రెండు రాష్ట్రాల్లోనూ ఐజీలే నేతృత్వం వహించే అవకాశం
ఇబ్బందులు వస్తాయంటున్న నిపుణులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనతో రెండు రాష్ట్రాల నిఘా విభాగాధిపతుల హోదాలు పూర్వస్థితికి చేరుకోనున్నాయి. దీంతో కొత్తగా ఏర్పడబోయే ఆంధ్రప్రదేశ్‌తోపాటు తెలంగాణకూ ఐజీ స్థాయి అధికారులే ఇంటెలిజెన్స్ చీఫ్‌లుగా వ్యవహరించే అవకాశం ఉంది. ఏడేళ్ల క్రితం వరకు ఈ హోదా అధికారులే నిఘా విభాగాన్ని పర్యవేక్షించినా.. తర్వాత ఆ పోస్టును అదనపు డీజీ స్థాయికి పెంచారు. పోలీసు విభాగంలో డెరైక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు (డీజీపీ) తర్వాత అంతటి శక్తివంతమైనదిగా రాష్ట్ర నిఘా విభాగం చీఫ్ పోస్టును పరిగణిస్తారు. రాష్ట్రంలో ఐపీఎస్ సహా అనేక కీలక అధికారుల పోస్టింగ్స్, దేశంలోని ఇతర రాష్ట్రాల, కేంద్ర ఏజెన్సీలతో సమన్వయం చేసుకోవడంతోపాటు రాజకీయ, ఇతర పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రికి నివేదించడం, పలు కీలక సమయాలు, సందర్భాల్లో సలహాలు ఇవ్వడం నిఘా విభాగాధిపతి కీలక బాధ్యతలు. ముఖ్యమంత్రిని ప్రతిరోజూ డీజీపీ కలవాల్సిన అవసరం ఉండదు. అయితే నిఘా విభాగం చీఫ్ మాత్రం నిత్యం సీఎంను కలిసే తొలి అధికారిగా ఉంటారు. ఇంతటి కీలకమైన పోస్టుల్లో సాధారణంగానే ముఖ్యమంత్రులు తమకు అనుకూలమైనవారిని నియమించుకుంటారు.
మాజీ డీజీపీ కె.అరవిందరావుకు ముందు వరకు ఈ పోస్టు ఐజీ స్థాయికే పరిమితమైంది. ఆయన హయాంలోనే పరిపాలనాపరమైన కారణాల నేపథ్యంలో ప్రభుత్వం అదనపు డీజీ స్థాయికి పెంచింది. అరవిందరావు తర్వాత మహేందర్‌రెడ్డి సైతం అదనపు డీజీ హోదాలోనే కొనసాగుతున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండింటికీ రెండు ఇంటెలిజెన్స్ విభాగాలు ఏర్పడనున్నాయి. విశాఖపట్నం పోలీసు కమిషనర్‌గా పనిచేసి, ఇంటెలిజెన్స్‌కు బదిలీపై వచ్చిన శివధర్‌రెడ్డికి తెలంగాణ నిఘా విభాగాధిపతి పోస్టింగ్ దాదాపు ఖరారైనట్లే. ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణస్వీకారం తర్వాత దీనికి సంబంధించిన ఉత్తర్వులు వెలువడనున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే.. ప్రస్తుత ఇంటెలిజెన్స్ విభాగంలో ఐజీగా పనిచేస్తున్న ఓ అధికారిపై చంద్రబాబు ఆసక్తి చూపుతున్నట్లు తెలిసింది.
సాధారణ నిఘాతోపాటు రాజకీయ రంగంపైనా ఆయనకు మంచి పట్టు ఉండటం, సుదీర్ఘకాలంగా ఇంటెలిజెన్స్‌లో పనిచేయడంతో ఆయన్నే ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా నియమిస్తారనే వాదన వినిపిస్తోంది. ఇదే ఖరారైతే రెండు రాష్ట్రాలకూ నిఘా విభాగాధిపతులుగా ఐజీ ర్యాంకు అధికారులే కొనసాగనున్నారు. అయితే దీనివల్ల కొన్ని పరిపాలనాపరమైన ఇబ్బందులు వస్తాయని నిపుణులు చెప్తున్నారు. డీజీపీ తర్వాత అంతటి కీలకమైన పోస్టులో ఉండే వ్యక్తి అవసరమైన సందర్భాల్లో మిగిలినవారికి ఆదేశాలు జారీ చేయాల్సి వస్తుంది. ఐజీ స్థాయి అధికారులు ఇంటెలిజెన్స్ చీఫ్‌లుగా కొనసాగుతున్నప్పుడు అందరికీ ఆదేశాలు ఇవ్వడం సాధ్యపడదు. తెలంగాణ విషయానికి వస్తే రాజధానిగా ఉండే హైదరాబాద్ కమిషనర్‌గా అదనపు డీజీ స్థాయి అధికారి, దీనికి పొరుగున ఉన్న సైబరాబాద్‌కు సీనియర్ ఐజీ స్థాయి అధికారి ఉంటారు. వీరికి ఇంటెలిజెన్స్ చీఫ్ హోదాలో ఉన్న ఐజీ కేవలం సూచనలు ఇవ్వడం తప్ప ఆదేశాలు జారీ చేయలేరు. ఇప్పటికే విశాఖపట్నం కమిషనర్‌గా సీనియర్ ఐజీ స్థాయి అధికారి ఉంటున్నారు. కొత్త రాజధానిని ప్రకటించిన తర్వాత ఆ ప్రాంతాన్ని కమిషనరేట్‌గా చేస్తే కచ్చితంగా అదనపు డీజీ స్థాయివారినే కమిషనర్‌గా నియమించాల్సి ఉంటుంది. దీంతో అక్కడా ఇలాంటి ఇబ్బందులే వస్తాయని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.