నా వారసత్వం విశ్వసనీయతే | Trusted my heritage | Sakshi
Sakshi News home page

నా వారసత్వం విశ్వసనీయతే

Published Mon, Apr 21 2014 1:05 AM | Last Updated on Sat, Jul 28 2018 6:33 PM

నా వారసత్వం  విశ్వసనీయతే - Sakshi

నా వారసత్వం విశ్వసనీయతే

అందుకే నేను చంద్రబాబులా అబద్ధాల హామీలు ఇవ్వను..  చేసేదే చెప్తా: జగన్‌మోహన్‌రెడ్డి

మరో 18 రోజుల్లో మన తలరాత
మార్చే ఎన్నికలు వస్తున్నాయి
వైఎస్సార్ విశ్వసనీయత ఒకవైపు.. చంద్రబాబు కుళ్లు కుతంత్రాలు మరోవైపు
విశ్వసనీయతకే ఓటేయండి.. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులనే గెలిపించండి

 
 నెల్లూరు: ‘‘దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డికి ముందు చాలామంది ముఖ్యమంత్రులున్నారు. ఆయన హఠాన్మరణం తర్వాత కొందరు ముఖ్యమంత్రులు వచ్చారు. కానీ ముఖ్యమంత్రి అంటే ఎలా ఉండాలో దేశానికి చాటి చెప్పింది వైఎస్సార్ ఒక్కరే. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరి సంక్షేమం గురించి ఆలోచించిన ముఖ్యమంత్రి ఆయనొక్కరే. అందుకే ఆయన మరణిస్తే వందలాది గుండెలు ఆగిపోయాయి. ఆయన మన మధ్య నుంచి వెళ్లిపోయి నాలుగున్నరేళ్లు కావస్తున్నా ప్రజల గుండెల్లో జీవించే ఉన్నారు. అందుకే ఆ మహానేత ఎక్కడున్నాడని ప్రశ్నిస్తే... ప్రజల చేయి నేరుగా వారి గుండెల మీదకు వెళ్తుంది. రాజన్న మా గుండెల్లో జీవించి ఉన్నారని వారు నినదిస్తారు. ఆ దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి నుంచి నాకు వారసత్వంగా ఏదైనా వచ్చిందీ అంటే అది ఒక్క విశ్వసనీయతే. అందుకే నేను చంద్రబాబులా అబద్ధాల హామీలు ఇవ్వను. చెప్పేదే చేస్తా... చేసేదే చెప్తా’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు.

‘‘చంద్రబాబు ఇంటికో ఉద్యోగం ఇస్తానని ప్రకటించినప్పుడు నా దగ్గరకు చాలామంది వచ్చి... అన్నా నువ్వు ఇంటికి రెండు ఉద్యోగాలు ఇస్తానని చెప్పన్నా అని సూచించారు. చంద్రబాబు రైతుల రుణాలు మాఫీ చేస్తానని ప్రకటించినప్పుడు కొందరు నా దగ్గరకొచ్చి... అన్నా నువ్వు కూడా రైతుల రుణాలు మాఫీ చేస్తానని ప్రకటించన్నా అని సలహా ఇచ్చారు. కానీ నేను వైఎస్సార్ కొడుకుని. ఓట్లు సీట్లు కోసం చంద్రబాబులా అబద్ధాలు చెప్పి ప్రజలను మోసగించలేనని చెప్పాను’’ అని చెప్పారు. ‘‘మరో 18 రోజుల్లో  సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలు మన తలరాత లు మార్చే ఎన్నికలు. ఏ వ్యక్తి అయితే  జనం గుండె చప్పుడు వినేవాడో... ఏ నాయకుడైతే పేద ప్రజల కోసం ఆలోచిస్తాడో... ఏ నాయకుడైతే చనిపోయిన తర్వాత కూడా ప్రజల గుండెల్లో బతికుండాలని కోరుకుంటాడో అలాంటి నాయకుడినే సీఎం కుర్చీలో కూర్చోబెట్టాలి. ఈ ఎన్నికల్లో వైఎస్సార్ అందించిన విశ్వసనీయత, నిజాయితీ ఒకవైపు... చంద్రబాబు కుళ్లు కుతంత్రాలు మరోవైపు ఉన్నా యి. విశ్వసనీయతకే మీరు ఓటేయండి...  వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపించండి’’ అని ప్రజలకు పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఆయన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గం వింజమూరులో జరిగిన బహిరంగ సభల్లో ప్రసంగించారు. ఎంపీ అభ్యర్థి మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఆత్మకూరు అభ్యర్థి మేకపాటి గౌతమ్‌రెడ్డి, ఉదయగిరి అభ్యర్థి మేకపాటి చంద్రశేఖరరెడ్డి, జిల్లా అధ్యక్షుడు మేరిగ మురళీధర్, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ బాలచెన్నయ్య. మాజీ ఎమ్మెల్సీ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి ఈ సభల్లో పాల్గొన్నారు. ఈ సభల్లో జగన్ ప్రసంగ సారాంశం ఆయన మాటల్లోనే....

 ఐదు సంతకాలతో రాష్ట్రం దశ మారుతుంది

 నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే వేదికపైనే చేసే సంతకాలు ఈ రాష్ట్ర ప్రజల దశ, దిశ మార్చగలవని కచ్చితంగా హామీ ఇవ్వగలను.రాష్ట్రంలో అక్కాచెల్లెళ్లను కష్టాలకడగండ్ల నుంచి గట్టెక్కేంచేందుకు అమ్మ ఒడి పథకంపై తొలి సంతకం చేయబోతున్నా. ఇద్దరు పిల్లలను బడికి పంపితే.. అక్కాచెల్లెళ్ల ఖాతాలో ప్రతి నెలా రూ.వెయ్యి జమ చేస్తా.అవ్వాతాతలకు మనవడిగా భరోసా ఇస్తున్నా. అవ్వాతాతలంతా రోజూ మూడు పూటలా తిండి తినడం కోసం నెలకు రూ.700 చొప్పున పెన్షన్ ఇచ్చేలా రెండో సంతకం చేయబోతున్నా.
 
రైతన్నల కోసం మూడో సంతకం చేయబోతున్నా. రైతులకు మద్దతుధర, గిట్టుబాటు ధర కల్పించడం కోసం మూడు వేల కోట్లతో స్థిరీకరణ నిధి ఏర్పాటుచేస్తా. కరువు, వరద వచ్చినప్పుడు వెంటనే  పరిహారం అందించి.. రైతును ఆదుకోవడానికి రూ.2 వేల కోట్లతో సహాయ నిధిని ఏర్పాటు చేస్తా. ఖరీఫ్‌లో పంట నష్టపోతే రబీ నాటికి పంటనష్ట పరిహారం అందిస్తా. నా అక్కాచెల్లెళ్ల కోసం నాలుగో సంతకం చేయబోతున్నా.  రూ.20 వేల కోట్ల డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తా.గ్రామాల్లో రేషన్‌కార్డు, పెన్షన్‌కార్డు, ఏ కార్డు కావాలన్నా మీ ఊర్లో మీవార్డులోనే 24 గంటల్లోగా కార్డును ఇప్పించే ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటుచేసేలా ఐదో సంతకం చేస్తా.
 
ఆరు పనులతో అందరికీ అండగా నిలుస్తా..


  వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దేశంలో 47 లక్షలు ఇళ్లు నిర్మిస్తే.. ఒక్క మన రాష్ట్రంలోనే 48 లక్షల ఇళ్లు నిర్మించారు. ఆ తర్వాత ఇళ్ల నిర్మాణం ఆగిపోయింది. నేను అధికారంలోకి వస్తే ఐదేళ్లలో 50 లక్షల ఇళ్లు నిర్మిస్తా. గుడిసే లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతా. 2019 నాటికి ఏ గ్రామానికికైనా వెళ్లి ఇళ్లులేని వారు ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నిస్తే ఒక్క చేయి కూడా పైకి లేవకుండా చేస్తా. నేను ముఖ్యమంత్రినయ్యాక ఆరోగ్యశ్రీ పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేస్తా. ప్రమాదాల్లో గాయపడి ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందినవారు డాక్టర్ సూచన మేరకు వారు ఎన్ని రోజులు విశ్రాంతి తీసుకుంటే.. అన్ని రోజులు నెలకు రూ.మూడు వేల చొప్పున సహాయంగా అందిస్తా. చెవుడు, మూగ పిల్లలకు  రూ.6 లక్షల ఖర్చయ్యే కాక్లియర్ ఆపరేషన్లను ప్రభుత్వం ఆరోగ్యశ్రీ నుంచి తొలగించింది. వీటిని కూడా ఆరోగ్యశ్రీలో చేర్చుతా. నేను సీఎం అయ్యాక ప్రతి జిల్లాలో హైదరాబాద్‌లో ఉన్నటువంటి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు నిర్మించి డాక్టర్లు 24 గంటలు అందుబాటులో ఉండేలా చేస్తా.
 
ఒక టీవీ, రెండు ఫ్యాన్లు, మూడు బల్బులున్న ఇంటికి  రూ. వందకే విద్యుత్ అందజేస్తా. దీన్ని మీ హక్కుగా మార్చుతా. చంద్రబాబు తరహాలో ఇంటికో ఉద్యోగం ఇస్తానంటూ అబద్ధాలు చెప్పడం నాకు చేతకాదు. రాష్ట్రంలో ప్రతి స్కూలు ను ఇంగ్లిష్ మీడియంగా మార్చుతా. అమ్మ ఒడి పథకం కింద మీ పిల్లలను ఇంజనీరుగా, డాక్టరుగా తీర్చిదిద్దు తా. సొంత తమ్ముడు, చెల్లెమ్మకు ఉద్యోగం కోసం ఎంత కష్టపడతానో అదే రీతిలో మీ పిల్లలకు ఉద్యోగం వచ్చే ప్రయత్నం చేస్తా.ఇంజనీర్లు డాక్టర్లు కావాల్సిన పిల్లలు బెల్ట్‌షాపులవల్ల దారితప్పుతున్నారు. నేను ముఖ్యమంత్రి అయ్యాక బెల్ట్‌షాపులను మూసివేయిస్తా. బెల్ట్‌షాపులు లేకుండా చేసేందుకు ప్రతి గ్రామానికి పదిమంది ఆడ పోలీసులను నియమిస్తా. ప్రతి నియోజకవర్గానికి ఓ చోట మాత్రమే మద్యం దుకాణం ఉంటుంది. మద్యం ధరలు కూడా ముట్టుకుంటే షాక్ కొట్టేలా ఉండేలా చేస్తా.’’
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement