Khamamm
-
శాసన వ్యవస్థపై ‘గవర్నర్ల’ దాడి
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ‘దేశవ్యాప్తంగా సమాఖ్య వ్యవస్థ మీద దాడి జరుగుతోంది. కేరళపై ఇది ఇంకా తీవ్రంగా ఉంది. గవర్నర్ల రూపంలో శాసన వ్యవస్థలో జోక్యం చేసుకోవడం నానాటికీ పెరుగుతోంది. బీజేపీ, ఆర్ఎస్ ఎస్ ఎజెండాను గవర్నర్ల ద్వారా అమ లు చేసే ప్రయత్నం చేస్తున్నారు. గవర్నర్లను రాజకీయ ఏజెంట్లుగా వాడుకుని, చట్టసభల కన్నా ఉన్నతంగా చూపేందుకు కేంద్రం కుట్రపన్నుతోంది. యూనివర్సిటీ చాన్స్లర్ల పేరుతో ఉన్నత విద్యపై ఆధిపత్యాన్ని సంపాదించుకోవాలని చూస్తోంది. ఇది రాజ్యాంగంలోని సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం’అని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కేంద్ర ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తారు. గురువారం ఖమ్మంలో తెలంగాణ వ్యవసాయ కార్మికసంఘం మూడవ రాష్ట్ర మహాసభలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ కాలేజీ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో విజయన్ మాట్లాడారు. బీజేపీయేతర పాలిత రాష్ట్రాలపై కేంద్రం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. దేశంలో చారిత్రక ఉద్యమాలకు సీపీఎం నాంది పలికిందని, తెలంగాణ, కునప్రవేల, తెబాగలో జరిగిన పోరాటాలు ఇందుకు మచ్చుతునకలని అన్నారు. ఖమ్మంలో జరిగిన బహిరంగ సభకు హాజరైన ప్రజలు గురుతర బాధ్యత ఖమ్మం ప్రజలదే.. ఈ దేశంలో తామే ప్రతిపక్షమని చెప్పుకుంటున్న కాంగ్రెస్ ఎప్పుడూ నిజమైన ప్రతిపక్షంగా లేదని, బీజేపీకి రిక్రూట్మెంట్ ఏజెన్సీగా పనిచేస్తోందని విజయన్ ఆరోపించారు. బీజేపీలోకి కాంగ్రెస్ తన కేడర్‌ను పంపిస్తోందన్నారు. వామపక్షాల్లో సీపీఎం మాత్రమే నిజమైన ప్రతిపక్షంగా దేశంలో కనిపిస్తోందని.. బీజేపీ, ఆర్ఎస్ఎస్ వాదానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తోందని చెప్పారు. వచ్చే పార్లమెంట్, శాసనసభ ఎన్నికల్లో సీపీఎంను దేశవ్యాప్తంగా, తెలంగాణలోనూ బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. ముఖ్యంగా ఖమ్మం ప్రజలపై ఈ గురుతర బాధ్యత ఉందని చెప్పారు. కార్మికులు, శ్రామికులు, రైతులు హక్కుల కోసం పోరాడాలని, అలాంటి పోరాటాలకు ఖమ్మం సభ నాంది కావాలని పిలుపునిచ్చారు. కాగా, సుస్థిర అభివృద్ధిలో దేశంలో కేరళ ది బెస్ట్ అని ఐక్యరాజ్య సమితి ప్రశంసించిందని, అలాగే ఎన్డీఏ ఆధీనంలోని నీతి ఆయోగ్ కూడా కేరళ నంబర్‌వన్ రాష్ట్రంగా అభివర్ణించిందని చెప్పారు. కేరళలోని ప్రభుత్వరంగ సంస్థలను మోదీ ప్రభుత్వం విక్రయించాలని చూస్తే తమ ప్రభుత్వమే వాటిని కొనుగోలు చేసిందన్నారు. సభకు వ్యవసాయ కార్మికసంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి.నాగయ్య అధ్యక్షత వహించారు. కమ్యూనిస్టులు మద్దతు ఇచ్చే వారిదే గెలుపు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ఓటమి చవిచూపిస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చెప్పారు. మునుగోడులో కమ్యూనిస్టుల మద్దతుతోనే గెలిచామని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చెప్పారన్నారు. పొత్తులు ఎన్నికల సమయంలోనే ఉంటాయని, వీటిపై ఇప్పటివరకు ఎక్కడా చర్చించలేదని చెప్పారు. నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో కమ్యూనిస్టులు ఎవరికి మద్దతు ఇస్తే వారిదే గెలుపు అని జోస్యం చెప్పారు. మహాసభకు రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ కార్మికసంఘం, సీపీఎం శ్రేణులు భారీగా తరలివచ్చాయి పెవిలియన్ గ్రౌండ్ నుంచి సభా ప్రాంగణం వరకు రెడ్‌షర్ట్ వలంటీర్లు కవాతు నిర్వహించారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మికసంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి వెంకట్, పార్టీ నేతలు పోతినేని సుదర్శన్, నున్నా నాగేశ్వరరావు పాల్గొన్నారు. -
పొలిటికల్ కారిడార్ : ఖమ్మం టీఆర్ఎస్ లో కొత్త టెన్షన్
-
దండకారణ్యం నుంచి తెలంగాణ జిల్లాల్లోకి
మావోయిస్టులను ఎదుర్కొనే విషయంలో సరిహద్దు రాష్ట్రాల పోలీసులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ బలగాలు సమన్వయంతో ముందుకెళ్లడం ఆనవాయితీ. అయితే ప్రస్తుతం కొత్తగా మరో విధానాన్ని పోలీసులు అవలంబించనున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఇతర శాఖలతో కలిసి ఏజెన్సీ ప్రజలకు మరింత చేరువై.. నక్సలిజాన్ని అడ్డుకునేందుకు ప్రణాళికలు తయారు చేసుకుంటున్నారు. సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: ప్రస్తుతం ఎండాకాలం. ఇది ఆకురాలే సమయం కావడంతో పోలీసు బలగాలకు, మావోయిస్టులకు మధ్య హోరాహోరీ పోరు కొనసాగే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో సరిహద్దు ప్రాంతాల్లో దీన్ని ‘ప్రాణాలు తీసే సీజన్’గా సంబోధిస్తారు. ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలో బలగాలు, మావోయిస్టులకు మధ్య పోరు నడుస్తోంది. ఈ క్రమంలో మావోయిస్టులు ప్రత్యేకంగా యాక్షన్ టీమ్‌లను దండకారణ్యం నుంచి తెలంగాణ జిల్లాల్లోకి పంపించే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. గోదావరి పరీవాహక ప్రాంతంలోని అభయారణ్యం గుండా భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్ జిల్లాల్లోకి ప్రవేశించడంతో పాటు కొత్త రిక్రూట్మెంట్లు చేపట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ చర్యలను నియంత్రించేందుకు తెలంగాణ పోలీసులు నిరంతరం డేగకళ్లతో పహారా కాస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి సైతం నిరంతరం సమీక్ష చేస్తున్నారు. గతంలోనూ పలుసార్లు జిల్లాలో పర్యటించిన డీజీపీ.. సరిహద్దు జిల్లాల పోలీసు ఉన్నతాధికారులతో సమావేశాలు నిర్వహించారు. తాజాగా సోమవారం కూడా ఆయన కొత్తగూడెం వచ్చారు. భద్రాద్రి, మహబూబాబాద్ జిల్లాల ఎస్పీలు, ఇతర పోలీసు అధికారులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ఏజెన్సీలో మావోల యాక్షన్ టీమ్‌లను అడ్డుకోవడంతో పాటు, ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు విషయంలో పాలుపంచుకుంటూ గిరిజనులకు చేరువయ్యేందుకు, ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ కీలక పాత్ర.. ప్రభుత్వం చేపడుతున్న పల్లెప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలతో పాటు ఇతర సంక్షేమ పథకాలను అర్హులకు అందించే విషయంలో తమవంతు పాత్ర పోషించేందుకు పోలీస్ శాఖ సిద్ధమైంది. ఈ క్రమంలోనే ఈనెల 13న ఐజీ స్టీఫెన్ రవీంద్ర ఇల్లెందు మండలం బాలాజీనగర్, బొజ్జాయిగూడెం గ్రామాల్లో పర్యటించారు. ప్రల్లెప్రగతి, నర్సరీలు, డంపింగ్ యార్డుల వివరాలు తెలుసుకున్నారు. తాజాగా జిల్లా కేంద్రానికి వచ్చిన డీజీపీ సైతం పల్లెప్రగతి, పట్టణ ప్రగతి, ఇతర సంక్షేమ పథకాలను ప్రజలకు అందించడంలో తమవంతుగా కీలక పాత్ర పోషించనున్నట్లు తెలిపారు. తద్వారా ఏజెన్సీ ప్రజలకు చేరువయ్యేందుకు ప్రణాళికలు తయారు చేసుకుంటున్నారని సమాచారం. కాగా, జిల్లా కలెక్టర్ ఎం.వి.రెడ్డి సైతం డీజీపీని కలిసి జిల్లాలో ప్రభుత్వ కార్యక్రమాల అమలు గురించి వివరించడం గమనార్హం. ఇదిలా ఉండగా సరిహద్దుల్లో, గోదావరీ పరీవాహక ప్రాంత జిల్లాల్లో పోలీసులు భారీగా కూంబింగ్, సెర్చ్ అపరేషన్లు సైతం నిర్వహిస్తున్నారు. ప్రాజెక్టులకు రక్షణగా... జిల్లాలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సీతారామ ఎత్తిపోతల పథకం, మణుగూరు సమీపంలో భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ ప్రాజెక్టుల రక్షణ బాధ్యతలు సైతం పోలీసులే పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. పనుల పురోగతి గురించి తెలుసుకునేందుకు వివిధ స్థాయిల ఉన్నతాధికారులు సైతం క్షేత్రస్థాయికి వస్తున్నారు. ఈ నెలాఖరులో ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా జిల్లాకు రానున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పోలీసు యంత్రాంగం మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. కాగా అధికార పార్టీ నాయకులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. అత్యవసరమైతే తప్ప గ్రామాల్లో తిరగవద్దని, బయటికి వెళితే తమకు తప్పనిసరిగా సమాచారం ఇవ్వాలని చెపుతున్నారు. ఈ పరిస్థితుల్లో సరిహద్దు జిల్లాల్లో హై అలర్ట్ నెలకొంది. -
మహిళా మణులకు.పరీక్షే...
ఖమ్మం : ఈసారి సార్వత్రిక బరిలో నిలిచిన మహిళా నేతలు తాము పోటీ చేస్తున్న స్థానాల్లో ఓటర్ల మనసు గెలవడానికి నానాపాట్లు పడుతున్నారు. సొంత పార్టీ నుంచి మొండిచేయి ఎదురుకావడం, పార్టీలో వర్గపోరు వంటి సమస్యల మధ్య జిల్లాలో ప్రధాన పార్టీల తరఫున బరిలో నిలిచిన మహిళా అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వైరా, భధ్రాచలం, ఇల్లెందు, పాలేరు నియోజకవర్గాల్లో మహిళలు అసెంబ్లీ సంగ్రామంలో సై అంటున్నారు. వీరంతా ఓటర్లను ప్రసన్నం చేసుకోవడంతో పాటు సొంత పార్టీలో చిక్కులను చక్కదిద్దుకునేందుకు ఎదురీదాల్సి వస్తోంది. వైరానుంచి గతంలో సీపీఐ తరఫున విజయం సాధిం చిన బాణోతు చంద్రావతికి ఈసారి టికెట్ విషయంలో ఆ పార్టీ మొండిచేయి చూపడం.. ఆమె టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవడం, వెంటనే ఆ పార్టీ టికెట్ దక్కించుకొని ఎన్నికల రం గంలో నిలవడం చకాచకా జరిగిపోయాయి. ఇక టీడీపీలో జిల్లాలోని ఓ ప్రధాన నేత వర్గంలో కీలకంగా ఉన్న స్వర్ణకుమారి ఆయన పలుకుబడితో పాలేరు టికెట్ సాధించారు. భద్రాచలం బరి నుంచి మళ్లీ కాంగ్రెస్ పార్టీ తరఫున కుంజా సత్యవతి పోటీలో ఉన్నారు. ఆమెపై టీడీపీ నుంచి ఫణీశ్వరమ్మ పోటీ చేస్తున్నారు. ఇల్లెందులో అయితే హఠాత్తుగా బాణోతు హరి ప్రియ అనే అభ్యర్థి టికెట్ దక్కించుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. చంద్రావతికి పెద్ద పరీక్ష... అతిపిన్న వయసులో ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టిన చంద్రావతికి ఈసారి ఎన్నికలు పెద్ద పరీక్షగా మారాయి. సీపీఐ టికెట్ దక్కకపోవడంతో చివరకు ఆమె కారెక్కారు. టీఆర్ఎస్ నుంచి బరిలో ఉన్న ఆమె సీపీఐని ఓడించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. తనను ఆదరించని పార్టీకి తన సత్తా ఏంటో చూపాలన్న ఉద్దేశంతో ఆమె మళ్లీ వైరా నుంచే పోటీలో ఉన్నారు. అయితే స్థానికంగా టీఆర్ఎస్ కేడర్ బలంగా లేకపోవడం, సీపీఐ నుంచి బలమైన నాయకులు ఎవరూ ఆమె వెంట వెళ్లకపోవడం ప్రతికూలాంశాలని పరిశీలకులు అంటున్నారు. ఒకడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కు వేస్తూ ఆమె ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో వైరా సీటుపై ఆమె ఆశలు పెట్టుకున్నా.. తన సొంత ఇమేజ్‌తోనే గట్టెక్కాల్సి ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సత్యవతి, ఫణీశ్వరమ్మ భవితవ్యం ఏమిటో..? భద్రాచలం సీటుపై కాంగ్రెస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే కుంజా సత్యవతి, టీడీపీ తరఫున ఫణీశ్వరమ్మ గురి పెట్టారు. అయితే ఇరువురు అభ్యర్థులకు ఇంటిపోరు తలకుమించిన భారంగా మారింది. సత్యవతి అభ్యర్థిత్వాన్ని సొంత పార్టీలోని ఎంపీ బలరాం నాయక్ వర్గం నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎంపీ వర్గీయులకు, ఆమె అనుచరులకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇటీవల ఇరువురు నేతల ముందే వారి అనుచరులు ఘర్షణ పడడం.. ఎంపీ తీరును ఎమ్మెల్యే.. ఎమ్మెల్యే తీరును ఎంపీ వ్యతిరేకించడంతో వర్గపోరు బహిర్గతమైంది. దీంతో పైకి కలిసిఉన్నట్లుగా వ్యవహరిస్తున్నా.. అంతర్గతంగా మాత్రం ఎంపీ అనుచరులు ఆమె ఓటమే ధ్యేయంగా సర్వశక్తులొడ్డుతున్నట్లు సమాచారం. ఈ పరిస్థితుల్లో ఆమెకు ఈసారి కష్టకాలమేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే సత్యవతి మాత్రం విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక ఫణీశ్వరమ్మది కూడా ఇదే పరిస్థితి. ఈమె నామా వర్గం నేతగా ముద్ర పడడంతో తుమ్మల వర్గం ఆగ్రహంతో ఉంది. పాలేరు, భద్రాచలంలో ఇద్దరు మహిళా నేతలు నామా వర్గానికే చెందిన వారు కావడంతో ఈమెను ఎలాగైనా ఓడించాలని తుమ్మల శిబిరం ఎత్తుకుపైఎత్తులు వేస్తోంది. 2004లో భద్రాచలం ఎంపీగా ఆమె పోటీ చేసి ఓటమి పాలయిన ఫణీశ్వరమ్మ ఇప్పుడు అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు మళ్లీ బరిలోకి దిగినా.. నామా వర్గం నేతగా ముద్రపడడం ఆశనిపాతమైంది. ఇలా భద్రాచలం సీటుపై ప్రధాన పార్టీల తరఫున మహిళా నేతలు బరిలో ఉన్నా.. వర్గపోరుతో స్థానిక నాయకత్వం మొహం చాటేస్తుండడంతో ప్రచారమేమోగాని ఇంటిపోరును చక్కదిద్దే పనిలోనే వారు నిమగ్నమయ్యారు. స్వర్ణక్క కల నెరవేరేనా..? పాలేరు సీటు తనకే కావాలని పట్టుబట్టి.. తన వర్గానికి నేతృత్వం వహిస్తున్న నేతతో లాబీయింగ్ చేయించి.. ఎట్టకేలకు సీటు దక్కించుకున్న మద్దినేని స్వర్ణకుమారికి వర్గపోరు పెద్ద తలనొప్పిగా మారింది. ఈమె కూడా నామా వర్గం నేత కావడంతో ఇక్కడ ఉన్న తుమ్మల వర్గం స్వర్ణకుమారి అంటేనే గుర్రుగా ఉంది. అంతేకాకుండా నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్న ఆమె.. మండల పార్టీ బాధ్యతలు ఒకే సామాజిక వర్గానికి ఇవ్వడంతో ఇతర వర్గాల నేత లు రాజీనామా బాట పడుతున్నారు. అంతేకాకుండా ఎమ్మెల్సీ బాలసాని టికెట్ ఎపిసోడ్ రచ్చకెక్కడంతో బీసీ నేతలు కూడా ఆమె అభ్యర్థిత్వం పట్ల గుర్రుగానే ఉన్నారు. నామా లాబీయింగ్‌తో టికెట్ దక్కించుకున్నా .. తుమ్మల అనుచర వర్గం ఇప్పటికీ ఆమెకు దూరంగానే ఉంటోంది. ఈ పరిణామాలతో ఆమె కలనెరవేరుతుందో..? లేదో..?ననే చర్చ పార్టీలో జరుగుతోంది. హరిప్రియకూ అష్టకష్టాలే... ఇల్లెందు బరిలో టీడీపీ అభ్యర్థిగా ఉన్న హరిప్రియ రాజకీయాలకు కొత్తయినప్పటికీ.. సిటింగ్ ఎమ్మెల్యే ఊకె అబ్బయ్యను కాదని ఆమెకు బీ ఫాం ఇచ్చారు. మొన్నటివరకు హైదరాబాద్‌కు-టేకులపల్లికి అప్అండ్ డౌన్ చేసిన హరిప్రియకు నియోజకవర్గ ప్రజలతో పెద్దగా సంబంధాల్లేవు. టీడీపీ టికెట్ ఆశించి భంగపడ్డ అబ్బయ్య టీఆర్ఎస్లో చేరారు. ఆయనతో పాటు కొందరు టీడీపీ నేతలు కూడా పార్టీని వీడి వెళ్లారు. వీరంతా ఆమెకు నష్టం చేసే అవకాశం ఉంది. మరోవైపు జిల్లా నేతలు ఆమె ప్రచారం వైపు కన్నెత్తి కూడా చూడకపోవడంతో ఉన్న కొంతమంది కార్యకర్తలు కూడా నైరాశ్యంలో పడ్డారు. పార్టీలోని స్థానిక నేతలు ఇతర పార్టీల బాట పట్టడంతో.. ఇల్లెందు ఓటర్లు ఆమెకు ఊహించని రీతిలో ఝలక్ ఇస్తారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
అమ్మా.. సాంబనొచ్చా..!
14 ఏళ్ల తర్వాత కుమారుడి ప్రత్యక్షం చనిపోయాడనుకొని కర్మలు చేసి..సమాధి నిర్మించిన తల్లిదండ్రులు గుండాల, అమ్మా.. నేను సాంబ’ను అనే పిలుపు ఆ తల్లిదండ్రులకు ఉలిక్కిపడేలా చేసింది. 14ఏళ్ల క్రితం చనిపోయిన కొడుకు రావడమేమిటి? అసలు ఇది కలనా.. నిజమా! అని సంశయంలో పడ్డారు. ముందు నిలిచి ఉన్న కొడుకును చూసి కూడా వారు తమ కళ్లనే తాము నమ్మలేకపోయారు. ఈ సంఘటన ఖమ్మం జిల్లాలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలు.. జిల్లాలోని గుండాలకు చెందిన ఆవుల వెంకన్న-కనకమ్మ దంపతులకు నలుగురు సంతానం. పెద్ద కొడుకు సాంబయ్య 14ఏళ్ల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అతడి ఆచూకీ కోసం ఎంత వెతికినా జాడ దొరకలేదు. కొద్దిరోజుల తర్వాత విశాఖపట్నంలో సాంబయ్య పేరుగల వ్యక్తి మృతి చెందాడని పత్రికల్లో చూశారు. అక్కడికి వెళ్లి చూడగా,, మృతదేహం గుర్తుపట్టడానికి వీలు లేకుండా ఉండడంతో ఇంటికి తిరిగి వచ్చారు. సాంబయ్యనే చనిపోయి ఉంటాడనుకుని కర్మకాండలు నిర్వహించారు. అతడి స్మృతి చిహ్నంగా సమాధి కూడా నిర్మించారు. అయితే గురువారం రాత్రి ఇంటికి చేరుకున్న సాంబయ్య.. ‘అమ్మా..సాంబను వచ్చానమ్మా’ అంటూ పిలిచాడు. నిద్రలో ఉన్న తల్లిదండ్రులు తలుపు తెరిచి చూడగా.. చెట్టంత కొడుకు వాళ్ల కళ్ల ముందు నిలబడి ఉన్నాడు. చనిపోయిన సాంబయ్య రావడం ఏమిటి? అని ముందు నమ్మలేకపోయారు. గతంలో జరిగిన కొన్ని ఘటనలు గుర్తు తెచ్చుకోవడం.. అతడి తలపై ఉన్న పాతగాయం ఆధారంగా వారు కుమారుడిని గుర్తుపట్టారు. తమ కుమారుడే అని తెలుసుకొని ఇన్నాళ్లకు వచ్చావా నాయనా.. అంటూ గుండెలకు హత్తుకున్నారు. తాను విజయవాడలో క్యాటరింగ్లో పని చేసేవాడినని సాంబయ్య విలేకరులకు తెలిపాడు. ఆరు నెలలుగా గుండెజబ్బుతో బాధపడుతున్నానని, అనారోగ్యంతో ఉన్న తనకు అమ్మానాన్నలను చూడాలనిపించి ఇంటికి తిరిగి వచ్చానని చెప్పాడు. సాంబయ్య వచ్చిన విషయం శుక్రవారం గ్రామంలో దావానలంలా వ్యాపించింది. దీంతో స్థానికులు, స్నేహితులు వచ్చి ఆప్యాయంగా పలకరిం చారు. దీంతో ఆ ఇంట పండుగ వాతావరణం నెలకొంది. -
చంద్రబాబుకు ఆ దైర్యం ఉందా?’
తన పాలనను మళ్లీ తెస్తానని ఆయన చెప్పగలరా? : షర్మిల ఖమ్మం: ‘‘ఐదేళ్లలో ప్రజాసమస్యలు పట్టించుకోకుండా విస్మరించిన కాంగ్రెస్‌ను కాలర్ పట్టుకుని నిలదీయాల్సిన చంద్రబాబు.. భుజాన వేసుకుని మోసి రక్షణ కవచంలా కాపాడాడు. అధికారంలో ఉన్న తొమ్మిదేళ్లలో చంద్రబాబు ఏ ఒక్క మంచి పథకమైనా ప్రవేశపెట్టాడా..? ప్రజలకు ఏ ఒక్క మంచిపనీ చేయని చంద్రబాబు తన పాలనను తిరిగి తీసుకువస్తానని చెప్పుకుని ఓట్లడిగే దైర్యం ఉందా?’’ అని వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ, వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల ప్రశ్నించారు. జనభేరి ఎన్నికల ప్రచారయాత్రలో భాగంగా మూడోరోజు మంగళవారం ఖమ్మం జిల్లాలోని పినపాక, భద్రాచలం, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో నిర్వహించిన సభల్లో ఆమె ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. చంద్రబాబు ప్రధానప్రతిపక్ష నాయకుడిగా ప్రజాసమస్యలను పట్టించుకోకుండా మళ్లీ శుష్కవాగ్దానాలతో ప్రజల ముందుకొస్తున్నాడని దుయ్యబట్టారు. ఆయనేమైనా వైఎస్సార్‌లా పేదల కోసం ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చారా..? 108, 104, ఆరోగ్యశ్రీ, పింఛన్లు, జలయజ్ఞం, ఉచిత విద్యుత్ లాంటి అద్భుత పథకాలు ప్రవేశపెట్టారా? అని ప్రశ్నించారు. పేనుకు పెత్తనం ఇస్తే.. తలంతా కొరిగినట్లు చంద్రబాబుకు పెత్తనం ఇస్తే మన గొయ్యి మనం తీసుకున్నట్లేనని ఎద్దేవా చేశారు. ఎవరెన్ని ప్రలోభాలకు గురిచేసినా.. ఓటేసే ముందు ఒక్క నిమిషం మీ గుండెల్లో గూడుకట్టుకున్న రాజన్నను గుర్తు తెచ్చుకోండి.. ఫ్యాన్ గుర్తుపై ఓటేయాలని విజ్ఞప్తి చేశారు. షర్మిల వెంట ప్రచారయాత్రలో ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంటు అభ్యర్థులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, డాక్టర్ తెల్లం వెంకట్రావు, కొత్తగూడెం, పినపాక, అశ్వారావుపేట నియోజకవర్గాల వైఎస్సార్సీపీ అభ్యర్థులు వనమా వెంకటేశ్వరరావు, పాయం వెంకటేశ్వర్లు, తాటి వెంకటేశ్వర్లు, వైఎస్సార్సీపీ మద్దతుతో భద్రాచలం సీపీఎం అభ్యర్థిగా బరిలో ఉన్న సున్నం రాజయ్య పాల్గొన్నారు.