ఊరు ఉంది
జ్ఞాపకం
మూడుంపావు అవుతోంది. లాస్ట్ పిరియడ్ అంజయ్య మాస్టారు గారి సోషల్ క్లాస్. బుర్రలో రకరకాల ఆలోచనలు. ఎలా కాళీని చూడాలి. కాళి తప్ప మనసుకు ఏమీ పట్టడం లేదు. ఆ... ఐడియా వచ్చింది. సార్.. అని పిలుస్తూ నెమ్మదిగా అంజయ్య మాస్టారి దగ్గరకు వెళ్లాను. స్టాఫ్ రూమ్‌లో ఉన్నారు. కొంచెం మంచి అభిప్రాయమే ఉంది కదా మనమంటే, ‘ఏంటమ్మా’ అన్నారు ప్రసన్నంగా. ‘తలనొప్పిగా ఉంది సార్. మీరు పర్మిషన్ ఇస్తే లాస్ట్ పావు గంట ఇంటికి వెళ్తాను’ అన్నాను. అరగంట ఆయన క్లాస్ వింటాననే సరికి వాత్సల్యం అంతా కళ్లల్లో ప్రకటిస్తూ సరేనమ్మ వెళ్లు అన్నారు. అనందభాష్పాలు రాలడం ఒక్కటే తక్కువ.
హమ్మయ్య ఇవాళ కాళిని చూడొచ్చు అనుకోగానే ఎక్కడలేని హుషారు వచ్చింది. ఉత్సాహంగా క్లాస్‌కి అటెండ్ అయ్యి, సోషల్ స్టడీస్‌లో కూడా డౌట్స్ అడిగి వెళ్లాల్సిన టైమ్ దగ్గర పడగానే నీరసంగా ముఖం పెట్టి కూర్చున్నాను. నా ముఖం చూసే సరికి సర్‌కి గుర్తొచ్చింది. ‘ఇంక వెళ్లమ్మా’ అన్నారు. ఓపిక లేనట్లు లేచి బుక్స్ తీసుకుని బయల్దేరాను. ఏమనుకున్నారో.. నేనూ వస్తానమ్మ. పదా.. నాన్నగారిని కలిసి చాలా రోజులు అయ్యింది అన్నారు. నా గుండె ఢాం అంది. బిత్తర చూపులు చూశాను. కారణం తెలిసిన నెప్పల్లి పద్మ నా ముఖం చూసి కిసుక్కున నవ్వింది. మిగతా పిల్లలు అర్థం కాక అయోమయంగా, అసూయగా చూస్తున్నారు. గొంతులోంచి మాట రావట్లేదు. ఏం చెప్పాలా అని ఆలోచిస్తున్నాను.
ఇది ఒక రోజుతో అయిపోయేది కాదు కదా! కాళి ఈ ఊళ్లో ఉన్నన్నాళ్లూ ఈ అబద్ధాలు తప్పవు. ఇంతలో వచ్చాడు ఆపద్బాంధవుడు, అనాథ రక్షకుడు, ఆర్తత్రాయ పరాయణుడు. మా స్కూల్ అటెండర్ నోటీసు పట్టుకుని. ఇదే ఛాన్స్ అనుకుని ఛలో... స్కూల్ బయటి వరకు నెమ్మదిగా నడుచుకుని వచ్చాను. పరుగు. ఇంక ఒకటే పరుగు. తెలిసినవాళ్లు ‘డాక్టరు గారి అమ్మాయి ఏంటి ఇలా పరుగెడుతోంది’ అని ఆశ్చర్యంగా చూస్తున్నారు. వీళ్లకేం తెలుసు. ఇంకా నాలుగు రోజుల్ల్లో కాళి వెళ్లిపోతాడని. ఆయాసపడుతూ వచ్చాను గేట్ దగ్గరికి. నన్ను చూడగానే ఏసు గేట్ తెరిచాడు. లాస్ట్ చెయిర్ ఖాళీగా ఉంటే కూర్చున్నాను. హమ్మయ్య ఇంకా కొంచెం టైమ్ ఉంది. జయసుధ, జయప్రదల క్లైమాక్స్ డాన్స్ పాట ఇంకా మొదలవలేదు. ఎన్.టి.రామారావు కాళీని పిలవడానికి టైమ్ ఉంది.
ఇదంతా.. అడవిరాముడు సినిమాలో కాళి... కాళి... కాళీ అనే పాట గురించి. ఏనుగుల గుంపు వచ్చి ఎన్.టి.ఆర్.కి హెల్ప్ చేసే పాట. ఇంతలో పాట స్టార్ట్ అయింది. అదిగో అనుకున్న టైమ్ వచ్చింది. పిలిచేశాడు ఎన్.టి.ఆర్. కాళీ అని. మైమరచి పోయి చూస్తున్నాను. ఒళ్లు గగుర్పొడిచే సీన్. ఏనుగుల హెల్ప్‌తో దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. కాళిని కరువు తీరా చూసి ఏనుగునెక్కిన ఆనందంతో ఇంటికి వచ్చాను. ఆ పాట కోసం ఇరవై నాలుగుసార్లు సినిమా మొత్తం చూశాను. లాస్ట్ లాస్ట్‌లో కేవలం పాట కోసం వెళ్లేదాన్ని. కాకపోతే లాస్ట్ పిరియడ్ అంజయ్య మాస్టారితో ఇబ్బంది. మంచి మాస్టారు. మల్లెపువ్వులాంటి పంచాలాల్చీలో బక్క పలుచని రూపం. నోరు విప్పితే ‘సంస్కృతం’. ఎక్కువగా అబ్బాయిలతోనే ఆ భాషలో మాట్లాడి వాళ్లని ఎడ్యుకేట్ చేసేవాళ్లు.
ఇంకా నాలుగు రోజుల్లో కొత్త సినిమా వేస్తారు, అడవిరాముడు తీసేస్తారు అనగానే మధ్యాహ్నం భోజనానికి వచ్చి ఇంక స్కూల్‌కి వెళ్లేదాన్ని కాదు. నాతో పాటు నా ఫ్రెండ్స్ నగరాజకుమారి, నెప్పల్లి పద్మ. ఏడుకొండలవాడ... వెంకటరమణ అనే పాట వినపడగానే వెళ్లి పోయేవాళ్లం. డాక్టర్ గారి అమ్మాయిని కదండీ, టికెట్స్ ఏమీ తీసుకోనక్కర్లా. అందులోనూ మ్యాట్నీ షో. పైగా గేట్‌దగ్గర మన ఆత్మబంధువు ఏసు ఉంటాడు. చూడగానే నవ్వుతూ లోపలికి పంపేవాడు. ఇంటర్వెల్‌లో సోడా తెచ్చేవాడు. ఎప్పుడైనా ఫస్ట్ షోకి వెళ్లి నిద్రపోతే లేపి జాగ్రత్తగా ఇంటికి తీసుకొచ్చేవాడు.
కాళిని కరువు తీరా చూసి ఏనుగు ఎక్కినంత ఆనందంగా ఇంటికి వచ్చేదాన్ని. ఇప్పుడు ఎన్.టి.ఆర్. లేడు. అంజయ్యగారు లేరు. ఏసు లేడు. కాళిని పిలిస్తే ఏనుగొచ్చి హెల్ప్ చెయ్యడం అనే కాన్పెప్టుని ఎంజాయ్ చేసే అమాయకపు జనాలూ లేరు. కానీ ఊరు ఉంది. ఊరిని తలుచుకోగానే నిండే మనసు, వచ్చే ఆనందము ఉంది. - కవిత