మావోయిస్టు యాక్షన్ టీం సభ్యుల ఫొటోల పోస్టర్ ఆవిష్కరిస్తున్న ఎస్పీ
సాక్షి, ఆసిఫాబాద్: మావోయిస్టుల సమాచారం తెలిపిన వారికి రూ.5లక్షల బహుమతి ఇస్తామని ఎస్పీ మల్లారెడ్డి పేర్కొన్నారు. ఇటీవల భూపాలపల్లి జిల్లాలో పోలీసుల తనిఖీల్లో ఇద్దరు యాక్షన్ టీం సభ్యులు పట్టుబడ్డ నేపథ్యంలో బుధవారం జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్‌క్వార్టర్స్ సమావేశ మందిరంలో జిల్లా అదనపు ఎస్పీ గోద్రుతో కలిసి నిర్వహించిన సమావేశంలో నిషేధిత మావోయిస్టు పార్టీ యాక్షన్ టీం సభ్యుల పోస్టర్ ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మావోయిస్టు పార్టీకి చెందిన యాక్షన్ టీం సభ్యులు విధ్వంసానికి పాల్పడే అవకాశాలు ఉన్నాయన్నారు. యాక్షన్ టీంల సంచారంపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంత వాతావరణలో జరిగేందుకు ప్రజలు సహకరించాలన్నారు.
ప్రజాపోరాటం ముసుగులో శాంతి యుతవాతావరణం విచ్ఛిన్నం చేసేలా మావోయిస్టులు ప్రజాఆస్తులను విధ్వంసం చేసి సాధించేది శూన్యమన్నారు. జిల్లాలో నిషేధిత మావోయిస్ట్ పార్టీకి చెందిన వ్యక్తులు యాక్షన్ టీమ్ సభ్యులుగా ఏర్పడి రాజకీయ నాయకులు, ప్రభుత్వ ఆస్తులే లక్ష్యంగా చేసుకొని పనిచేయుటకు అవకాశం ఉన్నందున ముందస్తుగా జిల్లా ఇతర రాష్ట్రాలతో సరిహద్దును పంచుకున్న గ్రామాల్లో వారి కదలికలను పసిగట్ట వారి చర్యలను నిర్వీర్యం చేసేందుకు పోలీసులు అప్రమత్తంగా ఉండాలన్నారు. మావోయిస్టులను గుర్తించేందుకు వీలుగా వారి ఫొటోలతో కూడిన పోస్టర్‌ను ఉత్తర తెలంగాణలోని అన్ని జిల్లాల్లో విడుదల చేసినట్లు ఎస్పీ తెలిపారు. పోస్టర్లలో ఉన్న మావోయిస్టుల సమాచారం తెలిపిన వారికి పారితోషికం ఇవ్వడంతోపాటు, వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. ఈ సందర్భంగా ప్రొజెక్టర్ ద్వారా మావోయిస్టుల చిత్రాలను చూపించారు. సమావేశంలో రిజర్వ్ ఇన్పెక్టర్ శేఖర్‌బాబు, ఐటీకోర్ సభ్యుడు శ్రీనివాస్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment