ఖమ్మంజిల్లా వైఎస్సార్ జనభేరిలో షర్మిల
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: తెలంగాణలో తాము అధికారంలోకి వస్తే సంక్షేమ రాజ్యం తీసుకొస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చెప్పారు. ఎన్నికల ప్రచార యాత్ర వైఎస్సార్ జనభేరిలో భాగంగా బుధవారం ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి, వైరా, మధిర నియోజకవర్గాల్లో ఆమె పర్యటించి పలుచోట్ల ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. వైఎస్సార్‌లా రైతును రాజులా తీర్చిదిద్దడం కేవలం వైఎస్సార్‌సీపీతోనే సాధ్యమన్నారు. రాజశేఖరరెడ్డిలా ప్రజలను సొంత కుటుంబంలా ప్రేమించే మనసు ఎవరిదని ప్రతి ఒక్కరూ ఆలోచించాలన్నారు. ఓటేసే ముందు మీ గుండెల్లో గూడు కట్టుకున్న వైఎస్సార్‌ను గుర్తుచేసుకొని ఫ్యాను గుర్తుకు ఓటేయాలని విజ్ఞప్తి చేశారు. ఇంకా ఆమె ఏమన్నారంటే..
వైఎస్ ప్రతి పథకాన్ని అమలు చేస్తాం
- వైఎస్ తన పాలనలో ఎన్నో సంక్షేమ పథకాలను అద్భుతంగా అమలు చేసి జనం గుండెల్లో నిలిచారు.
-వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 108, 104, ఆరోగ్యశ్రీ, ఉచిత విద్యుత్, జలయజ్ఞం, ఫీజు రీయింబర్స్‌మెంట్‌తోపాటు మిగిలిన పథకాలన్నింటినీ తిరిగి అద్భుతంగా అమలు చేస్తాం.
- రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు రూ.3వేల కోట్లతో రైతు స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తాం. కరువు, వరదల నుంచి రైతులను ఆదుకునేందుకు రూ.2వేల కోట్లతో మరో నిధిని ఏర్పాటు చేస్తాం.
- రైతులు, మహిళలు, వికలాంగులకు వడ్డీలేని రుణాలు ఇస్తాం. డ్వాక్రా సంఘాల మహిళలు తీసుకున్న రుణాల న్నింటినీ మాఫీ చేస్తాం. రాష్ట్రంలో అర్హులయిన ప్రతి ఒక్క పేదకుటుంబానికీ పక్కా ఇళ్లు కట్టిస్తాం.
- అమ్మఒడి పథకం ద్వారా ఇద్దరు పిల్లలను బడికి పంపించే ప్రతి తల్లి ఖాతాలో నెలనెలా పదోతరగతి వరకు రూ.500, ఇంటర్ వరకు రూ.700, డిగ్రీకి రూ.1000 జమచేస్తాం.
ఖమ్మం జిల్లాలో ముగిసిన జనభేరి
ఖమ్మం జిల్లాలో ఈనెల 13 నుంచి షర్మిల చేపట్టిన ఎన్నికల ప్రచార యాత్ర జనభేరి బుధవారంతో ముగిసింది. జిల్లాలోని పది నియోజకవర్గాల్లో ఆమె పర్యటించగా..అడుగడుగునా ప్రజలు ఆమెకు బ్రహ్మరథం పట్టారు. పాలేరు నియోజకవర్గం కూసుమంచి నుంచి ప్రారంభమైన షర్మిల ప్రచార యాత్ర మధిరలో చివరి సభతో బుధవారం ముగిసింది.
సంక్షేమ రాజ్యం తెస్తాం: షర్మిల
Published Thu, Apr 17 2014 3:25 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM
Advertisement
Advertisement