
సాక్షి, భూపాలపల్లి : పట్టుకోసం మావోయిస్టులు పలు చర్యలతో ప్రయత్నిస్తుండగా.. భద్రతాబలగాలు ఎప్పటికప్పుడు తిప్పికొడుతుండడంతో ఏజెన్సీలో మళ్లీ అలజడి పెరుగుతోంది. తాజాగా జరిగిన చర్ల సంఘటనతో భద్రతా బలగాలు మరింత అప్రమత్తమయ్యాయి. ఇటీవల మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ అటవీ ప్రాంతంలో మావోయిస్టు ముఖ్యనేతలు సంచరించారనే వార్తలు వచ్చిన నేపథ్యంలోనే.. చర్లలోని టీఆర్‌ఎస్ ఎంపీటీసీ కిడ్నాప్ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. మరోవైపు ఈనెల 28 నుంచి మావోయిస్టు అమరవీరుల వారోత్సవాలు ఉన్నాయి. దీంతో భద్రతా దళాలు సైతం అప్రమత్తమయ్యాయి.
ఉమ్మడి భూపాలపల్లి జిల్లాపై పట్టు పెంచుకునేందుకు మావోయిస్టులు ప్రయత్నిస్తున్న వాతావరణం కనిపిస్తోంది. రెండు జిల్లాల పరిధి పలు మండలాల్లో కరపత్రాలు లభించడం, గత నెల తాడ్వాయి మండలంలో వాచ్‌మెన్‌పై దాడి ఘటన ఇందుకు బలం చేకూర్చుతున్నాయి. తాజాగా వాజేడు– వెంకటాపురం కమిటీని ఏర్పాటు చేయడం కూడా విస్తరణలోనే భాగమే అని తెలుస్తోంది. ఇటీవల కాలంలో జిల్లాలో అక్కడక్కడా మావోల ఉనికి కనిపిస్తుండడంతో భద్రతా బలగాలు పటిష్టమైన చర్యలు చేపట్టాయి.
ఇటీవల సరిహద్దు మండలం చర్లలో టీఆర్‌ఎస్ నాయకుడి అపహరణ, హత్యనేపథ్యంలో కూంబింగ్‌ను మరింత విస్తృతం చేశారు. సీఆర్‌పీఎఫ్, స్పెషల్ పార్టీ పోలీసులు ఎప్పటికప్పుడు అటవీ గ్రామాలతో పాటు, అడవులను జల్లెడ పడుతున్నారు. మరోవైపు మావోయిస్టు వారోత్సవాలు దగ్గర పడుతుండటంతో సరిహద్దు మండలాల్లో నిఘా మరింత పెంచారు. ఛత్తీస్‌గఢ్, భద్రాచలం, ములుగు జిల్లాల సరిహద్దులో పెద్ద ఎత్తున కూంబింగ్ నిర్వహిస్తున్నారు.
గోదావరి పరీవాహక ప్రాంతంలో మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలను అనుకుని ఉన్న ప్రాంతాల్లో కూంబింగ్‌ను ముమ్మరం చేశారు. ఏటూరునాగారం ముల్లకట్ట వంతెన సమీపంలో, వాజేడు, వెంకటాపురం, ఏటూరునాగరం, కన్నాయిగూడెం, పలిమెల, మహాముత్తారం మండలాల్లో వాహన తనిఖీలు విస్తృతగా చేపడుతున్నారు. ఇంటలిజెన్స్ వర్గాలు సైతం గ్రామాల్లో తిరుగుతూ.. ఎవరు వస్తున్నారు.. ఎక్కడి వారు.. ఎవరిని కలుస్తున్నారనే విషయాలపై సమాచారం సేకరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment