ప్రముఖ రచయిత్రి మల్లాది సుబ్బమ్మ కన్నుమూత
హైదరాబాద్: ప్రముఖ రచయిత్రి మల్లాది సుబ్బమ్మ(90) కన్నుమూశారు. మహిళాభ్యుదయంపై ఆమె అనేక రచనలు చేశారు. హేతువాదం, కాంతికిరణాలు, చీకటి వెలుగులు నవలలు రాశారు. 12 సంస్థలు స్థాపించి మహిళాభ్యుదయం కోసం ఆమె కృషి చేశారు. కుల నిర్మూలన, ఛాందస వ్యతిరేక పోరాటం, మూఢవిశ్వాస నిర్మూలన, స్త్రీ జనోద్ధరణ, కుటుంబ నియంత్రణ, స్త్రీ విద్య కోసం పాటు పడ్డారు.
మల్లాది సుబ్బమ్మ 1924 ఆగస్టు 2న గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా పోతార్లంకలో జన్మించారు. బాపట్లకు చెందిన ఎం.వి.రామమూర్తిని ఆమె వివాహం చేసుకున్నారు. అత్తమామలు వ్యతిరేకించినప్పటికీ భర్త సహకారంతో పెళ్లైన తర్వాత ఉన్నత విద్యను అభ్యసించారు. 60పైగా రచనలు చేశారు. మల్లాది సుబ్బమ్మ మరణం పట్ల కవులు, రచయితలు సంతాపం ప్రకటించారు. మల్లాది సుబ్బమ్మ మరణం తీరని లోటని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ సంతాపం వ్యక్తం చేశారు.