ఖమ్మం : ఈసారి సార్వత్రిక బరిలో నిలిచిన మహిళా నేతలు తాము పోటీ చేస్తున్న స్థానాల్లో ఓటర్ల మనసు గెలవడానికి నానాపాట్లు పడుతున్నారు. సొంత పార్టీ నుంచి మొండిచేయి ఎదురుకావడం, పార్టీలో వర్గపోరు వంటి సమస్యల మధ్య జిల్లాలో ప్రధాన పార్టీల తరఫున బరిలో నిలిచిన మహిళా అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వైరా, భధ్రాచలం, ఇల్లెందు, పాలేరు నియోజకవర్గాల్లో మహిళలు అసెంబ్లీ సంగ్రామంలో సై అంటున్నారు. వీరంతా ఓటర్లను ప్రసన్నం చేసుకోవడంతో పాటు సొంత పార్టీలో చిక్కులను చక్కదిద్దుకునేందుకు ఎదురీదాల్సి వస్తోంది. వైరానుంచి గతంలో సీపీఐ తరఫున విజయం సాధిం చిన బాణోతు చంద్రావతికి ఈసారి టికెట్ విషయంలో ఆ పార్టీ మొండిచేయి చూపడం.. ఆమె టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకోవడం, వెంటనే ఆ పార్టీ టికెట్ దక్కించుకొని ఎన్నికల రం గంలో నిలవడం చకాచకా జరిగిపోయాయి. ఇక టీడీపీలో జిల్లాలోని ఓ ప్రధాన నేత వర్గంలో కీలకంగా ఉన్న స్వర్ణకుమారి ఆయన పలుకుబడితో పాలేరు టికెట్ సాధించారు. భద్రాచలం బరి నుంచి మళ్లీ కాంగ్రెస్ పార్టీ తరఫున కుంజా సత్యవతి పోటీలో ఉన్నారు. ఆమెపై టీడీపీ నుంచి ఫణీశ్వరమ్మ పోటీ చేస్తున్నారు. ఇల్లెందులో అయితే హఠాత్తుగా బాణోతు హరి ప్రియ అనే అభ్యర్థి టికెట్ దక్కించుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు.
చంద్రావతికి పెద్ద పరీక్ష...
అతిపిన్న వయసులో ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టిన చంద్రావతికి ఈసారి ఎన్నికలు పెద్ద పరీక్షగా మారాయి. సీపీఐ టికెట్ దక్కకపోవడంతో చివరకు ఆమె కారెక్కారు. టీఆర్‌ఎస్ నుంచి బరిలో ఉన్న ఆమె సీపీఐని ఓడించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. తనను ఆదరించని పార్టీకి తన సత్తా ఏంటో చూపాలన్న ఉద్దేశంతో ఆమె మళ్లీ వైరా నుంచే పోటీలో ఉన్నారు. అయితే స్థానికంగా టీఆర్‌ఎస్ కేడర్ బలంగా లేకపోవడం, సీపీఐ నుంచి బలమైన నాయకులు ఎవరూ ఆమె వెంట వెళ్లకపోవడం ప్రతికూలాంశాలని పరిశీలకులు అంటున్నారు. ఒకడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కు వేస్తూ ఆమె ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో వైరా సీటుపై ఆమె ఆశలు పెట్టుకున్నా.. తన సొంత ఇమేజ్‌తోనే గట్టెక్కాల్సి ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
సత్యవతి, ఫణీశ్వరమ్మ భవితవ్యం ఏమిటో..?
భద్రాచలం సీటుపై కాంగ్రెస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే కుంజా సత్యవతి, టీడీపీ తరఫున ఫణీశ్వరమ్మ గురి పెట్టారు. అయితే ఇరువురు అభ్యర్థులకు ఇంటిపోరు తలకుమించిన భారంగా మారింది. సత్యవతి అభ్యర్థిత్వాన్ని సొంత పార్టీలోని ఎంపీ బలరాం నాయక్ వర్గం నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎంపీ వర్గీయులకు, ఆమె అనుచరులకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇటీవల ఇరువురు నేతల ముందే వారి అనుచరులు ఘర్షణ పడడం.. ఎంపీ తీరును ఎమ్మెల్యే.. ఎమ్మెల్యే తీరును ఎంపీ వ్యతిరేకించడంతో వర్గపోరు బహిర్గతమైంది. దీంతో పైకి కలిసిఉన్నట్లుగా వ్యవహరిస్తున్నా.. అంతర్గతంగా మాత్రం ఎంపీ అనుచరులు ఆమె ఓటమే ధ్యేయంగా సర్వశక్తులొడ్డుతున్నట్లు సమాచారం. ఈ పరిస్థితుల్లో ఆమెకు ఈసారి కష్టకాలమేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే సత్యవతి మాత్రం విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక ఫణీశ్వరమ్మది కూడా ఇదే పరిస్థితి. ఈమె నామా వర్గం నేతగా ముద్ర పడడంతో తుమ్మల వర్గం ఆగ్రహంతో ఉంది. పాలేరు, భద్రాచలంలో ఇద్దరు మహిళా నేతలు నామా వర్గానికే చెందిన వారు కావడంతో ఈమెను ఎలాగైనా ఓడించాలని తుమ్మల శిబిరం ఎత్తుకుపైఎత్తులు వేస్తోంది. 2004లో భద్రాచలం ఎంపీగా ఆమె పోటీ చేసి ఓటమి పాలయిన ఫణీశ్వరమ్మ ఇప్పుడు అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు మళ్లీ బరిలోకి దిగినా.. నామా వర్గం నేతగా ముద్రపడడం ఆశనిపాతమైంది. ఇలా భద్రాచలం సీటుపై ప్రధాన పార్టీల తరఫున మహిళా నేతలు బరిలో ఉన్నా.. వర్గపోరుతో స్థానిక నాయకత్వం మొహం చాటేస్తుండడంతో ప్రచారమేమోగాని ఇంటిపోరును చక్కదిద్దే పనిలోనే వారు నిమగ్నమయ్యారు.
స్వర్ణక్క కల నెరవేరేనా..?
పాలేరు సీటు తనకే కావాలని పట్టుబట్టి.. తన వర్గానికి నేతృత్వం వహిస్తున్న నేతతో లాబీయింగ్ చేయించి.. ఎట్టకేలకు సీటు దక్కించుకున్న మద్దినేని స్వర్ణకుమారికి వర్గపోరు పెద్ద తలనొప్పిగా మారింది. ఈమె కూడా నామా వర్గం నేత కావడంతో ఇక్కడ ఉన్న తుమ్మల వర్గం స్వర్ణకుమారి అంటేనే గుర్రుగా ఉంది. అంతేకాకుండా నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉన్న ఆమె.. మండల పార్టీ బాధ్యతలు ఒకే సామాజిక వర్గానికి ఇవ్వడంతో ఇతర వర్గాల నేత లు రాజీనామా బాట పడుతున్నారు. అంతేకాకుండా ఎమ్మెల్సీ బాలసాని టికెట్ ఎపిసోడ్ రచ్చకెక్కడంతో బీసీ నేతలు కూడా ఆమె అభ్యర్థిత్వం పట్ల గుర్రుగానే ఉన్నారు. నామా లాబీయింగ్‌తో టికెట్ దక్కించుకున్నా .. తుమ్మల అనుచర వర్గం ఇప్పటికీ ఆమెకు దూరంగానే ఉంటోంది. ఈ పరిణామాలతో ఆమె కలనెరవేరుతుందో..? లేదో..?ననే చర్చ పార్టీలో జరుగుతోంది.
హరిప్రియకూ అష్టకష్టాలే...
ఇల్లెందు బరిలో టీడీపీ అభ్యర్థిగా ఉన్న హరిప్రియ రాజకీయాలకు కొత్తయినప్పటికీ.. సిటింగ్ ఎమ్మెల్యే ఊకె అబ్బయ్యను కాదని ఆమెకు బీ ఫాం ఇచ్చారు. మొన్నటివరకు హైదరాబాద్‌కు-టేకులపల్లికి అప్‌అండ్ డౌన్ చేసిన హరిప్రియకు నియోజకవర్గ ప్రజలతో పెద్దగా సంబంధాల్లేవు. టీడీపీ టికెట్ ఆశించి భంగపడ్డ అబ్బయ్య టీఆర్‌ఎస్‌లో చేరారు. ఆయనతో పాటు కొందరు టీడీపీ నేతలు కూడా పార్టీని వీడి వెళ్లారు. వీరంతా ఆమెకు నష్టం చేసే అవకాశం ఉంది. మరోవైపు జిల్లా నేతలు ఆమె ప్రచారం వైపు కన్నెత్తి కూడా చూడకపోవడంతో ఉన్న కొంతమంది కార్యకర్తలు కూడా నైరాశ్యంలో పడ్డారు. పార్టీలోని స్థానిక నేతలు ఇతర పార్టీల బాట పట్టడంతో.. ఇల్లెందు ఓటర్లు ఆమెకు ఊహించని రీతిలో ఝలక్ ఇస్తారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
మహిళా మణులకు.పరీక్షే...
Published Sat, Apr 19 2014 3:58 AM | Last Updated on Sat, Sep 2 2017 6:12 AM
Advertisement
Advertisement