ఏజెన్సీ గజగజ! | Police Checkings In AOB Visakhapatnam | Sakshi
Sakshi News home page

ఏజెన్సీ గజగజ!

Published Mon, Dec 3 2018 11:44 AM | Last Updated on Thu, Mar 28 2019 5:07 PM

Police Checkings In AOB Visakhapatnam - Sakshi

ఒడిశా సరిహద్దు ముంచంగిపుట్టులో తనిఖీలు చేపడుతున్న స్పెషల్‌ పార్టీ పోలీసులు

సాక్షి, విశాఖపట్నం/అరకులోయ/సీలేరు: విశాఖ ఏజెన్సీ గజగజ వణుకుతోంది. కొ న్నాళ్లుగా ఆరేడు డిగ్రీల ఉష్ణోగ్రతల నమోదుతో వణికించే చలి వల్ల కాదు.. మావోయిస్టులు, పో లీసుల వల్ల ఎలాంటి ఉపద్రవం ముంచుకొస్తుందోనన్న భయంతో మన్యసీమ వణుకుతోంది. పీఎల్‌జీఏ వారోత్సవాల ఆరంభానికి ముందే మావోయిస్టులు మన్యంలో తన ఉనికిని చాట డం మొదలు పెట్టారు. భారీ సాయుధ పోలీసు బలగాలు కూంబింగ్‌తో పాటు అడవులను జల్లె డ పడుతున్నా మావోయిస్టులు వెనక్కి తగ్గడం లేదు. ఆదివారం నుంచి వారం రోజుల పాటు పీఎల్‌జీఏ వారోత్సవాలు జరుగుతున్నాయి. అంతకుముందే అంటే శనివారం సాయంత్రమే పెదబయలు మండలం కోండ్రుం–ఇంజరిల మద్య అటవీ ప్రాంతంలో కూంబింగ్‌ పోలీసులు లక్ష్యంగా మావోయిస్టులు భారీ మందుపాతర్లను పేల్చారు. ఈ ఘటన నుంచి పోలీసులు త్రుటిలో తప్పించుకున్నారు. మూడు రోజుల క్రి తం కూడా జి.మాడుగుల మండలం నుర్మతి వద్ద మావోయిస్టులు మందుపాతర్లు పేల్చి పోలీ సులకు సవాలు విసిరారు.  పీఎల్‌జీఏ వారోత్సవాల సందర్భంగా మావోయిస్టులు సెల్‌టవర్ల పేల్చివేయనున్నారని సమాచారం అందినట్టు జిల్లా ఎస్పీ అట్టాడ బాబూజీ వెల్లడించారు.

పీఎల్‌జీఏ వారోత్సవాలను మావోయిస్టులు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు.ఈ వారం రోజుల్లో ఏదైనా భారీ ఘటనకు పాల్పడాలని పథక రచన చేస్తారు.
 మావోయిస్టులు సాదాసీదా భావించే పార్టీ విలీన వారోత్సవాల వేళ (సెప్టెంబర్‌ 21 నుంచి 27 వరకు) అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, సివేరి సోమలను డుంబ్రిగుడ మండలం లివిటిపుట్టులో సెప్టెంబర్‌ 23న పట్టపగలే కాల్చి చంపారు. అలాంటిది అంతకంటే కీలకంగా భావించే పీఎల్‌జీఏ వారోత్సవాల సమయంలో ఎలాంటి అఘాయిత్యాలకు దిగుతారోనని పోలీసులు ఆందోళన చెందుతున్నారు. అంతేకా దు.. అక్టోబర్‌ 12న మావోయిస్టు ఏవోబీ స్పెషల్‌ జోన్‌ కమిటీ సభ్యురాలు మీనాను పోలీసులు పనసపుట్టు–బెజ్జంగిల మధ్య ఎన్‌కౌంటర్‌ చేశారు. దీంతో ఏవోబీ మరింత ఉద్రిక్తంగా మారింది. ఇలా ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలను హతమార్చి మావోయిస్టులు, ప్రతిగా మీనాను ఎన్‌కౌంటర్‌ చేసి పోలీసులు ఒకరికొకరు సవాల్‌ విసురుకున్నట్టయింది. ఇప్పటికే మన్యంలో భారీగా పోలీసు బలగాలు మోహరించి ఉన్నాయి. ఏవోబీలో యాంటీ నక్సల్‌ స్క్వాడ్‌ పెట్రోలింగ్‌ను కూడా పెంచారు. దీంతో ఏజెన్సీ అంతటా వాతావరణం నివురుగప్పిన నిప్పులా ఉంది. ఏ క్షణాన ఏం జరుగుతుందోనంటూ గిరిజనులు భయాందోళన చెందుతున్నారు. 

అప్రమత్తంగా ఉండండి..
పీఎల్‌జీఏ వారోత్సవాల సందర్భంగా జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు అప్రమత్తంగా ఉండాలని పోలీసు అధికారులు ఇప్పటికే హెచ్చరించారు. ఏజెన్సీలోని మారుమూల గ్రామాల్లో సభలు, సమావేశాలు నిర్వహించరాదని, ఎక్కడికైనా వెళ్లాల్సి వస్తే ముందుగా తమకు సమాచారం ఇవ్వాలని సూచించారు. మంత్రుల ఇళ్ల వద్ద అదనపు భద్రతను పెంచారు.

ముమ్మరంగా వాహన తనిఖీలు
కొయ్యూరు, చింతపల్లి, జీకే.వీధి, జి.మాడుగుల,పెదబయలు,ముంచంగిపుట్టు మండలాలలతో పాటు,ఒడిశా సరిహద్దులో ఉన్న హుకుంపేట,డుంబ్రిగుడ,అరకులోయ ప్రాంతాలలో పోలీసులు రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు.అవుట్‌ పోస్టులలో అదనపు పోలీసు పార్టీలను అందుబాటులో ఉంచారు.  మారుమూల ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలతో పాటు,మండల కేంద్రాలలో సంచరించే అన్ని వాహనాలను   తనిఖీలు చేస్తున్నారు. ఒడిశాలోని కొరాపుట్,మల్కన్‌గిరి జిల్లాల పోలీసుశాఖ కూడా అప్రమత్తమైంది. ఒడిశా నుంచి అరకులోయ ప్రాంతం వైపు వచ్చే వాహనాలను,అరకుసంత సమీపంలోని జైపూర్‌ జంక్షన్‌ వద్ద తనిఖీలు నిర్వహిస్తున్నారు.  సీలేరు పరిసరాల్లో రోడ్డు నిర్మాణ పనుల్లో వినియోగిస్తున్న వాహనాలను  పోలీస్‌స్టేషన్‌ వద్దకు చేర్చారు.

సెల్‌టవర్ల వద్ద నిఘా
అల్లిపురం(విశాఖ దక్షిణం):  సెల్‌ టవర్ల పేల్చివేతకు మావోయిస్టులు సన్నాహాలు చేస్తున్నారని తెలియడంతో వాటి వద్ద నిఘాను ఏర్పాటు చేసినట్టు  జిల్లా ఎస్పీ అట్టాడ బాబూజీ ఓ ప్రకటనలో తెలిపారు.  ముఖ్యంగా గిరిజన యువత తమ గ్రామాల్లో ఉన్న సెల్‌ టవర్ల ధ్వంసం కాకుండా కాపాడుకోవాలని  సూచించారు.  అవాంఛనీయ సంఘటనలు జరుగుతున్నట్టు అనుమానం వచ్చిన వెంటనే  తమ దగ్గరలోని పోలీస్‌ స్టేషన్‌కు గానీ, అధికారులకు గానీ తెలియజేయాలని ఆయన కోరారు. పీఎల్‌జీఏ  వారోత్సవాల సందర్భంగా  ఏజెన్సీ ప్రాంతంలో సెల్‌ టవర్లను ధ్వంసం చేయడానికి మావోయిస్టులు పూనుకుంటున్నారని పేర్కొన్నారు. టవర్లను పేల్చివేస్తే సమాచార వ్యవస్థ స్తంభిస్తుందని, అత్యవసర సమాచారం తెలియక నష్టపోవలసి వస్తుందని తెలిపారు.  సెల్‌టవర్లు పేల్చివేయడం అనాలోచిత చర్యకు నిదర్శనమన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement