తిరుపతిలో జరిగిన రాయలసీమ ఆత్మగౌరవ సభకు భారీగా హాజరైన జనసందోహంలో ఓ భాగం
వికేంద్రీకరణకు మద్దతు దిశగా యావత్ రాష్ట్రం అడుగులు ముందుకు వేస్తోంది. మొన్న విశాఖ దిక్కులు పిక్కటిల్లేలా గర్జిస్తే, ఇప్పుడు తిరుపతి జనసంద్రంగా మారి కదంతొక్కింది. రాయలసీమ గుండె చప్పుడు ప్రతిధ్వనించింది. పదులు.. వందలు కాదు.. వేలాది మంది ఆధ్యాత్మిక నగరిలో మూడు రాజధానులకు మద్దతుగా పెద్ద పెట్టున నినదించారు. మహిళలు, విద్యార్థులు, వ్యాపారులు, కార్మికులు, కర్షకులు.. ఇలా ఒక్కరేంటి, అన్ని వర్గాల వారు రోడ్డుపైకి వచ్చి తమ ఆకాంక్షను బలంగా చాటారు. ‘సీఎం జగనన్న వికేంద్రీకరణ బాటలో నడుద్దాం.. న్యాయ రాజధాని సాధిద్దాం.. మన ఆత్మగౌరవం కాపాడుకుందాం.. స్వార్థ రాజకీయాలకు చరమగీతం పాడుదాం..’ అంటూ ప్రతినబూనారు.
సాక్షి ప్రతినిధి, తిరుపతి: ‘ఇటు రాయలసీమకు, అటు ఉత్తరాంధ్రకు న్యాయం జరగాలి. అది ఇప్పుడు కాకపోతే మరెప్పటికీ జరగదు. రాయలసీమను రతనాల సీమగా మార్చే సత్తా సీఎం వైఎస్ జగన్‌కు మాత్రమే ఉంది. మనం కొంత కాలంగా పోగొట్టుకున్న దానిలో కొంతైనా తిరిగి ఇవ్వాలని కోరడం కోసమే ఈ ఆత్మగౌరవ మహా ప్రదర్శన. ఇది రాయలసీమ గుండె చప్పుడు’ అని వికేంద్రీకరణను కాంక్షిస్తూ వేలాది మంది ప్రజలు నినదించారు.
తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ఆధ్వర్యంలో శనివారం తిరుపతి నగరంలో రాయలసీమ ఆత్మగౌరవ మహా ప్రదర్శన ర్యాలీ నిర్వహించారు. మూడు రాజధానులకు మద్దతుగా.. రాయలసీమ హక్కులు, కర్నూలులో న్యాయ రాజధాని సాధనే లక్ష్యంగా సాగిన ఈ మహా ప్రదర్శనకు అనూహ్య స్పందన లభించింది. తిరుపతి నగరంలోని కృష్ణాపురం ఠాణా నుంచి ప్రారంభమైన మహా ప్రదర్శన గాంధీ రోడ్డు మీదుగా నాలుగు కాళ్ల మండపం, తిలక్ రోడ్డు, తిరుపతి మున్సిపల్ కార్యాలయం వరకు సాగింది. తిరుపతి నగరంలోని ప్రతి గడప నుంచి ప్రజలు తరలి వచ్చారు.
స్థానికులు, మేధావులు, న్యాయవాదులు, ఉద్యోగ సంఘాలు, ప్రజా సంఘాలు, వివిధ కళాశాలల విద్యార్థులు, వ్యాపారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధుల రాకతో నగరం జనసంద్రంగా మారింది. ప్ల కార్డులు చేతబట్టి.. ‘కర్నూలును న్యాయ రాజధాని చేయాలి’ అని కొందరు, జై జగన్ అంటూ మరి కొందరు.. పదండి ముందుకు మూడు రాజధానుల కోసం’ అంటూ ఇంకొందరు నినదిస్తూ ముందుకు సాగారు. ఇసుక వేస్తే రాలనంతగా జనంతో మూడు కిలోమీటర్ల మేర ర్యాలీ సాగింది. దారి పొడవునా ప్రజలు మిద్దెలపై నుంచి పూల వర్షం కురిపిస్తూ ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, నగర మేయర్ శిరీష, డిప్యూటీ మేయర్ భూమన అభినయరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తిరుపతి గాందీరోడ్డులో సాగుతున్న రాయలసీమ ఆత్మగౌరవ మహా ప్రదర్శన
తిరుపతి వేదికగా సీమ రాజధానికి విత్తనం
తిరుపతి వేదికగా రాయలసీమ రాజధానికి విత్తనం నాటాం. మిగిలిన జిల్లాల వారూ నీరు పోస్తారు. తద్వారా రాజధాని మొక్క మహావృక్షమై కల సాకరమవుతుంది. సీఎం వైఎస్ జగన్ పాలన పట్ల, నిర్ణయం పట్ల ప్రజలకు పూర్తి విశ్వాసం ఉందనేందుకు ఈ మహా ప్రదర్శనే నిదర్శనం. తిరుపతి చరిత్రలో మునుపెన్నడూ రానంతగా జనం ఈ ఆత్మగౌరవ మహా ప్రదర్శనలో పాల్గొన్నారు. శ్రీబాగ్ ఒప్పందాన్ని అమలు చేయడం సీఎం జగన్‌కే సాధ్యం అని సీమ ప్రజలు నమ్ముతున్నారు. 14 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించిన చంద్రబాబు రాష్ట్రానికి, రాయలసీమకు చేసింది శూన్యం. సీమ గడ్డమీద పుట్టిన చంద్రబాబు సీమకే ద్రోహం చేశారు. ఈ రోజు సీమ ప్రజలు నీరు తాగుతున్నారంటే అది వైఎస్ రాజశేఖరరెడ్డి పుణ్యమే. వైఎస్ జగన్ దమ్మున్న నాయకుడు కాబట్టే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు, ప్రజలంతా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో మూడు రాజధానుల దిశగా ముందుకు వెళ్తున్నారు.
– భూమన కరుణాకరరెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే
రాష్ట్ర సమగ్రాభివృద్ధే సీఎం లక్ష్యం
రాష్ట్ర సమగ్రాభివృద్ధే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అడుగులు వేస్తున్నారు. రాయలసీమ మనోభావాలను గౌరవిస్తూ న్యాయ రాజధానిని రాయలసీమలో ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. దాన్ని వ్యతిరేకిస్తూ స్వార్థ ప్రయోజనాల కోసం ఒకే ప్రాంతంలో అభివృద్ధి మొత్తం కేంద్రీకరించాలనుకోవటం దుర్మార్గం. లక్షల కోట్ల రూపాయలు ఒకే ప్రాంతంలో ఖర్చు చేసి, తన అనుయాయుల రియల్ ఎస్టేట్ వ్యాపారానికి కొమ్ముకాసే విధంగా రాయలసీమలోని పుట్టి పెరిగిన చంద్రబాబు వ్యవహరించటం శోచనీయం. దుష్టచతుష్టయం సహకారంతో రాష్ట్ర ప్రజల మెదళ్లలో విషబీజాలు నాటుతున్న చంద్రబాబుకు, ఆయన కోటరీకి ఈ ఆత్మగౌరవ మహా ప్రదర్శన చెంపపెట్టు. మన పిల్లల ఉద్యోగ, ఉపాధి కోసం సీఎం జగన్ విశేషంగా కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా తిరుపతిలో ఐటీ కాన్సెప్ట్ సిటీని నిర్మించనున్నారు. పారిశ్రామిక అభివృద్ధి దిశగా 7 సెజ్‌లు నిర్మిస్తున్నారు.
– మద్దెల గురుమూర్తి, తిరుపతి ఎంపీ
సీమ ఆకాంక్షకు ఈ ప్రదర్శనే సాక్ష్యం
రాయలసీమకు న్యాయ రాజధాని కావాలని కోట్లాది మంది కోరుకుంటున్నారు. అందుకు ఈ ఒక్క నగరంలో ఈ మహా ప్రదర్శనే సాక్ష్యం. అమరావతి యజమానుల వద్ద బానిసలుగా ఉన్న తిరుపతిలోని కొందరు రాయలసీమ ఆకాంక్షను గుర్తించాలి. ప్రజలు ఏం కోరుకుంటున్నారో ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారులకు తెలియజెప్పాలి. ఇక్కడికి వచ్చిన ప్రజలంతా స్వచ్ఛందంగా వచ్చిన వారే. తిరుపతిలో శుక్రవారం సమావేశమైంది అఖిలపక్షం కాదు.. ఆ పేరుతో 2024లో పోటీ చేయనున్న మిత్రపక్షాలు. ఈ ప్రాంత వాసులై ఉండీ, ఈ ప్రాంతానికి వ్యతిరేకంగా పావులు కదపడం సిగ్గుచేటు. ముసుగు తీసి బయటకు వచ్చి, మా అజెండా ఇదీ అని చెప్పుకునే ధైర్యం లేని మీరు ప్రజలకు ఏం మేలు చేస్తారు?
– మాకిరెడ్డి పురుషోత్తంరెడ్డి, రాయలసీమ మేధావుల ఫోరం కన్వీనర్
వికేంద్రీకరణ ద్వారానే అభివృద్ధి
శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం 85 ఏళ్ల క్రితం రాయలసీమకు కృష్ణా, గోదావరి జలాల్లో అధిక వాటా ఇస్తామని చెప్పి, ఒక్క చుక్క కూడా ఇవ్వలేదు. రాయలసీమకు తరతరాలుగా అన్యాయం జరుగుతూనే ఉంది. రాయలసీమ ప్రజల గొంతు ఎండిపోకుండా ఉండేందుకు సీఎం వైఎస్ జగన్ చర్యలు తీసుకోవడం హర్షణీయం. వికేంద్రీకరణ ద్వారానే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
– శైలుకుమార్, మానవ వికాస వేదిక కన్వీనర్
Comments
Please login to add a commentAdd a comment