురు ఆమె మృతికి సంతాపం ప్రకటించారు.