Lok sabha elections 2024: శ్రుతి మించుతోంది | Lok sabha elections 2024: Offensive comments on women leaders during elections | Sakshi
Sakshi News home page

Lok sabha elections 2024: శ్రుతి మించుతోంది

Published Thu, Mar 28 2024 5:51 AM | Last Updated on Thu, Mar 28 2024 5:51 AM

Lok sabha elections 2024: Offensive comments on women leaders during elections - Sakshi

మహిళా అభ్యర్థులపై నీచమైన కామెంట్లు

సోషల్‌ మీడియాలో కించపరిచే పోస్టులు

ప్రచారంలో పేట్రేగుతున్న పెడ ధోరణి

అన్ని పార్టీలూ ఆ తాను ముక్కలే

ఒకప్పుడు ఎన్నికలొస్తే ప్రత్యర్థుల భావజాలం, అవినీతి, ప్రభుత్వ విధానాల వంటివాటిపై పారీ్టల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు సాగేవి. కానీ ఇప్పుడు నేతల నోళ్లు అదుపు తప్పుతున్నాయి. మాటలు హద్దులు దాటుతున్నాయి. ఎన్నికల బరిలో దిగుతున్న మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసే పెడ ధోరణి పెరిగిపోతోంది.

వారిని కించపరచడం, లింగవివక్షతో కూడిన వెకిలి కామెంట్లు చేయడం పరిపాటిగా మారుతోంది. చివరికి మహిళా నేతలు ప్రత్యర్థి పార్టీల్లోని సాటి మహిళలపై నోరు పారేసుకోవడానికి వెనకాడటం లేదు! బీజేపీ లోక్‌సభ అభ్యరి్థ, సినీ నటి కంగనాపై కాంగ్రెస్‌ నాయకురాలు సుప్రియా శ్రీనేత్‌ వ్యాఖ్యలు అందుకు         నిదర ్శనమే. నారీ శక్తి అంటూ పార్టీలు ఇస్తున్న నినాదాలు మాటలకే పరిమితమవుతున్న వైనం ఆందోళన కలిగిస్తోంది... 

‘మండీలో ఇప్పుడు ఏ రేటు పలుకుతోందో!’ – ఇది కంగనాపై కాంగ్రెస్‌ ఐటీ విభాగం చీఫ్‌ సుప్రియ మూడు రోజుల కింద ఇన్‌స్టాగ్రాంలో పెట్టిన పోస్టు. కంగనా హిమాచల్‌ప్రదేశ్‌లోని తన స్వస్థలమైన మండి నుంచి లోక్‌సభకు పోటీ చేస్తున్నారు. మండి అంటే బజారు అన్న అర్థాన్ని సాకుగా తీసుకుని, కంగనా ఫొటో పెట్టి మరీ చేసిన ఈ నీచమైన వ్యాఖ్యలపై దుమారం రేగింది. బీజేపీ వెంటనే దీన్ని అందిపుచ్చుకుంటూ కాంగ్రెస్‌ అంటేనే సంస్కారరాహిత్యానికి మారుపేరంటూ మండిపడింది.

ఆ పార్టీ అగ్ర నేత రాహుల్‌గాంధీ మొదలుకుని పలువురు నేతలు చేసిన ఇలాంటి కామెంట్లన్నింటినీ ప్రస్తావిస్తూ దుమ్మెత్తిపోసింది. దాంతో ఆ పోస్టుతో తనకు సంబంధం లేదని, ఎవరో తన ఇన్‌స్టా అకౌంట్‌ను హాక్‌ చేసి ఈ పని చేశారని సుప్రియ వివరణ ఇచ్చుకున్నా కాంగ్రెస్‌కు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ‘‘ఓ యువకునికి టికెట్‌ దక్కితే అతని భావజాలంపై దాడి! అదే ఒక యువతి ఎన్నికల బరిలో దిగితే లింగవివక్షతో కూడిన ఇలాంటి వ్యాఖ్యలు! ఈ నీచమైన పోకడకు ఇకనైనా తెర పడాలి.

సెక్స్‌ వర్కర్ల జీవితాలు ఎంతో దుర్భరం. వాటినిలా మహిళలపై బురదజల్లేందుకు సరుకుగా వాడుకోవడం సరికాదు’’ అంటూ కంగనా హుందాగా ఇచ్చిన రిప్లై అందరి మనసులూ గెలుచుకుంది. భారత్‌లో ఎన్నికల వేళ మహిళా నేతలపై ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలు కొత్తేమీ కాదు.

కానీ ఈసారి మాత్రం ఎన్నికల వేడి మొదలవుతూనే ఈ తరహా దూషణ పర్వం ఊపందుకోవడం ఆందోళన కలిగిస్తోంది. రాహుల్‌ కూడా అయోధ్య రామాలయంలో విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి మోదీ సర్కారు కేవలం వీఐపీలనే పిలిచిందంటూ తప్పుబట్టే క్రమంలో నటి ఐశ్వర్యారాయ్‌పై అభ్యంతకర వ్యాఖ్యలు చేశారు.

‘‘ఆ కార్యక్రమాన్ని మీరంతా చూశారు కూదా! ఐశ్వర్య, అమితాబ్, మోదీ... ఇలాంటివాళ్లే ఉన్నారు. కార్యక్రమంలో ఐశ్వర్య డ్యాన్సులు చేసింది. కానీ అక్కడ ఓబీసీలు, ఇతర సామాన్యులు ఒక్కరన్నా కన్పించారా?’’ అన్న రాహుల్‌ కామెంట్లపై తీవ్ర విమర్శలే వచ్చాయి. వాటిపై నెటిజన్లు కూడా దుమ్మెత్తిపోశారు. కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ కూడా ఇలాంటి వ్యాఖ్యల బాధితురాలే. అమేథీ నియోజకవర్గానికి ఆమె కేవలం అప్పుడప్పుడూ వచ్చి తన హావభావాలతో జనాన్ని ఆకర్షించి వెళ్లిపోతారంటూ కాంగ్రెస్‌ నేత అజయ్‌రాయ్‌ ఇటీవల నోరుపారేసుకున్నారు.

బీజేపీ నేతలు కూడా...
మహిళా నేతలపై అభ్యంతరకర వ్యాఖ్యల విషయంలో అధికార బీజేపీ నాయకులూ ఏమీ తక్కువ తినలేదు. తాజాగా తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి, పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీపై రాష్ట్ర బీజేపీ నేత దిలీప్‌ ఘోష్‌ చేసిన వ్యాఖ్యలు కూడా మంటలు రేపాయి. ‘‘మమత గోవాకు వెళ్తే తాను గోవా కూతురినంటారు. త్రిపురకు వెళ్తే త్రిపుర బిడ్డనని చెప్పుకుంటారు. ముందుగా మమత తన తండ్రెవరో గుర్తించాలి’’ అంటూ తీవ్ర అభ్యంతకరకర వ్యాఖ్యలు చేశారాయన.

సుప్రియా, ఘోష్‌ ఇద్దరికీ కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా తలంటింది. వారి వ్యాఖ్యలకు వివరణ కోరుతూ తాఖీదులిచ్చింది. ఘోష్‌కు బీజేపీ అధినాయకత్వం కూడా షోకాజ్‌ నోటీసిచ్చింది. అడ్డగోలు వ్యాఖ్యలు చేయడం ఆయనకు కొత్తేమీ కాదు. 2021 పశి్చమబెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల వేళ మమత కాలికి గాయమైంది. దాంతో కొంతకాలం వీల్‌చైర్‌లోనే ప్రచారం చేశారు. ఆ ఎన్నికల్లో తృణమూల్‌తో హోరాహోరీ తలపడ్డ బీజేపీ ఇదంతా సానుభూతి స్టంటేనంటూ ఎద్దేవా చేసింది.

ఆ క్రమంలో, ‘బెర్ముడాలు (నిక్కర్లు) వేసుకుంటే సౌలభ్యంగా ఉంటుంది’ అంటూ అప్పట్లో మమతపై ఘోష్‌ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఇక కేరళలో బీజేపీ నేత, సినీ నటుడు సురేశ్‌ గోపీ ప్రెస్‌మీట్‌ సందర్భంగా ఓ మహిళా జర్నలిస్టును పదేపదే అభ్యంతరకరంగా తాకడమూ వివాదం రేపింది. ఆమె ఒకటికి రెండుసార్లు ఆయన చేయిని అడ్డుకుంటూ నెట్టేసినా అలాగే వ్యవహరించారు. దీనిపై గొడవ పెద్దదవడంతో తప్పనిసరైన క్షమాపణలు చెప్పినా, పితృవాత్సల్యంతో అలా చేశానంటూ సమర్థించుకున్నారు.

చిర్రెత్తుకొచ్చిన సదరు జర్నలిస్టు ఆయనపై కేసు పెట్టేదాకా వెళ్లింది. మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీ అగ్ర నేత కైలాశ్‌ విజయవర్గీయ కూడా ఇలాగే నోరు పారేసుకున్నారు. అభ్యంతరకర దుస్తులు ధరించే మహిళలు శూర్పణఖల్లా కనిపిస్తారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతటితో ఆగకుండా, ‘‘దేవుడు మీకు అందమైన శరీరమిచ్చాడు. మంచి బట్టలేసుకోవచ్చుగా’’ అన్నారు. వీటిని సుప్రియా శ్రీనేత్‌ అప్పట్లో తీవ్రంగా తప్పుబట్టడం, మహిళలంటే బీజేపీకి గౌరవం లేదంటూ దుయ్యబట్టడం విశేషం! రాజకీయాలు అర్థం కాకుంటే ఇంటికెళ్లు వంట చేసుకొమ్మంటూ ఎన్సీపీ నేత సుప్రియా సులేను ఉద్దేశించి మహారాష్ట్ర బీజేపీ చీఫ్‌ చంద్రకాంత్‌ పాటిల్‌ వ్యాఖ్యలు కూడా అప్పట్లో మంటలు రేపాయి.

ఆందోళనకరమే..
మన దేశంలో ఎన్నికల వేళ మహిళా నేతలపై అభ్యంతరకర వ్యాఖ్యలు పెరిగిపోతాయని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ ఇండియా పరిశోధన తేలి్చంది. ‘‘2019 లోక్‌సభ ఎన్నికల్లోనైతే వారిపై వ్యక్తిగత విమర్శలు అనూహ్య స్థాయిలో పెరిగిపోయాయి. 95 మంది మహిళా నేతలకు వచ్చిన 1.14 లక్షల ట్వీట్లను పరిశీలిస్తే 14 శాతం దాకా లింగవివక్షతో కూడిన అభ్యంతరకర విమర్శలే. అంటే ఒక్కొక్కరికీ రోజుకు సగటున ఇలాంటి 113 ట్వీట్లొచ్చాయి!’’ అని పేర్కొంది.

బీజేపీ తరఫున యూపీలో రాంపూర్‌ నుంచి పోటీ చేసిన జయప్రదపై సమాజ్‌వాదీ పార్టీ నేత ఆజం ఖాన్‌ ‘ఖాకీ లో దుస్తులు’ వ్యాఖ్యలు, ప్రియాంకా గాంధీ ‘పప్పూ కీ పప్పీ’ అంటూ బీజేపీ నేతల ఎద్దేవా, సినీ నటి హేమమాలిని ఓట్ల కోసం డ్యాన్సులు చేస్తారంటూ ప్రత్యర్థుల విమర్శలు... ఇలా 2019 ఎన్నికల్లో వివాదాలకు దారితీసిన ఉదంతాలెన్నో! ఇలా మహిళా నేతల వ్యక్తిత్వ హననానికి పూనుకునే ధోరణి మన దేశ రాజకీయాల్లో నేటికీ పెద్ద సవాలుగానే ఉందని విశ్లేషకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఒకరకంగా మన సమాజపు పురుషాహంకార వైఖరికి ఇది అద్దం పడుతోందని వారంటున్నారు. నిజానికి పోలింగ్‌ బూత్‌లకు వచ్చేందుకు పురుషుల నిరాసక్తత నేపథ్యంలో భారత్‌లో కొన్నేళ్లుగా ఏ ఎన్నికల్లోనైనా మహిళల ఓట్లు కీలకంగా మారాయి. ఈ నేపథ్యంలో నాయకురాళ్లను కించపరిస్తే మహిళల ఓట్లకు గండి పడవచ్చని తెలిసి కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేస్తుండటం ఆందోళనకర పరిణామమేనంటున్నారు.

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement