జిల్లాలో పోలీస్ కమిషనర్ పాలన రానుంది. ఐజీ లేదా డీఐజీ స్థాయి పర్యవేక్షణలో కార్యకలాపాలు సాగనున్నాయి.
గోదావరిఖని : జిల్లాలో పోలీస్ కమిషనర్ పాలన రానుంది. ఐజీ లేదా డీఐజీ స్థాయి పర్యవేక్షణలో కార్యకలాపాలు సాగనున్నాయి. పారిశ్రామికీకరణతో పెరుగుతున్న జనాభా, ఇతర అవసరాలతో గోదావరిఖని కేంద్రంగా పోలీస్ కమిషనరేట్ కార్యాలయం ఏర్పాటుకు పోలీస్‌శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. కొత్తగా ఐదు మహిళా పోలీస్‌స్టేషన్లతోపాటు మొత్తం ఐదు సర్కిళ్లు, 27 పోలీస్‌స్టేషన్లు కమిషనరేట్ పరిధిలో ఉండనున్నాయి. రామగుండం, పెద్దపల్లి, మంథని, ధర్మపురి నియోజకవర్గాలను కలుపుతూ గోదావరిఖని కేంద్రంగా పోలీస్‌కమిషనరేట్ ఏర్పాటు చేయనున్నారు.
దీని పరిధిలో 27 పోలీస్‌స్టేషన్లు ఉండనుండగా, ఇందులో ఇన్‌స్పెక్టర్ ఎస్‌హెచ్‌వోగా ఉండే పోలీస్‌స్టేషన్లు 16, ఎస్సై ఎస్‌హెచ్‌వోగా ఉండే స్టేషన్లు 11 ఉండనున్నాయి. దీంతోపాటు కొత్తగా ఐదు మహిళా పోలీస్‌స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. రామగుండం నియోజకవర్గం పారిశ్రామికంగా ప్రగతి సాధించింది. సింగరేణి బొగ్గు గనులతోపాటు రామగుండం ఎన్టీపీసీ, జెన్‌కో ఆధ్వర్యంలో నడిచే బీ-పవర్‌హౌస్, కేశోరామ్ సిమెంట్ కర్మాగారాలు ఉన్నాయి. మరికొద్ది రోజుల్లో రామగుండం ఎరువుల కర్మాగారం కూడా పునరుద్ధరణకు నోచుకోనుంది. రామగుండం ఎన్టీపీసీలో మరో రెండు కొత్త యూనిట్లు రాబోతున్నాయి.
దీంతోపాటు తెలంగాణ ప్రభుత్వం కోసం ఎన్టీపీసీ నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ నెలకొల్పనుంది. తెలంగాణ జెన్‌కో ఆధ్వర్యంలో కూడా సూపర్‌క్రిటికల్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నారు. ఈ తరుణంలో రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఉద్యోగులు, కార్మికులతోపాటు వారిపై ఆధారపడే వారి సంఖ్య పెరుగుతుంది. ఇదే నియోజకవర్గంలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఎల్లంపల్లి ప్రాజెక్టు ఉంది. నాలుగు లైన్లతో రాజీవ్హ్రదారి విస్తరణ కూడా చేపట్టగా, నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. పక్కనే ఉన్న మంథని నియోజకవర్గంలో కూడా సింగరేణి గనులతోపాటు త్వరలో తాడిచర్ల వద్ద ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టు ఏర్పాటు కాబోతోంది.
కొత్తగా పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. దీనికి తోడు మంథని నియోజకవర్గంలోని తూర్పు డివిజన్‌లో గోదావరి నది సరిహద్దున మావోయిస్టుల కదలికలున్నాయి. సైబర్ క్రైమ్, ఆర్థిక నేరాలు, చోరీలు, మహిళా సమస్యలు, వాహనాలు పెరగడంతో ట్రాఫిక్ సమస్యలు పెరిగిపోనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఏఎస్పీ సారథ్యంలో సాగుతున్న గోదావరిఖని సబ్ డివిజన్‌ను కమిషనర్ పాలనలోకి తీసుకువచ్చే ఆలోచనను ప్రభుత్వం చేసింది. కనీసం 10 లక్షల జనాభా పరిధి ఉన్న ప్రాంతాలనే కమిషనరేట్‌గా చేసే నిబంధనలు ఉండగా గోదావరిఖని సబ్‌డివిజన్ పరిధిలో జనాభా తక్కువ కావడంతో పెద్దపల్లి, ధర్మపురి నియోజకవర్గాలను కూడా చేర్చారు. దీంతో కార్యాలయం ఏర్పాటు సులువు కానుంది.