సాక్షి, మల్కన్‌గిరి: రాత్రివేళ గ్రామంలోకి రహస్యంగా చొరబడ్డ మావోయిస్టులపై గ్రామస్తులు రాళ్ల దాడి చేశారు. ఆంధ్రా-ఒడిశా సరిహద్దులోని చిత్రకొండ బ్లాక్ పరిధిలోని జొడొంబొ పంచాయతీ జంతురామ్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. వివరాలు.. శనివారం రాత్రి ముగ్గురు సాయుధ మావోయిస్టులు జంతురామ్ గ్రామంలోకి చొరబడ్డారు. ఆ గ్రామానికి చెందిన ఓ గిరిజనుడిని తమతోబాటు తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీన్ని ప్రతిఘటించిన గ్రామస్తులు మావోయిస్టులను అడ్డుకున్నారు. దీంతో మావోయిస్టులకు, గ్రామస్తులకు మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ క్రమంలో గ్రామస్తులు మావోయిస్టులపై రాళ్ల దాడి చేశారు. ఈ దాడిలో ఒక మావోయిస్టు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గాయపడిన మావోయిస్టును మల్కన్‌గిరి జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఇక మరో మావోయిస్టు సంఘటనా స్థలం నుంచి పరారయ్యాడు. కాగా గతంలో చిత్రకొండ మావోయిస్టులకు అడ్డాగా ఉండేది. కానీ జవానులు అక్కడ నిరంతరం కూంబింగ్ నిర్వహిస్తుండటంతో మావోల అలజడి తగ్గుముఖం పట్టింది. ఈ క్రమంలో వారి ఉనికిని చాటుకోడానికే మావోలు గ్రామంలోకి చొరబడినట్లు తెలుస్తోంది.
చదవండి: చిత్రకొండ పరిసరాల్లో ఆర్కే?
Comments
Please login to add a commentAdd a comment