దంతెవాడలో మావోయిస్టులకు ఎదురుదెబ్బ | 35 Dantewada Maoist Surrender To Chhattisgarh Police | Sakshi
Sakshi News home page

భారీ సంఖ్యలో లొంగిపోయిన మావోయిస్టులు

Published Mon, Oct 26 2020 12:39 PM | Last Updated on Mon, Oct 26 2020 1:13 PM

35 Dantewada Maoist Surrender To Chhattisgarh Police - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

చత్తీస్‌గఢ్‌‌: రాష్ట్రంలో మావోయిస్టు ప్రభావిత జిల్లా అయిన దంతెవాడలో పెద్ద సంఖ్యలో నక్సలైట్లు పోలీసుల ఎదుట లొంగిపోయారు. మావోయిస్టు పార్టీలోని వివిధ విభాగాలకు చెందిన 32 మంది లొంగిపోయినట్లు ఆదివారం పోలీసులు వెల్లడించారు. వారిలో 10 మంది మహిళలు ఉన్నట్లు తెలిపారు. మావోయిస్టు పార్టీ డొల్ల సిద్ధాంతాలతో విసిగి.. పోలీసులు ప్రకటించిన పునరావాస కార్యక్రమానికి ఆకర్షితులై వీరంతా లొంగిపోయినట్లు దంతెవాడ ఎస్పీ అభిషేక్‌ పల్లవ వెల్లడించారు. భద్రతా కారణాల రీత్యా వారి పేర్లు వెల్లడించేందుకు నిరాకరించారు. లొంగిపోయిన 32 మంది దండకారణ్య ఆదివాసీ కిసాన్‌ మజ్దూర్‌ సంఘటన్‌, క్రాంతికారి మహిళా ఆదివాసీ సంఘటన్‌, చేత్న నాట్య మండలి, జనతనా సర్కార్‌ గ్రూప్స్‌ తదితర విభాగాలకు చెందిన వారని ఎస్పీ తెలిపారు. 

తాజాగా లొంగిపోయిన వారిలో పలువురికి గతంలో పోలీసులు, పోలింగ్‌ సిబ్బందిపై దాడికి పాల్పడిన నేపథ్యం ఉంది. నలుగురిపై తలో లక్ష రూపాయల చొప్పున రివార్డు కూడా ఉందని ఎస్పీ తెలిపారు. లొంగిపోయిన వారికి తక్షణ సాయం కింద రూ.10వేలు చొప్పున అందించారు. ప్రభుత్వం ప్రకటించిన పునరావాస ప్యాకేజీని అందించనున్నారు. మావోయిస్టు కార్యకలాపాల్లో పాల్గొన్నవారు ప్రజా జీవనంలోకి రావాలని కోరుతూ స్థానిక పోలీసులు 'లాన్‌ వర్రటు' పేరిట కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ మేరకు నక్సల్‌ ప్రభావిత గ్రామాల్లో పెద్దఎత్తున పోస్టర్లు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం ప్రారంభించిన తర్వాత ఈ ఏడాది జూన్‌ నుంచి ఇప్పటి వరకు 150 మంది వరకు మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement