కాస్గంజ్: ఉత్తరప్రదేశ్‌లోని కాస్గంజ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కాస్గంజ్‌లోని కస్బా మోహన్‌పురా గ్రామంలోని కొందరు మహిళలు మట్టిని తవ్వేందుకు వెళ్లారు. ఆ సమయంలో మట్టిలో కూరుకుపోయి ముగ్గురు మహిళలు, ఒక బాలిక మృతిచెందారు.
ఈ ప్రమాదంలో మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మరికొందరు మహిళలు మట్టిలో కూరుకుపోయారని స్థానికులు అంటున్నారు. వారిని బయటకు తీసేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి.
ఘటనా స్థలంలో కాస్గంజ్ జిల్లా అధికారి మేధా రూపమ్, ఎస్పీ అపర్ణ రజత్ కౌశిక్ ఉన్నారు. వీరు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. మట్టిని తవ్వేందుకు వెళ్లిన ప్రత్యక్ష సాక్షి, గాయపడిన మహిళ హేమలత మీడియాతో మాట్లాడుతూ దేవతాన్ పండుగ సందర్భంగా కాటోర్ రాంపూర్‌లోని మహిళలు తమ ఇంటిలోని పొయ్యిలకు రంగులు వేయడానికి పసుపు మట్టిని తవ్వడానికి వెళ్లారన్నారు.
ఈ సమయంలో ఒక్కసారిగా పైనుంచి భారీగా మట్టి పడిపోవడంతో ఈ ప్రమాదం చోటుచేసుకున్నదని తెలిపారు. ఈ ఘోర ప్రమాదంపై ముఖ్యమంత్రి యోగి విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపిన ఆయన, ఘటనాస్థలంలో సహాయక చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
ఇది కూడా చదవండి: ప్రేమలో విఫలమై కాశ్మీరీ యువతి ఆత్మహత్య..!
Comments
Please login to add a commentAdd a comment