ఉరకలెత్తి.. తెరమరుగై..! | Maoist Groups in Nalgonda | Sakshi
Sakshi News home page

ఉరకలెత్తి.. తెరమరుగై..!

Published Wed, Oct 26 2016 2:51 AM | Last Updated on Wed, Aug 29 2018 4:18 PM

ఉరకలెత్తి.. తెరమరుగై..! - Sakshi

ఉరకలెత్తి.. తెరమరుగై..!

సాక్షి, యాదాద్రి : సుమారు మూడు దశాబ్దాల క్రితం నల్లగొండ జిల్లా పోరుబిడ్డలకు పుట్టినిల్లుగా ఉండేది. అప్పట్లో పురుడుపోసుకున్న ఆలేరు, రాచకొండ, కనగల్, కృష్ణపట్టె, గిరాయపల్లి దళాలు 1990 నుంచి 2005 వరకు ఉద్యమాన్ని ఉర్రూతలూగించాయి. అయితే పోలీసుల ఎన్‌కౌంటర్లు, వర్గశుత్రు నిర్మూలన పేరుతో ఆలేరు నుంచి దేవరకొండ వరకు దాదాపు 200 మందికి పైనే ఉద్యమకారులు నేలకొరిగారు. తాజాగా ఏఓబీ ( ఆంధ్ర- ఒడిశా సరహద్దు)లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో హతమైన శ్యామల కిష్టయ్యతో మావోల ఉద్యమం మరో అగ్రనేతను కోల్పోయింది.  
 
 ఇంకా ఎవరెవరున్నారంటే..
 మావోయిస్టు ఉద్యమంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన పన్నాల యాదయ్య, షేక్ జాన్‌బీ(గుర్రంపోడు)బోడ అంజయ్య(పీఏపల్లి)భాస్కర్(చిట్యాల)పాక హన్మంతు కొనసాగుతున్నారు. ఉద్యమంలో ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్క్కొన్న మావోయిస్టులు ఒక్కొక్కరుగా నెలకొరుగుతున్నారు. అయితే కేంద్ర కమిటీ, వేర్వేరు ప్రాంతాల్లో పనిచేస్తున్న మరికొంత మంది మావోయిస్టులు ఇంకా ఉద్యమంలో కొనసాగుతున్నారు.
 
 అసువులుబాసిన వారిలో కొందరు..
  దాసిరెడ్డిగూడేనికి చెందిన శ్యామల కిష్టయ్య మావోయిస్టు కేంద్రకమిటీ సభ్యుడిగా పనిచేస్తూ  తాజాగా పోలీస్ ఎదురుకాల్పుల్లో హతమయ్యారు. అదే విధంగా మిర్యాలగూడకు చెందిన రాష్ట్ర కార్యదర్శి పులి అం జయ్య, పోచంపల్లి మండలం శివారెడ్డిగూడేనికి చెందిన మేకల దామోదర్‌రెడ్డి, వలిగొండ మండలం తుర్కపల్లి గ్రామానికి చెందిన హైదరాబాద్ సిటిసెక్రటరీ తుమ్మలవీరారెడ్డి, వలిగొండ మండలం పొద్దటూరుకు చెందిన వెంకన్న, గుండాల మండలం అంబాలకు చెందిన హైదరాబద్ సిటీ కమిటీ సభ్యు లు మజ్జిగరాజు, వలి గొండ మండలం రెడ్టరేపాకకు చెందిన నాగార్జునరెడ్డి, భువనగిరికి చెందిన భానుప్రసాద్ జిల్లాకు చెందిన పలువురు నేతలు పోలీస్ ఎదురు కాల్పుల్లో అసువులుబాసారు.
 
 చిన్నబోయిన దాసిరెడ్డిగూడెం
 మావోయిస్టు (పీపుల్స్ వార్) ఉద్యమానికి ఎందరో ఉద్యమ నాయకులను అందించిన దాసిరెడ్డిగూడెం నేడు చిన్నబోయింది. ఏఓబీలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు కేంద్రకమిటీ సభ్యుడు శ్యామల కిష్టయ్య అలియాస్ దయ మృతిచెందిన విషయం తెసిందే. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో  మావోయిస్టు ఉద్యమానికి ఊపిరులూదిన ఉద్యమకారులు ఒక్కొక్కరు పోరుబాటలో కన్నుమూస్తున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఆలేరు నుంచి మూసీని దాటుతూ రాచకొండమీదుగా నల్లమలకు చేరిన పీపుల్స్ వార్ ఉద్యమం కాలక్రమంలో తగ్గుతూ వచ్చింది. సాయుధపోరాటం ద్వారానే రాజ్యాధికారం సాధిస్తామని నమ్మి  ఉద్యమాన్ని నడిపిన యాదాద్రి జల్లా  వలిగొండ మండలం దాసిరెడ్డిగూడెంది మాత్రం అత్యంత ప్రత్యేకం.
 
  ఈ గ్రామం నుంచి మావోయిస్టు ఉద్యమంలోకి నలుగురు నేతలను అందించింది.  మిలిటెంట్ స్థాయి నుంచి రాష్ట్రకార్యదర్శి, కేంద్రకమిటీ సభ్యుల స్థాయికి ఎదిగారు.1990  శ్యామల కిష్టయ్య ముందుగా ఉద్యమం వైపు ఆకర్షితుడయ్యాడు. అతని బాటలో గ్రామానికి చెందిన కొనపురి అయిలయ్య అలియాస్ సాంబశివుడు, అతడి సోదరుడు కోనపురిరాములు, గ్రామానికి చెందిన రాపోలు స్వామిలు ఉన్నారు. విద్యార్థి జీవితంలో ఉద్యమంలోకి వెళ్లిన కిష్టయ్య పార్టీలో కేంద్రకమిటీ సభ్యుని స్థాయికి  ఎదిగారు. ఇతడి తలపై ప్రభుత్వం రూ.20 లక్షల రివార్డు ప్రకటించింది. ఇదే గ్రామానికి చెందిన సాంబశివుడు పార్టీ రాష్ట్ర కార్యదర్శి స్థాయికి ఎదిగారు.
 
  సాంబశివుడి తలపై ప్రభుత్వం రూ.50 లక్షల రివార్డును ప్రకటించింది. ఉద్యమ బాటను వీడి జనజీవన స్రవంతిలో కలిసిన సాంబశివుడు 2011లో ప్రత్యర్థుల చేతిలో హత్యకు గురయ్యాడు. కోనపురి రాములును 2014లో నయీమ్ ముఠా హత్య చేసింది. కాగా గ్రామానికి చెందిన రాపోలు స్వామి శ్యామల కిష్టయ్యకు అంగరక్షకుడిగా ఉంటూ పోలీస్‌ల ఎన్‌కౌంటర్‌లో 2009 లో చనిపోయాడు. ఆ ఎన్‌కౌంటర్ లో కిష్టయ్యతో పాటు పలువురు తప్పించుకుపోయారు.  ఇలా నలుగురు ఉద్యమకారులను అందించిన దాసిరెడ్డిగూడెం రెడ్లరేపాక గ్రామ పంచాయతీలో చిన్న మధిర గ్రామం.
 
 జిల్లాలో జరిగిన ముఖ్య ఎన్‌కౌంటర్లు
  జిల్లాలో పలు ప్రధాన ఎన్‌కౌంటర్లలో పీపుల్స్ వార్ ముఖ్యనాయకులను కోల్పోయింది. చిట్యాల మండలం బ్రాహ్మణవెల్లంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 18 మంది నక్సలైట్లు చనిపోయారు. మర్రిగూడ మండలంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో జననాట్యమండలి కార్యదర్శి, నల్లగొండ జిల్లా కార్యదర్శి దివాకర్‌తో పాటు 8 మంది హతమయ్యారు. వార్‌లో పనిచేస్తూ పోలీస్ ఇన్‌ఫార్మర్‌గా మారిన సోమ్లానాయక్ పావురాలగుట్టపై ఐదుగురు నక్సలైట్లను కాల్చిచంపాడు. మగ్దుంపల్లి వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో అప్పటి జిల్లా కార్యదర్శి కరీంనగర్ జిల్లా మెట్‌పల్లికి చెందిన ముక్క కిరణ్‌కుమార్ చనిపోయాడు. ఇంకా భువనగిరి, ఆలేరు, దేవరకొండ, చౌటుప్పల్, నల్లగొండ ప్రాంతాల్లో పలువురు మావోయిస్టులు ఎన్‌కౌంటర్లలో చనిపోయారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement