చంద్రబాబుకు ఆ దైర్యం ఉందా?’
తన పాలనను మళ్లీ తెస్తానని ఆయన చెప్పగలరా? : షర్మిల
ఖమ్మం: ‘‘ఐదేళ్లలో ప్రజాసమస్యలు పట్టించుకోకుండా విస్మరించిన కాంగ్రెస్‌ను కాలర్ పట్టుకుని నిలదీయాల్సిన చంద్రబాబు.. భుజాన వేసుకుని మోసి రక్షణ కవచంలా కాపాడాడు. అధికారంలో ఉన్న తొమ్మిదేళ్లలో చంద్రబాబు ఏ ఒక్క మంచి పథకమైనా ప్రవేశపెట్టాడా..? ప్రజలకు ఏ ఒక్క మంచిపనీ చేయని చంద్రబాబు తన పాలనను తిరిగి తీసుకువస్తానని చెప్పుకుని ఓట్లడిగే దైర్యం ఉందా?’’ అని వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ, వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల ప్రశ్నించారు. జనభేరి ఎన్నికల ప్రచారయాత్రలో భాగంగా మూడోరోజు మంగళవారం ఖమ్మం జిల్లాలోని పినపాక, భద్రాచలం, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో నిర్వహించిన సభల్లో ఆమె ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
చంద్రబాబు ప్రధానప్రతిపక్ష నాయకుడిగా ప్రజాసమస్యలను పట్టించుకోకుండా మళ్లీ శుష్కవాగ్దానాలతో ప్రజల ముందుకొస్తున్నాడని దుయ్యబట్టారు. ఆయనేమైనా వైఎస్సార్‌లా పేదల కోసం ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇచ్చారా..? 108, 104, ఆరోగ్యశ్రీ, పింఛన్లు, జలయజ్ఞం, ఉచిత విద్యుత్ లాంటి అద్భుత పథకాలు ప్రవేశపెట్టారా? అని ప్రశ్నించారు. పేనుకు పెత్తనం ఇస్తే.. తలంతా కొరిగినట్లు చంద్రబాబుకు పెత్తనం ఇస్తే మన గొయ్యి మనం తీసుకున్నట్లేనని ఎద్దేవా చేశారు. ఎవరెన్ని ప్రలోభాలకు గురిచేసినా.. ఓటేసే ముందు ఒక్క నిమిషం మీ గుండెల్లో గూడుకట్టుకున్న రాజన్నను గుర్తు తెచ్చుకోండి.. ఫ్యాన్ గుర్తుపై ఓటేయాలని విజ్ఞప్తి చేశారు. షర్మిల వెంట ప్రచారయాత్రలో ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంటు అభ్యర్థులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, డాక్టర్ తెల్లం వెంకట్రావు, కొత్తగూడెం, పినపాక, అశ్వారావుపేట నియోజకవర్గాల వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు వనమా వెంకటేశ్వరరావు, పాయం వెంకటేశ్వర్లు, తాటి వెంకటేశ్వర్లు, వైఎస్సార్‌సీపీ మద్దతుతో భద్రాచలం సీపీఎం అభ్యర్థిగా బరిలో ఉన్న సున్నం రాజయ్య పాల్గొన్నారు.