అధికారులతో సమీక్ష అనంతరం బయటకు వస్తున్న డీజీపీ మహేందర్ రెడ్డి, కలెక్టర్ ఎం.వి. రెడ్డి
మావోయిస్టులను ఎదుర్కొనే విషయంలో సరిహద్దు రాష్ట్రాల పోలీసులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ బలగాలు సమన్వయంతో ముందుకెళ్లడం ఆనవాయితీ. అయితే ప్రస్తుతం కొత్తగా మరో విధానాన్ని పోలీసులు అవలంబించనున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఇతర శాఖలతో కలిసి ఏజెన్సీ ప్రజలకు మరింత చేరువై.. నక్సలిజాన్ని అడ్డుకునేందుకు ప్రణాళికలు తయారు చేసుకుంటున్నారు.
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: ప్రస్తుతం ఎండాకాలం. ఇది ఆకురాలే సమయం కావడంతో పోలీసు బలగాలకు, మావోయిస్టులకు మధ్య హోరాహోరీ పోరు కొనసాగే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో సరిహద్దు ప్రాంతాల్లో దీన్ని ‘ప్రాణాలు తీసే సీజన్’గా సంబోధిస్తారు. ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలో బలగాలు, మావోయిస్టులకు మధ్య పోరు నడుస్తోంది. ఈ క్రమంలో మావోయిస్టులు ప్రత్యేకంగా యాక్షన్ టీమ్‌లను దండకారణ్యం నుంచి తెలంగాణ జిల్లాల్లోకి పంపించే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. గోదావరి పరీవాహక ప్రాంతంలోని అభయారణ్యం గుండా భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్ జిల్లాల్లోకి ప్రవేశించడంతో పాటు కొత్త రిక్రూట్‌మెంట్లు చేపట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఈ చర్యలను నియంత్రించేందుకు తెలంగాణ పోలీసులు నిరంతరం డేగకళ్లతో పహారా కాస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి సైతం నిరంతరం సమీక్ష చేస్తున్నారు. గతంలోనూ పలుసార్లు జిల్లాలో పర్యటించిన డీజీపీ.. సరిహద్దు జిల్లాల పోలీసు ఉన్నతాధికారులతో సమావేశాలు నిర్వహించారు. తాజాగా సోమవారం కూడా ఆయన కొత్తగూడెం వచ్చారు. భద్రాద్రి, మహబూబాబాద్ జిల్లాల ఎస్పీలు, ఇతర పోలీసు అధికారులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ఏజెన్సీలో మావోల యాక్షన్ టీమ్‌లను అడ్డుకోవడంతో పాటు, ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు విషయంలో పాలుపంచుకుంటూ గిరిజనులకు చేరువయ్యేందుకు, ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నారు.
ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ కీలక పాత్ర..
ప్రభుత్వం చేపడుతున్న పల్లెప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలతో పాటు ఇతర సంక్షేమ పథకాలను అర్హులకు అందించే విషయంలో తమవంతు పాత్ర పోషించేందుకు పోలీస్ శాఖ సిద్ధమైంది. ఈ క్రమంలోనే ఈనెల 13న ఐజీ స్టీఫెన్ రవీంద్ర ఇల్లెందు మండలం బాలాజీనగర్, బొజ్జాయిగూడెం గ్రామాల్లో పర్యటించారు. ప్రల్లెప్రగతి, నర్సరీలు, డంపింగ్ యార్డుల వివరాలు తెలుసుకున్నారు. తాజాగా జిల్లా కేంద్రానికి వచ్చిన డీజీపీ సైతం పల్లెప్రగతి, పట్టణ ప్రగతి, ఇతర సంక్షేమ పథకాలను ప్రజలకు అందించడంలో తమవంతుగా కీలక పాత్ర పోషించనున్నట్లు తెలిపారు. తద్వారా ఏజెన్సీ ప్రజలకు చేరువయ్యేందుకు ప్రణాళికలు తయారు చేసుకుంటున్నారని సమాచారం. కాగా, జిల్లా కలెక్టర్ ఎం.వి.రెడ్డి సైతం డీజీపీని కలిసి జిల్లాలో ప్రభుత్వ కార్యక్రమాల అమలు గురించి వివరించడం గమనార్హం. ఇదిలా ఉండగా సరిహద్దుల్లో, గోదావరీ పరీవాహక ప్రాంత జిల్లాల్లో పోలీసులు భారీగా కూంబింగ్, సెర్చ్ అపరేషన్లు సైతం నిర్వహిస్తున్నారు.
ప్రాజెక్టులకు రక్షణగా...
జిల్లాలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సీతారామ ఎత్తిపోతల పథకం, మణుగూరు సమీపంలో భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ ప్రాజెక్టుల రక్షణ బాధ్యతలు సైతం పోలీసులే పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. పనుల పురోగతి గురించి తెలుసుకునేందుకు వివిధ స్థాయిల ఉన్నతాధికారులు సైతం క్షేత్రస్థాయికి వస్తున్నారు. ఈ నెలాఖరులో ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా జిల్లాకు రానున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పోలీసు యంత్రాంగం మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. కాగా అధికార పార్టీ నాయకులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. అత్యవసరమైతే తప్ప గ్రామాల్లో తిరగవద్దని, బయటికి వెళితే తమకు తప్పనిసరిగా సమాచారం ఇవ్వాలని చెపుతున్నారు. ఈ పరిస్థితుల్లో సరిహద్దు జిల్లాల్లో హై అలర్ట్ నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment