
అల్లిపురం (విశాఖ దక్షిణం): టీడీపీ మంత్రులు, నాయకులను హెచ్చరిస్తూ సీపీఐ మావోయిస్టు ఈస్ట్ డివిజన్ కార్యదర్శి కైలాసం గురువారం రాత్రి ఒక లేఖ విడుదల చేశారు. మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు, మాజీ మంత్రి కిడారి శ్రావణ్‌కుమార్, గిడ్డి ఈశ్వరిలతో పాటు మండల నాయకులు కొర్ర బలరాం, మామిడి బాలయ్య, ముక్కల మహేష్, వండలం బాలయ్య, నళినిలను ఉద్దేశిస్తూ రాసిన ఆ లేఖలో మన్యంలో నడుస్తోన్న పోలీసు నిర్భందాన్ని ఎత్తివేయకపోతే టీడీపీ నాయకులపై ప్రజలు, సీపీఐ మావోయిస్టు పార్టీ తీసుకునే చర్యలకు వారే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు.
విశాఖ మన్యంలో 2017 మే నుండి ‘సమాధాన్’ దాడిలో భాగంగా రాజ్యనిర్బంధం అమలవుతోందని, గ్రామాలపై నిత్యం పోలీసులు దాడులు, అక్రమ అరెస్ట్‌లు, వేధింపులతో మన్యంలో పోలీసుల రాజ్యం నడుస్తోందని ఆయన ఆరోపించారు. గత సంవత్సరం ఆర్‌వీ నగర్, చాపగట్ట, సిరిబాల ఎస్టేట్ చుట్టుపక్కల 30 గ్రామాల ప్రజలు ఏపీఎఫ్‌డీసీ వద్ద కూలీలుగా పని చేయబోమని, కాఫీ తోటలపై హక్కు తమదేనని గొత్తెత్తినందుకు వారిపై మావోయిస్టు సానుభూతిపరులుగా ముద్రవేసి, చిత్రహింసలకు గురిచేస్తున్నారని కైలాసం పేర్కొన్నారు. మే 1వ తేదీ నాడు వంచుల పంచాయితీ పనసలొద్ది, కొత్తవాదురుపల్లి గ్రామాలపై పోలీసులు దాడులు చేసి ఆరుగురు రైతులను నిర్బంధించి చిత్రహింసలకు గురిచేశారని, వారి విడుదల కోసం ఆ గ్రామాల ప్రజలు రెండు రోజులు పాటు పోలీసుల చుట్టు తిరిగినా వాళ్లని పట్టించుకున్న వాళ్లే లేరన్నారు.
Comments
Please login to add a commentAdd a comment